కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 6/1 పేజీలు 28-31
  • పౌలు జతపనివారు—ఎవరెవరు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పౌలు జతపనివారు—ఎవరెవరు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రయాణ సహచరులు, ఆతిథ్యమిచ్చిన స్త్రీపురుషులు
  • స్నేహితుల గొప్ప సమూహం
  • ఖైదులో ఉన్నప్పుడు యథార్థతతో కూడిన మద్దతు
  • “మేము దేవుని జతపనివారమై యున్నాము”
  • “పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వడం
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
  • ధైర్యంగా ఉండండి—మీకు సహాయం చేసేది యెహోవాయే
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • “ఎవరి రక్తం విషయంలోనూ నేను దోషిని కాను”
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
  • రోమాలో పౌలు
    నా బైబిలు కథల పుస్తకము
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 6/1 పేజీలు 28-31

పౌలు జతపనివారు—ఎవరెవరు?

బైబిలు పుస్తకమైన అపొస్తలుల కార్యములులోను, పౌలు వ్రాసిన ఉత్తరాల్లోను, ‘అన్యజనులకు అపొస్తలుడైన’ పౌలుతో వ్యక్తిగత పరిచయంవున్న దాదాపు వందమంది మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘ సభ్యుల పేర్లు ప్రస్తావించబడ్డాయి. (రోమీయులు 11:13, 14) వారిలో చాలామందిని గురించి మనకు చాలా తెలుసు. అపొల్లో, బర్నబా, సీలల కార్యకలాపాల్ని గురించి బహుశ మీకు తెలిసివుండవచ్చు. మరోవైపు చూస్తే అర్ఖిప్పు, క్లౌదియ, దమరి, పుదే, పెర్సిసు, లిను, సోపత్రు అనే వారిని గురించి అంతగా చెప్పలేకపోవచ్చు.

వేర్వేరు సమయాల్లో, వేర్వేరు పరిస్థితుల్లో అనేకమంది వ్యక్తులు పౌలు చేస్తున్న పరిచర్యకు మద్దతునిచ్చేందుకు ఎంతో క్రియాశీలమైన పాత్రను పోషించారు. అరిస్తార్కు, తిమోతి, లూకా వంటివారు కొందరు ఈ అపొస్తలునితో చాలా సంవత్సరాలు సన్నిహితంగా సేవచేశారు. ఆయన ఖైదులో ఉన్నప్పుడు కొందరు ఆయనతో ఉన్నారు. లేదా ఆయన ఒక చోటినుంచి మరోచోటికి వెళ్తున్నప్పుడు ఆయనతో ప్రయాణ సహచరులుగానో లేక అతిథేయులుగానో ఉన్నారు. విచారకరంగా అలెక్సంద్రు, దేమా, ఫుగెల్లు, హెర్మొగెనే వంటి ఇతరులు క్రైస్తవ విశ్వాసంలో పట్టుదలతో కొనసాగలేదు.

అసుంక్రితు, పిలొలొగు, యూలియా, హెర్మే అనే పేర్లుగల ఇతర పౌలు స్నేహితుల విషయానికి వస్తే మనకు వారి గురించి వారి పేర్లకుమించి ఏమీ తెలియదు. అలాంటి వారు ఇంకా చాలామంది ఉన్నారు. నేరియ సహోదరి గురించిగాని, రూఫు తల్లి గురించిగాని, క్లోయె ఇంటివారి గురించైతే ఆ కాస్త కూడా తెలియవు. (రోమీయులు 16:13-15; 1 కొరింథీయులు 1:11) ఏదేమైనా, వందకు పైచిలుకు ఉన్న ఈ వ్యక్తుల గురించి మనకు తెలిసిన కొద్ది సమాచారాన్ని పరిశీలించడం, అపొస్తలుడైన పౌలు పనిచేసిన తీరుపై వెలుగును ప్రసరింపజేస్తుంది. అనేకమంది తోటి విశ్వాసులు మన చుట్టూ ఉండడం, వారితో కలిసి దగ్గరగా పనిచేయటంలో ఉన్న ప్రయోజనాల గురించి కూడా మనకు అలా పరిశీలించడం తెలియజేస్తుంది.

ప్రయాణ సహచరులు, ఆతిథ్యమిచ్చిన స్త్రీపురుషులు

అపొస్తలుడైన పౌలు పరిచర్య నిమిత్తం విస్తృతంగా ప్రయాణించవలసి వచ్చింది. కేవలం అపొస్తలుల కార్యములు పుస్తకంలో నమోదు చేయబడిన దాని ప్రకారం చూస్తే ఆయన నేలమీద, సముద్రంపైనా ప్రయాణించిన దూరం దాదాపు 16,000 కిలోమీటర్లు వరకు ఉంటుందని ఒక రచయిత లెక్కవేస్తున్నాడు. ఆ కాలంలో ప్రయాణం అలసటతో కూడినది మాత్రమే కాదు, ప్రమాదకరమైనది కూడాను. ఓడ బ్రద్దలుకావడం, నదులవలనైన ఆపదలు, అరణ్యములో ఆపదలు, సముద్రములో ఆపదలు వంటివి పౌలు ఎదుర్కొన్న ప్రమాదాల్లో కొన్ని మాత్రమే. (2 కొరింథీయులు 11:25, 26) అందుకనే ఒకచోటి నుండి మరోచోటికి వెళ్తున్నప్పుడు పౌలు ఒంటరిగా ఉన్న సందర్భాలు చాలా తక్కువ.

పౌలుతోపాటు ఉన్నవారు పరిచర్యలో ఆయనకు సాహచర్యం, ప్రోత్సాహం, ఆచరణయోగ్యమైన సహాయం అందించారు. కొన్ని సందర్భాల్లో తనతోపాటు వస్తున్న వారిని ఆయా ప్రాంతాల్లో ఏర్పడిన క్రొత్త విశ్వాసుల ఆధ్యాత్మిక అవసరాలను చూసుకోవడానికి వారిని అక్కడే విడిచిపెట్టాడు. (అపొస్తలుల కార్యములు 17:14; తీతు 1:5) భద్రత కోసం, ప్రయాణంలో ఇమిడివుండే కష్టనష్టాలను ఎదుర్కోవడానికి మద్దతు కోసం సహచరులు ఉండటం బహుశ కీలకమై ఉంది. కాబట్టి, పౌలుతో కూడ ఉన్న ప్రయాణ సహచరులుగా మనకు తెలిసిన సోపత్రు, సెకుందు, గాయి, త్రోఫిము అనేవారు ఆయన పరిచర్యను విజయవంతం చేసేందుకు ఎంతో కీలకమైన పాత్రను పోషించివుంటారు.—అపొస్తలుల కార్యములు 20:4.

ఆతిథ్యమిచ్చిన స్త్రీపురుషుల సహాయం ఏమాత్రం తక్కువ కాదు. తాను ప్రకటనా పని చేయాలని లేదా ఒక రాత్రికి మాత్రం బసచేయాలని ఉద్దేశించిన ఒక నగరంలోనికి పౌలు ప్రవేశించినప్పుడు అన్నింటికన్నా ముందు తలదాచుకునే స్థలం కోసం వెదకడం జరిగేది. పౌలు చేసినంత విస్తారమైన ప్రయాణాలు చేసే వ్యక్తి వేర్వేరు స్థలాల్లో పడుకోవల్సిరావటం తప్పనిసరి. ఆయన పూటకూళ్ల ఇంట్లో ఉండగలిగేవాడే, కానీ ఇవి “ప్రమాదకరమైన, అసహ్యమైన స్థలాలు” అని చరిత్రకారులు వర్ణిస్తున్నారు, అందుకని సాధ్యమైన చోటల్లా పౌలు బహుశ తోటి విశ్వాసులతోనే బసచేసి ఉంటాడు.

పౌలుకు ఆతిథ్యమిచ్చిన స్త్రీపురుషుల పేర్లు కొన్ని మనకు తెలుసు—అకుల ప్రిస్కిల్ల, గాయి, యూసోను, లూదియ, మ్నాసోను, ఫిలేమోను, ఫిలిప్పు. (అపొస్తలుల కార్యములు 16:14, 15; 17:7; 18:2, 3; 21:8, 16; రోమీయులు 16:23; ఫిలేమోను 1, 22) ఫిలిప్పీ, థెస్సలొనీక, కొరింథుల్లో ఆ విధంగా బసచేయడం మూలంగా పౌలుకు తన మిషనరీ కార్యకలాపాల్ని సంస్థీకరించుకోవడానికి చక్కని కేంద్రంగా పనిచేశాయి. కొరింథులో, ఈ అపొస్తలుడు తన ప్రకటనా పనిని కొనసాగించేందుకు తీతియు యూస్తు కూడా పౌలుకోసం తన ఇంటి ద్వారాలను తెరిచాడు.—అపొస్తలుల కార్యములు 18:7.

స్నేహితుల గొప్ప సమూహం

పౌలు వారిని వేర్వేరు పరిస్థితుల్లో కలవడం మూలంగా ఆయన సహచరులను మనం వేర్వేరు విధాల్లో జ్ఞాపకం ఉంచుకుంటాము. ఉదాహరణకు త్రుపైనా, త్రుఫోసా, పెర్సిసు, ఫీబే, మరియ అనేవారందరూ పౌలు తోటి స్త్రీ విశ్వాసులు. వారి ప్రయాసలకూ కష్టపడి చేసిన వారి పనినిబట్టి వారు మెచ్చుకోబడ్డారు. (రోమీయులు 16:1, 2, 6, 12) క్రిస్పు, గాయి, స్తెఫను ఇంటివారికి పౌలు బాప్తిస్మమిచ్చాడు. ఏథెన్సులో దియొనూసియు, దమరి అనేవారు పౌలు నుండి సత్యవాక్యాన్ని స్వీకరించారు. (అపొస్తలుల కార్యములు 17:34; 1 కొరింథీయులు 1:14, 16) “అపొస్తలులలో ప్రసిద్ధికెక్కిన” అంద్రొనీకు, యూనీయకు అనేవారు పౌలుకన్నా ఎక్కువకాలం నుండి విశ్వాసులుగా ఉన్నారు, వీరిని ఆయన “నా తోడి ఖైదీలు” అని పిలిచాడు. బహుశ వారు ఆయనతో పాటు ఏదో సందర్భంలో ఖైదులో ఉండివుండవచ్చు. యాసోను, లూకియ, సోసిపత్రు, హెరోదియోనుల వలెనే వీరిద్దరినీ కూడా పౌలు తన “బంధువుల”ని పిలిచాడు. (రోమీయులు 16:7, 11, 21) ఇక్కడ ఉపయోగించబడిన గ్రీకు పదానికి “తోటి దేశస్థులు” అనే అర్థం ఉన్నా, “ఒకే తరంలోని రక్త సంబంధీకులు” అన్నది దాని ప్రాథమిక అర్థం.

పౌలు స్నేహితుల్లో చాలామంది సువార్త నిమిత్తం ప్రయాణాలు చేశారు. ఆయన సహచరులని మనకు బాగా తెలిసిన వారికి తోడు, తమ సంఘ ఆధ్యాత్మిక స్థితిని గూర్చి పౌలుతో చర్చించడానికి కొరింథు నుండి ఎఫెసుకు ప్రయాణించిన అకాయికు, ఫొర్మూనాతు, స్తెఫను అనేవారు కూడా ఉన్నారు. క్రేతు అనే ద్వీపంలో సేవ చేస్తున్న తీతును కలవడానికి అర్తెమా, తుకికు సిద్ధంగా ఉన్నారు, జేనా అపొల్లోతోపాటు ప్రయాణించనైయున్నాడు.—1 కొరింథీయులు 16:17; తీతు 3:12, 13.

చిన్న చిన్న వివరాలైనా మనల్ని ఎంతగానో ఆకర్షించే వివరాల్ని కొంతమందిని గూర్చి పౌలు మనకు అందిస్తున్నాడు. ఉదాహరణకు, ఎపైనెటు ‘ఆసియలో ప్రథమఫలము’ అనీ, ఎరస్తు కొరింథులోని ‘పట్టణపు ఖజానాదారుడు’ అనీ, లూకా వైద్యుడనీ, లూదియ ఊదారంగు పొడిని అమ్ముతుందనీ, తెర్తియు అనే వ్యక్తిని రోమీయులకైన తన పత్రికను వ్రాయడానికి పౌలు ఉపయోగించుకున్నాడనీ మనకు తెలుస్తుంది. (రోమీయులు 16:5, 22, 23; అపొస్తలుల కార్యములు 16:14; కొలొస్సయులు 4:14) ఈ వ్యక్తుల గురించి ఇంకా ఎక్కువ తెల్సుకోవాలనుకునే ఎవరికైనా ఈ చిన్న వివరాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

పౌలు సహచరుల్లో ఇతరులు ఆయన వద్దనుండి వ్యక్తిగత సందేశాల్ని అందుకున్నారు, ఇవిప్పుడు బైబిలులో పొందుపర్చబడ్డాయి. ఉదాహరణకు, తాను కొలొస్సయులకు వ్రాసిన పత్రికలో పౌలు అర్ఖిప్పుకు ఇలా ఉద్బోధించాడు: “ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిగూర్చి జాగ్రత్త పడు[ము].” (కొలొస్సయులు 4:17) యువొదియ, సుంటుకేల మధ్య పరిష్కరించుకోవల్సిన వ్యక్తిగత మనస్పర్థలు ఏవో ఉన్నాయని అవగతమౌతుంది. అందుకని, పౌలు ఫిలిప్పీలోని పేరు తెలియని ఒక ‘సహకారి’ ద్వారా “ప్రభువునందు ఏకమనస్సుగలవారై యుండుడని” పురికొల్పాడు. (ఫిలిప్పీయులు 4:2, 3) తప్పకుండా ఇది మనందరికీ చక్కని సలహా.

ఖైదులో ఉన్నప్పుడు యథార్థతతో కూడిన మద్దతు

పౌలు అనేకసార్లు ఖైదులో ఉన్నాడు. (2 కొరింథీయులు 11:23) ఈ సందర్భాల్లో స్థానిక క్రైస్తవులు ఎవరైనా ఉన్నప్పుడు ఆయన మరింత సహనశీలంగా ఉండడానికి తప్పకుండా తమకు సాధ్యమైనంతా చేసివుంటారు. పౌలు రోములో మొదటిసారి ఖైదీగా ఉన్నప్పుడు, రెండు సంవత్సరాలు తాను అద్దె ఇంటిలో ఉండేందుకు అనుమతించబడ్డాడు, తన స్నేహితులు తనను సందర్శించడానికి అనుమతించబడ్డాడు. (అపొస్తలుల కార్యములు 28:30) ఆ కాలంలో ఆయన ఎఫెసు, ఫిలిప్పీ, కొలొస్సయిలలోని సంఘాలకూ అలాగే ఫిలేమోనుకూ పత్రికలను వ్రాశాడు. పౌలు తను నిర్బంధంలో ఉన్నప్పుడు ఆయనకు అంటిపెట్టుకుని ఉన్నవారిని గురించి ఇవి మనకు ఎంతో సమాచారాన్నిస్తాయి.

ఉదాహరణకు, ఫిలేమోను దగ్గరి నుండి పారిపోయిన బానిసయైన ఒనేసిము రోములో పౌలును కలిశాడని మనకు తెలుస్తుంది. తుకికు కూడా అలాగే పౌలును రోములో కలిసి ఒనేసిముతోపాటు అతని యజమాని దగ్గరకు తిరుగు ప్రయాణం చేశాడు. (కొలొస్సయులు 4:7-9) మరో ఉదాహరణగా, తన సంఘం నుండి ఒక కానుకను తీసుకుని ఫిలిప్పీనుండి ఎంతో దూరం ప్రయాణం చేసివచ్చి, తర్వాత అనారోగ్యానికి గురైన ఎపఫ్రొదితు ఉన్నాడు. (ఫిలిప్పీయులు 2:25; 4:18) రోములో పౌలుతో సన్నిహితంగా పనిచేసిన అరిస్తార్కు, మార్కు, యూస్తు అనే యేసు ఉన్నారు, వీరిని గూర్చి పౌలు ఇలా చెప్పాడు: “వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జతపనివారై యున్నారు, వీరివలన నాకు ఆదరణ కలిగెను.” (కొలొస్సయులు 4:10, 11) విశ్వసనీయులుగా ఉన్న వీరితోపాటు అందరికీ తెలిసిన తిమోతి, లూకా, అటుతర్వాత ఇహలోక ప్రేమ మూలంగా పౌలును విడనాడిన దేమా ఉన్నారు.—కొలొస్సయులు 1:1; 4:14; 2 తిమోతి 4:10; ఫిలేమోను 24.

వీరిలో ఎవ్వరూ రోమీయులు కారన్నట్లుగానే కనబడుతుంది, అయినా వారు పౌలుకు అండగా నిలిచివున్నారు. బహుశ కొందరు ఆయన ఖైదులో ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఆయనకు సహాయం చేయడానికే వెళ్లివుంటారు. కొందరు పౌలు అవసరాల నిమిత్తం చిన్న చిన్న పనులు చేయడమో, ఇంకొందరు సుదూర ప్రయాణాల్ని చేయడమో, మరికొందరు పౌలు పత్రికలను వ్రాయడమో చేశారనడంలో సందేహంలేదు. వీరందరికీ పౌలు పట్ల దేవుని పట్ల వారికున్న ప్రేమా యథార్థతలు ఎంత లోతుగా ఉన్నాయన్నదానికి ఇది ఎంత బలమైన సాక్ష్యం!

పౌలు వ్రాసిన పత్రికల్లోని కొన్నింటి ముగింపుల నుండి, ఆయన బహుశ క్రైస్తవ సహోదరీ సహోదరుల గొప్ప సమూహంతో ఆవరించి ఉన్నాడనీ, వారి సంఖ్య మనకు తెల్సిన కొద్ది పేర్ల సంఖ్యను మించిపోతుందనీ మనం గ్రహించగలము. వేర్వేరు సందర్భాల్లో, “పరిశుద్ధులందరు మీకు వందనములు చెప్పుచున్నారు” అనీ లేదా “నాయొద్ద ఉన్నవారందరు నీకు వందనములు చెప్పుచున్నారు” అనీ ఆయన వ్రాశాడు.—2 కొరింథీయులు 13:13; తీతు 3:15; ఫిలిప్పీయులు 4:22.

హతసాక్షిగా మారే పరిస్థితి ఉన్న తన రెండవ ఖైదు సమయంలో పౌలు మనస్సులో ఆయన తోటి పనివారే ఉన్నారు. వారిలో కనీసం కొందరి కార్యకలాపాల్ని పర్యవేక్షించడమో లేదా సమన్వయపర్చడమో ఇంకా చేస్తూనే ఉన్నాడు. తీతు, తుకికు మిషనరీ పనుల్లో పంపబడ్డారు, క్రేస్కే గలతీయకు వెళ్లాడు, ఎరస్తు కొరింథులోనే ఉండిపోయాడు, త్రోఫిము రోగియై మిలేతులోనే ఉండిపోయాడు, కానీ మార్కు తిమోతిలు ఆయన్ను చూడడానికి రానైయున్నారు. అయితే, లూకా పౌలుతోనే ఉన్నాడు, పౌలు తిమోతికి రెండవ పత్రిక వ్రాసినప్పుడు, అక్కడే ఉన్న యుబూలు, పుదే, లిను, క్లౌదియలతో పాటు అనేకులైన ఇతర విశ్వాసులు వందనములు చెప్పారు. వీరందరూ నిస్సందేహంగా పౌలుకు సాధ్యమైనంత సహాయం చేస్తునే ఉన్నారు. అదే సమయంలో పౌలు తానే ప్రిస్కిల్ల అకులలకు, ఒనేసిఫొరు ఇంటివారికి వందనములు తెలిపాడు. విషాదకరంగా ఈ శ్రమల కాలంలో దేమా పౌలును విడనాడాడు, అలెక్సంద్రు ఆయనకు ఎంతో కీడు తలపెట్టాడు.—2 తిమోతి 4:9-21.

“మేము దేవుని జతపనివారమై యున్నాము”

పౌలు తన ప్రకటనా పనిలో చాలా తక్కువసార్లే ఒంటరిగా ఉన్నాడు. “అనేకమంది సహవాసులు ఉన్న ఒక మిషనరీగా మన మనస్సుల్లో ఒక చిత్రం ఏర్పడుతుంది. నిజంగానే పౌలు సహవాసులు లేకుండా కనబడడం చాలా తక్కువ” అని వ్యాఖ్యానకర్త అయిన ఇ. ఎర్ల్‌ ఎల్లిస్‌ అంటున్నాడు. దేవుని పరిశుద్ధాత్మ నడిపింపులో పౌలు అనేకమంది ప్రజల్ని పురికొల్పగలిగాడు, అనేక మిషనరీ కార్యకలాపాల్ని సంస్థీకరించగలిగాడు. సన్నిహితులైన భాగస్వాములు, తాత్కాలికంగా ఉన్న సహాయకులు, కొందరు బలమైన వ్యక్తిత్వాలు గలవారు, అనేకమంది నమ్రతగల సేవకులు ఆయన్ను ఆవరించి ఉన్నారు. అయినా, వీరందరూ కేవలం తోటి పనివారు మాత్రమే. వారు పనిచేసిన పరిధి ఎంతైనా, పౌలుతో ఎంతమేరకు సహవసించినా వారి మధ్య ఉన్న క్రైస్తవ ప్రేమా, వారి మధ్య ఉన్న స్నేహమూ కొట్టొచ్చినట్లు కనబడుతుంది.

“స్నేహితుల్ని సంపాదించడంలో అపారమైన ప్రజ్ఞ” అపొస్తలుడైన పౌలుకు ఉందని చెప్పబడింది. ఆయన సువార్తను అన్య జనుల వద్దకు తీసుకువెళ్లడానికి ఎంతో కృషి చేశాడు, కానీ తానొక్కడే దాన్ని చేయడానికి ప్రయత్నించలేదు. ఆయన సంస్థీకరించబడిన క్రైస్తవ సంఘంతో పూర్తిగా సహకరించి దాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాడు. సాధించిన ఫలితాలకు ఎటువంటి గుర్తింపునూ కోరుకోలేదు కానీ నమ్రతగా తాను ఒక దాసుడని గుర్తించుకుని ఘనత యావత్తు అభివృద్ధికి కారణమైన దేవునికి మాత్రమే చెందాలని అన్నాడు.—1 కొరింథీయులు 3:5-7; 9:16; ఫిలిప్పీయులు 1:1.

నేడు మన కాలాలు పౌలు కాలాలకన్నా భిన్నమైనవి, అయినప్పటికీ నేడు క్రైస్తవ సంఘంలో ఎవరూ కూడా తను స్వతంత్రునిగా ఉండగలడనీ లేదా ఉండాల్సిన అవసరం ఉందనీ తలంచరాదు. బదులుగా, మనం ఎల్లప్పుడు దేవుని సంస్థతో, మన స్థానిక సంఘంతో మన తోటి విశ్వాసులతో పనిచేస్తూ ఉండాలి. మనకు మంచి కాలాల్లోనూ దుర్దశల్లోనూ వారి సహాయం, మద్దతు, ఆదరణ అవసరం. ‘లోకమందున్న సహోదరుల సమూహం’లో భాగంగా ఉండే అమూల్య ఆధిక్యత మనకు ఉంది. (1 పేతురు 5:9) మనం విశ్వసనీయంగా ప్రేమపూర్వకంగా వారందరితో భుజభుజాలు కలిపి పనిచేస్తే అప్పుడు పౌలు వలే మనం కూడా “మేము దేవుని జతపనివారమై యున్నాము” అని చెప్పగలము.—1 కొరింథీయులు 3:9.

[31వ పేజీలోని చిత్రాలు]

అపొల్లో

అరిస్తార్కు

బర్నబా

లూదియ

ఒనేసిఫొరు

తెర్తి

తుకికు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి