దుష్టాత్మలు మనల్ని రోగగ్రస్థులను చేస్తాయా?
రోగం ఎన్నటికీ వచ్చి ఉండేది కాదు. మనం పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని దేవుడు మనల్ని సృష్టించాడు. మన ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వలను పాపంలోకి నడిపించి మానవకుటుంబాన్ని రోగం, బాధ, మరణాలు పీడించేలా చేసింది ఒక ఆత్మ ప్రాణి అయిన సాతాను.—ఆదికాండము 3:1-5, 17-19; రోమీయులు 5:12.
అంటే, రోగాలన్నీ ఆత్మ ప్రపంచం నుండి ఎవరో జోక్యం చేసుకోవటం మూలంగానే వస్తున్నాయని దీని భావమా? ముందటి శీర్షికలో పేర్కొన్నట్లుగా, చాలామంది అలాగే భావిస్తున్నారు. ఓమాజీ నాన్నమ్మ అలాగే భావించింది. అయితే ఓమాజీకి వచ్చిన అతిసార వ్యాధి—ఉష్ణమండల ప్రాంతాల్లో చిన్నపిల్లలకు చాలా ప్రాణాంతకమైనదైన ఈ వ్యాధి—నిజంగా అదృశ్య ఆత్మల మూలంగా వచ్చినదేనా?
సాతాను పాత్ర
బైబిలు ఈ ప్రశ్నకు చాలా స్పష్టంగా సమాధానం చెప్తుంది. మొదటిగా, మన పూర్వీకుల ఆత్మలు జీవిస్తున్న వారిని ప్రభావితం చేయలేవని అది చూపిస్తుంది. ప్రజలు మరణించినప్పుడు, “వారు ఏమియు ఎరుగరు.” మరణం తర్వాత జీవించి ఉండే ఆత్మలు వాళ్లకు లేవు. వాళ్లు సమాధిలో నిద్రిస్తుంటారు, అక్కడ “పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.” (ప్రసంగి 9:5, 10) మృతులు సజీవులను ఏవిధంగానూ రోగగ్రస్థులను చేయలేరు!
అయితే, దుష్టాత్మలు ఉనికిలో ఉన్నాయని బైబిలు తెలియజేస్తుంది. మొత్తం విశ్వమంతటిలో మొట్టమొదట తిరుగుబాటు చేసినది ఇప్పుడు సాతాను అని పిలువబడుతున్న ఆత్మ ప్రాణి. ఇతరులు అతనితో కలిసి, దయ్యాలు అని పిలువబడుతున్నారు. సాతాను, దయ్యాలు రోగాన్ని కల్గించగలవా? అలా జరిగింది. యేసు చేసిన అద్భుతమైన స్వస్థతలలో, దయ్యాలను వెళ్లగొట్టడం కూడా ఉంది. (లూకా 9:37-43; 13:10-16) అయితే, యేసు స్వస్థపర్చిన రోగాల్లో అత్యధికం సూటిగా దయ్యాల మూలంగా కలిగినవి కావు. (మత్తయి 12:15; 14:14; 19:2) అలాగే నేడు సాధారణంగా, రోగమన్నది సహజ కారకాల మూలంగానే వస్తుంది గానీ సహజాతీత కారకాల వల్ల కాదు.
మంత్రవిద్య సంగతేమిటి? సామెతలు 18:10 మనకిలా అభయమిస్తుంది: “యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగానుండును.” యాకోబు 4:7 ఇలా చెప్తుంది: “అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.” అవును, దేవుడు తన నమ్మకమైన వారిని మంత్రవిద్య నుండి, మరే ఇతరమైన సహజాతీత శక్తి నుండి కాపాడగలడు. “సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని” చెప్పిన యేసు మాటల్లో అంతర్నిహితమైన ఒక అర్థం అదే.—యోహాను 8:32.
‘మరి యోబు విషయమేమిటి? ఆయనను రోగానికి గురి చేసింది దుష్టాత్మ కాదా?’ అని కొందరడగవచ్చు. అవును, యోబుకు కలిగిన అనారోగ్యానికి కారణం సాతానేనని బైబిలు చెప్తుంది. కాని యోబు విషయం అసాధారణమైనది. దయ్యాల దాడి నుండి యోబుకు ఎంతోకాలం పాటు దైవిక కాపుదల ఉంది. అప్పుడు సాతాను యోబుపై దాడి చేయమని యెహోవాతో సవాలు చేశాడు, గొప్ప వివాదాంశాలు ఇమిడి ఉన్నందున, యెహోవా ఈ ఒక్క సందర్భంలో మాత్రం తన ఆరాధకుని నుండి తన కాపుదలను పాక్షికంగా వెనక్కి తీసుకున్నాడు.
అయితే, దేవుడు పరిమితులను నియమించాడు. యోబుపై దాడి చేసేందుకు ఆయన సాతానుకు అనుమతినిచ్చినప్పుడు, సాతాను యోబును కొంతకాలంపాటు రోగగ్రస్థుడ్ని మాత్రం చేయగలడు కాని ఆయనను చంపలేడు. (యోబు 2:5, 6) చివరికి, యోబు బాధలు తీరాయి, ఆయన యథార్థతను బట్టి యెహోవా ఆయనను ఎంతగానో ఆశీర్వదించాడు. (యోబు 42:10-17) యోబు యథార్థత మూలంగా నిరూపించబడిన సూత్రాలు ఎప్పటి నుండో బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి, అవి అందరికీ విదితమే. అలాంటి మరో పరీక్ష జరుగవలసిన అవసరం ఇక లేదు.
సాతాను ఎలా పని చేస్తాడు?
దాదాపు ప్రతి సందర్భంలోనూ, సాతానుకు మానవ అనారోగ్యానికి మధ్యనున్న ఏకైక సంబంధమేమిటంటే, సాతాను మొదటి మానవ జంటను శోధించడంతో వాళ్లు పాపంలోకి పడిపోయారన్నదే. ప్రతి ఒక్క జబ్బుకు అతడూ, అతని దయ్యాలే కారణం కాదు. అయితే, మన ఆరోగ్యానికి హాని కలిగే విధంగా మనం జ్ఞానరహితమైన నిర్ణయాలు తీసుకునేలా, మన విశ్వాసంతో రాజీ పడేలా సాతాను మనల్ని కొన్నిసార్లు ప్రభావితం చేస్తాడు. అతడు ఆదాము హవ్వలను మంత్రించలేదు, వాళ్లను హత్య చేయలేదు, లేక వాళ్లకు అనారోగ్యం కలిగించలేదు. అతడు దేవునికి అవిధేయత చూపేలా హవ్వను ఒప్పించాడు, ఆదాము ఆమె అవిధేయతా విధానాన్ని అనుసరించాడు. దాని పర్యవసానంలో భాగమే రోగం, మరణం.—రోమీయులు 5:19.
మోయాబు సరిహద్దులపై మోయాబు రాజుకు భయం కలిగించే విధంగా మోహరించివున్న ఇశ్రాయేలు జనాంగాన్ని శపించటానికి బిలాము అనే పేరుగల నమ్మకద్రోహి అయిన ప్రవక్తను ఆ రాజు పిలిపించుకున్నాడు. బిలాము ఇశ్రాయేలీయులను శపించటానికి ప్రయత్నించాడు గానీ, ఆ జనాంగం యెహోవా కాపుదల క్రింద ఉన్నందున అతడు శపించలేకపోయాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీయులు విగ్రహారాధన చేసేలా, లైంగిక దుర్నీతిలో పడిపోయేలా మోయాబీయులు వారిని ప్రలోభ పెట్టారు. ఈ కుయుక్తులు పనిచేశాయి, ఇశ్రాయేలు జనాంగం యెహోవా కాపుదలను కోల్పోయింది.—సంఖ్యాకాండము 22:5, 6, 12, 35; 24:10; 25:1-9; ప్రకటన 2:14.
