యెహోవా మార్గాన్ని సిద్ధపరుస్తాడు
“ఈ రాజ్య సువార్త . . . ప్రకటింపబడును.”—మత్తయి 24:14.
1. మొదటి శతాబ్దంలోను, 20వ శతాబ్దంలోను ప్రకటనా పని ద్వారా ఏమి సాధించబడింది?
యెహోవా ప్రేమకు దేవుడు గనుక, ఆయన “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు.” (1 తిమోతి 2:4) ఇందుకు ప్రకటనా బోధనా పని అంతర్జాతీయంగా అవసరమౌతుంది. మొదటి శతాబ్దంలో, ఈ ప్రకటనా పని మూలంగా క్రైస్తవ సంఘము “సత్యమునకు స్తంభమును ఆధారము[ను]” అయ్యింది. (1 తిమోతి 3:15) అటుతర్వాత సత్యపు కాంతి మసకబారిన ఒక సుదీర్ఘమైన భ్రష్టత్వపు కాలం వచ్చింది. ఇటీవలి కాలాల్లో, “అంత్యకాలము”లో మళ్లీ “సత్య జ్ఞానము” అధికమైంది, దీనిమూలంగా బైబిలు ఆధారిత నిరీక్షణ అయిన నిత్య రక్షణ లక్షలాదిమందికి అందుబాటులోనికి వచ్చింది.—దానియేలు 12:4, NW.
2. ప్రకటనా పని సంబంధంగా యెహోవా ఏమి చేశాడు?
2 దేవుని సంకల్పానికి విఘాతం కల్గించడానికి సాతాను ఎడతెగక ప్రయత్నించినప్పటికీ, మొదటి శతాబ్దంలోనూ ఈ 20వ శతాబ్దంలోనూ ప్రకటనా పని అద్భుతమైన విజయాల్ని సాధించింది. ఇది యెషయా ప్రవచనాన్ని జ్ఞప్తికి తెస్తుంది. యూదా నిర్వాసితులు సా.శ.పూ. ఆరవ శతాబ్దంలో తిరిగి యూదయకు రావడాన్ని గురించి యెషయా ఇలా వ్రాశాడు: “ప్రతి లోయను ఎత్తు చేయవలెను. ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను వంకరవి చక్కగాను, కరుకైనవి సమముగాను ఉండవలెను.” (యెషయా 40:4) అటు మొదటి శతాబ్దంలోనూ ఈ 20వ శతాబ్దంలోనూ కూడా యెహోవా గొప్ప ప్రకటనా కార్యాలకు మార్గాన్ని సిద్ధం చేసి, సుగమం చేశాడు.
3. యెహోవా తన సంకల్పాల్ని ఏయే మార్గాల్లో నెరవేరుస్తున్నాడు?
3 దీనర్థం, సువార్త ప్రకటనను వ్యాప్తి చేయడానికి యెహోవా భూమ్మీది ప్రతి అభివృద్ధినీ ప్రత్యక్షంగా ప్రభావితం చేశాడని కాదు; లేదా జరుగబోయే ప్రతి సంఘటననూ ఖచ్చితమైన వివరణలతో సహా తెలుసుకోవడానికి యెహోవా భవిష్యజ్ఞానాన్ని ఉపయోగించాడనీ కాదు. నిజమే, భవిష్యత్తును ముందే చూసే సామర్థ్యమూ, భవిష్య సంఘటనల్ని రూపించే సామర్థ్యమూ ఆయనకు ఉన్నాయి. (యెషయా 46:9-11) కానీ పరిస్థితులు మారుతుండగా ఆయన వాటికి ప్రతిస్పందించగలడు కూడా. తన గొఱ్ఱెల మందను నడిపించడమూ, దాన్ని కాపాడటమూ తెలిసిన అనుభవజ్ఞుడైన గొఱ్ఱెల కాపరిలా యెహోవా తన ప్రజల్ని నడిపిస్తాడు. వారి ఆధ్యాత్మికతను కాపాడుతూ, ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటన విజయానికి తోడ్పడే పరిస్థితుల నుండి అభివృద్ధుల నుండి వారు ప్రయోజనాన్ని పొందేలా నిర్దేశిస్తూ ఆయన వారిని రక్షణవైపుగా నడిపిస్తాడు.—కీర్తన 23:1-4.
