రాజ్య ప్రచారకుల నివేదిక
ఫ్రాన్సులో సాక్షులు ప్రజల వద్దకు వెళ్లడం
ఫ్రాన్సులోని యెహోవాసాక్షులు, 1999 జనవరి 29 శుక్రవారం ఉదయం మొదలుకొని ఆ వారాంతంలో, ఫ్రాన్సువాసులారా, మీరు తప్పుదోవ పట్టించబడుతున్నారు! అనే కరపత్రం 1.2 కోట్ల ప్రతులను వీధుల్లోనూ, ఆ తర్వాత ఇంటింటికి వెళ్లి ఉత్సాహంగా పంచిపెట్టారు. ఎందుకలాంటి ప్రచారం?
ఆ శుక్రవారం ఉదయం పారిస్‌లో ఒక విలేఖరుల సమావేశంలో, ఆ ప్రచారానికి కారణం తెలియజేయడం జరిగింది. సాక్షియైన ఒక ప్రతినిధి ఇలా వివరించారు: “మేమిప్పుడు చేయాలనుకుంటున్నది ఏమిటంటే, మా గురించి మేము తెలియజేసుకుని మా గురించి వ్యాప్తి చేయబడిన నిందాపూర్వకమైన వ్యాఖ్యానాల నోరు నొక్కేయడమే. మేము విమర్శను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము, కాని మేము అబద్ధాలను, మా పేరుప్రతిష్టలను పాడుచేసే వ్యాఖ్యానాలను ఇక ఎంత మాత్రం వినదల్చుకోలేదు.”
యెహోవాసాక్షులు ఫ్రాన్సులో మూడవ అతిపెద్ద క్రైస్తవ మతం అయినప్పటికీ, చాలామంది సాక్షుల పిల్లలు పాఠశాలలో అవమానించబడి, వేధించబడుతున్నారు. పెద్దవాళ్లు తమ ఉద్యోగాలను కోల్పోయారు, తమ మతాన్ని బట్టి బెదిరించబడ్డారు. నమ్మశక్యంకాని విధంగా, వాళ్లు అందుకుంటున్న మతసంబంధమైన విరాళాలపై కూడా 60 శాతం పన్ను విధించబడింది. ఆ ప్రచారం ఈ వివక్షతతో ఎలా వ్యవహరించింది?
“ఫ్రాన్సులో నివసిస్తున్న 2,50,000 మంది యెహోవాసాక్షులు వారి సహచరులు, 1900 నుండి ఫ్రాన్సులో ఉనికిలో ఉన్న తమ క్రైస్తవ మతాన్ని 1995 నుండి ప్రమాదకరమైన తెగలతో కలిపి జమకడుతున్న అన్యాయమైన విధానానికి వ్యతిరేకంగా . . . తాము అనుభవిస్తున్న ఎడతెగని హింసకు వ్యతిరేకంగా తమ అసమ్మతిని తెలియజేస్తున్నారు.” ఫ్రాన్సులోని సాక్షులపై వేయబడిన అపవాదకరమైన నిందలు, వారి గురించి ప్రతికూలమైన ప్రచారం చేయడానికి అపనిందకులు పన్నిన మోసకరమైన విధానాలు బహిర్గతం చేయబడ్డాయి. కరపత్రం ఇలా చెబుతూ ముగుస్తుంది: “నేడు, 20 లక్షలకన్నా ఎక్కువ మంది యెహోవాసాక్షులు, వారి సహచరులు యూరప్‌లో నివసిస్తున్నారు. సువార్త విలువలను ఉన్నతపర్చడం ద్వారా వారు, తాము ఏ దేశ పౌరులుగా ఉన్నారో ఆ దేశ ప్రభుత్వ చట్టాలను గౌరవిస్తారు. ఫ్రాన్సువాసులారా, ఇవీ వాస్తవాలు. అవి నిజంగా ఉన్న విధంగా వాటిని అందజేయడం మా బాధ్యత!”
సత్వరమైన, అనుకూలమైన ప్రతిస్పందన
మొదటి రోజున లక్షలాది కరపత్రాలు అందజేయబడ్డాయి. కేవలం పారిస్‌లోనే, మధ్యాహ్నానికల్లా 7,000 కంటే ఎక్కువమంది సాక్షులు 13 లక్షలకన్నా ఎక్కువ కరపత్రాలను ప్రజల చేతుల్లో పెట్టారు. అంతమంది సాక్షులు వీధుల్లో కరపత్రాలను పంచిపెట్టడాన్ని చూడటం ఆ దేశ ప్రజలకు అదే మొట్టమొదటిసారి. ఈ ప్రచారానికి జాతీయ మరియు స్థానిక వార్తాపత్రికలు, టీవీతో సహా ప్రచార సాధనాలు అనుకూలంగా ప్రతిస్పందించాయి. లె ప్రొగ్రెస్ డె ల్యాన్ అనే వార్తాపత్రిక ఇలా పేర్కొంది: “ఇలా చొరవ తీసుకోవడం . . . ఒక పదాన్ని గురించి ఉన్న అపోహను వెలుగులోకి తెస్తుంది. గత పది సంవత్సరాల్లో, ‘తెగ’ అనే పదం . . . వక్రమైన, ప్రమాదకరమైన, హానికరమైన భావాన్ని సంతరించుకుంది. . . . యెహోవాసాక్షులు సమాజాన్ని కూలదోసేలాంటి ప్రమాదకరమైన నైజం గలవారు కాదు.”
యెహోవాసాక్షుల గురించి తెలిసినవారు వారి శాంతియుతమైన నైజాన్ని, స్థాపించబడిన సామాజిక క్రమం పట్ల వారికి గల ప్రగాఢమైన గౌరవాన్ని ప్రశంసిస్తారు. కాబట్టి, వీధుల్లోని చాలామంది, ప్రచారంలో పాల్గొన్న వేలాదిమంది సాక్షులపట్ల తమ ప్రశంసను, మద్దతును వ్యక్తపర్చారు. కరపత్రాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెల్పుతూ చేయబడిన ఫోన్ కాల్సు, ఫాక్సులు, వ్రాయబడిన ఉత్తరాలు దాదాపు వెనువెంటనే అందాయి. అన్నిటికంటే ముఖ్యంగా, కల్పితమైన, మూర్ఖమైన వ్యాఖ్యానాలకు బదులుగా సాక్షులను గురించిన వాస్తవాలను వినే అవకాశం యథార్థవంతులకు ఇవ్వబడింది, తమ నమ్మకాలకు ద్రోహం చేయబడిన వారు తాము ప్రియంగా ఎంచుతున్న వాటి గురించి తమ భావాలను వ్యక్తపర్చగల్గారు.