ప్రతి ఒక్కరూ స్వతంత్రులుగా ఉంటారు
“మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షతకొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణకలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచబడెను [“వ్యర్థతకు లోనుచేయబడింది,” NW]. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచునున్నదని యెరుగుదుము.”—రోమీయులు 8:18-22.
రోమ్‌లోని క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు వ్రాసిన ఉత్తరంలోనుండి తీసుకున్న ఈ భాగంలో, జీవితాల్లో నిజమైన స్వేచ్ఛ ఎందుకు కొరవడుతోందో, జీవితాల్లో శూన్యభావమూ బాధా ఎందుకు అలుముకుంటున్నాయో అన్నవాటికి కారణాన్ని ఆ మాటల్లో ఆయన సంగ్రహంగా స్పష్టంగా చెబుతున్నాడు. మనం నిజమైన స్వాతంత్ర్యాన్ని ఎలా పొందవచ్చో కూడా ఆయన వివరిస్తున్నాడు.
“ఇప్పటి కాలపు శ్రమలు”
పౌలు “మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని” అంటున్నప్పుడు, ఆయన ఈ నాటి శ్రమలను తక్కువ చేసి చెప్పడంలేదు. పౌలు కాలంలోనూ అటుతర్వాత కూడా క్రైస్తవులు, మానవహక్కుల్ని ఏమాత్రం పట్టించుకోని రోమా అధికారుల నిరంకుశత్వం క్రింద ఎన్నో విపరీతమైన బాధల్ని అనుభవించారు. క్రైస్తవులు ప్రభుత్వానికి శత్రువులు అన్న అభిప్రాయం రోమ్‌కు ఒక్కసారి ఏర్పడిన తర్వాత అది వారిని చాలా క్రూరమైన అణచివేతకు గురిచేసింది. చరిత్రకారుడైన జె. ఎమ్. రాబర్ట్స్ ఇలా అంటున్నాడు: “రాజధానిలో [రోమ్‌లో] ఉన్న అనేకమంది క్రైస్తవులు ఎరీనాలో ఘోరంగా నాశనమయ్యారు, లేదా వారు సజీవంగా దహనం చేయబడ్డారు.” (షార్టర్ హిస్టరీ ఆఫ్ ద వరల్డ్) నీరో హింసలకు గురైన వారిని గురించి మరో నివేదిక ఇలా చెబుతుంది: “కొంతమందిని మ్రానుపై వ్రేలాడదీశారు, కొంతమందికి జంతు చర్మాలు కుట్టించి వారిని కుక్కలు వేటాడేలా చేశారు, కొంతమందికి కీలు పూసి చీకటిపడినప్పుడు వెలుతురు ఇవ్వడానికి సజీవ కాగడాల్లా ఉపయోగించబడ్డారు.”—న్యూ టెస్టమెంట్ హిస్టరీ, ఎఫ్. ఎఫ్. బ్రూస్.
ఆ తొలి క్రైస్తవులు అటువంటి అణచివేత నుండి విముక్తి పొందడానికి నిశ్చయంగా ఇష్టపడేవుంటారు, కానీ అలా పొందేందు కోసం యేసుక్రీస్తు బోధలను ఉల్లంఘించడానికి సుముఖత చూపలేదు. ఉదాహరణగా చెప్పాలంటే, పరిపాలిస్తున్న రోమా అధికారులకూ జీలట్‌లవంటి యూదా స్వాతంత్ర్య సమరయోధులకూ మధ్య జరిగిన పోరాటంలో వారు పూర్తిగా తటస్థంగా ఉండిపోయారు. (యోహాను 17:16; 18:36) జీలట్‌ల దృష్టిలో “దేవుని యుక్తకాలం వరకూ వేచివుండడం అనే మాటలు అప్పటి పరిస్థితికి తగినవికావు.” “శత్రువైన” రోమ్‌కు విరుద్ధంగా హింసాయుత చర్యలు తీసుకోవడమే” చేయవలసిన పని అని వాళ్ళన్నారు. (న్యూ టెస్టమెంట్ హిస్టరీ) తొలి క్రైస్తవులు భిన్నంగా ఆలోచించేవాళ్ళు. వారి దృష్టిలో “దేవుని యుక్తకాలం వరకూ వేచివుండడం” అనేది ఒకే ఒక్క వాస్తవికమైన ఎంపిక. “ఇప్పటి కాలపు శ్రమల”కు శాశ్వతంగా ముగింపును తీసుకువచ్చి, నిజమైన నిరంతరమైన స్వాతంత్ర్యాన్ని తీసుకురావడానికి దేవుడు జోక్యం చేసుకోవడం మినహా వేరే మార్గం ఏమీ లేదని వారు పూర్తి నిశ్చయతతో ఉన్నారు. (మీకా 7:7; హబక్కూకు 2:3) అయితే, అదెలా సంభవిస్తుందో పరిశీలించే ముందు, “సృష్టి” అసలు ఎందుకు ‘వ్యర్థతకు లోనుచేయబడిందో’ పరిశీలిద్దాం.
“వ్యర్థతకు లోనుచేయబడింది”
ఇక్కడ “సృష్టి” అనే పదానికి అర్థం కొందరు చెబుతున్నట్టుగా “జంతువులూ, జీవంలేని సృష్టీ” కాదని, “సమస్త మానవజాతి” అని ద ఎంఫాటిక్ డయాగ్లట్‌లో బెంజమిన్ విల్సన్ చెబుతున్నాడు. (పోల్చండి కొలొస్సయులు 1:23.) ఆ పదం పూర్తి మానవ కుటుంబాన్ని—స్వాతంత్ర్యం కోసం పరితపించే మనందరినీ సూచిస్తుంది. మనం మన ఆది తల్లిదండ్రుల చర్యల మూలంగా ‘వ్యర్థతకు లోనుచేయబడ్డాము.’ ఈ సంఘటనలు జరిగింది, “[మనం] స్వేచ్ఛగా” ఇష్టపడడం మూలంగాకాదు, లేదా మనం వ్యక్తిగతంగా ఎంపిక చేసుకోవడం ఫలితంగా కాదు. మన ఈ పరిస్థితిని మనం వారసత్వంగా పొందాము. లేఖనాల దృష్టికోణంలో చూస్తే, “మానవుడు స్వతంత్రుడుగా జన్మించాడు” అని రూసో చెప్పినది తప్పు. మనలో ప్రతి ఒక్కరం పాపం యొక్క, అపరిపూర్ణత యొక్క దాస్యంలో జన్మించాము, వైఫల్యంతోనూ వ్యర్థత్వంతోనూ నిండిపోయివున్న వ్యవస్థకు బానిసలమయ్యాము.—రోమీయులు 3:23.
ఎందుకిలా జరిగింది? ఎందుకంటే, మన ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వలు ‘దేవునివలె’ ఉండాలనీ, స్వయంగా నిర్ణయించుకునే సంపూర్ణ హక్కు కావాలనీ ఏది మంచో ఏది చెడో తామే నిర్ణయించుకోవాలనీ ఆశించారు. (ఆదికాండము 3:5) వారు స్వాతంత్ర్యాన్ని గురించిన ఒక ప్రాథమిక అంశాన్ని విస్మరించారు. అదేమిటంటే, కేవలం సృష్టికర్తకు మాత్రమే సంపూర్ణ స్వాతంత్ర్యం ఉంటుంది. ఆయనే విశ్వ సర్వాధికారి. (యెషయా 33:22; ప్రకటన 4:11) మానవ స్వాతంత్ర్యం అనేది తప్పకుండా పరిమితుల్లో ఉండే స్వాతంత్ర్యమే. అందుకనే శిష్యుడైన యాకోబు “స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమము” శాసించాలని తన కాలంలోని క్రైస్తవులను ప్రోత్సహించాడు.—యాకోబు 1:25.
