యేసు మీ జీవితాన్ని ఎలా మార్చగలడు?
యేసుక్రీస్తు దాదాపు 2,000 సంవత్సరాల క్రితం పాలస్తీనాలో జీవించిన ఒక గొప్ప బోధకుడు. ఆయన బాల్యం గురించి ఎక్కువగా తెలియదు. అయితే, ఆయన దాదాపు 30 ఏళ్ల వయస్సులో, ‘సత్యాన్ని గురించి సాక్ష్యమిచ్చే’ తన పరిచర్యను ప్రారంభించాడని ధృవీకరించబడింది. (యోహాను 18:37; లూకా 3:21-23) ఆయన జీవిత వృత్తాంతాలను వ్రాసిన నలుగురు శిష్యులూ ఆ తర్వాతి మూడున్నర సంవత్సరాల గురించే ఎక్కువగా వ్రాశారు.
యేసుక్రీస్తు తన పరిచర్యలో, ప్రపంచంలోని అనేకానేక రుగ్మతలకు విరుగుడు కాగల ఒక ఆజ్ఞను తన శిష్యులకిచ్చాడు. అదేమిటి? యేసు ఇలా చెప్పాడు: “మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను.” (యోహాను 13:34) అవును, మానవజాతి ఎదుర్కుంటున్న అనేక సమస్యలకు పరిష్కారం ప్రేమే. మరో సందర్భంలో, ఆజ్ఞల్లోకెల్లా గొప్పది ఏదని యేసును అడిగినప్పుడు, ఆయనిలా సమాధానమిచ్చాడు: “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.”—మత్తయి 22:37-40.
దేవుడ్ని, తోటి మానవుల్ని ఎలా ప్రేమించాలో యేసు మాటల ద్వారా క్రియల ద్వారా మనకు చూపించాడు. మనం కొన్ని ఉదాహరణలను పరిశీలించి, ఆయన నుండి మనం ఏమి నేర్చుకోవచ్చో చూద్దాం.
ఆయన బోధలు
చరిత్రలోకెల్లా పేరుపొందిన ప్రసంగాలైన ఒక దాంట్లో, యేసుక్రీస్తు తన అనుచరులకు ఇలా చెప్పాడు: “ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు.” (మత్తయి 6:24) మన జీవితాల్లో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలన్న యేసు బోధ, డబ్బే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందని అనేకులు నమ్మే ఈ రోజుల్లో కూడా ఆచరణాత్మకమైనదేనా? నిజమే, జీవనం సాగించడానికి మనకు డబ్బు అవసరమే. (ప్రసంగి 7:12) అయినప్పటికీ, “సిరి” మన యజమానిగా ఉండటానికి మనం అనుమతిస్తే, “ధనాపేక్ష” మన మొత్తం జీవితంపై ఆధిపత్యం చేస్తూ మనల్ని అదుపు చేస్తుంది. (1 తిమోతి 6:9, 10) ఈ ఉరిలో చిక్కుకున్న అనేకులు తమ కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని, చివరికి తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు.
మరో వైపున, మన యజమానిగా దేవుని నడిపింపు కోసం చూడటం మన జీవితానికి అర్థాన్ని చేకూరుస్తుంది. సృష్టికర్తగా ఆయనే జీవానికి మూలం, కాబట్టి, ఆయన మాత్రమే మన ఆరాధనకు అర్హుడు. (కీర్తన 36:9; ప్రకటన 4:10) ఆయన లక్షణాల గురించి తెలుసుకుని ఆయనను ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలు గైకొనడానికి పురికొల్పబడతారు. (ప్రసంగి 12:13; 1 యోహాను 5:3) అలా చేయటం ద్వారా, మనం మనకు మనమే ప్రయోజనం చేకూర్చుకుంటాము.—యెషయా 48:17.