కష్టతరమైన నియామకం
4, 5. సువార్త ప్రకటన ఎందుకు సవాలుతో కూడిన నియామకమై ఉంది?
4 నోవహు కాలంలో ఓడ నిర్మాణంలానే, మొదటి శతాబ్దంలోనూ ఈ ఆధునిక కాలంలోనూ రాజ్య ప్రకటనా పని ఒక భారీ నియామకంగా ఉంది. ఎటువంటి సందేశాన్నైనా ప్రజలందరికీ వినిపించడం అంటే చాలా కష్టం, కానీ ఈ నియామకం ఇంకా సవాలుతో కూడినది. మొదటి శతాబ్దంలో శిష్యులు చాలా కొద్దిమందే ఉండేవారు. వారి నాయకుడైన యేసు తిరుగుబాటును రేకెత్తించిన వ్యక్తియనే నిందపై చంపబడ్డాడు. యూదా మతం సుస్థాపితమైన మతం. యెరూషలేములో ఒక మహత్తరమైన దేవాలయం వారికి ఉంది. మధ్యధరా ప్రాంతంలోని అన్య మతాలు కూడా దేవాలయాలతోను యాజకత్వాలతోను సుస్థాపితమైనవే. అదే విధంగా, 1914లో “అంత్యకాలము” ప్రారంభమౌతుండగా, అభిషిక్త క్రైస్తవులు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు, దేవుణ్ని సేవిస్తున్నామని చెప్పుకునే ఇతర మతాలవారి సంఖ్య అత్యధికంగా ఉంది.—దానియేలు 12:9.
5 తన శిష్యులు హింసించబడతారని యేసు వారిని హెచ్చరించాడు. ఆయనిలా అన్నాడు: “జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు.” (మత్తయి 24:9) అటువంటి సమస్యలకు తోడు, ప్రాముఖ్యంగా “అంత్యదినము”లలో తాము “అపాయకరమైన కాలము”ల్లో ఉన్నట్లు క్రైస్తవులు గ్రహిస్తారు. (2 తిమోతి 3:1) పని విస్తారత, హింసల నిశ్చయత, ఈ కష్టకాలాలు—ఇవన్నీ ప్రకటనా పనిని ఒక సవాలుగా, కష్టతరమైనదిగా చేశాయి. అందుకు గొప్ప విశ్వాసం కావాల్సివచ్చింది.
6. విజయం సాధిస్తారన్న ఏ హామీని యెహోవా తన ప్రజలకు ఇచ్చాడు?
6 కష్టాలు ఉంటాయని యెహోవాకు తెలుసు, అయినా ఈ పనిని ఏదీ ఆపలేదని కూడా ఆయనకు తెలుసు. మొదటి శతాబ్దంలో గమనార్హమైన నెరవేర్పును చూసిన, ఈ 20వ శతాబ్దంలోనూ గమనార్హమైన రీతిలో నెరవేరుతున్న ఒక ప్రసిద్ధ ప్రవచనంలో విజయం లభిస్తుందని ముందే చెప్పబడింది: “ఈ రాజ్య సువార్త . . . లోకమందంతటను ప్రకటింపబడును.” (ఇటాలిక్కులు మావి.)—మత్తయి 24:14.
7. మొదటి శతాబ్దంలో ప్రకటనా పని ఎంత విస్తారంగా జరిగింది?
7 విశ్వాసంతోను, పరిశుద్ధాత్మతోను నిండుకొనినవారై మొదటి శతాబ్దంలోని దేవుని సేవకులు తమ నియామకాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగిపోయారు. యెహోవా వారితో ఉన్నాడు గనుక వారూహించగల్గిన దానికన్నా ఎంతో ఎక్కువ విజయాన్ని వారు సాధించారు. యేసు చనిపోయిన తర్వాత దాదాపు 27 సంవత్సరాలకు పౌలు కొలొస్సయులకు వ్రాసే సమయానికి, సువార్త ‘ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి ప్రకటింపబడింది’ అని ఆయన చెప్పగలిగాడు. (కొలొస్సయులు 1:23) దానికి సమాంతరంగానే, 20వ శతాబ్దం ముగింపుకల్లా సువార్త 233 దేశాల్లో ప్రకటించబడుతోంది.
