కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 10/15 పేజీలు 28-31
  • దేవుని వాక్య ప్రేమికులకు ఒక మైలురాయి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని వాక్య ప్రేమికులకు ఒక మైలురాయి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎందుకొక క్రొత్త అనువాదం?
  • విశేషమైన అంశాలు
  • దేవుని నామాన్ని పునరుద్ధరించటం
  • ఆంగ్లేతర పాఠకులను చేరటం
  • న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ పట్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కృతజ్ఞతాభావంతో ఉన్నారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • కొత్తలోక అనువాదం ఖచ్చితమైనదేనా?
    తరచూ అడిగే ప్రశ్నలు
  • తేలిగ్గా అర్థమయ్యే ఓ బైబిలు అనువాదం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • యెహోవా సంభాషించే దేవుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 10/15 పేజీలు 28-31

దేవుని వాక్య ప్రేమికులకు ఒక మైలురాయి

దేవుని వాక్య ప్రేమికులందరి జీవితాల్లో 1998 ఒక విశేషమైన మైలురాయిగా పరిణమించింది. ఆ సంవత్సరంలో, “న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ద హోలీ స్క్రిప్చర్స్‌” యొక్క 10 కోట్లవ ప్రతి ప్రెస్సు నుండి బయటికి వచ్చింది. దానితో అది ఈ శతాబ్దంలో ఉత్పత్తి చేయబడిన బైబిళ్లలోకెల్లా అత్యధికంగా పంచిపెట్టబడిన బైబిళ్లలో ఒకటయ్యింది!

ఈఅనువాదం విడుదల చేయబడినప్పుడు అది తీవ్రమైన విమర్శకు గురైందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే, ఇది ఎంతో విశేషమైన విజయమే. అయినప్పటికీ, అది ఉనికిలో కొనసాగడమే గాక, ప్రవర్థమానం చెంది, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది గృహాల్లోకి, అలాగే వారి హృదయాల్లోకి ప్రవేశించింది! ఈ విశేషమైన అనువాదానికి మూలమేమిటి? దాని వెనుక ఎవరున్నారు? దాన్ని ఉపయోగించటం ద్వారా మీరెలా ప్రయోజనం పొందవచ్చు?

ఎందుకొక క్రొత్త అనువాదం?

యెహోవాసాక్షులకు చట్టబద్ధమైన సంస్థగా ప్రాతినిధ్యం వహిస్తున్న వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఇప్పటికి వంద సంవత్సరాలకుపైగా బైబిళ్లను పంచిపెట్టింది. అయితే దేవుని వాక్యం యొక్క మరో అనువాదాన్ని ఉత్పత్తి చేయవలసిన అవసరం ఉందని యెహోవాసాక్షులు ఎందుకు భావించారు? సాకాయె కూబో, వాల్టర్‌ స్పెక్ట్‌లు వ్రాసిన సో మెనీ వెర్షన్స్‌? అనే పుస్తకం ఇలా పేర్కొంటుంది: “బైబిలు యొక్క ఏ అనువాదాన్నీ ఇదే చివరిదని అనుకోలేము. అనువాదాలు, బైబిలు సంబంధిత పాండిత్యంలో జరుగుతున్న అభివృద్ధితోనూ, భాషలో వస్తున్న మార్పులతోనూ సమానంగా పురోగమించాలి.”

బైబిలు ప్రాథమికంగా వ్రాయబడిన భాషలైన హెబ్రీ, గ్రీకు, అరామిక్‌ భాషలను అర్థం చేసుకోవటంలో ఈ శతాబ్దంలో చెప్పుకోదగినంత అభివృద్ధి కనిపించింది. అంతేగాక, గత తరాలకు చెందిన బైబిలు అనువాదకులు ఉపయోగించిన వాటికంటే మరింత ప్రాచీన, మరింత కచ్చితమైన బైబిలు వ్రాతప్రతులు కనుగొనబడ్డాయి. కాబట్టి మునుపెన్నటి కన్నా నేడు దేవుని వాక్యాన్ని మరింత కచ్చితంగా అనువదించవచ్చు! అందుకని మంచి కారణంతోనే, బైబిలును ఆధునిక దిన భాషల్లోకి అనువదించటానికి న్యూ వరల్డ్‌ బైబిల్‌ ట్రాన్స్‌లేషన్‌ కమిటీ రూపొందించబడింది.