ఆ ప్రాచీన సంఘటన నుండి మనం ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్చుకోవచ్చు. దైవిక సహాయం దేవుని నమ్మకమైన సేవకులకు దుష్టాత్మల సూటియైన దాడి నుండి కాపుదలను ఇస్తుంది. అయితే, వ్యక్తులు తమ విశ్వాసంతో రాజీ పడిపోయేలా చేసేందుకు సాతాను ప్రయత్నించగలడు. అతడు వారిని లైంగిక దుర్నీతిలో పడిపోయేలా ప్రలోభపెట్టగలడు. లేదా, వారు దేవుని కాపుదలను కోల్పోయేలా ప్రవర్తించేటట్లు అతడు గర్జించు సింహంవలే వాళ్లను భయపెట్టడానికి ప్రయత్నిస్తాడు. (1 పేతురు 5:8) అందుకే అపొస్తలుడైన పౌలు సాతానును ‘మరణముయొక్క బలముగలవాడని’ పిలుస్తున్నాడు.—హెబ్రీయులు 2:14.
ఓమాజీ నాన్నమ్మ రోగం నుండి కాపుదలగా తాయెత్తులనూ, రక్షరేకులనూ ఉపయోగించేలా హావను ఒప్పించటానికి ప్రయత్నించింది. హావ గనుక లొంగిపోయి ఉంటే ఏమి జరిగి ఉండేది? అలా చేయడం ద్వారా ఆమె తనకు యెహోవా దేవునియందు పూర్తి నమ్మకం లేదని చూపించేది, ఆమె ఆయనిచ్చే కాపుదల గురించి నమ్మకం కల్గివుండగలిగేది కాదు.—నిర్గమకాండము 20:5; మత్తయి 4:10; 1 కొరింథీయులు 10:21.
సాతాను యోబును కూడా ఒప్పించటానికి ప్రయత్నించాడు. ఆయన నుండి ఆయన కుటుంబాన్ని, ఆయన ఆస్తిని, ఆయన ఆరోగ్యాన్ని దోచుకోవటంతో మాత్రమే ఆగలేదు. “దేవుని దూషించి మరణము కమ్మ”ని చెప్పినప్పుడు యోబు భార్య ఆయనకు చాలా చెడ్డ సలహా ఇచ్చింది. (యోబు 2:9) తర్వాత ఆయన ముగ్గురు “స్నేహితులు” వచ్చి, ఆయన జబ్బుకు ఆయనే నిందార్హుడని ఆయనను ఒప్పించటానికి మూకుమ్మడిగా ప్రయత్నం చేశారు. (యోబు 19:1-3) ఈ విధంగా సాతాను యోబు బలహీన స్థితిని ఆసరాగా తీసుకుని, ఆయనను నిరుత్సాహపర్చటానికి, యెహోవా నీతియందు ఆయనకు గల నమ్మకాన్ని సడలించటానికి ప్రయత్నించాడు. అయినప్పటికీ, యోబు యెహోవానే తన ఏకైక నిరీక్షణగా ఆయనపై ఆధారపడటంలో కొనసాగాడు.—పోల్చండి కీర్తన 55:22.
మనం జబ్బుతో బాధపడ్తున్నప్పుడు, మనం కూడా కృంగిపోవచ్చు. అలాంటి పరిస్థితిలో, మనం మన విశ్వాసంతో రాజీపడిపోయే విధంగా ప్రవర్తించేలా చేయడానికి సాతాను సిద్ధంగా ఉంటాడు. గనుక, జబ్బు చేసినప్పుడు, మన బాధకు ప్రాథమిక కారణం వారసత్వంగా వచ్చిన అపరిపూర్ణతే గానీ, కచ్చితంగా ఏదో సహజాతీత ప్రభావం కాదని మనం మనస్సులో ఉంచుకోవటం ప్రాముఖ్యం. నమ్మకమైన వాడైన ఇస్సాకు తాను మరణించటానికి చాలా సంవత్సరాల క్రితమే అంధుడయ్యాడని గుర్తుంచుకోండి. (ఆదికాండము 27:1) దానికి కారణం దుష్టాత్మలు కాదుగానీ వృద్ధాప్యమే. రాహేలు ప్రసవించేటప్పుడు మరణించినది సాతాను మూలంగా కాదు గానీ, మానవ శారీరక బలహీనత మూలంగానే. (ఆదికాండము 35:17-19) చివరికి, ప్రాచీన కాలానికి చెందిన నమ్మకమైన వారంతా మరణించింది దుష్టాత్మల మూలంగా లేక శాపాల మూలంగా కాదుగానీ వారసత్వంగా వచ్చిన అపరిపూర్ణత మూలంగానే.
