మా అమ్మానాన్నలు మాకు దేవుడ్ని ప్రేమించడం నేర్పించారు
ఎలిజబెత్ ట్రేసీ చెప్పినది
ఆ రోజు మాపైకి అల్లరిమూకను రేపిన సాయుధులు, అమ్మను నాన్నను కారులో నుంచి దిగమని బలవంతం చేశారు. నేనూ మా అక్కయ్య, మళ్లీ మా అమ్మానాన్నలను చూస్తామా లేదా అనుకుంటూ వెనుక సీట్లో ఒంటరిగా ఉండిపోయాము. అమెరికాలోని అలబామా నందలి సెల్మాలో, 1941లో జరిగిన ఈ భయంకరమైన అనుభవానికి నడిపినదేమిటి? దానికీ, మా అమ్మానాన్నల నుండి మేము పొందిన బోధలకూ సంబంధమేమిటి?
మా నాన్నగారైన డూయీ ఫౌంటెన్ పసితనంలోనే తన తల్లిదండ్రులను పోగొట్టుకుని, టెక్సాస్‌లోని పొలాల్లో ఉంటున్న వాళ్ల అక్కా బావల దగ్గర పెరిగారు. తర్వాత ఆయన చమురు బావుల ప్రాంతంలో పని చేయడానికి వెళ్లారు. 1922లో, ఆయనకు 23 ఏళ్లున్నప్పుడు టెక్సాస్ వాస్తవ్యురాలైన విన్నీ అనే అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఇక స్థిరపడి కుటుంబ జీవనం సాగించాలని పథకాలు వేసుకోవడం మొదలెట్టారు.
ఆయన తూర్పు టెక్సాస్ సమీపంలోవున్న గెర్రీసన్ అనే చిన్న పట్టణంలోని కలప చెట్లున్న ప్రాంతంలో ఇల్లు కట్టించుకున్నారు. అక్కడాయన పత్తి, మొక్కజొన్నతో సహా రకరకాల పంటలు వేశారు. ఆయన అన్ని రకాల పెంపుడు జంతువులను కూడా పెంచారు. కొంతకాలానికి, మేము ముగ్గురం, అంటే డూయీ జూనియర్ 1924 మేలో, ఎడ్వీనా 1925 డిసెంబరులో, నేను 1929 జూన్‌లో జన్మించాము.
బైబిలు సత్యాన్ని తెలుసుకోవడం
తాము చర్చ్ ఆఫ్ క్రైస్ట్‌కు చెందిన వాళ్లం గనుక తమకు బైబిలు తెలుసని అమ్మానాన్న అనుకున్నారు. అయితే, వాచ్ టవర్ సొసైటీ ప్రచురించిన డెలివరెన్స్ మరియు గవర్న్మెంట్ అనే పుస్తకాలను జి. డబ్ల్యూ. కుక్ 1932లో, మా పెదనాన్నగారైన మన్రో ఫౌంటెన్‌కు ఇచ్చారు. తాను నేర్చుకుంటున్నదాన్ని మా అమ్మానాన్నలతో చెప్పాలనే ఉత్సాహంతో పెదనాన్నగారు తరచూ ఉదయం వేళ మా ఇంటికి వచ్చి, కావలికోట నుండి ఒక శీర్షిక చదివి, “అనుకోకుండా” పత్రిక అక్కడే ఉంచి వెళ్లిపోయేవారు. తర్వాత అమ్మా నాన్న దాన్ని చదివేవారు.
ఒక ఆదివారం ఉదయం పెదనాన్నగారు బైబిలు పఠనం కోసం పొరుగువారింటికి రమ్మని నాన్నగారిని ఆహ్వానించారు. మిస్టర్ కుక్ నాన్నగారి ప్రశ్నలన్నిటికీ బైబిలు నుండి సమాధానం ఇవ్వగలరని ఆయన హామీ ఇచ్చారు. నాన్నగారు పఠనం నుండి తిరిగి వచ్చి, అత్యుత్సాహంగా మాతో ఇలా చెప్పారు: “నా ప్రశ్నలన్నిటికీ జవాబులు దొరికాయి, ఇంకా అదనపు సమాచారం కూడా లభించింది! నాకంతా తెలుసని నేననుకున్నాను, కాని మిస్టర్ కుక్ నరకం, ఆత్మ, భూమిపట్ల దేవుని సంకల్పం, ఆ సంకల్పాన్ని దేవుని రాజ్యం ఎలా నెరవేరుస్తుంది వంటి విషయాలు వివరించ నారంభించే సరికి, బైబిలు గురించి నాకసలేమీ తెలియదని గ్రహించడం మొదలుపెట్టాను!”
