“తుపానులో సముద్రయానానికి బయల్దేరడం”
అటువంటి సాహసానికి పూనుకోవడం ఆ సమయానికి తగినది కాదనీ, మూర్ఖత్వమనీ ప్రమాదాన్ని కోరితెచ్చుకోవడమనీ మీరు అనుకోరా? అయితే కొందరు మాత్రం ఒక అలంకారిక భావంలో అటువంటి స్థితిలోనికి తమను తాము నెట్టుకుంటారు. అదెలా? 17వ శతాబ్దపు ఆంగ్ల రచయిత థామస్ ఫుల్లర్ ఇలా చెప్పాడు: “క్రోధంలో ఉన్నప్పుడు ఏమీ చేయకు. అది తుపానులో సముద్రయానానికి బయల్దేరడంలాంటిది.”
అదుపుతప్పిన కోపంలో ఉన్నప్పుడు ఏదైనా చర్య తీసుకోవడం విషాదకరమైన పరిణామాలకు దారితీయవచ్చు. ఇది బైబిలులో నమోదు చేయబడిన ఒక సంఘటన ద్వారా స్పష్టమౌతుంది. ప్రాచీనకాలంలో షిమ్యోను లేవి అనే ఇద్దరు యాకోబు కుమారులు తమ సహోదరియైన దీనాను మానభంగం చేసినందుకు ప్రతీకారంతో ఉగ్రులై తుపానులా విరుచుకుపడ్డారు. దాని ఫలితంగా సామూహిక హత్యలూ దోపిడీలూ సంభవించాయి. వారి దౌష్ట్యాన్ని గర్హిస్తూ యాకోబు, ‘మీరు నన్ను బాధపెట్టి యీ దేశ నివాసులలో అసహ్యునిగా చేసితిరి’ అని అనడంలో ఆశ్చర్యం లేదు.—ఆదికాండము 34:25-30.
దానికి విరుద్ధమైన చర్యను గైకొనుమని దేవుని వాక్యమైన బైబిలు జ్ఞానయుక్తంగా సిఫారసు చేస్తుంది. అది ఇలా చెబుతుంది: “కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. వ్యసనపడకుము అది కీడుకే కారణము.” (కీర్తన 37:8) ఆ సలహాను పాటించడం గొప్ప పాపాలను చేయకుండా మనల్ని ఆపగలదు.—ప్రసంగి 10:4; సామెతలు 22:24, 25 కూడా చూడండి.