మనకు వచ్చే ప్రతి జబ్బుపై అదృశ్య ఆత్మల ప్రభావం ఉంటుందని ఊహించుకోవటం ఒక ఉచ్చు లాంటిది. అది ఆత్మల గురించి మనలో అనారోగ్యకరమైన భయాన్ని కలిగించవచ్చు. ఇక, మనం జబ్బు పడినప్పుడు, మనం దయ్యాల నుండి దూరంగా ఉండే బదులు వాటిని ప్రీతిపర్చటానికి ప్రయత్నించేలా శోధించబడవచ్చు. మనం ఆత్మల సంబంధమైన ఆచారాల్లో పడిపోయేలా సాతాను మనల్ని భయపెట్టగల్గితే, అది సత్య దేవుడైన యెహోవాకు నమ్మక ద్రోహం చేసినట్లే అవుతుంది. (2 కొరింథీయులు 6:15) మనం దేవుని పట్ల గౌరవంతో కూడిన భయంచే నడిపించబడాలి గాని ఆయన శత్రువైన సాతాను పట్ల మూఢాచారంతో కూడిన భయంచే నడిపించబడకూడదు.—ప్రకటన 14:7.
ఓమాజీకి దుష్టాత్మల నుండి ఇప్పటికే సాధ్యమైనంత శ్రేష్ఠమైన కాపుదల ఉంది. అపొస్తలుడైన పౌలు చెప్తున్నదాని ప్రకారం, దేవుడు ఆమెను “పరిశుద్ధ”మైనదాన్నిగా పరిగణిస్తాడు, ఎందుకంటే ఆ పాపకు విశ్వాసురాలైన తల్లి ఉంది, పరిశుద్ధాత్మ ద్వారా తన కుమార్తెతో ఉండమని ఆమె తల్లి ఆమె కోసం దేవుడ్ని ప్రార్థించగలదు. (1 కొరింథీయులు 7:14) అలాంటి కచ్చితమైన జ్ఞానంతో ఆశీర్వదించబడిన హావ తాయెత్తులపై ఆధారపడే బదులు ఓమాజీకి సాధ్యమైనంత మంచి వైద్యాన్ని చేయించగల్గింది.
రోగానికి వివిధ కారణాలు
చాలామంది ప్రజలు దుష్టాత్మలను నమ్మరు. తమకు జబ్బు చేసినప్పుడు, తాము ఖర్చును భరించగల్గితే వైద్యుని దగ్గరికెళ్తారు. అయితే, జబ్బుతో బాధపడ్తున్న వ్యక్తి వైద్యుని దగ్గరికి వెళ్లి కూడా స్వస్థత పొందలేకపోవచ్చు. వైద్యులు అద్భుతాలు చేయలేరు. అయితే స్వస్థత పొందగల చాలామంది వైద్యుని దగ్గరికి మరీ ఆలస్యంగా వెళ్తారు. వాళ్లు మొదట మూఢనమ్మకాలతో కూడిన చికిత్సలను ప్రయత్నించి, అవి విఫలమైన తర్వాత చివరి దిక్కుగా వైద్యుని వద్దకు వెళ్తారు. ఈ కారణంగా, అనేకులు అనవసరంగా చనిపోతారు.
