యేసుక్రీస్తును ఎందుకు విశ్వసించాలి?
“క్రైస్తవులు కాని చాలామంది ప్రజలు కూడా ఆయన ఒక గొప్ప జ్ఞానవంతుడైన బోధకుడని విశ్వసిస్తారు. కచ్చితంగా ఆయన, జీవించిన వారిలోకెల్లా అత్యంత ఎక్కువ ప్రభావాన్ని చూపించిన వ్యక్తి.” (ద వరల్డ్ బుక్ ఎన్సైక్లోపీడియా) “ఆయన” ఎవరు? క్రైస్తవమత స్థాపకుడైన యేసుక్రీస్తు.
అయితే, ఎన్సైక్లోపీడియా ఏమి చెప్తున్నప్పటికీ, ప్రాచ్య దేశాల్లోనూ మరితర ప్రాంతాల్లోనూ ఉన్న కోట్లాదిమందికి యేసుక్రీస్తు అపరిచితుడు, కేవలం ఉన్నత-పాఠశాల పాఠ్యపుస్తకాల్లో ఆయన పేరును చదివినట్లు వాళ్లకు జ్ఞాపకం ఉండవచ్చు. క్రైస్తవమత సామ్రాజ్య చర్చీల్లో కూడా, తమకు నిజంగా యేసు తెలియదని చెప్పే వేదాంతులు, మతనాయకులు ఉన్నారు, వాళ్లు బైబిల్లో ఇప్పటికీ వ్రాయబడివున్న ఆయన జీవితాన్ని తెలియజేసే నాలుగు వృత్తాంతాల (సువార్తల) నిజత్వాన్ని సందేహిస్తారు.
సువార్త రచయితలు యేసు జీవిత కథను సృష్టించి ఉండవచ్చా? ఎంతమాత్రం కాదు! పేరుపొందిన చరిత్రకారుడైన విల్ డ్యూరాంట్ సువార్త వృత్తాంతాలను విశ్లేషించిన తర్వాత, ఇలా వ్రాశాడు: “ఒకే తరంలోని సామాన్యులైన కొంతమంది అంత శక్తివంతమైన ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని, అంత ఉన్నతమైన నైతిక సూత్రావళిని, అంత ప్రేరణాత్మకమైన మానవ సహోదరత్వ భావనను కనిపెట్టడం, సువార్తలలో వ్రాయబడివున్న ఏ అద్భుతంకంటే కూడా నమ్మశక్యం కానిదై ఉంటుంది. రెండు శతాబ్దాల ఉన్నత శ్రేణి విమర్శ తర్వాత, క్రీస్తు జీవితం, గుణం, బోధలను గురించిన స్థూలదృష్టి చెప్పుకోదగినంత స్పష్టంగా మిగిలివుంది, పాశ్చాత్య మానవుని చరిత్రలో అత్యంత అద్భుతమైన అంశంగా అవతరించింది.”
అయినప్పటికీ, యేసుక్రీస్తు అనుచరులమని చెప్పుకుంటున్న వారు చేసినదాన్ని బట్టి ఆయన తమ అవధానాన్ని పొందడానికి అర్హుడు కాదని తిరస్కరించేవారూ ఉన్నారు. ‘వాళ్లు నాగసాకి మీద ఆటంబాంబు వేశారు. జపాన్లోని అనేక నగరాల్లో కంటే నాగసాకిలోనే ఎక్కువమంది క్రైస్తవులున్నారు’ అని జపాన్లోని కొందరంటారు. కాని, వైద్యుడిచ్చిన సలహాను రోగి పాటించకపోతే, రోగి అనారోగ్యానికి మీరు వైద్యుడ్ని నిందిస్తారా? క్రైస్తవులమని చెప్పుకుంటున్న అనేకమంది ప్రజలు, మానవజాతి రుగ్మతలను నిర్మూలించడానికి యేసు ఇచ్చిన సలహాలను ఎంతోకాలంగా అలక్ష్యం చేశారు. అయినప్పటికీ, యేసు మన అనుదిన సమస్యలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవజాతి వేదనలకు పరిష్కారాన్ని ఇచ్చాడు. అందుకే, తర్వాతి శీర్షిక చదివి, ఆయన ఎలాంటి వ్యక్తియై ఉన్నాడో మీరే స్వయంగా తెలుసుకోమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.