సహేతుకంగానే యెహోవా తన విశ్వ కుటుంబంలోనుండి ఆదాము హవ్వలను వెళ్ళగొట్టాడు, ఫలితంగా వారు మరణించారు. (ఆదికాండము 3:19) కానీ వారి సంతానం మాటేమిటి? వాళ్లు తమ సంతానానికి కేవలం అపరిపూర్ణతను, పాపాన్ని, మరణాన్ని మాత్రమే వారసత్వంగా ఇవ్వగల్గినప్పటికీ యెహోవా వారు పిల్లలకు జన్మనిచ్చేందుకు కరుణతో అనుమతించాడు. ఆ విధంగా “మరణము అందరికిని సంప్రాప్తమాయెను.” (రోమీయులు 5:12) ఆ భావంలో ‘సృష్టి వ్యర్థతకు లోనయ్యేలా’ దేవుడు అనుమతించాడు.
“దేవుని కుమారుల ప్రత్యక్షత”
“దేవుని కుమారుల” కార్యశీలత ద్వారా ఒకరోజు మానవ కుటుంబానికి స్వాతంత్ర్యం పునరుద్ధరించబడుతుంది అన్న “నిరీక్షణ” ఆధారంగానే యెహోవా సృష్టిని వ్యర్థత్వానికి అప్పగించాడు. ఈ ‘దేవుని కుమారులు’ ఎవరు? వారు యేసుక్రీస్తు శిష్యులు, మిగతా “[మానవ] సృష్టి” లాగే పాపమూ అపరిపూర్ణతల దాస్యంలో జన్మించినవారే. వారికి దేవుని స్వచ్ఛమైన, పరిపూర్ణమైన విశ్వ కుటుంబంలో వారసత్వంగా లభించిన స్థానమేదీ లేదు. కానీ యెహోవా వారి కోసం అసాధారణమైనదొకటి చేశాడు. యేసుక్రీస్తు విమోచన క్రయధన బలి ద్వారా ఆయన వారిని వారసత్వంగా పొందిన పాపపు దాస్యం నుండి విముక్తుల్ని చేసి, వారిని “నీతిమంతులుగా” లేక, ఆధ్యాత్మికంగా కడగబడినవారిగా ప్రకటిస్తాడు. (1 కొరింథీయులు 6:11) అటుతర్వాత ఆయన వారిని తన విశ్వ కుటుంబంలోనికి తిరిగి తీసుకుంటూ వారిని ‘దేవుని కుమారులు’గా దత్తత తీసుకుంటాడు.—రోమీయులు 8:14-17.
యెహోవా దత్తత తీసుకున్న కుమారులుగా, వారికి మహిమకరమైన ఆధిక్యత లభిస్తుంది. వారు ‘దేవునికి యాజకులుగాను, భూలోకమందు ఏలుటకుగాను’ యేసుక్రీస్తు ప్రక్కన దేవుని పరలోక రాజ్యంలో అంటే పరలోక ప్రభుత్వంలో భాగంగా ఉంటారు. (ప్రకటన 5:9, 10; 14:1-4) ఇది స్వాతంత్ర్యం, న్యాయం అనే సూత్రాలపై స్థాపించిన ప్రభుత్వం—అణచివేత, నిరంకుశత్వములపై ఆధారపడినది కాదు. (యెషయా 9:6, 7; 61:1-4) ఈ దేవుని కుమారులు ఎంతోకాలం క్రితం వాగ్దానం చేయబడిన ‘అబ్రాహాము సంతానం’ అయిన యేసుకు సహకారులుగా ఉంటారని అపొస్తలుడైన పౌలు అంటున్నాడు. (గలతీయులు 3:16, 26, 29) ఆ హోదాలో వారు దేవుడు తన స్నేహితుడైన అబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడంలో ఒక కీలకమైన పాత్రను పోషిస్తారు. అబ్రాహాము సంతానం ద్వారా “భూలోకములోని జనములన్నియు . . . ఆశీర్వదించబడును” అన్నది ఆ వాగ్దానంలో ఒక భాగం.—ఆదికాండము 22:18.