క్రైస్తవ గ్రీకు లేఖనముల నూతన లోక అనువాదము యొక్క ఆంగ్ల భాషా అనువాదము 1950లో ప్రచురించబడింది. బైబిలు “పాత,” “క్రొత్త” నిబంధనలతో ఏర్పడినదన్న వివరణను నిరాకరిస్తూ, దానికి ఇవ్వబడిన పేరే సాంప్రదాయానికి వ్యతిరేకంగా తీసుకున్న ఎంతో సాహసోపేతమైన చర్య. తర్వాతి దశాబ్దంలో, హెబ్రీ లేఖన భాగాలు దఫాల వారీగా ప్రచురించబడ్డాయి. 1961లో మొత్తం బైబిలు ఆంగ్లంలో ఒక సంపుటిగా విడుదల చేయబడింది.

ఈ విశేషమైన బైబిల్‌ను ఎవరు అనువదించారు? కావలికోట (ఆంగ్లం) సెప్టెంబరు 15, 1950, సంచిక ఇలా తెలియజేసింది: “అనువాద కమిటీగా రూపొందిన పురుషులు తమ పేర్లను వెల్లడి చేయకూడదనీ, . . . ప్రాముఖ్యంగా తాము సజీవంగా ఉన్నా లేక మరణించినా తమ పేర్లు ప్రచురించబడకూడదన్న తమ కోరికను సూచించారు. అనువాదపు ఉద్దేశం సజీవుడైన సత్య దేవుని నామమును ఉన్నతపర్చాలన్నదే.” కేవలం అనుభవరహితుల ఉత్పాదనగా దానిని, మరో ఆలోచన లేకుండా తీసిపడేయాలని కొంతమంది విమర్శకులు ఆరోపించారు, కాని అందరూ అదే విధమైన నిర్హేతుకమైన అభిప్రాయాన్ని కల్గిలేరు. అలన్‌ ఎస్‌. డతీ ఇలా వ్రాస్తున్నాడు: “ఫలానా బైబిలు అనువాదం యొక్క అనువాదకులు లేక ప్రచురణకర్తలు ఎవరు అన్నది తెలుసుకోవటం, ఆ అనువాదం మంచిదా కాదా అన్నది నిర్ణయించటానికి మనకు సహాయపడుతుందా? సూటిగా సహాయపడదు. ప్రతి అనువాదంలోని గుణలక్షణాలను పరీక్షించటానికి మరో ప్రత్యామ్నాయం ఏదీ లేదు.”a

విశేషమైన అంశాలు

కోట్లాదిమంది పాఠకులు ఆ పనే చేసి, న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ కేవలం చదువదగినదిగా ఉండటం మాత్రమే గాక, అది అల్పమైన విషయాల్లో సహితం నిర్దుష్టమైనదిగా ఉన్నట్లు కనుగొన్నారు. దాని అనువాదకులు అందుబాటులో ఉన్న సర్వశ్రేష్ఠమైన మూలపాఠాలను ఉపయోగిస్తూ మూల భాషలైన హెబ్రీ, గ్రీకు, అరామిక్‌ భాషల నుండి అనువదించారు.b ప్రాచీన మూలపాఠాన్ని సాధ్యమైనంత అక్షరార్థంగా, అయితే సులభంగా అర్థమయ్యే భాషలోకి అనువదించటానికి అసాధారణమైన శ్రద్ధ తీసుకోవటం జరిగింది. కాబట్టి, కొంతమంది పండితులు ఈ అనువాదాన్ని, దాని యథార్థతనూ, కచ్చితత్వాన్నీ బట్టి ప్రశంసించారు. ఉదాహరణకు, 1963 జనవరి అండోవర్‌ న్యూటన్‌ క్వార్టర్లీ ఇలా తెలియజేసింది: “ఈ క్రొత్త నిబంధన అనువాదం, బైబిలు అనువాదానికి సంబంధించిన అనేక సమస్యలతో జ్ఞానయుక్తంగా వ్యవహరించగల అర్హులైన పండితులు యెహోవాసాక్షుల్లో ఉన్నారనటానికి నిదర్శనం.”

