“విశ్వాసంతో ప్రేరేపించబడిన వ్యక్తిత్వ బలం”
గీకానానీసీ వ్రాసిన లే టేమ్వ డ జేయోవా ఫాస్ ఈట్లర్ (హిట్లర్ ఎదుట యెహోవాసాక్షులు) అనే క్రొత్త ఫ్రెంచ్ పుస్తకం 1998లో విడుదల చేయబడింది. విమర్శకులు దీన్ని ఎంతో మెచ్చుకున్నారు. ఈ పుస్తకపు ముందుమాటలో, “ఇది ఎంతో సంతోషంతో స్వీకరించబడుతున్న పుస్తకం. ఎందుకంటే ఇది చరిత్ర పుటల్లో వ్రాయకుండా విడువబడినదాన్ని పూడుస్తుందనే కాదు, ఇది సమయోచితమైనది కూడాను. . . . మూడవ రైక్ క్రింద యెహోవాసాక్షులు అనుభవించిన దురవస్థను గురించి నిపుణులకు కాక మరెవరికి తెలుసు? అయినప్పటికీ 12 సంవత్సరాల పాలనలో, వారు ఎడతెగక క్రూరంగా, హింసాత్మకంగా పీడించబడ్డారు. వాళ్ళు కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో భయంకరమైన పరిస్థితిని కూడా అనుభవించారు. వాళ్ళు తమ విశ్వాసాన్ని బట్టి, నమ్మకాలను బట్టి ఎంతో మూల్యాన్ని కూడా చెల్లించారు. చరిత్రలో ఈ క్రైస్తవులు ఎందుకు మరువబడ్డారు? . . .
“చెదరిపోయిన, హానికారులు కాని చిన్న గుంపు అంత క్రూరంగా, పద్ధతిప్రకారంగా ఎందుకు పీడించబడింది? ఇదే విరోధాభాసానికి కీలకాంశం. జర్మనీలోని ఆరు కోట్ల కన్నా ఎక్కువ మంది ఉన్న మొత్తం జనాభాలో, క్రైస్తవులు దాదాపు 20,000 మంది ఉండేవారని గణాంకాలు చూపిస్తున్నాయి. ఆ క్రైస్తవులు అల్ప సంఖ్యాకులకు ప్రాతినిధ్యం వహించడం మాత్రమే కాక, చట్టాన్ని గౌరవిస్తూ, ఎవరినీ బెదిరించక శాంతియుతంగా ఉండేవారు, పనిచేయాలనీ, తమ పిల్లల్ని సరిగ్గా పెంచాలనీ మాత్రమే కోరుకునేవాళ్ళు. . . .
“ఈ హింస, విశ్వాసులకున్న దృఢమైన అజేయమైన ఆధ్యాత్మిక నిరోధక శక్తిపై దాడి చేసింది. యేసునందున్న విశ్వాసంపై ఆధారపడిన తమ అంతర్ శక్తితో, బాహ్య ఒత్తిళ్ళను తాళుకోగల్గారు, పోలీసుల ప్రభుత్వం పెట్టిన శారీరక హింసను భరించడం మొదలుకొని, ధీరత్వాన్ని చూపించి, హతసాక్షులుగా మరణించవలసిన పరిస్థితిని సహితం తాళుకోగల్గారు” అని ఎంతగానో గౌరవించబడే, ఫ్రాన్స్వా బడారీడ అనే ఫ్రెంచ్ చరిత్రకారుడు వ్రాశాడు.
మత సహనం లేని పరిస్థితిలో, తమ క్రైస్తవ విశ్వాసం కోసం హతసాక్షులుగా మరణించిన యెహోవాసాక్షుల వృత్తాంతం చాలా శక్తివంతమైనది. ప్రముఖ ఫ్రెంచ్ క్యాథలిక్ వార్తాపత్రికయైన లా క్ర్వా, ఈ పుస్తకాన్ని పునఃసమీక్షిస్తూ, “అంతగా వెలుగులోకి రాని యెహోవాసాక్షుల చరిత్రను గురించి గీ కానానీసీ చూపించిన అనేకానేక రుజువులు చూస్తే, విశ్వాసంతో ప్రేరేపించబడిన వారి సరళమైన మాటల్లో వ్యక్తీకరించబడిన బలమైన వ్యక్తిత్వాన్నీ, చిన్న పిల్లలు సహితం అంతం వరకు చూపించిన అచంచల విశ్వాసాన్నీ చూస్తే ఎవరికైనా నోట మాట రాదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడం యెహోవాసాక్షుల క్రైస్తవ స్వభావాన్ని గురించిన ప్రస్తుత చర్చకు ఆధారాన్నివ్వాలి” అని ఘాటుగా అంటోది.