బైబిలు అర్థవివరణ—ఎవరి ప్రభావంతో?
“అర్థవివరణ” అంటే వ్యక్తిగత నమ్మకం, అవగాహన, లేక పరిస్థితి వెలుగులో అర్థాన్ని వివరించడమని చాలామంది ఉద్దేశం. కాబట్టి, అర్థవివరణ సాధారణంగా ఆ వ్యక్తి యొక్క పూర్వాపరాలు, విద్య, పెంపకంచే ప్రభావితం చేయబడుతుంది.
అయితే, బైబిలును వివరించటం విషయమేమిటి? మన స్వంత “నమ్మకం, అవగాహన, లేక పరిస్థితికి” అనుగుణ్యంగా బైబిలు వాక్యాలను వివరించే స్వేచ్ఛ మనకుందా? సహజంగానే, చాలామంది బైబిలు పండితులు, అనువాదకులు తాము అలా చేయమనీ, కాని తాము దేవునిచే నడిపించబడుతున్నామనీ చెప్తారు.
దానికి ఒక ఉదాహరణ, 1836లో జాన్ లిన్గార్డ్ “ఒక క్యాథలిక్” అన్న కలంపేరుతో ప్రచురించిన ఎ న్యూ వెర్షన్ ఆఫ్ ద ఫోర్ గాస్పెల్స్లోని యోహాను 1:1కి ఇవ్వబడిన ఒక అధఃస్సూచిలో చెప్పబడిన విషయం. అదిలా చెప్తుంది: “ఏ మతానికి చెందిన వారైనా తమకు గల విలక్షణమైన అభిప్రాయాలకు సాక్ష్యాధారం పరిశుద్ధ లేఖనాల్లో ఉందని నమ్ముతారు: వాస్తవానికి, వాళ్లకు తెలియజేసేది లేఖనం కాదుగానీ వాళ్లే లేఖనానికి తమ స్వంత వివరణను ఇచ్చుకుంటారు.”
విషయం సమంజసమైనదే అయినప్పటికీ, అసలు రచయిత ఉద్దేశం ఏమిటి? ఆ వచనానికి తాను ఏ అర్థం ఇస్తూ అనువదించాడో దానికి మద్దతుగా ఆయన ఆ వ్యాఖ్యానం చేశాడు, ఆ అనువాదం ఇలా ఉంది: “ఆదియందు ‘వాక్యము’ ఉండెను; ‘వాక్యము’ దేవుని యొద్ద ఉండెను; ‘వాక్యము’ దేవుడైయుండెను,” అచ్చమైన త్రిత్వ అనువాదం.
యోహాను 1:1ని త్రిత్వ సిద్ధాంతానికి మద్దతుగా అనువదించడానికి రచయితను ఏమి పురికొల్పింది? ఆయనకు అలా చేయమని ‘తెలియజేసేది లేఖనమా’? అది అసాధ్యం ఎందుకంటే బైబిల్లో ఎక్కడా త్రిత్వ బోధ లేదు. ఈ విషయాన్ని గురించి ద న్యూ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఏమి చెప్తుందో గమనించండి: “త్రిత్వమనే పదం గాని, సుస్పష్టమైన సిద్ధాంతం గాని క్రొత్త నిబంధనలో కనిపించదు.” అంతేగాక, యేల్ విశ్వవిద్యాలయ ప్రొఫెసరైన ఈ. వాష్బర్న్ హాప్కిన్స్ ఇలా పేర్కొన్నాడు: “యేసుకు, పౌలుకు త్రిత్వ సిద్ధాంతం అపరిచితమని స్పష్టమౌతుంది; . . . వాళ్లు దాని గురించి ఏమి చెప్పడం లేదు.”
యోహాను 1:1 గురించైనా లేక బైబిల్లోని మరే ఇతర వచనం గురించైనా త్రిత్వ సంబంధిత వివరణకు మద్దతునిచ్చే వారి గురించి మనం ఏ ముగింపుకు రావచ్చు? మిస్టర్ లిన్గార్డ్ స్వంత సూత్రం ప్రకారం, “వాళ్లకు తెలియజేసేది లేఖనం కాదుగానీ వాళ్లే లేఖనానికి తమ స్వంత వివరణను ఇచ్చుకుంటారు.”
అయితే సంతోషకరంగా ఈ విషయంలో మనకు నడిపింపు నిచ్చేందుకు దేవుని స్వంత వాక్యం ఉంది. అపొస్తలుడైన పేతురు ఇలా చెప్పాడు: “ఒకడు తన ఊహనుబట్టి చెప్పుట [“అర్థవివరణ చేయుట,” NW] వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.”—2 పేతురు 1:20, 21.