అనువాదకులు బైబిలును అర్థం చేసుకోవటంలో ఒక క్రొత్త లోకాన్ని వెలుగులోకి తెచ్చారు. ముందు కేవలం అస్పష్టంగా అర్థమైన బైబిలు లేఖనాలు చెప్పలేనంత సుస్పష్టమయ్యాయి. ఉదాహరణకు, మత్తయి 5:3 నందలి, “ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు” (కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌) అనే సంక్లిష్టమైన వచనం, తమ ఆధ్యాత్మిక అవసరతల పట్ల శ్రద్ధగలవారు ధన్యులు అనే తలంపునిస్తూ, అర్థవంతమైన విధంగా అనువదించబడింది. న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ కీలకమైన పదాలను, మృతుల స్థితిని గురించిన గందరగోళాన్ని నివారించే విధంగా అనువదించింది. ఫలితంగా, మతసంబంధమైన సిద్ధాంతాలకు భిన్నంగా, మానవుడు మరణించిన తర్వాత జీవనం కొనసాగించే అమర్త్యమైన భాగమేది అతనిలో లేదని పాఠకులు వెంటనే గ్రహించగల్గుతారు.—మత్తయి 2:20, 21; మార్కు 3:4; లూకా 6:9; 17:33.

దేవుని నామాన్ని పునరుద్ధరించటం

న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ యొక్క విశేషమైన అంశాల్లో ఒకటి, దేవుని నామమైన యెహోవాను పునరుద్ధరించటం. హెబ్రీ బైబిలు ప్రాచీన ప్రతుల్లో, “యోధ్‌,” “హే,” “వావ్‌,” “హే” అనే నాలుగు హెబ్రీ హల్లులు దైవిక నామానికి ప్రాతినిధ్యం వహించేవి. ఈ విశిష్టమైన నామము, పాత నిబంధన అని పిలువబడుతున్న దానిలోనే దాదాపు 7,000 సార్లు కనిపిస్తుంది. (నిర్గమకాండము 3:15; కీర్తన 83:18) స్పష్టంగా, తన ఆరాధకులు తన నామాన్ని తెలుసుకుని దాన్ని ఉపయోగించాలని మన సృష్టికర్త ఉద్దేశించాడు!

అయితే, మూఢమైన భయాలు యూదులు ఆ దైవిక నామాన్ని ఉపయోగించటాన్ని మానుకునేలా చేశాయి. యేసు అపొస్తలుల మరణం తర్వాత, గ్రీకు లేఖనాలను ఎత్తి వ్రాసేవారు దేవుని వ్యక్తిగత నామము స్థానంలో కైర్యోస్‌ (ప్రభువు) లేక థియోస్‌ (దేవుడు) అనే గ్రీకు పదాలను ఉంచటం ప్రారంభించారు. విచారకరంగా, ఆధునిక అనువాదకులు దేవుణ్ని అగౌరవపర్చే ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ, అనేక బైబిళ్ల నుండి దేవుని నామాన్ని తీసివేసి, అసలు దేవునికి ఒక నామము ఉందన్న విషయాన్నే మరుగు చేశారు. ఉదాహరణకు, యోహాను 17:6 నందు యేసు మాటలు ఇలా ఉన్నాయి: “నీ నామమును ప్రత్యక్షపరచితిని.” అయితే టుడేస్‌ ఇంగ్లీష్‌ వర్షన్‌ దాన్ని ఇలా అనువదించింది: “నేను నిన్ను తెలియజేశాను.”

దైవిక నామాన్ని కచ్చితంగా ఎలా ఉచ్చరించాలో తెలియదు గనుక దాన్ని తొలగించటం సరైనదేనని కొంతమంది పండితులు వాదిస్తారు. అయితే, బైబిల్లోని జెర్మయా, ఐజాయా, జీసస్‌ (తెలుగులో యిర్మీయా, యెషయా, యేసు) వంటి సుపరిచితమైన పేర్లు వాటి హెబ్రీ మూల ఉచ్చారణతో ఏమాత్రం పొందికలేని విధంగా అనువదించబడుతూనే ఉన్నాయి. దైవిక నామాన్ని అనువదించటానికి ఆంగ్ల రూపమైన జెహోవా అన్నది న్యాయబద్ధమైనది గనుకా, అది అనేకులకు సుపరిచితమైనది గనుకా దాన్ని ఉపయోగించటానికున్న అభ్యంతరాల్లో అంత పస ఉన్నట్లు అనిపించదు.