వారు మానవజాతికి ఏ ఆశీర్వాదాల్ని తెస్తారు? దేవుని ఈ కుమారులు ఆదాము పాపం మూలంగా కలిగిన ఘోరమైన పర్యవసానాలనుండి మానవకుటుంబాన్నంతటినీ విడుదల చేయడంలోనూ, మానవజాతిని పరిపూర్ణతకు పునరుద్ధరించడంలోనూ భాగం వహిస్తారు. “ప్రతి జనములోనుండియు, ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు” వచ్చినవారు యేసుక్రీస్తు విమోచన క్రయధన బలిమీద విశ్వాసం ఉంచడం ద్వారా, హితకరమైన రాజ్య పరిపాలనకు విధేయత చూపడం ద్వారా తమపై తాము ఆశీస్సులను కుమ్మరించుకోగలరు. (ప్రకటన 7:9, 14-17; 21:1-4; 22:1, 2; మత్తయి 20:28; యోహాను 3:16) ఈ విధంగా “సృష్టి యావత్తు” ‘దేవుని పిల్లలు పొందే మహిమగల స్వాతంత్ర్యమును’ తిరిగి అనుభవిస్తుంది. ఇది ఏదో పరిమితమైన తాత్కాలికమైన రాజకీయ స్వాతంత్ర్యం కాదు గానీ, ఇది ఆదాము హవ్వలు దేవుని సర్వాధిపత్యాన్ని తృణీకరించినప్పటినుండి మానవ కుటుంబం మీదికి వచ్చిన బాధలకూ మానసిక క్షోభకూ కారణమైన దానంతటి నుండి లభించే స్వాతంత్ర్యం. అందుకనే మరి, విశ్వసనీయులుగా ఉన్నవారు చేయబోయే మహిమకరమైన సేవతో పోల్చుకుంటే, “ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను” అని అపొస్తలుడైన పౌలు చెప్పగలగడంలో ఆశ్చర్యం లేదు!
“దేవుని కుమారుల ప్రత్యక్షత” ఎప్పుడు ప్రారంభమౌతుంది? చాలా త్వరలోనే, దేవుని కుమారులు ఎవరన్నది యెహోవా అందరికీ స్పష్టపర్చినప్పుడే ప్రారంభమౌతుంది. ఈ స్పష్టపర్చడం ఎప్పుడు జరుగుతుందంటే, ఆ “కుమారులు” ఆత్మ సామ్రాజ్యంలోనికి పునరుత్థానం చేయబడి, దేవుని యుద్ధమైన అర్మగిద్దోనులో భూమ్మీద నుండి దుష్టత్వాన్నీ అణచివేతనూ తీసివేయడంలో యేసుక్రీస్తుతోపాటు భాగం వహించినప్పుడు సంభవిస్తుంది. (దానియేలు 2:44; 7:13, 14, 27; ప్రకటన 2:26, 27; 16:15; 17:14; 19:11-21) తిరుగుబాటునీ, దాని మూలంగా వచ్చిన దుష్టత్వాన్నీ ఎంతో కాలంగా సహిస్తూ వచ్చిన దేవుని సహనం అంతం అయ్యే ఈ “అంత్యదినములలో” మనం చివరికంటా వచ్చేశామనడానికి రోజురోజుకీ అధికమౌతున్న సాక్ష్యాధారాల్ని మన చుట్టూ చూస్తున్నాము.—2 తిమోతి 3:1-5; మత్తయి 24:3-31.
ఇది మాత్రం నిజం, అపొస్తలుడైన పౌలు చెబుతున్నట్లుగా, “సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచునున్న[ది]”—కానీ ఇంకా ఎంతోకాలం కాదు. ఇప్పుడు జీవిస్తున్న లక్షలాదిమంది ‘దేవుడు ఆదినుండి తన పరిశుద్ధ ప్రవక్తలనోట పలికించిన’ ‘అన్నిటి కుదురుబాటును,’ మానవజాతి అంతటికి శాంతిని స్వాతంత్ర్యాన్ని న్యాయాన్ని కుదురుబాటు చేయడంతోసహా చూస్తారు.—అపొస్తలుల కార్యములు 3:21.
చివరికి నిజమైన స్వాతంత్ర్యం
“దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము” అనుభవించాలంటే మీరేమి చేయాలి? “మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులైయుండి సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులను చేయునని” యేసుక్రీస్తు చెప్పాడు. (యోహాను 8:31, 32) అదే స్వాతంత్ర్యానికిగల రహస్యం—క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞలనూ బోధలనూ నేర్చుకుని వాటికి విధేయులు కావడం. అలా చేయడం నేడు కూడా కొంతమేరకు స్వాతంత్ర్యాన్ని తీసుకొస్తుంది. ఎంతో సమీప భవిష్యత్తులో అది క్రీస్తుయేసు పరిపాలన క్రింద పూర్ణ స్వాతంత్ర్యాన్ని తీసుకొస్తుంది. జ్ఞానపూర్వకమైన పని ఏమిటంటే దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడంద్వారా యేసు ‘వాక్యాన్ని’ తెలిసికోవడమే. (యోహాను 17:3) తొలి క్రైస్తవుల్లాగానే క్రీస్తు యొక్క నిజమైన శిష్యుల సంఘముతో క్రియాశీలంగా సహవసించండి. ఆ విధంగా చేయడంద్వారా మీరు, నేడు యెహోవా తన సంస్థద్వారా అందజేస్తున్న స్వతంత్రులను చేసే సత్యాలనుండి ప్రయోజనం పొందవచ్చు.—హెబ్రీయులు 10:24, 25.
మీరు ‘దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు . . . తేరిచూచుచు కనిపెడుతుండగా,’ అపొస్తలుడైన పౌలు తాను పడే బాధలు, అనుభవించే అన్యాయాలు ఇక భరించలేనని అన్పించినప్పటికీ, క్రీస్తు చూపించే సంరక్షణాత్మకమైన శ్రద్ధమీద అందించే మద్దతుమీద ఆయన ఉంచినటువంటి నమ్మకాన్ని మీరు కూడా పెంపొందించుకోవచ్చు. దేవుని కుమారుల ప్రత్యక్షత గురించి చర్చించిన తర్వాత పౌలు, “క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా?” అని అడిగాడు. (రోమీయులు 8:35) అవును, పౌలు కాలంలోని క్రైస్తవులు, రూసో మాటల్లో చెప్పాలంటే అప్పటికింకా ఏదో ఒక రకమైన అణచివేసే “సంకెళ్ళలోనే” ఉన్నారు. వారు “వధకు సిద్ధమైన గొఱ్ఱెల” వలె ‘దినమెల్ల వధింపబడినవారే.’ (రోమీయులు 8:36) ఆ అణచివేత తమను ఓడించేందుకు అనుమతించారా?
“అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము” అని పౌలు వ్రాస్తున్నాడు. (రోమీయులు 8:37) తొలి క్రైస్తవులు అంతగా సహించాల్సివచ్చినా వారు విజయాన్ని పొందారా? అదెలా? ఆ ప్రశ్నకు పౌలు జవాబిస్తూ, “మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తుయేసు నందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను” అని అంటున్నాడు. (రోమీయులు 8:38, 39) మీరు కూడా ఈలోగా అనుభవించాల్సివచ్చే ఏ విధమైన “శ్రమయైనను బాధయైనను హింసయైనను” తట్టుకుని వాటిపై ‘అత్యధిక విజయము పొంద’గలరు. మనము “దాస్యములో నుండి విడిపింపబడి . . . దేవుని పిల్లలు పొందే మహిమగల స్వాతంత్ర్యము”ను త్వరలోనే—చాలా త్వరలోనే—పొందుతామని దేవుని ప్రేమ హామీని ఇస్తుంది.
[6వ పేజీలోని చిత్రాలు]
“సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచునున్నది”
[7వ పేజీలోని చిత్రం]
‘సృష్టి దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందే మహిమగల స్వాతంత్ర్యము పొందును’