బైబిలు ఉద్దేశము
బంధాన్ని ఏర్పర్చే ప్రేమ
ఉత్తర అట్లాంటిక్‌నందు 1978లో, ఒక పెద్ద తుపాను హుందాగా ఉండే క్వీన్ ఎలిజబేత్ 2 అనే ఒక మహాసముద్ర నౌకను అల్లకల్లోలం చేసింది. పది అంతస్థుల భవనమంత ఎత్తు కెరటాలు ఆ నౌకపై విరుచుకుపడ్డాయి, దానితో అది నీటిలో ఒక బెరడులా ఊగిసలాడింది. ఆ నౌక అటూ ఇటూ అతి వేగంగా ఊగిసలాడినప్పుడు సామాన్లు చెల్లాచెదరయ్యాయి, ప్రయాణికులు అటూ ఇటూ పడిపోయారు. ఉన్న 1,200 మంది ప్రయాణికులకు కేవలం స్వల్ప గాయాలు మాత్రమే తగలడం ఎంతో ఘననీయమైన విషయం. మంచి ఇంజినీరింగు, సామగ్రి మరియు నిర్మాణం మూలంగా ఓడ బ్రద్దలు కాలేదు.
శతాబ్దాల క్రితం ఒక విపత్కర తుపానులో మరొక ఓడ చిక్కుకొన్నది. అపొస్తలుడైన పౌలు మరియు 275 మంది ఇతరులు దానిలో ఉన్నారు. తుపాను తీవ్రత మూలంగా ఓడ ముక్క చెక్కలౌతుందన్న భయంతో, నావికులు ఈ వ్యాపార నౌక స్థూలభాగం నిర్మింపబడిన చెక్క పలకలు గట్టిగా పట్టి ఉండేందుకు ఓడకు ఒక వైపునుండి మరొక వైపుకు ఓడ క్రిందనుండి “త్రాళ్లు” బిగించారు. ఓడను కాపాడలేకపోయారు గానీ దాని ప్రయాణికులందరూ క్షేమంగా మిగిలారు.—అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయం.
జీవితంలోని కష్టాలు కొన్నిసార్లు మనం అలజడిగల సముద్రంపై పయనిస్తున్న ఓడలో ఉన్నామేమోనని భావించేలా చేస్తాయి. చింత, నిరాశ మరియు క్రుంగుదల అనే అలలు మన ప్రేమను తుదమట్టుకు పరీక్షిస్తూ, మనల్ని తుడిచిపెట్టవచ్చు. అలాంటి తుపానులను తట్టుకుని, బ్రద్దలుకాకుండా ఉండేందుకు మనకు కూడా కొన్ని సహాయాలు కావాలి.
తుపానులు చెలరేగినప్పుడు
అపొస్తలుడైన పౌలు యొక్క విశ్వాసం మరియు సహనం గురించి బైబిలులో చాలా స్పష్టంగా వ్రాయబడివుంది. ఆయన తొలి క్రైస్తవ సంఘాల నిమిత్తం కష్టించి పనిచేశాడు. (2 కొరింథీయులు 11:24-28) ప్రభువు పనిలో ఆయన పొందిన సాఫల్యాలు తన పొరుగువారి ఎడల ఆయనకున్న మిక్కుటమైన ప్రేమకు మరియు దేవునితో ఆయనకుగల దృఢమైన సంబంధానికి స్పష్టమైన రుజువులనిచ్చాయి. అయినప్పటికీ, పౌలు జీవితం ఎల్లవేళలా సుఖమైన సాగర పయనంలా లేదు. అపొస్తలుడు అక్షరార్థంగా మరియు సూచనార్థకంగా కూడా అనేక తుపానులను ఎదుర్కొన్నాడు.