8. ఎటువంటి పరిస్థితుల్లో అనేకమంది సువార్తను స్వీకరించారు? ఉదాహరణలు ఇవ్వండి.
8 ఇటీవలి దశాబ్దాల్లో లక్షలాదిమంది సువార్తను స్వీకరించారు. వారిలో చాలామంది అననుకూలమైన పరిస్థితుల్లో—యుద్ధకాలాల్లో, నిషేధం క్రింద ఉన్న కాలాల్లో, తీవ్రమైన హింసలున్న కాలంలో సువార్తను స్వీకరించారు. మొదటి శతాబ్దంలో కూడా అది వాస్తవం. ఒక సందర్భంలో పౌలు, సీలలను బెత్తములతో విపరీతంగా కొట్టి చెరసాలలో వేశారు. ఎలాంటి పరిస్థితుల్లో శిష్యుల్ని చేయాల్సివుంది కదా! అయినా, యెహోవా అదే పరిస్థితిని ఉపయోగించుకుని ఆ పనినే నెరవేర్చాడు. పౌలు, సీలలు విడుదల చేయబడ్డారు, చెరసాల నాయకుడూ ఆయన కుటుంబమూ విశ్వాసులయ్యారు. (అపొస్తలుల కార్యములుల 16:19-33) సువార్త, దాన్ని వ్యతిరేకించే వారి ప్రయత్నాల మూలంగా ఆగదని అటువంటి అనుభవాలు నిరూపిస్తాయి. (యెషయా 54:17) అయినా, క్రైస్తవత్వపు చరిత్ర అంతులేని వ్యతిరేకత, హింసలతో మాత్రమే నిండిలేదు. ఇప్పుడు మనం, మొదటి శతాబ్దంలోనూ ఈ 20వ శతాబ్దంలోనూ సువార్త ప్రకటనను విజయవంతంగా కొనసాగించడానికి మార్గాన్ని సుగమం చేసిన కొన్ని అనుకూలమైన అభివృద్ధులపై దృష్టి కేంద్రీకరిద్దాము.
మతపరమైన వాతావరణం
9, 10. మొదటి శతాబ్దంలోను, 20వ శతాబ్దంలోను సువార్త ప్రకటన జరుగుతుందన్న నిరీక్షణను యెహోవా ఎలా ఏర్పర్చాడు?
9 భౌగోళిక ప్రకటనా కార్యాల నిర్ణీత సమయాల్ని పరిశీలించండి. మొదటి శతాబ్దపు నేపథ్యాన్ని చూస్తే, దానియేలు 9:24-27లోని 70 వారపు సంవత్సరాల ప్రవచనం మెస్సీయా సరిగ్గా ఏ సంవత్సరంలో ప్రత్యక్షమౌతాడన్నది సూచించింది—అది సా.శ. 29వ సంవత్సరం. మొదటి శతాబ్దపు యూదులు ఖచ్చితమైన సంవత్సరాన్ని అర్థం చేసుకోలేకపోయినా, వారు కనిపెడుతూ మెస్సీయా కోసం వేచిచూస్తూ ఉన్నారు. (లూకా 3:15) ఫ్రెంచ్ భాషలోని మాన్యుల్ బిబ్లిక్ ఇలా తెలియజేస్తోంది: “దానియేలు స్థిరపర్చిన డెబ్బది వారముల సంవత్సరాలు ముగియబోతున్నాయని ప్రజలకు తెలుసు; దేవుని రాజ్యము సమీపిస్తోందని బాప్తిస్మమిచ్చు యోహాను ప్రకటించడాన్ని విని ఎవ్వరూ ఆశ్చర్యపోలేదు.”