న్యూ వరల్డ్‌ బైబిల్‌ ట్రాన్స్‌లేషన్‌ కమిటీ హెబ్రీ, గ్రీకు లేఖన భాగాలు రెండింటిలోనూ జెహోవా అనే నామాన్ని ఉపయోగించాలనే సాహసవంతమైన చర్యను చేపట్టింది. మధ్య అమెరికా, దక్షిణ పసిఫిక్‌, ప్రాచ్య దేశాల్లోని ప్రజల కోసం మిషనరీలు చేసిన తొలి అనువాదాలు అదే పనిని చేశాయి. అయితే, అలా దేవుని నామాన్ని ఉపయోగించినది కేవలం విద్యా విషయక ఆసక్తితో కాదు. దేవుని నామాన్ని తెలుసుకోవటమన్నది, ఒక వ్యక్తిగా ఆయనను తెలుసుకోవటానికి ఎంతో ఆవశ్యకం. (నిర్గమకాండము 34:6, 7) న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆయన నామాన్ని ఉపయోగించటానికి లక్షలాదిమంది పాఠకులను ప్రోత్సహించింది!

ఆంగ్లేతర పాఠకులను చేరటం

1963 నుండి 1989 మధ్యకాలంలో, న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ మొత్తంగాగానీ లేక భాగాలుగా గానీ అదనంగా మరో పది భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే, 20 సంవత్సరాలు లేక అంతకన్నా ఎక్కువ కాలం పట్టే ప్రాజెక్టులతో అనువాద పని చాలా శ్రమతో కూడినది. తర్వాత, 1989లో యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయంలో అనువాద సేవల శాఖ స్థాపించబడింది. పరిపాలక సభకు చెందిన రైటింగ్‌ కమిటీ నిర్దేశం క్రింద ఈ శాఖ బైబిలు అనువాద పనిని త్వరితం చేసింది. బైబిలు సంబంధిత పదాల అధ్యయనాన్ని, కంప్యూటర్‌ టెక్నాలజీతో జతచేసిన ఒక అనువాద విధానం వృద్ధి చేయబడింది. ఈ విధానం ఎలా పనిచేస్తుంది?

రైటింగ్‌ కమిటీ బైబిలును ఒక క్రొత్త భాషలోకి అనువదించటానికి ఆమోదించినప్పుడు, అనువాద బృందంగా ఉండటానికి అది సమర్పిత క్రైస్తవుల ఒక బృందాన్ని నియమిస్తుంది. ఒక వ్యక్తి ఒంటరిగా చేసేదాని కన్నా అనువాదకుల జట్లు మరింత సమతూకమైన అనువాదాలను అందజేయగలవు. (పోల్చండి సామెతలు 11:14.) సాధారణంగా, ప్రతి జట్టు సభ్యునికీ సంస్థ ప్రచురణలను అనువదించటంలో అనుభవం ఉంటుంది. తర్వాత ప్రతి జట్టు బైబిలు అనువాద సూత్రాల్లోనూ, ప్రత్యేకంగా వృద్ధి చేయబడిన కంప్యూటర్‌ కార్యక్రమాలను ఉపయోగించటంలోనూ సమగ్రమైన తర్ఫీదును పొందుతుంది. కంప్యూటర్‌ అసలు అనువాద పనిని చేయదు, కాని అది ఒక జట్టు ప్రాముఖ్యమైన సమాచారాన్ని పొందటానికీ, తమ నిర్ణయాలను రికార్డు చేసి ఉంచుకోవటానికీ సహాయం చేస్తుంది.

బైబిలు అనువాద ప్రాజెక్ట్‌కు రెండు దశలుంటాయి. మొదటి దశలో, ఆంగ్ల న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌లో ఉపయోగించబడిన పదాలు పదబంధాల పట్టిక అనువాదకులకు ఇవ్వబడుతుంది. ఒకదానితో మరోదానికి సంబంధంగల ఆంగ్ల పదాలు కలిపి జత చేయబడి, భావంలో వచ్చే సునిశితమైన తేడాల విషయంలో అనువాదకులను అప్రమత్తం చేయటం జరుగుతుంది. వాళ్లు తాము అనువాదం చేస్తున్న భాషలో వాటికి సరిసమానమైన పదాల పట్టికను తయారు చేస్తారు. అయితే, కొన్నిసార్లు, ఒక అనువాదకునికి ఒక వచనాన్ని అనువదించటం కష్టం కావచ్చు. కంప్యూటర్‌లోని రీసెర్చ్‌ సిస్టమ్‌ అనువాదకునికి గ్రీకు హెబ్రీ పదాల సమాచారాన్ని అందజేసి, వాచ్‌ టవర్‌ ప్రచురణలలోకి వెళ్లటానికి సహాయం చేస్తుంది.