కొండమీది ప్రసంగంలో, తోటి మానవుల పట్ల ప్రేమ ఎలా చూపించాలో కూడా యేసు తన శిష్యులకు బోధించాడు. “కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి” అని ఆయన చెప్పాడు. (మత్తయి 7:12) ఇక్కడ యేసు ఉపయోగించిన “మనుష్యులు” అనే పదం ఒకరి శత్రువులను సహితం చేర్చుకుంటుంది. అదే ప్రసంగంలో ఆయనిలా చెప్పాడు: “మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థనచేయుడి.” (మత్తయి 5:43, 44) అలాంటి ప్రేమ, నేడు మనం ఎదుర్కుంటున్న అనేక సమస్యలను పరిష్కరించదా? పరిష్కరిస్తుందని మోహన్‌దాస్ గాంధీ తలంచాడు. ఆయనిలా అన్నట్లు చెప్పబడుతుంది: “క్రీస్తు ఈ కొండమీది ప్రసంగంలో చెప్పిన బోధలను [మనం] అన్వయించుకుంటే, . . . మనం యావత్ ప్రపంచ సమస్యలను పరిష్కరించి ఉండేవాళ్లం.” ప్రేమ గురించి యేసు చేసిన బోధలను అన్వయించుకుంటే, మానవజాతి వేదనలనేకం పరిష్కరించబడగలవు.
ఆయన క్రియలు
ప్రేమ ఎలా చూపించాలనే విషయంలో యేసు అద్భుతమైన సత్యాలను బోధించడమే గాక తాను బోధించినదాన్ని ఆయన ఆచరించాడు కూడా. ఉదాహరణకు, ఆయన తన స్వంత ఆసక్తులకన్నా ఇతరుల ఆసక్తులకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. ఒక రోజు యేసు, ఆయన శిష్యులు ప్రజలకు సహాయం చేయటంలో ఎంతగా నిమగ్నమైవున్నారంటే వాళ్లకు భోజనం చేయడానికి కూడా సమయం దొరకలేదు. తన శిష్యులు కొంత విశ్రాంతి తీసుకోవలసిన అవసరం ఉందని ఆయన గ్రహించి, వాళ్లసు ఒక ఏకాంత స్థలానికి తీసుకువెళ్లాడు. కాని వాళ్లు అక్కడికి చేరేసరికి, తమ కోసం అప్పటికే ఎదురు చూస్తున్న జనసమూహాన్ని వాళ్లు చూశారు. మీకు కొంత విశ్రాంతి అవసరమని మీరనుకుంటున్న సమయంలో మీరు ఇంకా పని చేయాలని అపేక్షించే ప్రజలను చూసి మీరు ఎలా ప్రతిస్పందించి ఉండేవారు? యేసు, “వారిమీద కనికరపడి, వారికి అనేక సంగతులను బోధింపసాగెను.” (మార్కు 6:34) ఇతరులపట్ల యేసుకున్న ఈ శ్రద్ధ వారికి సహాయం చేయటానికి ఆయనను ఎల్లప్పుడూ పురికొల్పింది.
యేసు ప్రజలకు బోధించడం కంటే వారికోసం ఎక్కువే చేశాడు. ఆయన వాళ్లకు ఆచరణాత్మకమైన సహాయాన్ని అందజేశాడు. ఉదాహరణకు, ఒక సందర్భంలో, పొద్దుపోయేంత వరకు ఆయన చెప్పేది వింటూ ఉండిపోయిన 5,000 కంటే ఎక్కువమందికి ఆయన భోజనం పెట్టాడు. దాని తర్వాత కొద్దికాలానికే, ఆయన మరో పెద్ద సమూహానికి ఆహారాన్ని అనుగ్రహించాడు, ఈసారి 4,000 కంటే ఎక్కువమంది ఉన్నారు, వీళ్లంతా మూడు రోజులపాటు ఆయన చెప్పేది వింటూ ఉన్నందున వీళ్ల దగ్గర తినడానికి ఏమీ లేదు. మొదటి సందర్భంలో ఆయన ఐదు రొట్టెలు రెండు చేపలను, తర్వాతి సందర్భంలో ఏడు రొట్టెలు కొన్ని చిన్న చేపలను ఉపయోగించాడు. (మత్తయి 14:14-22; 15:32-38) అద్భుతాలా? అవును, ఆయన అద్భుతాలు చేశాడు.