10 ఆధునిక కాలంలోని నేపథ్యం సంగతేమిటి? ఒక విశిష్టమైన అభివృద్ధి ఏమిటంటే యేసు పరలోకంలో సింహాసనాసీనుడు కావడమే, ఇది రాజ్యాధికారంతో కూడిన ఆయన ప్రత్యక్షత ప్రారంభాన్ని సూచించింది. ఇది 1914లో జరిగిందని బైబిలు ప్రవచనం చూపిస్తుంది. (దానియేలు 4:13-17) ఈ సంఘటన జరుగనైయుందన్న నిరీక్షణ కూడా ఆధునిక కాలాల్లోని దైవభక్తిగల కొందరు అందుకోసం వేచివుండేందుకు కారణమైంది. ఈ పత్రికను 1879లో సీయోను కావలికోట మరియు క్రీస్తు ప్రత్యక్షతా చాటింపు (ఆంగ్లం) అనే పేరుతో ప్రచురించడం ప్రారంభించిన యథార్థవంతులైన బైబిలు విద్యార్థుల్లో కూడా నిరీక్షణ స్పష్టంగా కన్పించింది. ఆ విధంగా, అటు మొదటి శతాబ్దంలోనూ ఈ ఆధునిక కాలాల్లోనూ మతపరమైన నిరీక్షణలు సువార్త ప్రకటనకు వాతావరణాన్ని సిద్ధంచేశాయి.a
11. సువార్త ప్రకటనకు సహాయం చేయడానికి ఏ మత పునాదులు స్థాపించబడ్డాయి?
11 ఈ రెండు శతాబ్దాల్లోనూ క్రైస్తవుల పనికి దోహదపడిన మరో కారణం ఏమిటంటే, చాలామంది ప్రజలకు పరిశుద్ధ లేఖనాలతో పరిచయం ఉండటం. మొదటి శతాబ్దంలో, చుట్టు ప్రక్కల ఉన్న అన్య జనాంగాలన్నింట్లో యూదుల సమాజాలు చెదురుమదురుగా ఉన్నాయి. ఆ సమాజాలకు సమాజ మందిరాలు ఉన్నాయి, అక్కడ వారు క్రమంగా కూడుకుంటూ లేఖనాలు చదవడం చర్చించడం వినేవారు. ఆ విధంగా, తొలి క్రైస్తవులు ప్రజల్లో అప్పటికే ఉన్న ఆ మతపరమైన జ్ఞానం పునాదిపై నిర్మించగలిగారు. (అపొస్తలుల కార్యములు 8:28-36; 17:1, 2) మన యుగం తొలిభాగంలో యెహోవా ప్రజలు అనేక దేశాల్లో అటువంటి వాతావరణాన్నే అనుభవించారు. క్రైస్తవమత సామ్రాజ్యం అంతటిలో, ప్రాముఖ్యంగా ప్రొటస్టెంటు దేశాల్లో బైబిలు విరివిగా అందుబాటులో ఉంది. అనేక చర్చీల్లో దాన్ని చదవడం జరుగుతోంది; లక్షలాదిమంది దగ్గర స్వంత బైబిలు ఉంది. బైబిలు అప్పటికే ప్రజల చేతుల్లో ఉంది గానీ, తమదగ్గరున్న దాన్ని అర్థం చేసుకోవడానికి వారికి సహాయం అవసరమైంది.
చట్టం మూలంగా ప్రయోజనాలు
12. మొదటి శతాబ్దంలో రోమా చట్టం సాధారణంగా ఎలా భద్రతను కల్పించింది?
