కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 11/15 పేజీలు 24-27
  • “యెహోవాయే జ్ఞానమిచ్చువాడు”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “యెహోవాయే జ్ఞానమిచ్చువాడు”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘జ్ఞానమునకు నీ చెవియొగ్గుము’
  • మీరు తగిన కృషి చేస్తారా?
  • మీరు విఫలులు కారు
  • “తెలివి మనోహరముగా” ఉన్నప్పుడు
  • ‘దుష్టుల మార్గము నుండి నిన్ను రక్షించును’
  • “యథార్థవంతులు దేశమందు నివసించుదురు”
  • హృదయపూర్వకంగా వివేచననభ్యసించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • మీరు మరింత వివేచనను పెంపొందింపజేసుకోగలరా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • “జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • దాచబడిన నిధులను వెదకునట్లు వెదకుచునుండుము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 11/15 పేజీలు 24-27

“యెహోవాయే జ్ఞానమిచ్చువాడు”

ఎలాంటి అభిరుచులు మీ సమయాన్నీ, శక్తినీ తీసుకుంటాయి? మంచి పేరు సంపాదించుకోవడం మీకు ముఖ్యమైన విషయమా? మిమ్మల్ని మీరు ధన సంపాదనకే అంకితం చేసుకుంటారా? ఏదైనా ఒక రంగంలో వృత్తిని సంపాదించుకోవడం లేదా ఏదైనా ఒకటో రెండో క్షేత్రాల్లో నైపుణ్యాన్ని సంపాదించుకోవడం మాటేమిటి? ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం మీకు ప్రాముఖ్యమైన విషయమా? మంచి ఆరోగ్యాన్ని కల్గివుండడం మీ అసలు చింతా?

పైన పేర్కొనబడిన వాటన్నిటికీ కొంత విలువ ఉండవచ్చు. అయితే అన్నిటికన్నా ప్రాముఖ్యమైనదేమిటి? బైబిలు ఇలా సమాధానమిస్తుంది: “జ్ఞానమే ముఖ్యాంశము. జ్ఞానము సంపాదించుకొనుము.” (సామెతలు 4:7, NW) కాబట్టి మనం జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవచ్చు, దాని వల్ల వచ్చే ప్రయోజనాలేమిటి? బైబిలు పుస్తకమైన సామెతల గ్రంథంలోని రెండవ అధ్యాయం మనకు సమాధానమిస్తుంది.

‘జ్ఞానమునకు నీ చెవియొగ్గుము’

ప్రాచీన ఇశ్రాయేలుకు చెందిన జ్ఞానవంతుడైన సొలొమోను రాజు, ఒక ప్రేమగల తండ్రి చెప్పినట్లు ఇలా చెప్తున్నాడు: “నా కుమారుడా, నీవు నా మాటల నంగీకరించి నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించినయెడల తెలివికై మొఱ్ఱపెట్టినయెడల వివేచనకై మనవి చేసినయెడల వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును.”—సామెతలు 2:1-5.

జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే బాధ్యత ఎవరిపై ఉందో మీరు గమనించారా? ఈ వచనాల్లో, “[చేసిన] యెడల” అన్న మాట ఆరుసార్లు కనిపిస్తుంది. కాబట్టి జ్ఞానాన్నీ, దాని చెలికత్తెలైన వివేచననూ అవగాహననూ సంపాదించుకోవడం మనపైనే ఆధారపడి ఉందని స్పష్టమౌతుంది. అయితే, మొట్టమొదట మనం లేఖనాల్లో వ్రాయబడివున్న జ్ఞానవచనాల్ని ‘అంగీకరించి’ వాటిని మన జ్ఞాపకంలో ‘దాచుకోవలసిన’ అవసరం ఉంది. దీనికోసం మనం బైబిలు చదవాలి.

జ్ఞానమంటే దేవుడిచ్చిన తెలివిని సరైన విధంగా ఉపయోగించే సామర్థ్యం. బైబిలు జ్ఞానాన్ని ఎంత అద్భుతరీతిగా అందుబాటులోకి తెస్తుందో కదా! అవును, సామెతల గ్రంథంలోనూ, ప్రసంగిలోనూ వ్రాయబడినట్లుగా దానిలో జ్ఞానవచనాలు ఉన్నాయి, మనమా వచనాలకు అవధానమివ్వవలసిన అవసరం ఉంది. దైవిక సూత్రాలను అన్వయించుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలను, వాటిని అలక్ష్యం చేయడం వల్ల వచ్చే ప్రమాదాలను చూపించే అనేక ఉదాహరణలను కూడా మనం బైబిలు పుటల్లో కనుగొనవచ్చు. (రోమీయులు 15:4; 1 కొరింథీయులు 10:11) ఉదాహరణకు, ప్రవక్తయైన ఎలీషా దగ్గర పని చేసిన అత్యాశాపరుడైన గేహజీని గురించిన వృత్తాంతాన్ని పరిశీలించండి. (2 రాజులు 5:20-27) అత్యాశ ఉండకూడదన్న జ్ఞానాన్ని అది మనకు బోధించడం లేదా? యాకోబు కుమార్తె అయిన దీనా, కనాను “దేశపు కుమార్తెలను” చూసేందుకు వెళ్లినప్పుడు నిరపాయకరమైనవిగా అనిపించిన సందర్శనాల దుఃఖకరమైన పర్యవసానం మాటేమిటి? (ఆదికాండము 34:1-31) చెడు సహవాసాల బుద్ధిహీనతను మనం వెంటనే గ్రహించమా?—సామెతలు 13:20; 1 కొరింథీయులు 15:33.

జ్ఞానానికి చెవి యొగ్గడం, వివేచననూ అవగాహననూ సంపాదించుకోవడానికి దోహదపడుతుంది. వెబ్స్‌టర్స్‌ రివైజ్డ్‌ అనబ్రిడ్జడ్‌ డిక్షనరి ప్రకారం, వివేచన అంటే, “ఒక విషయం నుండి మరో విషయాన్ని వేరు చేయగలిగేలా మెదడుకున్న శక్తి లేక సామర్థ్యం.” తప్పేదో ఒప్పేదో గ్రహించి, సరైన మార్గాన్ని ఎన్నుకునే సామర్థ్యమే దైవిక వివేచన. మనం వివేచనను ‘హృదయపూర్వకంగా అభ్యసించకపోతే’ లేదా ఆత్రంగా దాన్ని సంపాదించుకోకపోతే, మనం ‘జీవానికి నడిపే మార్గంపై’ ఎలా నిలిచివుండగలం? (మత్తయి 7:13-14; పోల్చండి ద్వితీయోపదేశకాండము 30:19, 20.) దేవుని వాక్యాన్ని పఠించి, అన్వయించుకోవడం వివేచననిస్తుంది.

‘తెలివికై’ అంటే ఒక విషయానికి సంబంధించిన అంశాలు ఒకదానితో ఒకటీ, అలాగే మొత్తం అంశంతోనూ ఎలా సంబంధం కల్గివున్నాయో గ్రహించే సామర్థ్యానికై మనమెలా ‘మొఱ్ఱపెట్టవచ్చు’? అయితే, అధికమైన అవగాహనను పెంపొందింపజేసుకోవడానికి సహాయపడే కారకాలు వయస్సు, అనుభవము. కానీ అవి తప్పనిసరిగా అలా అయ్యుండనవసరం లేదు. (యోబు 12:12; 32:6-12) “నీ [యెహోవా] ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధులకంటె నాకు విశేషజ్ఞానము కలదు” అని కీర్తన గ్రంథకర్త అన్నాడు. ఆయనింకా ఇలా పాడాడు: “నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగుకలుగును అవి తెలివిలేనివారికి తెలివి కలిగించును.” (కీర్తన 119:100, 130) యెహోవా ‘మహావృద్ధుడు,’ మానవజాతికంతటికీ ఉన్న వివేచనకంటే అపరిమితమైన వివేచన ఆయనకుంది. (దానియేలు 7:13) దేవుడు తెలివిలేని వారికి వివేచననిచ్చి, వయస్సులో పెద్దవారికంటే అధికమైన వివేచన కల్గివుండేలా చేయగలడు. కాబట్టి, దేవుని వాక్యమైన బైబిలును పఠించి, అన్వయించుకోవడంలో మనం అత్యంత శ్రద్ధ కల్గివుండాలి.

