స్వతంత్రంగా ఉండాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు
“మానవుడు స్వతంత్రుడుగా జన్మించాడు, కానీ ఎక్కడైనా సంకెళ్ళలోనే ఉన్నాడు” అని ఫ్రెంచి వేదాంతి అయిన జాన్-జాక్ రూసో 1762లో వ్రాశాడు. స్వతంత్రుడుగా జన్మించడం. ఎంత పులకరింతను కలుగజేసే తలంపు! కానీ రూసో అన్నట్లు, చరిత్రంతటిలో కోట్లాదిమంది అసలు స్వాతంత్ర్యాన్నే అనుభవించలేదు. బదులుగా, వారు తమ అణగారిన జీవితాలను “సంకెళ్లలోనే” గడిపారు—తమ జీవితాల్లో కలకాలం నిలిచే సంతోషాన్నీ సంతృప్తినీ దోచుకున్న వ్యవస్థలో బానిసలుగా గడిపారు.
“ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట” జరుగుతుందని నేటికీ కోట్లాదిమంది అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు. (ప్రసంగి 8:9) అధికార వాంఛగల స్త్రీపురుషులు అధికారానికోసమైన వేటలో ఇతరుల స్వాతంత్ర్యాన్ని అణగద్రొక్కడంలో ఏ మాత్రం మానసిక క్షోభను అనుభవించరు. “ఇరవయ్యొక్క ప్రాణాల్ని బలిగొన్న తీవ్రవాదుల గుంపు” అని ఒక సగటు నివేదిక చెబుతుంది. ‘ఏ మాత్రం ఎదిరించలేని నిస్సహాయులైన స్త్రీలను, పిల్లల్ని, వృద్ధుల్నీ చంపుకుంటూ, గొంతుల్ని తెగనరుకుతూ, ఖైదీల తలలో తుపాకీ గుళ్లు పేల్చుకుంటూ, గ్రామాలకు గ్రామాల్నే సర్వనాశనం చేస్తూ, బాంబులతో విధ్వంసం సృష్టిస్తూ స్వైరవిహారం చేసిన’ భద్రతా దళాల “మారణకాండ” గురించి మరో నివేదిక చెబుతుంది.
ప్రజలు స్వాతంత్ర్యాన్ని ప్రగాఢంగా వాంఛించడంలో, అణచివేతనుండి విముక్తులయ్యేందుకు పోరాడడంలో ఆశ్చర్యం లేదు! అయితే విచారకరమైన నిజం ఏమిటంటే, స్వాతంత్ర్యం కోసం ఒకరు చేసే పోరాటంలో తరచూ మరొకరి స్వాతంత్ర్యాన్నీ హక్కుల్నీ కాలరాయడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఎంతోమంది అమాయకులైన స్త్రీలు, పురుషులు, పిల్లలు అనివార్యంగా బలిచేయబడుతున్నారు. ఈ పోరాటాలు చేయవలసినవేననీ, సహేతుకమైనవనీ ప్రకటించడం ద్వారా ఆ హత్యలు “చట్టబద్ధం” అయిపోతున్నాయి. ఒక ఉదాహరణ చెప్పాలంటే, గత సంవత్సరం ఐర్లాండ్‌లోని ఒక చిన్న పట్టణం అయిన ఓమాలో “స్వాతంత్ర్య సమరయోధులు” ఒక కారుబాంబుని పేల్చి అక్కడ నిల్చున్న 29 మంది అమాయకుల్ని హత్య చేశారు, వందలాదిమందిని గాయపర్చారు.
ఇప్పటికీ “సంకెళ్ళలోనే”
పోరాటాలు ముగిసిన తర్వాత ఏమి సాధించినట్లు? “స్వాతంత్ర్య సమరయోధులు” తమ పోరాటాల్లో గెల్చిన తర్వాత, వారికి కొంత స్వాతంత్ర్యం లభించవచ్చు. కానీ, వారు నిజంగానే స్వతంత్రంగా ఉన్నారా? స్వతంత్ర ప్రపంచం అని పిలువబడే దేశాల్లోని అత్యంత స్వేచ్ఛగల సమాజాల్లో సహితం ప్రజలు ఇప్పటికీ బీదరికం, అపరిపూర్ణత, వ్యాధి, మరణం అనే అతి క్రూరమైన యజమానుల “సంకెళ్లలోనే” లేరా? అలాంటివి తనను బానిసగా చేస్తున్నంత కాలం, తను నిజంగా స్వేచ్ఛాజీవియని ఎవరైనా ఎలా అనగలరు?
మానవ చరిత్రంతటిలోనూ నేటికీ కూడా ఎంతోమంది విషయంలోనూ వాస్తవంగా ఉన్నటువంటి జీవితాన్ని ప్రాచీన కాలపు బైబిలు రచయిత అయిన మోషే సరిగ్గా వర్ణించాడు. మనం 70 లేదా 80 సంవత్సరాలు జీవించవచ్చు, “అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే” అని అన్నాడాయన. (కీర్తన 90:10) ఇదసలు ఎప్పటికైనా మారుతుందా? నేడు అనేకమంది అనుభవించే బాధా, భీతీలేని పూర్ణ సంతృప్తితో కూడిన జీవితాల్ని మనమందరం గడపడం ఎన్నడైనా సాధ్యమౌతుందా?
సాధ్యమేనని బైబిలు చెబుతుంది! అది “దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము” గురించి మాట్లాడుతుంది. (రోమీయులు 8:21) మొదటి శతాబ్దంలో రోమ్‌లో ఉన్న క్రైస్తవులకు వ్రాసిన ఒక ఉత్తరంలో అపొస్తలుడైన పౌలు మాట్లాడిన ఆ స్వాతంత్ర్యాన్ని గురించి మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాము. ఈ ఉత్తరంలో పౌలు, మనలో ప్రతి ఒక్కరమూ నిజమైన నిరంతరమైన “మహిమగల స్వాతంత్ర్యము” ఎలా పొందగలమో స్పష్టంగా వివరించాడు.
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
From the book Beacon Lights of History, Vol. XIII