12 క్రైస్తవ ప్రకటనా పని చాలా సందర్భాల్లో ప్రభుత్వ చట్టాల మూలంగా ప్రయోజనాలు పొందింది. మొదటి శతాబ్దంలోని దేశాలపై రోమా సామ్రాజ్యం ఆధిపత్యం చెలాయించింది, దాని లిఖితపూర్వకమైన చట్టాలు దైనందిన జీవితంపై అపారమైన ప్రభావాన్ని చూపించాయి. ఈ చట్టాలు భద్రతను హామీగా ఇచ్చాయి, తొలి క్రైస్తవులు వాటిమూలంగా ప్రయోజనాల్ని పొందారు. ఉదాహరణకు, పౌలు రోమా చట్టానికి అప్పీలు చేసుకోవడం మూలంగా, ఆయన చెరసాల నుండి విడుదల పొంది, కొరడా దెబ్బల్ని తప్పించుకున్నాడు. (అపొస్తలుల కార్యములు 16:37-39; 22:25, 29) రోమా న్యాయ వ్యవస్థలోని సదుపాయం గురించి పేర్కోవడం, ఎఫెసులో చిందులు తొక్కుతున్న ఒక అల్లరి మూకను శాంతపర్చడానికి సహాయం చేసింది. (అపొస్తలుల కార్యములు 19:35-41) ఒకసారి, పౌలు రోమా పౌరుడు కావడం మూలంగా యెరూషలేములో హింసాయుత సంఘటన నుండి తప్పించుకున్నాడు. (అపొస్తలుల కార్యములు 23:27) అటుతర్వాత, ఆయన తన విశ్వాసాన్ని కైసరు ఎదుటనే చట్టబద్ధంగా సమర్థించుకోవడానికి రోమా చట్టం అనుమతించింది. (అపొస్తలుల కార్యములు 25:11) అనేకమంది కైసరులు నిరంకుశులుగా పరిపాలించినప్పటికీ, మొదటి శతాబ్దంలోని చట్టాలు సామాన్యంగా ‘సువార్తపక్షమున వాదించుటకు, దానిని స్థిరపరచుటకు’ అవకాశాన్నిచ్చాయి.—ఫిలిప్పీయులు 1:7.
13. మన కాలాల్లో ప్రకటన పని చట్టం నుండి ఎలా ప్రయోజనం పొందింది?
13 నేడు కూడా చాలా దేశాల్లో అదే వాస్తవంగా ఉంది. ‘కట్టడవలన కీడు కల్పించే’ వ్యక్తులు ఉన్నప్పటికీ అత్యధిక దేశాల్లోని లిఖితపూర్వకమైన చట్టాలు మత స్వాతంత్ర్యాన్ని ఒక ప్రాథమిక హక్కుగా పరిగణిస్తాయి. (కీర్తన 94:20) యెహోవాసాక్షులు సామాజిక భద్రతకు ఏమాత్రం ముప్పు వాటిల్లజేయరని గుర్తిస్తూ చాలా ప్రభుత్వాలు మనకు చట్టబద్ధమైన గుర్తింపునిచ్చాయి. సాక్షుల సాహిత్యాల ముద్రణ ఎంతో ఎక్కువగా జరిగిన అమెరికాలోని చట్టాలు కావలికోట పత్రికను 120 సంవత్సరాలుగా నిరంతరాయంగా ఉత్పత్తి చేయడాన్ని, ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా చదవడాన్ని సాధ్యంచేశాయి.
శాంతి సహనాల సమయాలు
14, 15. మొదటి శతాబ్దంలోని కాస్తంత సామాజిక స్థిరత్వం ఎలా ప్రయోజనాన్ని చేకూర్చింది?
14 ప్రకటనా పని కాస్త శాంతియుతమైన సమయాల నుండి కూడా ప్రయోజనం పొందింది. మొదటి శతాబ్దంలోనూ ఈ 20వ శతాబ్దంలోనూ ‘జనము మీదికి జనము లేచును’ అని యేసు ముందే ఖచ్చితంగా చెప్పినప్పటికీ రాజ్య ప్రకటనా పనిని తీవ్రతరం చేయడాన్ని సాధ్యపర్చిన స్థిరమైన కాలాలు మధ్యమధ్య ఉన్నాయి. (మత్తయి 24:7) మొదటి శతాబ్దపు క్రైస్తవులు పాక్స్ రోమానా అంటే రోమా శాంతి క్రింద జీవించారు. ఒక చరిత్రకారుడు ఇలా వ్రాశాడు: “రోమ్ మధ్యధరా ప్రాంతంలోని ప్రజల్ని ఎంతగా స్వాధీనంలో ఉంచుకుందంటే, అది సంవత్సరాల తరబడి దాదాపు నిరంతరాయంగా జరుగుతూ వచ్చిన యుద్ధాల్ని అంతం చేసింది.” ఈ స్థిరత్వం తొలి క్రైస్తవులు కాస్తంత భద్రతతో రోమా సామ్రాజ్యం అంతట్లో ప్రయాణించడాన్ని సుగమం చేసింది.
15 రోమా సామ్రాజ్యం ప్రజల్ని తన బలమైన హస్తాలతో ఐక్యపర్చాలని తీవ్రంగా ప్రయత్నించింది. ఈ విధానం ప్రయాణ సౌకర్యాల్నీ, సహనాన్నీ, తలంపుల ఆదానప్రదానాన్నీ అభివృద్ధిపర్చడం మాత్రమే కాక అంతర్జాతీయ సహోదరత్వమనే తలంపును కూడా పెంపొందించింది. నాగరికతా మార్గంపై (ఆంగ్లం) అనే పుస్తకం ఇలా అంటుంది: “[రోమా] సామ్రాజ్య ఐక్యత [క్రైస్తవ ప్రకటనా] క్షేత్రాన్ని అనుకూలమైనదిగా చేసింది. జాతీయ సరిహద్దులు చెరిగిపోయాయి. రోమా పౌరుడు అంతర్జాతీయ పౌరుడయ్యాడు. . . . అంతేగాక, విశ్వ పౌరసత్వ తలంపును పెంపొందించిన ప్రభుత్వం క్రింద, మానవ సౌభ్రాతృత్వాన్ని బోధించే మతాన్ని గ్రహించడం సులభమైంది.”—పోల్చండి అపొస్తలుల కార్యములు 10:34, 35; 1 పేతురు 2:17.
16, 17. ఆధునిక కాలాల్లో శాంతిని పెంపొందించడానికి చేయబడిన ప్రయత్నాల్ని ఏమి పురికొల్పింది, అనేకమంది ఏ ముగింపుకు వచ్చారు?
16 మన కాలాల సంగతేమిటి? ఈ 20వ శతాబ్దంలో చరిత్రలోనే అత్యంత ఘోరమైన యుద్ధాలు జరిగాయి, కొన్ని దేశాల్లో ప్రాంతీయ యుద్ధాలు కొనసాగుతునే ఉన్నాయి. (ప్రకటన 6:4) అయినా, కాస్తంత శాంతి ఉన్న కాలాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలోని బలమైన దేశాలు 50 సంవత్సరాలకుపైగా సమూల నాశనం జరిగేలా ఒకదానితో ఒకటి తలపడలేదు. ఈ పరిస్థితి ఆ దేశాల్లో సువార్త ప్రకటనలో ఎంతగానో సహాయపడింది.
17 ఈ 20వ శతాబ్దంలో జరిగిన యుద్ధాల్లోని భయభ్రాంతుల్ని చేసే సంఘటనలు, ఒక ప్రపంచ ప్రభుత్వాన్ని స్థాపించాల్సిన అవసరాన్ని అనేకమంది ప్రజలు గుర్తించేందుకు నడిపించాయి. ప్రపంచ యుద్ధమంటే ఉన్న భయం నానాజాతి సమితి ఏర్పడటానికీ ఐక్యరాజ్య సమితి ఏర్పడటానికీ నడిపించింది. (ప్రకటన 13:14) అంతర్జాతీయ సహకారాన్నీ శాంతినీ పెంపొందించడమే ఈ రెండు సంస్థల ప్రకటిత లక్ష్యమై ఉంది. అటువంటి అవసరాన్ని గ్రహించే ప్రజలు నిజమైన నిరంతర శాంతిని తెచ్చే ప్రపంచ ప్రభుత్వాన్ని గురించిన—దేవుని రాజ్యాన్ని గురించిన సువార్తకు సాధారణంగా అనుకూలంగానే ప్రతిస్పందిస్తారు.
18. మతంపట్ల ఏ వైఖరి ప్రకటనా పనికి అనుకూలంగా పరిణమించింది?
18 క్రైస్తవులు కొన్నిసార్లు క్రూరంగా హింసించబడినప్పటికీ అటు మొదటి శతాబ్దంలోనూ ఇటు 20వ శతాబ్దంలోనూ మత సహనం ఉన్న కొన్ని సమయాలు ఉన్నాయి. (యోహాను 15:20; అపొస్తలుల కార్యములు 9:31) రోమన్లు తాము జయించిన ప్రజల దేవుళ్లనీ దేవతల్నీ స్వేచ్ఛగా స్వీకరించేశారు, వారి అభిరుచుల మేరకు రూపాలు మార్చేసుకున్నారు. ప్రొఫెసర్ రాడ్నీ స్టార్క్ ఇలా వ్రాస్తున్నాడు: “అనేక రీతుల్లో చూస్తే, అమెరికా విప్లవం వరకూ మళ్లీ కన్పించనంత మత స్వాతంత్ర్యాన్ని రోమ్ ప్రసాదించింది.” ఆధునిక కాలాల్లో, అనేక దేశాల్లోని ప్రజలు ఇతరుల అభిప్రాయాలను వినడానికి మరింత సుముఖంగా తయారయ్యారు, దాని ఫలితంగా యెహోవాసాక్షులు వినిపించే బైబిలు సందేశాన్ని వినడానికి వారు ఇష్టపడుతున్నారు.
సాంకేతికత వహించిన పాత్ర
19. తొలి క్రైస్తవులు కోడెక్స్‌ను ఎలా ఉపయోగించుకున్నారు?
19 చివరిగా, సాంకేతిక పురోభివృద్ధుల నుండి ప్రయోజనం పొందేలా యెహోవా తన ప్రజల్ని ఎలా నడిపించాడో పరిశీలించండి. సాంకేతిక పురోభివృద్ధులు అత్యంత త్వరితగతిన జరిగిన యుగంలో తొలి క్రైస్తవులు జీవించకపోయినప్పటికీ, వారు ఉపయోగించుకున్న ఒక అభివృద్ధి కోడెక్స్, అంటే పుటలుగల పుస్తకం. ఈ కోడెక్స్ భారీ గ్రంథపు చుట్టల స్థానాన్ని ఆక్రమించింది. కోడెక్స్ పుట్టుక (ఆంగ్లం) అనే పుస్తకం ఇలా చెబుతుంది: “లౌకిక సాహిత్య రంగంలో కోడెక్స్ నెమ్మదిగా అంచెలవారిగా గ్రంథపు చుట్టల స్థానాన్ని ఆక్రమించగా, దీనికి విరుద్ధంగా క్రైస్తవులు ఈ కోడెక్స్‌ను స్వీకరించడం తక్షణమే జరిగింది, ఎల్లచోట్లా జరిగింది.” ఈ రెఫరెన్సు గ్రంథం ఇంకా ఇలా అంటోంది: “రెండవ శతాబ్దంలో క్రైస్తవులు కోడెక్స్‌ను ఉపయోగించడం ఎంత విస్తారమైన ప్రాంతాల్లో జరిగిందంటే దాని ప్రవేశం క్రీ.శ. 100కు ముందే జరిగివుండాలి.” గ్రంథపు చుట్టల కన్నా కోడెక్స్‌ను ఉపయోగించడం సుళువుగా ఉంటుంది. లేఖనాలను త్వరగా కనుక్కోవచ్చు. పౌలువలె, లేఖనాలను వివరించడం మాత్రమే గాక, తాము బోధించేవాటిని ‘దృష్టాంతములనెత్తి విప్పి చెబుతూ’ నిరూపించిన తొలి క్రైస్తవులకు ఇది నిశ్చయంగా సహాయపడి ఉండవచ్చు.—అపొస్తలుల కార్యములు 17:2, 3.
20. దేవుని ప్రజలు ఆధునిక సాంకేతికతను తమ భౌగోళిక ప్రకటనా పనిలో ఎలా ఉపయోగించుకున్నారు, ఎందుకు?
20 మన శతాబ్దంలోని సాంకేతిక పురోభివృద్ధులు నిజంగా అచ్చెరువొందించేవిగా ఉన్నాయి. హైస్పీడ్ ముద్రణా యంత్రాల సహాయంతో బైబిలు సాహిత్యాన్ని అనేక భాషల్లో ఒకేసారి ప్రచురించడం సాధ్యమైంది. ఆధునిక సాంకేతికత బైబిలు అనువాదాన్ని వేగిరం చేసింది. ట్రక్కులు, ట్రెయిన్‌లు, ఓడలు, విమానాల మూలంగా బైబిలు సాహిత్యాన్ని భూవ్యాప్తంగా త్వరితగతిన రవాణా చేయడానికి సాధ్యమైంది. టెలిఫోన్‌లు, ఫాక్స్ మెషీన్‌ల మూలంగా తక్షణ సమాచార వినిమయం వాస్తవరూపం దాల్చింది. సువార్తను ప్రపంచవ్యాప్తంగా ప్రకటించేందుకు అటువంటి సాంకేతికతను ఆచరణయుక్తంగా ఉపయోగించుకునేలా యెహోవా తన ఆత్మ ద్వారా తన సేవకులను నడిపించాడు. వారు అటువంటి పురోభివృద్ధులను ఉపయోగిస్తున్నది, ఈ లోకంలో ఏది అత్యంతాధునికమైనదో దాన్ని తెలుసుకొని ప్రయోగంలో పెట్టేయాలన్న కోరికతో కాదు. దానికి బదులుగా, వారి మొట్టమొదటిదైన అతి ప్రాముఖ్యమైన చింత ఏమిటంటే తమ ప్రకటనా నియామకాన్ని అత్యంత ప్రభావవంతంగా నెరవేర్చడానికి ఏది సహాయం చేస్తుందన్నదే.
21. మనం దేని విషయమై నిశ్చయతను కలిగివుండవచ్చు?
21 “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును” అని యేసు ప్రవచించాడు. (మత్తయి 24:14) తొలి క్రైస్తవులు దాని నెరవేర్పును చూసినట్లుగానే మనం నేడు గొప్ప పరిమాణంలో దాని నెరవేర్పును చూస్తున్నాము. పని విస్తారంగా ఉన్నప్పటికీ క్లిష్టంగా ఉన్నప్పటికీ, అనుకూల సమయంలోను అనుకూలం కాని సమయంలోను, చట్టాల మార్పుల మధ్య మారుతున్న వైఖరుల మధ్య, యుద్ధకాలంలోను శాంతి సమయంలోను, అన్ని రకాల సాంకేతిక పురోభివృద్ధుల మధ్య సువార్త ప్రకటించబడింది, ఇంకా ప్రకటించబడుతూ ఉన్నది. యెహోవా బుద్ధి జ్ఞానముల బాహుళ్యమును, అద్భుతమైన ఆయన ముందుచూపును చూసి మీ మనస్సులు ఆశ్చర్యంతో నిండిపోయేలా ఇది చేయడంలేదా? ప్రకటనా పని యెహోవా కాలపట్టిక ప్రకారమే పూర్తి చేయబడుతుందనీ, ప్రేమపూర్వకమైన ఆయన సంకల్పం నెరవేర్చబడుతుందనీ, ఇది నీతిమంతుల ఆశీర్వాదానికి దారితీస్తుందనీ మనం పూర్ణ నిశ్చయతతో ఉండవచ్చు. వారు భూమిని స్వతంత్రించుకుని దానిపైన నిరంతరము జీవిస్తారు. (కీర్తన 37:29; హబక్కూకు 2:3) మనం మన జీవితాల్ని యెహోవా సంకల్పానికి అనుగుణ్యంగా మార్చుకుంటే మనం కూడా ఆ నీతిమంతుల్లో ఉంటాము.—1 తిమోతి 4:16.
[అధస్సూచీలు]
a ఈ రెండు మెస్సీయా సంబంధిత ప్రవచనాలను గూర్చిన మరింత వివరణాత్మకమైన సమాచారం కోసం వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రచురించిన నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకంలోని 36, 97 మరియు 98-107 పేజీలు చూడండి.
పునస్సమీక్షకు అంశాలు
◻ సువార్త ప్రకటన ఎందుకు సవాలుతో కూడిన నియామకంగా ఉంది?
◻ క్రైస్తవులు ప్రభుత్వ ఏర్పాట్ల నుండీ, ఉన్న కాస్తంత సామాజిక స్థిరత్వం నుండీ ఏయే మార్గాల్లో ప్రయోజనం పొందారు?
◻ మన ప్రకటన పనిపైన యెహోవా ఆశీర్వాదాలు ఏ భవిష్య సంఘటనల గురించి మనకు హామీనిస్తున్నాయి?