ప్రాజెక్ట్‌ దాని రెండో దశలోకి వెళ్లేసరికి, ఎంపిక చేయబడిన పదాలు వాటంతటవే బైబిలు లేఖనాల్లోకి చొప్పించబడతాయి. దాని మూలంగా అనువాదంలో చెప్పుకోదగినంత కచ్చితత్వం, సంగతత్వం ఉంటుంది. అయితే, ఇలా “సెర్చ్‌ అండ్‌ రిప్లేస్‌” విధానం ద్వారా తయారయ్యే పాఠ్యభాగం ఏమాత్రం పఠన యోగ్యంగా ఉండదు. వాటిని సరళంగా చదువగల్గేలా బైబిలు వచనాలను ఎడిట్‌ చేసి పదబంధాలను కూర్చటానికి చెప్పుకోదగినంతగా పని చేయవలసి ఉంటుంది.

ఈ అనువాద విధానం ఎంతో ప్రభావవంతమైనదిగా నిరూపించబడింది. ఒక బృందం కేవలం రెండు సంవత్సరాల్లో మొత్తం హెబ్రీ లేఖనాలను అనువదించగల్గింది. ఈ బృందం పనిచేసిన భాషకు సంబంధించిన మరో భాషలో కంప్యూటర్‌ మద్దతు లేకుండా చేసిన పనిని పోల్చండి. వారికి దాదాపు 16 సంవత్సరాలు పట్టింది. నేటికి, 1989 నుండి క్రైస్తవ గ్రీకు లేఖనాలు 18 అదనపు భాషల్లో ముద్రించబడ్డాయి. ఇప్పుడు న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ మొత్తంగాగానీ భాగాలుగాగానీ 34 భాషల్లో అందుబాటులో ఉంది. కాబట్టి 80 శాతం కంటే ఎక్కువమంది యెహోవాసాక్షులకు కనీసం క్రైస్తవ గ్రీకు లేఖనాలు తమ మాతృభాషలో లభ్యమౌతున్నాయి.

6,500 ప్రపంచ భాషల్లో, బైబిలులోని భాగాలు కేవలం 2,212 భాషల్లో అందుబాటులో ఉన్నట్లు యునైటెడ్‌ బైబిల్‌ సొసైటీలు నివేదిస్తున్నాయి.c కాబట్టి, హెబ్రీ గ్రీకు లేఖనాల న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ను 11 మరియు 8 భాషల్లో విడివిడిగా ఉత్పత్తి చేయటానికి దాదాపు 100 మంది అనువాదకులు పనిచేస్తున్నారు. “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండ” వలెనన్నది దేవుని చిత్తం. (1 తిమోతి 2:4) ఈ విషయంలో న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ నిస్సందేహంగా ప్రముఖ పాత్ర వహించటంలో కొనసాగుతుంది.

కాబట్టి ఈ అనువాదం 10 కోట్ల ప్రతుల మైలురాయిని దాటినందుకు మేము సంతోషిస్తున్నాము, భవిష్యత్తులో ఇంకా అనేక కోట్లు ఉత్పత్తి చేయబడాలని మేము ప్రార్థిస్తున్నాము. దీన్ని మీరే స్వయంగా పరిశీలించుకోమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. మీరు అనేక ప్రత్యేక అంశాలను ఆనందిస్తారు: స్పష్టమైన అచ్చు, రన్నింగ్‌ హెడ్డింగులు, సుపరిచితమైన వచనాలను కనుగొనడానికి సహాయపడే విషయ సూచిక, సవివరమైన మ్యాపులు, చక్కని అనుబంధ సమాచారం. మరింత ప్రాముఖ్యంగా, ఈ బైబిలు దేవుని మాటలను మీ భాషలో కచ్చితత్వంతో అందజేస్తుందన్న నమ్మకంతో మీరు దాన్ని చదువవచ్చు.