ఇతరులు అజ్ఞానం మూలంగా అకారణ మరణానికి గురౌతారు. వాళ్లు రోగలక్షణాలను గుర్తించరు, జబ్బును నిరోధించటానికి ఏ ఆచరణాత్మకమైన చర్యలు తీసుకోవాలో వాళ్లకు తెలియదు. అనవసరమైన బాధను తప్పించుకోవటానికి జ్ఞానం సహాయం చేస్తుంది. విద్యావంతులైన తల్లుల కన్నా నిరక్షరాస్యులైన తల్లులు ఎక్కువగా తమ పిల్లలను కోల్పోతారన్నది గమనార్హమైన విషయం. అవును, అజ్ఞానం ప్రాణాంతకం కాగలదు.
రోగానికి మరో కారణం నిర్లక్ష్యం. ఉదాహరణకు, చాలామంది తమ ఆహారంపైన ఈగలను వాలనిస్తారు, లేదా వంట చేసేముందు తమ చేతులను శుభ్రంగా కడుక్కోరు గనుక రోగగ్రస్థులౌతారు. మలేరియా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో దోమతెర లేకుండా నిద్రించటం కూడా ప్రమాదకరం.a ఆరోగ్య విషయాల్లో, “చికిత్స కన్నా నివారణ మిన్న” అన్నది తరచూ వాస్తవం.
కోట్లాదిమంది రోగగ్రస్థులై, అకాల మరణానికి గురవ్వటానికి అజ్ఞానయుక్తమైన జీవన విధానం కారణం. త్రాగుబోతుతనం, లైంగిక దుర్నీతి, మాదకద్రవ్యాల దుర్వినియోగం, పొగాకు ఉపయోగం అనేకుల ఆరోగ్యాన్ని నాశనం చేశాయి. ఎవరైనా ఇలాంటి చెడు కార్యాల్లో నిమగ్నమై అనారోగ్యానికి గురైతే, అది దయ్యాల మూలంగా కలిగినట్లా లేక దుష్టాత్మ అతనిపై దాడిచేసినట్లా? కాదు. అతని జబ్బుకు అతడే బాధ్యుడు. దుష్టాత్మలను నిందించటం, అజ్ఞానయుక్తమైన జీవన విధానానికి తమ బాధ్యతను తీసుకోవటానికి నిరాకరించినట్లే.
నిజమే, మనం కొన్ని విషయాలను అదుపు చేయలేము. ఉదాహరణకు, మనం రోగ కారకాలైన సూక్ష్మజీవులకు లేక కాలుష్యానికి గురికావచ్చు. ఓమాజీ విషయంలో అదే జరిగింది. ఆమె తల్లియైన హావకు, అతిసార వ్యాధికి కారణమేమిటో తెలియలేదు. ఇతర పిల్లల్లా ఆమె పిల్లలకు అంత తరచుగా జబ్బులు చేయవు ఎందుకంటే ఆమె తన ఇంటిని, పెరటిని శుభ్రంగా ఉంచుతుంది, వంటచేయటానికి ముందు ఆమె ఎప్పుడూ తన చేతులు కడుక్కుంటుంది. కాని పిల్లలందరూ ఎప్పుడో ఒకసారి అనారోగ్యానికి గురౌతారు. దాదాపు 25 రకాల రోగక్రిముల మూలంగా అతిసార వ్యాధి సోకుతుంది. వాటిలో ఏది ఓమాజీ సమస్యకు కారణమో బహుశా ఎవ్వరూ చెప్పలేకపోవచ్చు.
దీర్ఘకాలిక పరిష్కారం
జబ్బు చేయటం దేవుని తప్పు కాదు. “దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు.” (యాకోబు 1:13) ఆయన ఆరాధకుల్లో ఎవరైనా జబ్బు పడితే, యెహోవా వారిని ఆధ్యాత్మికంగా పోషిస్తాడు. “రోగశయ్యమీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు.” (కీర్తన 41:3) అవును, దేవునికి కనికరం ఉంది. ఆయన మనకు సహాయం చేయాలనుకుంటున్నాడు గానీ మనకు హాని తలపెట్టాలని అనుకోవటం లేదు.
వాస్తవానికి, అనారోగ్యం విషయంలో యెహోవా వద్ద ఒక దీర్ఘకాలిక పరిష్కారం ఉంది—యేసు మరణం, పునరుత్థానం. యేసు విమోచన క్రయధన బలి ద్వారా, నీతియుక్తమైన హృదయంగలవారు పాపయుక్తమైన స్థితి నుండి విడిపించబడి చివరికి పరిపూర్ణ ఆరోగ్యాన్ని, పరదైసు భూమిపై నిరంతర జీవితాన్ని పొందగల్గుతారు. (మత్తయి 5:5; యోహాను 3:16) యేసు చేసిన అద్భుతాలు, దేవుని రాజ్యం తీసుకువచ్చే నిజమైన స్వస్థతకు ముంగుర్తుగా ఉన్నాయి. దేవుడు సాతానును, అతని దయ్యాలను కూడా నిర్మూలిస్తాడు. (రోమీయులు 16:20) వాస్తవానికి, ఆయన యందు విశ్వాసం ఉంచే వారి కోసం యెహోవా అద్భుతమైన విషయాలను భద్రపరిచాడు. మనం ఓర్పు, సహనం కల్గివుండాలంతే.
ఈలోగా, బైబిలు ద్వారా, నమ్మకమైన ఆరాధకుల ప్రపంచవ్యాప్త సహోదరత్వం ద్వారా దేవుడు ఆచరణాత్మకమైన జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక నడిపింపును అందజేస్తాడు. ఆరోగ్య సమస్యలను తీసుకువచ్చే చెడును మనం ఎలా నివారించవచ్చో ఆయన మనకు చూపిస్తాడు. సమస్యలు తలెత్తినప్పుడు సహాయం చేసే నిజమైన స్నేహితులను ఆయన మనకు ఇస్తాడు.
మళ్లీ యోబు గురించి ఆలోచించండి. యోబు భూతవైద్యుని వద్దకు వెళ్లటం ఆయన చేయగల ఘోరమైన విషయమై ఉండేది ! అది ఆయనకు దేవుని కాపుదల లేకుండా చేసివుండేది, ఆ గొప్ప శ్రమ తర్వాత ఆయన తనకు రానైయున్న ఆశీర్వాదాలనన్నింటినీ కోల్పోయి ఉండేవాడు. దేవుడు యోబును మరిచిపోలేదు, ఆయన మనల్నీ మరిచిపోడు. “మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి మరియు యెహోవా అనుగ్రహించిన ప్రతిఫలమును చూచితిరి” అని శిష్యుడైన యాకోబు చెప్తున్నాడు. (యాకోబు 5:11, NW) మనం కూడా ఎన్నడూ సహనాన్ని కోల్పోకపోతే, మనం కూడా దేవుని నిర్ణీత సమయంలో అద్భుతమైన ఆశీర్వాదాలను పొందుతాము.
ఓమాజీకి ఏమైంది? కావలికోట సహ పత్రిక అయిన తేజరిల్లు!లో ఓరల్ రిహైడ్రేషన్ థెరపీ గురించి వచ్చిన శీర్షికను ఆమె తల్లి జ్ఞాపకం చేసుకుంది.b ఆమె అందులో ఇవ్వబడిన సూచనలను పాటించి ఓమాజీ త్రాగటానికి ఒక ద్రావణాన్ని తయారు చేసింది. ఇప్పుడు ఆ పసిది చక్కగా, ఆరోగ్యంగా ఉంది.
[అధస్సూచీలు]
a సంవత్సరానికి దాదాపు 50 కోట్లమందికి మలేరియా సోకుతూ ఉంది, ఈ వ్యాధి మూలంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 లక్షలమంది చనిపోతున్నారు, ఈ మరణాలు ఎక్కువగా ఆఫ్రికాలోనే జరుగుతున్నాయి.
b తేజరిల్లు! (ఆంగ్లం) సెప్టెంబరు 22, 1985, 24-5 పేజీల్లోవున్న “జీవితాలను కాపాడే లవణ ద్రావణం!” అనే శీర్షికను చూడండి.
[7వ పేజీలోని చిత్రాలు]
అనారోగ్య సమస్యకు యెహోవా ఒక శాశ్వత పరిష్కారాన్ని ఏర్పాటు చేశాడు