సామెతల గ్రంథంలోని రెండవ అధ్యాయం ప్రారంభ భాగంలో ‘అంగీకరించిన,’ ‘దాచుకున్న,’ ‘మొఱ్ఱపెట్టిన,’ ‘వెదకిన’ వంటి పదాల తర్వాత “యెడల” అన్న మాట పదేపదే వచ్చింది. రచయిత అత్యధిక తీవ్రతగల ఈ పదాలను ఎందుకు ఉపయోగించాడు? ఒక పుస్తకం ఇలా తెలియజేస్తుంది: “జ్ఞానాన్ని సంపాదించుకోవడంలో ఉండవలసిన అత్యంతాసక్తిని ప్రాజ్ఞుడు [ఇక్కడ] నొక్కి చెప్తున్నాడు.” అవును, మనం జ్ఞానాన్నీ, దాని సంబంధిత లక్షణాలైన వివేచనను, అవగాహనను అత్యంతాసక్తితో వెంటాడాలి.

మీరు తగిన కృషి చేస్తారా?

జ్ఞానాన్ని సంపాదించుకోవడంలో ప్రముఖ అంశం శ్రద్ధతో బైబిలు అధ్యయనం చేయడం. అయితే ఈ అధ్యయనం, ఏదో కేవలం సమాచారం కోసం చదవడం కన్నా ఎంతో ఎక్కువే అయ్యుండాలి. లేఖనాలను అధ్యయనం చేయడంలో మనం చదివేదాన్ని సంకల్పవంతంగా ధ్యానించడం ముఖ్యమైన భాగం. జ్ఞానవివేచనలను సంపాదించుకోవడంలో, మనం నేర్చుకుంటున్నదాన్ని సమస్యలను పరిష్కరించుకోవడంలోనూ, నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఎలా ఉపయోగించవచ్చుననేదాని గురించి ఆలోచించడం ఇమిడివుంటుంది. అవగాహనను సంపాదించుకోవడానికి, మనకు ఇప్పటికే తెలిసినదానికి, క్రొత్త సమాచారం ఎలా సరిపోతుందనేదాని గురించి ఆలోచించడమవసరం. బైబిలును అలా ఆలోచనాపూర్వకంగా అధ్యయనం చేయడానికి సమయమూ శక్తివంతమైన ప్రయత్నమూ అవసరమన్న విషయాన్ని ఎవరు కాదంటారు? అందుకు వెచ్చించే సమయమూ, శక్తీ ‘వెండి కోసం, దాచబడిన ధనం కోసం వెదికేటప్పుడు’ వెచ్చించే వాటివంటివే. మీరు అవసరమైనంతగా కృషి చేస్తారా? అలా చేయడానికి కావలసిన ‘సమయాన్ని మీరు సద్వినియోగం’ చేసుకుంటారా?—ఎఫెసీయులు 5:15, 16.

మనం యథార్థ హృదయంతో బైబిల్లోకి లోతుగా త్రవ్వితే మన కోసం ఎంత గొప్ప నిధి వేచివుంటుందో పరిశీలించండి. “దేవునిగూర్చిన విజ్ఞానము”ను అంటే, మన సృష్టికర్తను గురించిన సుస్థిరమైన, దృఢమైన, జీవదాయక జ్ఞానాన్ని మనం కనుగొంటాము! (యోహాను 17:3) “యెహోవాయందు భయభక్తులు” కూడా సంపాదించుకోవలసిన గొప్ప నిధియే. ఆయనను గురించిన ఇటువంటి భక్తితో కూడిన భయం ఎంత విలువైనదో కదా! ఆయనను అప్రీతిపర్చడాన్ని గురించిన ఆరోగ్యదాయకమైన భయం మన జీవితంలోని ప్రతి అంశాన్ని నడిపిస్తూ, మనం చేసే దానంతటికీ ఆధ్యాత్మిక విశేషతను జతచేయాలి.—ప్రసంగి 12:13.

ఆధ్యాత్మిక సంపదలకోసం వెదకాలనే, త్రవ్వాలనే తీవ్రమైన కోరిక మనలో రగులుతూ ఉండాలి. మన పరిశోధనను కొనసాగించడానికి, యెహోవా చక్కని త్రవ్వే ఉపకరణాలను అందజేశాడు—సమయానుకూల, సత్య పత్రికలైన కావలికోట మరియు తేజరిల్లు! మరితర బైబిలు ఆధారిత ప్రచురణలు. (మత్తయి 24:45-47) యెహోవా తన వాక్యంలోనూ, మార్గాల్లోనూ విద్యను అందించడానికి క్రైస్తవ కూటాలను కూడా ఏర్పాటు చేశాడు. మనం వీటికి క్రమంగా హాజరవ్వాలి, అక్కడ చెప్పబడుతున్న దాన్ని శ్రద్ధగా వినాలి, కీలకమైన తలంపులపై అవధానముంచడానికీ, వాటిని దాచుకోవడానికీ మనం కృషి చేయాలి, యెహోవాతో మనకున్న సంబంధం గురించి ప్రగాఢంగా ఆలోచించాలి.—హెబ్రీయులు 10:24, 25.

మీరు విఫలులు కారు

నిక్షిప్తమైయున్న రత్నాలు, బంగారం, లేక వెండి కోసం వెదకడం సాధారణంగా నిష్ఫలమైనదిగా నిరూపించబడుతుంది. ఆధ్యాత్మిక నిధి కోసం వెదికే విషయం అలా కాదు. ఎందుకని? “యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును” అని సొలొమోను మనకు హామీ ఇస్తున్నాడు.—సామెతలు 2:6.

రాజైన సొలొమోను తనకున్న జ్ఞానానికి పేరుపొందాడు. (1 రాజులు 4:30-32) ఆయనకు మొక్కలు, జంతువులు, మానవ స్వభావం, దేవుని వాక్యం వంటి అనేకానేక విషయాల గురించిన జ్ఞానం ఉన్నదని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఒకే బిడ్డకు తాము తల్లులమని చెప్పుకుంటున్న ఇద్దరు స్త్రీల మధ్యనున్న వివాదాన్ని పరిష్కరించడంలో యౌవనుడైన రాజుగా ఆయన ప్రదర్శించిన వివేచన అంతర్జాతీయ ఖ్యాతినార్జించడానికి ఆయనకు సహాయపడింది. (1 రాజులు 3:16-28) ఆయనకున్న గొప్ప తెలివికి మూలమేమిటి? “జ్ఞానమును తెలివిని” దయచేయమనీ, ‘మంచిచెడ్డలు వివేచించే’ సామర్థ్యాన్ని అనుగ్రహించమనీ సొలొమోను యెహోవాకు ప్రార్థించాడు. యెహోవా ఆయనకు వాటన్నిటినీ అనుగ్రహించాడు.—2 దినవృత్తాంతములు 1:10-12; 1 రాజులు 3:9.

మనం కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధతో అధ్యయనం చేసేటప్పుడు యెహోవా సహాయం కోసం ప్రార్థించాలి. కీర్తన గ్రంథకర్త ఇలా ప్రార్థించాడు: “యెహోవా, నేను నీ సత్యము ననుసరించి నడచుకొనునట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము.” (కీర్తన 86:11) యెహోవా ఆ ప్రార్థనను ఆమోదించాడు, అందుకే ఆయన దాన్ని బైబిల్లో వ్రాయించి ఉంచాడు. బైబిల్లోని ఆధ్యాత్మిక నిధిని కనుగొనడంలో ఆయన సహాయం కోసం మనం చేసే పట్టుదలతో కూడిన హృదయపూర్వకమైన ప్రార్థనలకు సమాధానం లభించకుండా ఉండదని మనం నిశ్చయత కల్గివుండవచ్చు.—లూకా 18:1-8.