[అధస్సూచీలు]

a ఆసక్తికరంగా, న్యూ అమెరికన్‌ స్టాండర్డ్‌ బైబిల్‌ యొక్క 1971 రిఫరెన్స్‌ ఎడిషన్‌ పైఅట్ట అదే విధంగా ఇలా పేర్కొంది: “మేము ఏ పండితుని పేరును రిఫరెన్సు కోసం లేక సిఫారసుల కోసం ఉపయోగించలేదు, ఎందుకంటే దేవుని వాక్యం దాని స్వంత యోగ్యతలపైనే నిలబడాలన్నది మా నమ్మకం.”

b వెస్ట్‌కాట్‌, హార్ట్‌లు చేసిన ద న్యూ టెస్ట్‌మెంట్‌ ఇన్‌ ది ఒరిజినల్‌ గ్రీక్‌ (మూల గ్రీకులో క్రొత్త నిబంధన) అన్నది ప్రాథమిక గ్రీకు మూలపాఠంగా ఉపయోగపడింది. ఆర్‌. కిట్టెల్‌ యొక్క బిబ్లియా హెబ్రయికా అన్నది హెబ్రీ లేఖనాలకు ప్రాథమిక మూలపాఠంగా పనిచేసింది.

c చాలామంది ప్రజలకు రెండు భాషలు వచ్చు గనుక, బైబిలు మొత్తంగా గానీ భాగాలుగా గానీ ప్రపంచ జనాభాలోని 90 శాతం కంటే ఎక్కువమంది చదవగలిగేటన్ని భాషల్లోకి అనువదించబడింది.

[29వ పేజీలోని చిత్రం]

“ఈ క్రొత్త నిబంధన అనువాదం, బైబిలు అనువాదానికి సంబంధించిన అనేక సమస్యలతో జ్ఞానయుక్తంగా వ్యవహరించగల అర్హులైన పండితులు యెహోవాసాక్షుల్లో ఉన్నారనటానికి నిదర్శనం.”—అండోవర్‌ న్యూటన్‌ క్వార్టర్లీ, జనవరి 1963

[30వ పేజీలోని చిత్రం]

“అనువాదాలు, బైబిలు సంబంధిత పాండిత్యంలో జరుగుతున్న అభివృద్ధితోనూ, భాషలో వస్తున్న మార్పులతోనూ సమానంగా పురోగమించాలి”

[31వ పేజీలోని బాక్సు]

పండితులు న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ను ప్రశంసించటం

ఏన్‌ అమెరికన్‌ ట్రాన్స్‌లేషన్‌ అనే బైబిల్లోని గ్రీకు “క్రొత్త నిబంధన” అనువాదకుడైన ఎడ్గర్‌ జె. గుడ్‌స్పీడ్‌ క్రైస్తవ గ్రీకు లేఖనాల న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ గురించి, 1950 డిసెంబరు 8న వ్రాసిన ఉత్తరంలో ఇలా వ్రాశాడు: “నేను మీ వాళ్లు చేసే మిషనరీ పని గురించి, దాని ప్రపంచవ్యాప్త పరిధిని గురించి ఆసక్తికల్గివున్నాను. స్వేచ్ఛగా చేయబడిన, సూటియైన, సుస్పష్టమైన అనువాదం నాకెంతో నచ్చింది. అది స్వస్థబుద్ధితో కూడిన ప్రఫుల్లమైన పాండిత్యాన్ని ప్రదర్శిస్తుందని నేను రూఢిగా చెప్పగలను.”

హెబ్రీ, గ్రీకు పండితుడైన అలెగ్జాండర్‌ థామ్సన్‌ ఇలా వ్రాశాడు: “ఈ అనువాదం, ఆంగ్ల భాష ఎంత మేరకు వ్యక్తపర్చగలదో అంత మేరకు గ్రీకు లేఖనాల అసలైన భావాన్ని వ్యక్తపర్చటానికి ప్రయత్నించిన, ప్రజ్ఞాపాటవాలుగల పండితుల పని అని స్పష్టమౌతుంది.”—ద డిఫరెన్షియేటర్‌, ఏప్రిల్‌ 1952, 52-7 పేజీలు.

ఇజ్రాయెల్‌లో హెబ్రీ పండితుడైన ప్రొఫెసర్‌ బెంజమిన్‌ కెదార్‌ 1989లో ఇలా చెప్పాడు: “హెబ్రీ బైబిలుకు, అనువాదాలకు సంబంధించి నేను చేసిన భాషాపరమైన పరిశోధనల్లో, నేను తరచూ న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ అని పిలువబడుతున్న ఆంగ్ల అనువాదాన్ని రిఫర్‌ చేస్తాను. అలా చేయటం మూలంగా, వీలైనంత కచ్చితంగా ఉన్న లేఖనభాగాన్ని అర్థం చేసుకోవటానికి యథార్థమైన కృషిని ఈ పని ప్రతిఫలిస్తుందన్న నా భావన పదే పదే ధృవీకరించబడినట్లు భావిస్తాను.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి