2000—ప్రత్యేకమైన సంవత్సరమా?
రెండువేల సంవత్సరానికి ఏదైనా ప్రత్యేకత ఉందా? పాశ్చాత్య దేశాల్లో నివసిస్తున్న ప్రజలు సాధారణంగా దాన్ని మూడవ సహస్రాబ్దంలోని మొదటి సంవత్సరంగా పరిగణిస్తారు. దాన్ని ఒక పండుగలా జరుపుకునేందుకు విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. క్రొత్త సహస్రాబ్దం ప్రారంభమయ్యే వరకు క్షణాలను లెక్కించేందుకు పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ గడియారాలు నెలకొల్పబడుతున్నాయి. నూతన వత్సరానికి ఆహ్వానం పలికేందుకు మహోత్సవాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. సహస్రాబ్ద-ముగింపు అనే నినాదాలు వ్రాసివున్న టి-షర్ట్లు గ్రామాల్లోని చిన్న చిన్న దుకాణాల్లోనూ, నగరాల్లోని పెద్ద పెద్ద షాపుల్లోనూ అమ్మబడుతున్నాయి.
చర్చీలు, చిన్నవీ పెద్దవీ, అన్నీ సంవత్సరం పొడుగునా వేడుకలు జరుపుకునేందుకు సమకూడబోతున్నాయి. వచ్చే సంవత్సరం తొలిభాగంలో, పోప్ జాన్ పాల్ II, “రోమన్ క్యాథలిక్ చర్చి సహస్రాబ్ద ఉత్సవం” అని పిలువబడుతున్న వాటిలో రోమన్ క్యాథలిక్‌లకు నడిపింపు నిచ్చేందుకు ఇజ్రాయిల్‌కు వెళతాడనుకుంటున్నారు. భక్తిపరుల నుండి ఉత్సుకత గలవారి వరకూ, దాదాపు 25 నుండి 60 లక్షలమంది, వచ్చే సంవత్సరం ఇజ్రాయిల్‌ను సందర్శించడానికి పథకాలు వేసుకుంటున్నట్లు అంచనా వేయబడుతుంది.
ఎందుకు అంతమంది ఇజ్రాయిల్‌ను సందర్శించడానికి పథకాలు వేసుకుంటున్నారు? వాటికన్ అధికారి అయిన రోజర్ కార్డినల్ ఏషగరై, పోపు తరపున మాట్లాడుతూ, “2000వ సంవత్సరం క్రీస్తుకు ఉత్సవం, ఆయన ఈ దేశంలో గడిపిన జీవితాన్ని ఉత్సవంగా జరుపుకునే సంవత్సరం. కాబట్టి పోప్ ఇక్కడికి రావడమన్నది కేవలం సహజం,” అని చెప్పాడు. 2000వ సంవత్సరం క్రీస్తుతో ఎలా సంబంధం కల్గివుంది? 2000వ సంవత్సరం, క్రీస్తు జననం నుండి సరిగ్గా 2,000 సంవత్సరాలు గడిచాయన్నదానికి గుర్తుగా ఉంటుందని సాధారణంగా తలంచబడుతుంది. అది నిజమేనా? మనం చూద్దాం.
2000వ సంవత్సరం కొన్ని మత గుంపుల సభ్యులకు మరింత ప్రత్యేకమైనది. వచ్చే సంవత్సరంలో లేదా మరికొంత కాలంలో, యేసు ఒలీవల కొండకు తిరిగి వస్తాడనీ, ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడిన అర్మగిద్దోను యుద్ధం మెగిద్దో లోయలో జరుగుతుందనీ వాళ్లు దృఢంగా విశ్వసిస్తున్నారు. (ప్రకటన 16:14-16) ఈ సంఘటనల కోసం ఎదురు చూస్తూ, వందలాదిమంది అమెరికా వాసులు తమ ఇళ్లనూ, చాలా వరకు తమ ఆస్తులనూ అమ్ముకుని ఇజ్రాయిల్‌కు తరలివెళ్తున్నారు. తమ ఇళ్లను విడిచి వెళ్లలేని వారి ప్రయోజనార్థం, యేసు రాకడను టీవీలో, అదీ రంగుల్లో ప్రసారం చేస్తానని అమెరికాకు చెందిన ఒక ప్రముఖ సువార్తికుడు వాగ్దానం చేసినట్లు చెప్పబడుతుంది!
పాశ్చాత్య దేశాల్లో, మూడవ సహస్రాబ్దానికి ఆహ్వానం పలికే సన్నాహాలు ఉధృతమౌతున్నాయి. అయితే, ఇతర దేశాల్లోని ప్రజలు తమ అనుదిన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ ప్రజలు, అంటే ప్రపంచ జనాభాలోని అత్యధిక శాతం మంది నజరేయుడైన యేసును మెస్సీయ అని విశ్వసించడం లేదు. అంతేగాక వాళ్లు క్రీ.పూ.-క్రీ.శ. అనే విధమైన తేదీల లెక్కింపును కూడా అంగీకరించరు.a ఉదాహరణకు, చాలామంది ముస్లిమ్‌లు తమ స్వంత క్యాలెండర్‌ను ఉపయోగిస్తారు, దాని ప్రకారం, వచ్చే సంవత్సరం 1420 అవుతుంది గానీ 2000 కాదు. ముస్లిమ్‌లు, మహమ్మదు ప్రవక్త మక్కా నుండి మదీనాకు పారిపోయిన తేదీ నుండి సంవత్సరాలను లెక్కిస్తారు. మొత్తంమీద, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దాదాపు 40 రకాల క్యాలెండర్లను ఉపయోగిస్తున్నారు.
2000వ సంవత్సరం క్రైస్తవులకు ప్రత్యేకమైనదై ఉండాలా? 2000, జనవరి 1, నిజంగా అత్యంత విశేషమైన దినమా? ఈ ప్రశ్నలకు తర్వాతి శీర్షికలో సమాధానం ఇవ్వబడుతుంది.
[అధస్సూచీలు]
a క్రీ.పూ.-క్రీ.శ. విధమైన తేదీల లెక్కింపులో, సాంప్రదాయకంగా యేసు జనన సమయానికి ముందు సంభవించిన సంఘటనలు “క్రీ.పూ.” సంవత్సరాలుగా (క్రీస్తు పూర్వం) గుర్తించబడుతున్నాయి; ఆ తర్వాత జరిగిన సంఘటనలు “క్రీ.శ.” సంవత్సరాలుగా (అన్నో డోమిని—“మన ప్రభువు సంవత్సరంలో”) గుర్తించబడుతున్నాయి. అయితే, కొంతమంది అభిజ్ఞులైనవారు “సా.శ.పూ.” (సామాన్య శక పూర్వం) అనీ “సా.శ.” (సామాన్య శకం) అనీ లౌకికపరమైన గుర్తింపులను ఉపయోగించడానికి ఇష్టపడతారు.