మా ఇల్లెప్పుడూ వచ్చీపోయే వాళ్లతో సందడిగా ఉండేది. బంధువులు స్నేహితులు వచ్చి, పాలతోచేసే మిఠాయిలూ మొక్కజొన్న పేలాలతోచేసే లడ్డూలూ తయారు చేసేవాళ్లు, అమ్మ పియానో వాయిస్తుండగా వాళ్లు పాటలు పాడేవాళ్లు. మెల్లిగా ఈ సందర్భాలు బైబిలు అంశాలపై చర్చలు జరపడానికి దారితీశాయి. చర్చించబడుతున్న విషయాలన్నీ పిల్లలమైన మాకు అర్థంకాకపోయినప్పటికీ, దేవునిపట్లా బైబిలుపట్లా మా అమ్మానాన్నలకున్న ప్రగాఢమైన ప్రేమ ఎంత స్పష్టంగా తెలిసేదంటే, పిల్లలమైన మేము ముగ్గురం దేవునిపట్లా ఆయన వాక్యంపట్లా అలాంటి ప్రేమనే వృద్ధిచేసుకున్నాము.
వారపు బైబిలు చర్చల కోసం ఇతర కుటుంబాలు కూడా తమ ద్వారాలను తెరిచాయి, ఆ చర్చలు సాధారణంగా తాజా కావలికోట పత్రికలోని ఒక అంశంపై కేంద్రీకరించబడేవి. పొరుగునున్న ఆపెల్బీ, నాకడోషజ్ పట్టణాల్లోని కుటుంబాలు కూటాలు జరుపుకోవడానికి తమ ఇళ్లను ఇచ్చినప్పుడు, ఎండొచ్చినా వానొచ్చినా మేము మా మోడల్-ఏ-ఫోర్డ్ కారులో ప్రయాణించి వెళ్లేవాళ్లం.
వాళ్లు తాము నేర్చుకున్నదాన్ని ఆచరణలో పెట్టడం
తాము చర్య తీసుకోవలసి ఉందన్న విషయాన్ని మా అమ్మానాన్నలు గుర్తించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. దేవునిపట్లవున్న ప్రేమ, తాము నేర్చుకున్నదాన్ని ఇతరులతో చెప్పడాన్ని కోరింది. (అపొస్తలుల కార్యములు 20:35) ప్రాముఖ్యంగా మా అమ్మానాన్నలు సహజంగానే ఎంతో బిడియస్థులూ, దీనమనస్కులూ గనుక తమ విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించవలసిన ఈ చర్యను చేపట్టడం నిజంగా ఒక సవాలే అయ్యింది. అయినప్పటికీ, దేవునిపట్ల వారికున్న ప్రేమ వారిని పురికొల్పింది, తత్ఫలితంగా అది, యెహోవాయందు ప్రగాఢమైన నమ్మకాన్ని కల్గివుండడాన్ని మాకు బోధించడానికి వారికి సహాయం చేసింది. నాన్నగారు దాన్నిలా వ్యక్తం చేశారు: “యెహోవా, మట్టిపిసుక్కునే రైతులను ప్రచారకులుగా చేస్తున్నాడు!” 1933లో అమ్మానాన్నలు, టెక్సాస్‌లోని హెండర్సన్ వద్దనున్న చేపల కొలనులో నీటి బాప్తిస్మం పొందడం ద్వారా యెహోవాకు తమ సమర్పణను సూచించారు.
1935 తొలికాలంలో, నాన్నగారు వాచ్ టవర్ సొసైటికి ఉత్తరం వ్రాసి, నిత్యజీవాన్ని గురించిన క్రైస్తవ నిరీక్షణకు సంబంధించి అనేక ప్రశ్నలడిగారు. (యోహాను 14:2; 2 తిమోతి 2:11, 12; ప్రకటన 14:1, 3; 20:6) ఆనాటి సంస్థ అధ్యక్షుడైన జోసెఫ్ ఎఫ్. రూథర్‌ఫోర్డ్ స్వయంగా దానికి ప్రత్యుత్తరం వ్రాశారు. ఆయన ప్రశ్నలకు సమాధానమిచ్చే బదులు బ్రదర్ రూథర్‌ఫోర్డ్, మేనెలలో, వాషింగ్టన్ డి.సి.లో జరిగే యెహోవాసాక్షుల సమావేశానికి హాజరుకమ్మని నాన్నగారిని ఆహ్వానించారు.
‘అసాధ్యం!’ అనుకున్నారు నాన్నగారు. ‘మేము 65 ఎకరాల పొలంలో కూరగాయలు నాటుకున్న రైతులం. ఆ సమయానికల్లా అదంతా కోసి మార్కెట్‌కు పంపించాలి.’ అయితే, తర్వాత త్వరలోనే వరదలు రావటంతో ఆయన చెప్తున్న సాకులతో సహా పంటలు, కంచెలు, వంతెనలు కొట్టుకుపోయాయి. కాబట్టి మేము ఇతర సాక్షులతో కలిసి, అద్దెకు తీసుకున్న స్కూల్ బస్‌లో 1,600 కిలోమీటర్లు ఈశాన్యంగా ప్రయాణించి సమావేశానికి వెళ్లాము.
“మహా శ్రమ”ను తప్పించుకుని జీవించే “గొప్ప సమూహము” గురించిన గుర్తింపును స్పష్టంగా వివరించడాన్ని విని అమ్మానాన్నలు పులకరించిపోయారు. (ప్రకటన 7:9, 14) వారి మిగతా జీవితమంతటిలో, పరదైసు భూమిపై నిత్యజీవమనే నిరీక్షణ అమ్మానాన్నలను పురికొల్పింది, యెహోవా అనుగ్రహిస్తున్న భూమిపై నిరంతర జీవితమైన “వాస్తవమైన జీవమును సంపాదించు”కోమని పిల్లలమైన మమ్మల్ని వారు ప్రోత్సహించారు. (1 తిమోతి 6:18-19; కీర్తన 37:29; ప్రకటన 21:3, 4) అప్పుడు నా వయస్సు కేవలం ఐదేళ్లే అయినా, ఆ సంతోషభరితమైన సందర్భంలో నా కుటుంబంతో కలిసి ఉండటాన్ని నిజంగా నేనెంతగానో ఆనందించాను.
సమావేశం నుండి తిరిగి వచ్చిన తర్వాత, మేము మళ్లీ పంటలు వేసి, ఆ తర్వాత మునుపెన్నడూ లేనంత పుష్కలమైన దిగుబడిని అందుకున్నాము. యెహోవాయందు పూర్తి నమ్మకం ఉంచడం ఎన్నడూ నిష్ఫలదాయకమైపోదని అమ్మానాన్నలను ఒప్పించడానికి ఇది కచ్చితంగా సహాయపడింది. వాళ్లు ఒక ప్రత్యేకమైన ప్రకటనా పనిని ప్రారంభించారు, దానిలో వాళ్లు ఒక్కొక్కరం పరిచర్యలో నెలకు 52 గంటలు గడుపుతామని అంగీకరించారు. ఆ తర్వాత, మళ్లీ నాట్లు వేసే సమయం వచ్చినప్పుడు వాళ్లు తమకున్నదంతా అమ్మేశారు. మేము ఐదుగురం నివసించడానికి నాన్నగారు 6 x 2.4 మీటర్ల ట్రయలర్‌ను తీసుకున్నారు, దాన్ని లాక్కువెళ్లడానికి రెండు తలుపులున్న ఒక క్రొత్త ఫోర్డ్ సిడాన్ను కొన్నారు. పెదనాన్నగారు కూడా అలాగే చేశారు, ఆయన కూడా తన కుటుంబంతోపాటు ఒక ట్రయలర్లోకి మారిపోయారు.
మాకు సత్యం బోధించడం
అమ్మానాన్నలు 1936 అక్టోబరులో, పయినీరింగ్ అని పిలువబడే పూర్తికాల పరిచర్యను ప్రారంభించారు. మేము కుటుంబమంతా కలిసి తూర్పు టెక్సాస్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రకటించడం ప్రారంభించాము, రాజ్య సందేశం అక్కడికి అంత ఎక్కువగా చేరుకోలేదు. దాదాపు ఒక సంవత్సరంపాటు, మేము ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ప్రయాణించాము, కాని మొత్తానికి మేము నిజంగా ఆ జీవితాన్ని ఆనందించాము. బైబిలు సత్యాన్ని ఇతరులకు అందజేయడానికి తమను తాము అంకితం చేసుకున్న తొలి క్రైస్తవులలా ఉండమని అమ్మానాన్నలు మాకు వాచా కర్మణా బోధించారు.
అమ్మ తన ఇంటిని వదులుకోవడం ద్వారా చేసిన త్యాగాలను పిల్లలమైన మేము ప్రత్యేకంగా ఎంతో ఉన్నతమైందిగా పరిగణించాము. అయితే ఆమె తన కుట్టు మిషన్‌ను మాత్రం త్యాగం చేయలేకపోయింది. అది కూడా మంచిదే అయ్యింది. ఆమె కుట్టుపనిలో తనకున్న సామర్థ్యంతో, మమ్మల్ని ఎప్పుడూ చక్కని వస్త్రాల్లో ఉంచింది. ప్రతి సమావేశంలోనూ, మాకు ఆకర్షణీయమైన క్రొత్త బట్టలుండేవి.
హెర్మన్ జి. హెన్షెల్ వాచ్ టవర్ సొసైటికి చెందిన సౌండ్ ట్రక్‌లో తన కుటుంబంతో మా ప్రాంతానికి రావడం నాకు బాగా గుర్తుంది. బాగా జనసమ్మర్థం ఉన్న ప్రాంతంలో వాళ్లు తమ ట్రక్కును ఆపుకుని, రికార్డు చేయబడిన చిన్న ప్రసంగాన్ని వినిపించి, మరింత సమాచారాన్ని అందజేయడానికి ప్రజల దగ్గరికి వ్యక్తిగతంగా వెళ్లేవారు. అప్పట్లో తన యౌవనప్రాయంలో ఉన్న, హెర్మన్ కుమారుడైన మిల్టన్ సహవాసాన్ని డూయీ జూనియర్ ఎంతగానో ఆనందించాడు. మిల్టన్ ఇప్పుడు వాచ్ టవర్ సొసైటి అధ్యక్షుడు.
ఒహాయో నందలి కొలంబస్లో 1937లో జరిగిన సమావేశంలో ఎడ్వీనా బాప్తిస్మం తీసుకుంది, అమ్మానాన్నలకు ప్రత్యేక పయినీర్లుగా సేవచేసే ఆధిక్యత ఇవ్వబడింది. దాని కోసం, ఆ సమయంలో, ప్రకటనాపనిలో నెలకు 200 గంటలు వెచ్చించవలసి ఉండేది. నేను ఆ రోజులను గుర్తు తెచ్చుకున్నప్పుడు, నేను నా భర్తకు తన క్రైస్తవ నియామకాల్లో మద్దతునిచ్చేందుకు అమ్మ చక్కని మాదిరి ఎంతగా సహాయం చేసిందో నేను గ్రహిస్తాను.
నాన్నగారు ఒక కుటుంబంతో బైబిలు పఠనాన్ని ప్రారంభించినప్పుడు, వారి పిల్లలకు అనుకూలమైన మాదిరిని చూపించాలని పిల్లలమైన మమ్మల్ని తనతో తీసుకువెళ్లేవారు. బైబిలు తెరిచి లేఖనాలను చదవమని, కొన్ని ప్రాథమికమైన ప్రశ్నలకు సమాధానం చెప్పమని మాకు చెప్పేవారు. ఫలితంగా, అప్పుడు మేము ఎవరితోనైతే పఠించామో ఆ యౌవనస్థుల్లో అనేకులు ఈ నాటికీ నమ్మకంగా యెహోవా సేవ చేస్తున్నారు. వాస్తవానికి, దేవుని ప్రేమించడంలో కొనసాగడానికి మాకు దృఢమైన పునాది కూడా వేయబడింది.
డూయీ జూనియర్ పెద్దవాడౌతుండగా, చెల్లెళ్ళతో కలిసి అలాంటి ఇరుకైన స్థలంలో జీవించడం కష్టమని భావించాడు. కాబట్టి 1940లో ఆయన మమ్మల్ని విడిచి వెళ్లి మరో సాక్షితో కలిసి పయినీరు సేవ చేయడానికి నిర్ణయించుకున్నాడు. చివరికి ఆయన ఆడ్రీ బరన్ను వివాహం చేసుకున్నాడు. ఆడ్రీకి కూడా మా అమ్మానాన్నలే బోధించారు, ఆమె అమ్మానాన్నలను ఎంతగానో ప్రేమిస్తుంది. 1944లో డూయీ జూనియర్ తన క్రైస్తవ తటస్థతను బట్టి చెరసాలకు వెళ్లిన తర్వాత, ఆమె వచ్చి మాతోపాటు ఆ ఇరుకు స్థలంలో కొంతకాలంపాటు నివసించింది.
1941లో, మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో జరిగిన పెద్ద సమావేశంలో, సహాదరుడు రూథర్‌ఫోర్డ్, ముందు భాగంలోవున్న ప్రత్యేకమైన విభాగంలో కూర్చునివున్న 5 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సులోవున్న పిల్లలతో మాట్లాడారు. ఎడ్వీనా, నేను, ప్రశాంతమైన సుస్పష్టమైన ఆయన స్వరాన్ని విన్నాము; ఆయన ఇంట్లో తన పిల్లలకు బోధిస్తున్న ప్రేమగల తండ్రిలా ఉన్నారు. ఆయన తల్లిదండ్రులనిలా ప్రోత్సహించారు: “నేడు యేసుక్రీస్తు తన నిబంధన ప్రజలను తన యెదుట సమకూర్చాడు, తమ పిల్లలకు నీతి మార్గాల గురించి బోధించమని ఆయన వారికి శక్తివంతంగా చెప్తున్నాడు.” తర్వాత ఆయనిలా అన్నారు: “వాళ్లను ఇంటి దగ్గర ఉంచుకుని, వారికి సత్యం బోధించండి!” సంతోషకరంగా, మా తల్లిదండ్రులు అలాగే చేశారు!
ఆ సమావేశంలో, మేము జెహోవాస్ సర్వెంట్స్ డిఫెండెడ్ అనే ఒక క్రొత్త చిన్న పుస్తకాన్ని అందుకున్నాము, అందులో అమెరికాలోని సుప్రీమ్ కోర్టులో పరిశీలించబడిన వాటితో సహా, యెహోవాసాక్షులు విజయం సాధించిన కోర్టు కేసులు పునఃసమీక్షించబడ్డాయి. నాన్నగారు మాతో దాన్ని పఠించారు. అలబామాలోని సెల్మాలో కొన్ని వారాల తర్వాత జరుగనైయున్నదాని కోసం మేము సిద్ధం చేయబడుతున్నామని మాకెంత మాత్రం తెలియదు.
సెల్మాలో అల్లరిమూక చేసిన దొమ్మి
భయానకమైన అనుభవం ఎదురైన ఆ ఉదయం, చట్టం సంరక్షణలో పరిచర్యను కొనసాగించే మాకున్న చట్టబద్ధమైన హక్కును వివరిస్తూ వ్రాయబడిన ఒక ఉత్తరం ప్రతులను నాన్నగారు పోలీసు అధికారికీ, మేయర్కీ, సెల్మాలోని ప్రధాన పోలీసు అధికారికి ఇచ్చారు. అయినప్పటికీ, మమ్మల్ని పట్టణంలో నుండి వెళ్లగొట్టడానికే వాళ్లు నిశ్చయించుకున్నారు.
అపరాహ్ణవేళ, ఐదుగురు సాయుధులు వచ్చి అమ్మను, అక్కను, నన్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వాన్ని కూలదోసేవేవైనా ఉన్నాయేమోనని చూస్తూ, లోపలున్న ప్రతిదీ తనిఖీ చేయడం మొదలెట్టారు. నాన్నగారు బయట ఉన్నారు, వాళ్లు తమ తుపాకీలను ఆయనవైపు గురిపెట్టి ఉంచి, ట్రెయిలర్‌ను కారుకు తగిలించమని ఆజ్ఞాపించారు. ఆ సమయంలో నేనేం భయపడలేదు. మేము ప్రమాదకరమైన వారమని వాళ్లనుకోవడం ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అది నాకు, మా అక్కకు నవ్వు పుట్టించింది. అయితే నాన్నగారి ఒక్క చూపుతో మేము గంభీరంగా మారిపోయాము.
మేము వెళ్లిపోవడానికి సిద్ధమైనప్పుడు, నేను ఎడ్వీనా వాళ్లతోపాటు కారులో వెళ్లాలని వాళ్లన్నారు. నాన్నగారు స్థిరంగా నిలబడ్డారు. “నా శవం మీది నుండి తీసుకెళ్లండి!” అన్నారాయన. కొంత చర్చ తర్వాత, మా కుటుంబమంతా కలిసి ప్రయాణించడానికి అనుమతించారు, సాయుధులు తమ కారులో మా వెనుక వస్తారు. పట్టణంలో నుండి దాదాపు 25 కిలోమీటర్లు బయటికి వెళ్లిన తర్వాత, హైవే ప్రక్కన వాహనం ఆపమని చెప్పి, అమ్మను నాన్నను దూరంగా తీసుకువెళ్లారు. “ఆ మతాన్ని విడిచిపెట్టండి. పొలానికి తిరిగి రండి, మీ అమ్మాయిల్ని చక్కగా పెంచుకోండి” అని చెబుతూ వాళ్లు అమ్మను నాన్నను ఒప్పించడానికి వంతులు తీసుకున్నారు. నాన్నగారు వాళ్లతో తర్కించడానికి ప్రయత్నించారు గానీ ఫలితం శూన్యం.
చివరికి, ఒక వ్యక్తి ఇలా అన్నాడు: “వెళ్లిపోండి, మళ్లీ మీరు డల్లాస్ గ్రామానికి తిరిగి వస్తే మిమ్మల్నందరినీ చంపేస్తాము!”
ఉపశమనం పొంది, మేము మళ్లీ ఎన్నో గంటలపాటు కలిసి ప్రయాణించి రాత్రికి వాహనాన్ని నిలుపుకున్నాము. మేము వాళ్ల లైసెన్సు ప్లేటు నంబర్ వ్రాసి పెట్టుకున్నాము. నాన్నగారు వెంటనే అంతా వాచ్ టవర్ సొసైటీకి వ్రాశారు, కొన్ని నెలల తర్వాత ఆ వ్యక్తులను గుర్తించి అరెస్టు చేయడం జరిగింది.
గిలియడ్ మిషనరీ పాఠశాలకు
1946లో, న్యూయార్క్‌లోని సౌత్ లాన్సింగ్లో వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ 7వ తరగతికి హాజరు కమ్మని ఎడ్వీనా ఆహ్వానాన్ని అందుకుంది. ఉపదేశకుల్లో ఒకరైన ఆల్బర్ట్ ష్రోడర్ ఆమెకున్న చక్కని లక్షణాల గురించి, బేతేలులో సేవచేస్తున్న తన మాజీ పయినీరు పార్ట్నర్ అయిన బిల్ ఎల్రోడ్కు చెప్పారు, ఈ బేతేలు న్యూయార్క్ నందలి బ్రూక్లిన్‌లోని యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయం.a ఎడ్వీనా బిల్లు ఒకరికొకరు పరిచయం చేయబడ్డారు, ఆమె గిలియడ్ నుండి పట్టభద్రురాలైన ఒక సంవత్సరం తర్వాత, వాళ్లు వివాహం చేసుకున్నారు. చాలా కాలంపాటు వాళ్లు పూర్తికాల సేవలో ఉన్నారు, ఐదేళ్లపాటు బేతేలులో కలిసి సేవచేశారు. తర్వాత 1959లో ఒకరోజు, తన ప్రియ స్నేహితుడు కవల పిల్లలకు, అంటే ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి తండ్రి అయ్యాడని సహోదరుడు ష్రోడర్ 34వ గిలియడ్ తరగతికి ప్రకటించారు.
1947 చివరి భాగంలో నేను మిస్సిసిపిలోని మెరిడ్యన్లో మా అమ్మానాన్నలతో కలిసి సేవ చేస్తుండగా, మేము ముగ్గురం 11వ గిలియడ్ పాఠశాలకు హాజరు కమ్మనే ఆహ్వానాన్ని అందుకున్నాము. మేము దిగ్భ్రమ చెందాము ఎందుకంటే, దానికి ఉండవలసిన అర్హతలను బట్టి చూస్తే, నేను మరీ చిన్నదాన్ని, అమ్మానాన్నలు మరీ పెద్దవాళ్లు. కాని మినహాయింపు ఇవ్వబడింది, ఆ బైబిలు ఉపదేశాన్ని పొందే అపారమైన ఆధిక్యత మాకు లభించింది.
నా తల్లిదండ్రులతో కలిసి మిషనరీ సేవ
మాకు దక్షిణ అమెరికాలోని కొలంబియాలో మిషనరీలుగా నియామకం లభించింది. అయితే, మా గ్రాడ్యుయేషన్ అయిన సంవత్సరం తర్వాత, అంటే 1949 డిసెంబరు వరకు గానీ మేము బగోటాలోని మిషనరీ గృహానికి చేరుకోలేకపోయాము, అప్పటికే అక్కడ మరో ముగ్గురు మిషనరీలు నివసిస్తున్నారు. మొదట్లో, తాను స్పానిష్ నేర్చుకోవడానికి బదులు ప్రజలకు ఆంగ్లం నేర్పడం సుళువుగా ఉంటుందని నాన్నగారు భావించారు. అవును, మేము శ్రమలు ఎదుర్కున్నాము, అయినా ఎంతో గొప్ప ఆశీర్వాదాలను పొందాము! 1949లో కొలంబియాలో 100 కన్నా తక్కువమంది సాక్షులున్నారు, కాని ఇప్పుడక్కడ 1,00,000 కన్నా ఎక్కువమంది సాక్షులున్నారు!
బగోటాలో ఐదేళ్లు సేవ చేసిన తర్వాత, అమ్మానాన్నలను కాలి నగరానికి పంపించారు. ఆ మధ్య కాలంలో, అంటే 1952లో నేను రాబర్ట్ ట్రేసీని వివాహం చేసుకున్నాను, ఆయన కొలంబియాలో మా తోటి మిషనరీ.b మేము 1982 వరకు కొలంబియాలో ఉండిపోయాము, అప్పుడు మాకు మెక్సికోలో నియామకం లభించింది, అప్పటి నుండి ఇక అక్కడే సేవ చేస్తున్నాము. చివరికి 1968లో, అమ్మానాన్నలు వైద్య సహాయం కోసం అమెరికాకు తిరిగి రావలసి వచ్చింది. వాళ్లు మళ్లీ ఆరోగ్యాన్ని పుంజుకున్న తర్వాత, అలబామాలోని మొబైల్ నగరంలో ప్రత్యేక పయినీర్లుగా కొనసాగారు.
అమ్మానాన్నల పట్ల శ్రద్ధ తీసుకోవడం
సంవత్సరాలు గడుస్తుండగా, మెల్లగా అమ్మానాన్నల గమనవేగం తగ్గింది, వాళ్లకు మరింత మద్దతు, అవధానం ఇవ్వడం అవసరమైంది. వాళ్ల విజ్ఞప్తి మేరకు, అలబామాలోని ఏథెన్స్లో ఎడ్వీనా బిల్లకు దగ్గరగా వాళ్లకు పయినీరింగ్ నియామకం ఇవ్వబడింది. ఆ తర్వాత, కుటుంబమంతా దక్షిణ కరోలీనాలో ఒకరికొకరు సన్నిహితంగా నివసిస్తే బావుంటుందని మా అన్నయ్య డూయీ జూనియర్ తలంచాడు. కాబట్టి బిల్ అమ్మానాన్నలతో సహా తన కుటుంబాన్ని గ్రీన్‌వుడ్‌కు తరలించాడు. ఈ ప్రేమపూర్వకమైన ఏర్పాటు, అమ్మానాన్నల పట్ల ఎంతో శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని తెలుసుకుని, నేను రాబర్ట్ కొలంబియాలో మా మిషనరీ సేవను కొనసాగించాము.
తర్వాత, 1985లో నాన్నగారికి పక్షవాతం రావడంతో ఆయన మాట పడిపోయింది, ఆయన ఇక మంచం మీద నుండి లేవలేకపోయారు. అమ్మానాన్నల పట్ల చక్కగా శ్రద్ధ తీసుకోవడానికి ఏమి చేయవచ్చుననేది పరిశీలించడానికి కుటుంబమంతా కలిసి సమావేశమయ్యాము. ఆడ్రీ నాన్నగారి పట్ల శ్రద్ధ వహించాలనీ, రాబర్ట్ నేను ప్రోత్సాహకరమైన అనుభవాలతో ప్రతి వారం ఒక ఉత్తరం వ్రాయడం ద్వారా అలాగే వీలైనంత తరచుగా వారిని దర్శించడం ద్వారా సహాయం చేయాలనీ నిర్ణయించబడింది.
నాన్నగారిని నేను చివరిసారి కలిసిన దృశ్యం ఇప్పటికీ నా మనస్సులో స్పష్టంగా ఉంది. ఆయన మామూలుగా స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారు, కాని మేము మెక్సికోకు తిరిగి వెళ్తున్నామని ఆయనకు చెప్పినప్పుడు, ఆయన ఎంతో కష్టంతోనూ ఎంతో భావోద్వేగంగానూ ఒకే ఒక్క మాట పలికారు, “వీడ్కోలు!” దీని ద్వారా, మేము మా మిషనరీ నియామకంలో కొనసాగాలన్న మా నిర్ణయానికి ఆయన తన హృదయంలో మద్దతునిస్తున్నారని మాకు అర్థమైంది. ఆయన 1987 జూలైలో మరణించారు, తొమ్మిది నెలల తర్వాత అమ్మ కూడా చనిపోయింది.
మా అమ్మానాన్నలపట్ల మాకున్న మెప్పుదలను, విధవరాలైన మా అక్క వ్రాసిన ఈ ఉత్తరం చక్కగా తెలియజేస్తుంది. “నేను నా సుసంపన్నమైన క్రైస్తవ వారసత్వాన్ని ఎంతో విలువైందిగా ఎంచుతున్నాను, అమ్మానాన్నలు మనల్ని మరో విధంగా పెంచి ఉంటే బావుండేదని నాకు ఒక్క క్షణం కూడా అనిపించదు. దృఢమైన విశ్వాసం, స్వయం త్యాగ స్ఫూర్తి, యెహోవాయందు పూర్ణ నమ్మకం కల్గి వారు ఉంచిన మాదిరి, నా జీవితంలో ఎదురైన దుఃఖకరమైన క్షణాలను ఎదుర్కోవడానికి నాకు సహాయం చేసింది.” ఎడ్వీనా ఇలా ముగించింది: “మన ప్రేమగల దేవుడైన యెహోవా చుట్టూ మన జీవితాలను పొందుపర్చుకుంటే మనం పొందగల ఆనందాన్ని వాచా కర్మణా చూపించిన అమ్మానాన్నల నిచ్చినందుకు నేను యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.”
[అధస్సూచీలు]
a కావలికోట (ఆంగ్లం) మార్చి 1, 1988లోని 11, 12 పేజీలను చూడండి.
b కావలికోట (ఆంగ్లం) మార్చి 15, 1960లోని 189-91 పేజీలను చూడండి.
[22, 23వ పేజీలోని చిత్రం]
ఫౌంటెన్ కుటుంబం: (ఎడమ నుండి కుడికి) డూయీ, ఎడ్వీనా, విన్నీ, ఎలిజబెత్, డూయీ జూనియర్; కుడి: హెన్షెల్గారి సౌండ్ ట్రక్ మీదున్న ఎలిజబెత్, డూయీ జూనియర్ (1937) క్రింద కుడివైపు: 16 ఏళ్ల ప్రాయంలో ప్లేకార్డ్ పని చేస్తున్న ఎలిజబెత్