ప్రపంచ శాంతి—ఏ మూలం నుండి?
విద్యామతాలను భౌగోళికరణం చేయడం ప్రపంచ శాంతిని తీసుకొస్తుందా? ఐక్యరాజ్య సమితికి మాజీ సహాయ కార్యదర్శి, 1989లోని యునెస్కో ప్రైజ్ ఫర్ పీస్ ఎడ్యుకేషన్ బహుమతి గ్రహీత అయిన డా. రాబర్ట్ మ్యుల్లర్ కంటున్న కల అది. ద వాంకూవర్ సన్ అనే వార్తాపత్రికలో నివేదించబడినట్లుగా, డా. మ్యుల్లర్ “భూమ్మీదవున్న విద్యార్థులకందరికీ మన గ్రహాన్ని గురించిన, మానవత్వం గురించిన అహింస గురించిన వాస్తవాలనూ విలువలనూ ప్రాథమిక పాఠ్యాంశాలుగా బోధించాలని పూర్తి నమ్మకంతో ఉన్నాడు.” శాంతికోసం అతి శ్రేష్ఠమైన నిరీక్షణగా ఐక్యరాజ్య సమితి గురించి పిల్లలకు ప్రపంచంలోని విద్యాసంస్థలన్ని బోధించే రోజు వస్తుందని ఆయన ఆశతో ఎదురుచూస్తున్నాడు. “ఐక్యరాజ్య సమితిలాంటి ఐక్యమతాలు అనే ఒక క్రొత్త సంస్థలో ప్రపంచంలోని అన్ని మతాలు భాగమై ఉండాలి” అని కూడా ఆయన అభిప్రాయపడుతున్నాడని సన్ నివేదించింది. అప్పుడే “అన్ని మతాల బోధలు అహింసను ప్రోత్సహిస్తాయి.”
ప్రపంచ శాంతి అనేది అసలు వాస్తవరూపం దాలుస్తుందా? తప్పకుండా! కానీ ఏ మానవ వ్యవస్థ ద్వారా కాదు. యథార్థహృదయులు “యెహోవాచేత ఉపదేశము నొందుదురు” అనీ వారికి “అధిక విశ్రాంతి [“శాంతి,” NW] కలుగును” అనీ ఒక దైవప్రేరేపిత రచయిత 2,700కుపైగా సంవత్సరాల క్రితం ప్రవచించినప్పుడు, ఆయన శాంతి కొరకైన విద్యకు అత్యున్నత మూలం ఎక్కడుందో గుర్తించాడు.—యెషయా 54:13.
“సమాధానకర్త” దేవుడేనని బైబిలు చెబుతుంది. (రోమీయులు 16:20) “సమాధానమును [“శాంతిని,” NW] వెదకి దాని వెంటాడవలెను” అనీ, “ఖడ్గములను నాగటి నక్కులుగాను . . . యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టు”మనీ, “యుద్ధము చేయనేర్చుకొన”వద్దనీ యెహోవా తన ప్రజలకు నిర్దేశిస్తుండగా ఒక అద్భుతమైన భౌగోళిక విద్యా కార్యక్రమం ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది.—1 పేతురు 3:11; యెషయా 2:2-4.
వేషధారణ మోసం వంటివాటిమీద కాక సత్యం మీద ఆధారపడివున్న ఆరాధన దేవునికి అంగీకృతము. దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. (మత్తయి 15:7-9; యోహాను 4:23, 24) కేవలం సత్యారాధన మాత్రమే, దేవుని వాక్యానికి పూర్తి అనుగుణ్యంగా ఉన్న ఆరాధన మాత్రమే శాంతి సమైక్యతలతో జీవించే ప్రజల్నీ ఒకరినొకరు ప్రేమించే ప్రజల్నీ ఉత్పన్నం చేయగలదు.—యోహాను 13:35.
ప్రపంచ శాంతిని గురించి దేవుని వాక్యం ఏం చెబుతుందో ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి మేము మిమ్మల్ని ఈ పత్రికను ప్రచురించినవారిని కలువమని ఆహ్వానిస్తున్నాము.