సొలొమోను ఇలా చెప్తున్నాడు: “ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును; యుక్తమార్గము తప్పక నడుచుకొనువారికి ఆయన కేడెముగా నున్నాడు. న్యాయము తప్పిపోకుండ ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలిసికొందువు.” (సామెతలు 2:7-9) ఎంత గొప్ప హామీ! యథార్థంగా వెదికేవారికి యెహోవా నిజమైన జ్ఞానాన్ని ఇవ్వడమేగాక నీతిమంతులకు ఆయన ఒక రక్షణ కవచంగా కూడా ఉంటాడు ఎందుకంటే వాళ్లు నిజమైన జ్ఞానాన్ని ప్రదర్శించి, ఆయన నీతియుక్తమైన ప్రమాణాలకు యథార్థంగా కట్టుబడి ఉంటారు. “ప్రతి సన్మార్గమును” అర్థం చేసుకోవడానికి యెహోవా సహాయం చేసేవారి మధ్య మనమూ ఉందాము.

“తెలివి మనోహరముగా” ఉన్నప్పుడు

జ్ఞానం పొందడానికి, బైబిలును వ్యక్తిగతంగా అధ్యయనం చేయడం అత్యంతావశ్యకం, అయితే అది చాలామంది ప్రజలకు ఆహ్లాదకరమైన ఉత్తరాపేక్ష కాకపోవచ్చు. ఉదాహరణకు, 58 ఏళ్ల లారెన్స్‌ ఇలా చెప్తున్నాడు: “నేను ఎక్కువగా నా చేతులతోనే కష్టించి పనిచేస్తుంటాను. అధ్యయనం మాత్రం నాకు చాలా కష్టం.” స్కూల్లో చదువుకోవడం అంతగా ఇష్టపడని 24 ఏళ్ల మైఖెల్‌ ఇలా అంటున్నాడు: “కుదురుగా కూర్చుని చదువుకోవడానికి నన్ను నేను చాలా బలవంతపెట్టుకోవాలి.” అయినా, పఠించాలనే కోరికను వృద్ధి చేసుకోవచ్చు.

మైఖెల్‌ ఏమి చేశాడో పరిశీలించండి. ఆయనిలా చెప్తున్నాడు: “ప్రతిరోజు అరగంటసేపు అధ్యయనం చేసేలా నన్ను నేను క్రమశిక్షణలో పెట్టుకున్నాను. త్వరలోనే నా దృక్పథంలో, క్రైస్తవ కూటాల్లో నేను చేసే వ్యాఖ్యానాల్లో, ఇతరులతో నా సంభాషణల్లో వచ్చిన మార్పును నేను గమనించగలిగాను. నేనిప్పుడు నా అధ్యయన సమయాల కోసం ఎదురు చూస్తాను, ఆ సమయాల్లో ఏవైనా ఆటంకాలు రావడం నాకు అస్సలు ఇష్టముండదు.” అవును, మనం సాధించే అభివృద్ధిని మనం గమనించినప్పుడు, వ్యక్తిగత అధ్యయనం ఆనందదాయకమైనదౌతుంది. లారెన్స్‌ కూడా కష్టపడి బైబిలు అధ్యయనం చేశాడు, కొంతకాలానికి, ఆయన యెహోవాసాక్షుల సంఘంలో పెద్దగా సేవచేయనారంభించాడు.

వ్యక్తిగత అధ్యయనాన్ని ఆనందించదగిన అనుభవంగా చేసుకోవడానికి ఎడతెగని కృషి అవసరం. అయితే దాని వల్ల వచ్చే ప్రయోజనాలు మాత్రం గొప్పవి. “జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును” అని సొలొమోను చెప్తున్నాడు.—సామెతలు 2:10, 11.

‘దుష్టుల మార్గము నుండి నిన్ను రక్షించును’

జ్ఞానము, తెలివి, బుద్ధి, వివేచన ఎలా ఒక రక్షణగా పనిచేయగలవు? సొలొమోను ఇలా చెప్తున్నాడు: “[అవి] దుష్టుల మార్గమునుండియు మూర్ఖముగా మాటలాడువారి చేతిలోనుండియు నిన్ను రక్షించును. అట్టివారు చీకటి త్రోవలలో నడువవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు కీడుచేయ సంతోషించుదురు అతిమూర్ఖుల ప్రవర్తనయందు ఉల్లసించుదురు. వారు నడుచుకొను త్రోవలు వంకరవి వారు కుటిలవర్తనులు.”—సామెతలు 2:11-16.