పౌలు దినాల్లో, ఒక ఓడ అల్లకల్లోలమును సృష్టించే తుపానును ఎదుర్కొన్నప్పుడు, ప్రయాణికులు, ఓడ కాపాడబడటం నావికుల నైపుణ్యంపైన అలాగే ఓడ ఎంత పట్టుత్వాన్ని కలిగి ఉంది అనే దానిపైన ఆధారపడి ఉండేది. అపొస్తలుడు సూచనార్థక తుపానులను ఎదుర్కొన్నప్పుడు కూడా అదే వాస్తవమై ఉండినది. పౌలు భౌతిక లేమిని, ఖైదును మరియు హింసను అనుభవించినప్పటికీ, ఆయన ఆత్మీయ మరియు భావోద్రేక స్థిరతను మరియు ప్రేమ చూపడంలో కొనసాగగల తన సామర్థ్యాన్ని సవాలు చేసిన అతి తీవ్రమైన తుపానులు క్రైస్తవ సంఘంలోనుండే వచ్చాయి.
ఉదాహరణకు, కొరింథు పట్టణంలో సంఘాన్ని స్థాపించేందుకు పౌలు ఒకటిన్నర సంవత్సరాలు అవిశ్రాంత కృషి చేశాడు. కొరింథీయులతో ఆయనకు కలిగిన అనుభవాలు, ఆయన మంద ఎడల అనురాగ భావాలను పెంచుకునేలా చేశాయి. తాను వారికి తండ్రినని కూడా ఆయన అన్నాడు. (1 కొరింథీయులు 4:15) అయినప్పటికీ, ఆ సంఘం కొరకు ఆయన అంత ప్రేమ చూపినప్పటికీ, అంత కృషి చేసినప్పటికీ, కొరింథులోని కొందరు పౌలును దూషిస్తూ మాట్లాడారు. (2 కొరింథీయులు 10:10) స్వయం త్యాగంతో ఆయన వారి కొరకు అన్ని పనులు చేసిన దృష్ట్యా, అది ఎంత నిరుత్సాహకరంగా ఉండి ఉంటుందో కదా!
పౌలు చూపిన అపరిమిత ప్రేమను చవిచూసిన వారు అంత కఠినంగా, అవమానకరంగా ఎలా ఉండగలిగారు? తుపానులో చిక్కుకుని పగిలిపోబోతున్న ఓడవలె తాను కూడా బ్రద్దలు కాబోతున్నట్లు పౌలు భావించి ఉండవచ్చు. ఆయన చేతులెత్తేసి, తన గత ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయని భావించేందుకు లేక విముఖుడైపోయేందుకు పౌలుకు ఎంతో సులభమై ఉండవచ్చు! అయితే పౌలు సహేతుకతను కల్గియుండేలా ఏది సహాయపడింది? నిరాశతో బ్రద్దలు కాకుండా ఉండేందుకు ఆయనను ఏది నివారించింది?
మనలను దగ్గరకు పట్టి ఉంచే ప్రేమ
తనకు శక్తినిచ్చే, పురికొల్పే మూలాన్ని గురించి పౌలు తన పాఠకుల మనస్సుల్లో ఎలాంటి సందేహమూ ఉంచలేదు. ఆయనిలా వ్రాశాడు: ‘క్రీస్తుకు గల ప్రేమ మనలను ప్రేరేపించుచున్నది.’ (2 కొరింథీయులు 5:14) శక్తినిచ్చే, పురికొల్పే అత్యున్నత మూలాన్ని పౌలు సూచించాడు. అలా ప్రేరేపించే శక్తే ‘క్రీస్తుకు గల ప్రేమ.’ ఈ లేఖనాన్ని గురించి ఒక బైబిలు పండితుడు ఈ విధంగా గమనించి చెప్పాడు: “క్రీస్తు ఎడలగల మన ప్రేమ మనం మన పరిచర్యలో కొనసాగేలా చేస్తుందని పౌలు అనడం లేదు . . . అది మధ్యలోనే ఆగిపోతుంది. క్రీస్తు ఎడల మనకుగల ప్రేమ, మన ఎడల ఆయనకున్న ప్రేమ ద్వారా రగిలించబడి, ఎడతెగక కాపాడబడుతుంది.”—ఇటాలిక్కులు మావి.
హింసా కొయ్యపై బాధాకరమైన మరణానికి తనను తాను అప్పగించుకోవడం, తద్వారా విశ్వసించే మానవజాతినంతటినీ రక్షించేందుకు తన పరిపూర్ణ మానవ శరీరాన్ని క్రయధనంగా ఇవ్వడం ద్వారా క్రీస్తు ప్రదర్శించిన ప్రేమ, క్రీస్తు ఆసక్తుల నిమిత్తం మరియు సహోదరుల నిమిత్తం సేవ చేయడంలో కొనసాగేందుకు పౌలును పురికొల్పింది, ప్రేరేపించింది మరియు ఒత్తిడి చేసింది. అలా, క్రీస్తు ప్రేమ పౌలును అదుపు చేసింది, ఆయన్ను స్వార్థం నుండి దూరం చేసింది, మరియు దేవుని సేవలోను తోటి మనిషి సేవలోను తన లక్ష్యాన్ని నిలిపేలా చేసింది.
వాస్తవానికి, ఒక క్రైస్తవుని నమ్మకమైన జీవిత విధానాన్ని పురికొల్పే మూలం కూడా క్రీస్తు ప్రేమే. మనపై భౌతికంగా, భావోద్రేకంగా మరియు ఆత్మీయంగా విపత్కర ప్రభావాన్ని చూపగల సమస్యలను మనం ఎదుర్కొన్నప్పుడు, క్రీస్తు ప్రేమ యొక్క ప్రేరణాశక్తి, కొద్దిపాటి పురికొల్పును పొందినవారు సులభంగా విడిచిపెట్టే స్థాయినుండి మనం ముందుకు పోయేందుకు మనకు వీలు కలిగిస్తుంది. సహించే శక్తిని అది మనకు ఇస్తుంది.
మనల్ని కాపాడేందుకు, పురికొల్పేందుకు మనం మన అసంపూర్ణ భావోద్రేకాలపై ఆధారపడలేము. మనకు వచ్చే సమస్యలు నిరుత్సాహం లేక చింత మూలంగా వచ్చినప్పుడు ఇది ప్రాముఖ్యంగా వాస్తవం. మరో వైపు, మనం మన పరిచర్యకు హత్తుకుని ఉండేలా చేయగల, మనలను కాపాడగల, పురికొల్పగల మన వ్యక్తిగత శోధనకు లొంగిపోకుండునట్లు చేయగల శక్తి క్రీస్తు ప్రేమకు ఉంది. ఇతరులు అపేక్షించే దానికి మాత్రమే కాక బహుశ తన స్వంత అపేక్షలకంటే కూడా ఎక్కువ సహించేందుకు క్రీస్తు ప్రేమ ఒక క్రైస్తవునికి సామర్థ్యాన్నిస్తుంది.
అంతేకాకుండా, క్రీస్తు ప్రేమ సహిస్తుంది గనుక దాని ప్రభావం ఎన్నడూ అంతమొందదు. ఎన్నడూ చెరగని లేక సన్నగిల్లని ప్రేరేపణాశక్తి అది. “ప్రేమ శాశ్వతకాలముండును.” (1 కొరింథీయులు 13:8) ఏది ఎదురైనప్పటికీ ఆయనను నమ్మకంగా అనుసరించేందుకు అది మనకు వీలు కలిగిస్తుంది.
భావోద్రేక సమస్యలు మనలను బ్రద్దలు చేయగల శక్తిని మనపై చూపుతాయి. కాబట్టి, క్రీస్తు మన కొరకు ప్రదర్శించిన ప్రేమను గురించి మనం ధ్యానించడం ఎంత మంచిదో కదా. క్రీస్తు ప్రేమ మనలను ఐక్యపర్చుతుంది. మన విశ్వాసమను ఓడ బ్రద్దలు కాకుండా ఆయన ప్రేమ నివారిస్తుంది. (1 తిమోతి 1:14-19) అంతే కాకుండా, క్రీస్తు ప్రేమ వ్యక్తీకరణను సాధ్యం చేసినవాడైన యెహోవా దేవున్ని ఘనపర్చేందుకు క్రీస్తు ప్రేమ మనలను పురికొల్పుతుంది.—రోమీయులు 5:6-8.