యేసు రోగులైన అనేకమందిని కూడా స్వస్థపరిచాడు. ఆయన గ్రుడ్డివారిని, కుంటివారిని, కుష్ఠురోగులను, చెవిటివారిని స్వస్థపరిచాడు. అంతెందుకు, ఆయన మృతులను సహితం తిరిగి లేపాడు! (లూకా 7:22; యోహాను 11:30-45) ఒకసారి ఒక కుష్ఠురోగి, “నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని” ఆయనను వేడుకున్నాడు. యేసు ఎలా ప్రతిస్పందించాడు? “ఆయన కనికరపడి, చెయ్యచాపి వానిని ముట్టి—నాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను.” (మార్కు 1:40, 41) అలాంటి అద్భుతాల ద్వారా పీడితుల పట్ల యేసు తనకున్న ప్రేమను ప్రదర్శించాడు.
యేసు చేసిన అద్భుతాలను నమ్మడం మీకు కష్టంగా ఉందా? కొంతమందికి అలాగే ఉంటుంది. యేసు తన అద్భుతాలను బహిరంగంగానే చేశాడని గుర్తుంచుకోండి. ప్రతి సందర్భంలోనూ ఆయనలో తప్పులు పట్టుకోవాలని ప్రయత్నించిన ఆయన వ్యతిరేకులు కూడా, ఆయన అద్భుతాలు చేశాడన్న విషయాన్ని కాదనలేక పోయారు. (యోహాను 9:1-34) అంతేగాక, ఆయన చేసిన అద్భుతాలకు ఒక సంకల్పం ఉంది. ఆయన దేవునిచే పంపబడినవాడని ప్రజలు గుర్తించేలా అవి చేశాయి.—యోహాను 6:14.
అద్భుతాలు చేయడం ద్వారా యేసు ఇతరుల అవధానాన్ని తన వైపుకు మళ్లించుకోవాలని చూడలేదు. బదులుగా, తన శక్తికి మూలమైన దేవుడ్ని ఆయన మహిమపర్చాడు. ఒకసారి ఆయన కపెర్నహూములో, ప్రజలతో నిండిన ఇంట్లో ఉన్నాడు. పక్షవాయువుగల ఒక వ్యక్తి స్వస్థత పొందాలని కోరుకున్నాడు గాని లోపలకు ప్రవేశించలేకపోయాడు. కాబట్టి అతని స్నేహితులు పైకప్పును విప్పదీసి మంచంతో సహా అతన్ని క్రిందికి దించారు. వాళ్ల విశ్వాసాన్ని చూసి, యేసు ఆ పక్షవాయువుగల వ్యక్తిని స్వస్థపరిచాడు. ఫలితంగా ప్రజలు “దేవుని మహిమపరచి,” “మనమీలాటి కార్యములను ఎన్నడును చూడలేదని” చెప్పుకున్నారు. (మార్కు 2:1-4, 11, 12) యేసు చేసిన అద్భుతాలు ఆయన దేవుడైన యెహోవాకు ఘనతను తెచ్చి, అవసరంలో ఉన్నవారికి సహాయం చేశాయి.
అయితే, రోగులను అద్భుతరీతిగా స్వస్థపర్చడమన్నదే యేసు పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. యేసు జీవిత వృత్తాంతాన్ని వ్రాసిన ఒక వ్యక్తి ఇలా వివరించాడు: “యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.” (యోహాను 20:31) నమ్మే వ్యక్తులు జీవం పొందగలిగేలా యేసు భూమి మీదికి వచ్చాడు.
ఆయన బలి
‘యేసు భూమి మీదికి వచ్చాడా? ఎక్కడి నుండి వచ్చాడు?’ అని మీరు అడగవచ్చు. యేసు తానే ఇలా చెప్పాడు: “నా యష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని.” (యోహాను 6:38) దేవుని అద్వితీయ కుమారునిగా ఆయన మానవపూర్వ ఉనికిని కల్గివున్నాడు. మరి ఆయనను భూమి పైకి పంపినవాని చిత్తం ఏమైవుంది? సువార్త రచయితల్లో ఒకరైన యోహాను ఇలా చెప్తున్నాడు: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహాను 3:16) ఇదెలా సాధ్యమైంది?
మరణం మానవజాతి తప్పించుకోలేని అనుభవంగా ఎలా తయారైందో బైబిలు తెలియజేస్తుంది. మొదటి మానవ జంట నిరంతరం జీవించే ఉత్తరాపేక్షతో దేవుని నుండి జీవాన్ని పొందింది. అయితే, వాళ్లు తమ సృష్టికర్తకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి ఎంపిక చేసుకున్నారు. (ఆదికాండము 3:1-19) మొదటి మానవ పాపమైన ఈ చర్య వల్ల, ఆదాము హవ్వల సంతానం అనాహ్వానిత మరణ వారసత్వాన్ని సంతరించుకుంది. (రోమీయులు 5:12) మానవజాతికి నిజమైన జీవితాన్ని ఇవ్వడానికి, పాప మరణాలు నిర్మూలించబడాలి.
ఏ శాస్త్రవేత్తా ఏ విధమైన జెనటిక్ ఇంజినీరింగ్ ద్వారానైనా మరణాన్ని తప్పించలేడు. అయినప్పటికీ, విధేయులైన మానవులు నిరంతరం జీవించగలిగేలా వారిని పరిపూర్ణతకు తీసుకువచ్చే శక్తి మానవజాతి సృష్టికర్తకు ఉంది. బైబిల్లో ఈ ఏర్పాటు విమోచన క్రయధనం అని పిలువబడుతుంది. మొదటి మానవ జంట తమను, తమ సంతానాన్ని పాప మరణాల దాసత్వానికి అమ్ముకుంది. వాళ్లు దేవునికి విధేయులై ఉండవలసిన పరిపూర్ణ మానవ జీవితాన్ని, ఏది తప్పు ఏది ఒప్పు అనేదాని విషయంలో తమ స్వంత నిర్ణయాలను చేసుకుంటూ దేవుని నుండి స్వతంత్రంగా ఉండే జీవితానికి మారుగా విక్రయించారు. పరిపూర్ణ మానవ జీవితాన్ని తిరిగి కొనడానికి, మన మొదటి తల్లిదండ్రులు పోగొట్టుకున్న పరిపూర్ణ మానవ జీవితానికి సమానమైన మూల్యాన్ని చెల్లించాలి. అపరిపూర్ణతను సంతరించుకున్న మానవులు ఆ మూల్యాన్ని చెల్లించడానికి యోగ్యులు కాదు.—కీర్తన 49:7.
కాబట్టి సహాయం చేయడానికి యెహోవా దేవుడు జోక్యంచేసుకున్నాడు. తన అద్వితీయ కుమారుని పరిపూర్ణ జీవాన్ని, యేసుకు జన్మనిచ్చిన ఒక కన్యక గర్భానికి మార్చాడు. కన్యక జన్మనివ్వడాన్ని గురించిన తలంపును దశాబ్దాల క్రితమైతే మీరు నిరాకరించి ఉండేవారే. అయితే నేడు, శాస్త్రజ్ఞులు సస్తనజాతి జంతువులను క్లోన్ చేసి, ఒక జంతువులో నుండి జన్యువులను తీసి మరో జంతువులోకి ప్రవేశపెట్టారు. మానవ సంతానాన్ని ఉత్పత్తి చేసేందుకు సాధారణ పద్ధతినిగాక మరో విధానాన్ని ఉపయోగించేందుకు సృష్టికర్తకుగల సామర్థ్యాన్ని న్యాయంగా ఎవరు ప్రశ్నించగలరు?
పరిపూర్ణ మానవ జీవం ఉనికిలోకి రావడంతో, మానవజాతిని పాపమరణాల నుండి విమోచించే మూల్యం లభ్యమైంది. అయినప్పటికీ, భూమి మీద యేసుగా జన్మించిన శిశువు, మానవజాతి రుగ్మతలను స్వస్థపర్చడానికి “వైద్యాన్ని” చేకూర్చగలిగేలా “వైద్యునిగా” ఎదగాలి. పరిపూర్ణమైన, పాపరహితమైన జీవితాన్ని గడపడం ద్వారా ఆయనిది చేశాడు. పాపం క్రిందనున్న మానవజాతి అనుభవిస్తున్న వేదనను చూడటం మాత్రమే కాదుగాని యేసు, మానవునిగా ఉండటంలోని శారీరక పరిమితులను కూడా అనుభవించాడు. ఇది ఆయనను మరింత కనికరంగల వైద్యునిగా చేసింది. (హెబ్రీయులు 4:15) ఆయన భూమి మీది తన జీవితంలో చేసిన ఈ అద్భుతమైన స్వస్థతలు, రోగులను స్వస్థపర్చాలన్న కోరిక, శక్తి రెండూ ఆయనకున్నాయని నిరూపించాయి.—మత్తయి 4:23.
భూమి మీద మూడున్నర సంవత్సరాలపాటు పరిచర్య చేసిన తర్వాత, యేసును ఆయన వ్యతిరేకులు చంపేశారు. ఎంత పెద్ద శ్రమలు వచ్చినప్పటికీ పరిపూర్ణ మానవుడు సృష్టికర్తకు విధేయుడై ఉండగలడని ఆయన చూపించాడు. (1 పేతురు 2:22) ఆయన బలిగా అర్పించిన పరిపూర్ణ మానవ జీవం, మానవజాతిని పాప మరణాల నుండి విమోచించగల విమోచన క్రయధనమైంది. యేసుక్రీస్తు ఇలా చెప్పాడు: “తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగల వాడెవడును లేడు.” (యోహాను 15:13) యేసు తన మరణం తర్వాత మూడవ దినాన ఆత్మ జీవితానికి పునరుత్థానం చేయబడ్డాడు, యెహోవా దేవునికి విమోచన క్రయధనాన్ని అర్పించడానికి కొన్ని వారాల తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమైపోయాడు. (1 కొరింథీయులు 15:3, 4; హెబ్రీయులు 9:11-14) అలా చేయడం ద్వారా, యేసు తన విమోచన క్రయధన బలి విలువను, తనను అనుసరించే వారికి అన్వయించగలిగాడు.
ఆధ్యాత్మిక, భావోద్రేక, శారీరక రుగ్మతల ఈ విధమైన స్వస్థత నుండి ప్రయోజనం పొందాలని మీరు ఇష్టపడుతున్నారా? అలా చేయడానికి మీకు యేసు క్రీస్తునందు విశ్వాసం అవసరం. మీకై మీరు వైద్యుని దగ్గరికి ఎందుకు రాకూడదు? యేసుక్రీస్తు గురించి, విశ్వాసులైన మానవజాతిని రక్షించడంలో ఆయన పాత్ర గురించి తెలుసుకోవడం ద్వారా మీరలా చేయవచ్చు. మీకు సహాయం చేయడానికి యెహోవాసాక్షులు ఎంతో సంతోషిస్తారు.
[5వ పేజీలోని చిత్రం]
యేసుకు రోగులను స్వస్థపరిచే కోరిక, శక్తి రెండూ ఉన్నాయి
[7వ పేజీలోని చిత్రం]
యేసు మరణం మీపై ఎలా ప్రభావాన్ని చూపుతుంది?