నిజమైన జ్ఞానాన్ని ఇష్టపడేవాళ్లు, “మూర్ఖముగా” మాటలాడే వారి సహవాసాన్ని, అంటే నిజమైనవీ సరైనవీ అయిన వాటికి వ్యతిరేకంగా మాటలాడే వారెవరి సహవాసాన్నైనా విసర్జిస్తారు. సత్యాన్ని నిరాకరించటం మూలంగా చీకటి మార్గం మినహా వేరు మార్గం లేని వారినుండీ, కుటిలత్వంతో ప్రవర్తిస్తూ చెడు కార్యాల్లో ఆనందాన్ని పొందేవారి నుండి బుద్ధి, వివేచన మనకు కాపుదలనిస్తాయి.—సామెతలు 3:32.

నిజమైన జ్ఞానమూ దాని సంబంధిత లక్షణాలూ మనల్ని అనైతిక స్త్రీ పురుషుల చెడు మార్గాల నుండి కూడా కాపాడతాయి గనుక మనం ఎంత కృతజ్ఞత కల్గివుండవచ్చు! ఈ లక్షణాలు, “జారస్త్రీ నుండి మృదువుగా మాటలాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యౌవనకాలపు ప్రియుని విడుచునది తన దేవుని నిబంధనను మరచునది. దాని యల్లు మృత్యువు నొద్దకు దారితీయును అది నడచు త్రోవలు ప్రేతలయొద్దకు చేరును దానియొద్దకు పోవువారిలో ఎవరును తిరిగి రారు జీవమార్గములు వారికి దక్కవు” అని సొలొమోను జత చేస్తున్నాడు.—సామెతలు 2:16-19.

“జారస్త్రీ,” అంటే వేశ్య, తన యౌవనకాలపు ప్రియుని, బహుశా తన యౌవన దశలోని భర్తను, విడిచిపెట్టిన స్త్రీగా చూపించబడుతుంది. (పోల్చండి మలాకీ 2:14.) ధర్మశాస్త్ర నిబంధనలో భాగమైన, జారత్వాన్ని విసర్జించమన్న నిషేధాన్ని ఆమె మరిచిపోయింది. (నిర్గమకాండము 20:14) ఆమె మార్గాలు మరణానికి నడిపిస్తాయి. ఆమెతో సహవసించేవారు ‘జీవమార్గములను ఎన్నడూ తిరిగి పొందలేకపోవచ్చు,’ ఎందుకంటే వాళ్లు ఎప్పుడో ఒకసారి ఇక మరెన్నడూ తిరిగి రాలేని చోటుకు అంటే మరణానికి చేరుకోవచ్చు. వివేచనా, బుద్ధి గల వ్యక్తి అనైతిక ప్రవర్తనలోని ప్రలోభాలను తెలుసుకుని, వాటిలో చిక్కుకోవడాన్ని జ్ఞానయుక్తంగా తప్పించుకుంటాడు.

“యథార్థవంతులు దేశమందు నివసించుదురు”

జ్ఞానంపై తానిస్తున్న ఉపదేశ సంకల్పాన్ని సమీక్షిస్తూ, సొలొమోను ఇలా పేర్కొంటున్నాడు: “నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు నీతిమంతుల ప్రవర్తనల ననుసరించుదువు.” (సామెతలు 2:20) జ్ఞానమెంత అద్భుతమైన సంకల్పాన్ని నెరవేరుస్తుందో కదా! దేవుని అంగీకారాన్ని పొందే ఆనందభరితమైన, సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి అది మనకు సహాయం చేస్తుంది.

“సజ్జనుల మార్గమందు నడుచు”కొనే వారికోసం వేచివున్న గొప్ప ఆశీర్వాదాలను కూడా పరిశీలించండి. సొలొమోను ఇలా కొనసాగిస్తున్నాడు: “యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపములేనివారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికివేయబడుదురు.” (సామెతలు 2:21, 22) దేవుని నీతియుక్తమైన నూతన లోకంలో నిరంతరం నివసించే లోపములేనివారిలో మీరూ ఒకరై ఉండాలి.—2 పేతురు 3:13.

[26వ పేజీలోని చిత్రం]

సొలొమోను జ్ఞానం కోసం ప్రార్థించాడు. మనమూ అలాగే చేయాలి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి