కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 4/1 పేజీలు 9-14
  • మరణానంతర జీవితం—ప్రజలేమి నమ్ముతున్నారు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మరణానంతర జీవితం—ప్రజలేమి నమ్ముతున్నారు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సమాధానాలు ఎన్నెన్నో, ఇతివృత్తం మాత్రం ఒక్కటే
  • సిద్ధాంత ఆవిర్భావం
  • ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యం తూర్పుదిశగా వ్యాపించడం
  • జూడాయిజమ్‌, క్రైస్తవమత సామ్రాజ్యం, ఇస్లామ్‌ మతాల సంగతేమిటి?
  • పునరుత్థానంలో మీ విశ్వాసం ఎంత దృఢంగా ఉంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ప్రాణమునకు మరింత శ్రేష్ఠమైన నిరీక్షణ
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 4/1 పేజీలు 9-14

మరణానంతర జీవితం—ప్రజలేమి నమ్ముతున్నారు?

“మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా?”—యోబు 14:14.

1, 2. తమ ఆప్తులు మరణించినప్పుడు చాలామంది ఎలా ఓదార్పు పొందుతారు?

న్యూయార్క్‌ నగరంలో ఒక అంత్యక్రియల శాలలో, 17 ఏళ్ల అబ్బాయి శవపేటిక చుట్టూ అతని స్నేహితులూ కుటుంబ సభ్యులూ మౌనంగా నిలబడివున్నారు. ఆ అబ్బాయి క్యాన్సర్‌తో లేత ప్రాయంలోనే చనిపోయాడు. హృదయం బ్రద్ధలైపోయిన అతని తల్లి భోరున విలపిస్తూ, “టామీ ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. టామీ పరలోకంలో తనతోపాటు ఉండాలని దేవుడు కోరుకున్నాడు” అని అదే పనిగా అంటోంది. ఆమెకు అదే బోధించబడింది.

2 దానికి దాదాపు 11,000 కిలోమీటర్ల దూరంలో, ఇండియాలోని జామ్‌నగర్‌లో, చనిపోయిన తమ తండ్రి చితికి, ముగ్గురు కుమారుల్లో పెద్దవాడు నిప్పంటిస్తున్నాడు. నిప్పంటుకోగానే బ్రాహ్మణుడు “అమరాత్మ పరమాత్మలో లీనమైపోవుగాక” అంటూ సంస్కృతంలో మంత్రాలు చదువుతున్నాడు.

3. శతాబ్దాలుగా ప్రజలు ఏ ప్రశ్నల గురించి ఆలోచిస్తున్నారు?

3 మరణమెంత వాస్తవమైనదో మనకందరికీ తెలుసు. (రోమీయులు 5:12) మరణమే ముగింపా అని మనం ఆలోచించడం సహజమే. యెహోవా దేవుని ప్రాచీనకాల నమ్మకమైన సేవకుడైన యోబు, చెట్ల సహజ జీవన క్రమాన్ని గురించి ఆలోచించిన తర్వాత, “వృక్షము నరకబడినయెడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేతకొమ్మలు వేయుననియు నమ్మకముకలదు” అని పేర్కొన్నాడు. మరి మనుష్యుల సంగతేమిటి? “మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా?” అని యోబు వాకబు చేశాడు. (యోబు 14:7, 14) శతాబ్దాలుగా, అన్ని సమాజాల్లోని ప్రజలూ, మరణానంతర జీవితం ఉందా? ఉంటే, అది ఎలాంటి జీవితం? వంటి ప్రశ్నల గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. చివరికి, ప్రజలు ఏమి నమ్మడం మొదలెట్టారు? ఎందుకు?

సమాధానాలు ఎన్నెన్నో, ఇతివృత్తం మాత్రం ఒక్కటే

4. మరణానంతర జీవితం గురించి వివిధ మతాల వాళ్లు ఏమి నమ్ముతున్నారు?

4 మనుష్యులు మరణానంతరం పరలోకానికో లేదా నరకానికో వెళతారని చాలామంది నామకార్థ క్రైస్తవులు నమ్ముతారు. మరో వైపున, హిందువులు పునర్జన్మను నమ్ముతారు. ఇస్లామ్‌ మతస్థుల నమ్మకం ప్రకారం, మరణానంతరం ఖయామత్‌ (తీర్పు) దినం ఉంటుంది, అప్పుడు అల్లా ప్రతి వ్యక్తి జీవన విధాన విలువను నిర్ణయించి, ఆయా వ్యక్తుల్ని జెన్నత్‌కు (స్వర్గానికి) లేదా దోజక్‌కు (నరకానికి) పంపిస్తాడు. కొన్ని దేశాల్లో, చనిపోయిన వారిని గురించిన నమ్మకాలు స్థానిక ఆచారాల, నామకార్థ క్రైస్తవ ఆచారాల విచిత్రమైన సమ్మేళనంగా ఉన్నాయి. ఉదాహరణకు శ్రీలంకలో, బౌద్ధుల కుటుంబంలోగానీ క్యాథలిక్‌ల కుటుంబంలోగానీ ఎవరైనా మరణిస్తే, ఇంటి తలుపులనూ కిటికీలనూ బార్లా తెరిచివుంచి, మరణించిన వ్యక్తి పాదాలు తలవాకిలి వైపుకు ఉండేలా శవపేటికను పెడతారు. ఈ చర్యలన్నీ కూడా మరణించిన వ్యక్తి ఆత్మ వెళ్లిపోవడానికి దోహదపడతాయని వాళ్లు నమ్ముతారు. ఎవరైనా మరణించినప్పుడు ఇంట్లో ఉన్న అద్దాలను కప్పివేయడం పశ్చిమాఫ్రికాలోని అనేకమంది క్యాథలిక్‌ల ప్రొటెస్టెంట్‌ల ఆచారం, ఎవరైనా అద్దంలో చూసుకుంటే వారికి ఆ మరణించిన వ్యక్తి ఆత్మ కనిపించకూడదని అలా కప్పివేస్తారు. అటు తర్వాత 40 దినాలు గడిచాక, కుటుంబ సభ్యులూ స్నేహితులూ ఆత్మ పరలోకానికి చేరుకోవడాన్ని వేడుకగా జరుపుకుంటారు.

5. చాలా మతాలు ఏకీభవించే ప్రధాన నమ్మకం ఏది?

5 ఇంత వైవిధ్యం ఉన్నప్పటికీ, అనేక మతాలు కనీసం ఒక విషయంలో ఏకీభవిస్తున్నట్లు కనిపిస్తుంది. అవి మానవునిలో అమర్త్యమైన భాగం ఒకటుందనీ, మరణానంతరం అది ఉనికిలో కొనసాగుతుందనీ నమ్ముతున్నాయి. ఇంచుమించుగా క్రైస్తవమత సామ్రాజ్యానికి చెందిన వందలాది మతాలూ, వర్గాలూ మానవునిలో అమర్త్యమైనదేదో ఉందన్న నమ్మకాన్ని సమర్థిస్తున్నాయి. ఈ నమ్మకం, యూదా మతంలో కూడా అధికారిక సిద్ధాంతమే. అది హిందూ మతంలోని పునర్జన్మ సిద్ధాంతానికి పునాది. మరణానంతరం రూహ్‌ [ఆత్మ] ఉనికిలో కొనసాగుతూనే ఉంటుందని ఇస్లామ్‌ మతస్థులు నమ్ముతారు. ఆస్ట్రేలియాకు చెందిన ఆదివాసులు, ఆఫ్రికాకు చెందిన అనిమిస్ట్‌లు, షింటోలు, బౌద్ధులు, అందరూ ఇదే ఇతివృత్తాన్ని కొంత తేడాతో బోధిస్తారు.

6. మానవుని ఆత్మ అమర్త్యమైనదనే తలంపును కొంతమంది పండితులు ఎలా దృష్టిస్తారు?

6 మరో వైపున, మరణానంతరం సచేతన జీవితం ముగిసిపోతుందని భావించేవాళ్లు ఉన్నారు. వారి దృష్టిలో, మరణానంతరం భావోద్వేగపరమైన మేధోసంబంధమైన అశరీర భాగమేదో దేహం నుండి వేరైపోయి ఉనికిలో కొనసాగుతుందనే తలంపు నిర్హేతుకమైనది. ఆత్మ అమర్త్యమైనదని నమ్మడానికి నిరాకరించిన వారిలో, ప్రాచీనకాల ప్రముఖ తత్త్వవేత్తలైన అరిస్టాటిల్‌, ఎపిక్యూరస్‌, వైద్యుడైన హిప్పోక్రేట్స్‌, స్కాటిష్‌ తత్త్వవేత్త డేవిడ్‌ హూమ్‌, అరేబియన్‌ పండితుడు అవెర్రోస్‌, స్వతంత్ర భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఉన్నారు.

7. ఆత్మ అమర్త్యమైనదనే బోధను గురించి ఏ ప్రాముఖ్యమైన ప్రశ్నలను ఇప్పుడు పరిశీలించాలి?

7 పరస్పర విరుద్ధమైన అలాంటి తలంపులనూ, నమ్మకాలనూ ఎదుర్కుంటున్న మనం ఇలా ప్రశ్నించాలి: నిజంగా మనలో అమర్త్యమైన ఆత్మ ఉందా? లేకపోతే, మరి అలాంటి తప్పుడు బోధ, ఈనాటి అనేక మతాల్లో ఒక అంతర్గత భాగంగా ఎలా తయారైంది? ఆ తలంపు ఎక్కడి నుండి వచ్చింది? ఈ ప్రశ్నలకు మనం సత్యవంతమైన, సంతృప్తికరమైన సమాధానాలను పొందడం తప్పనిసరి. ఎందుకంటే, మన భవిష్యత్తు దానిపైనే ఆధారపడి ఉంది. (1 కొరింథీయులు 15:19) కాని మొదట, ఆత్మ అమర్త్యమైనదనే సిద్ధాంతం ఎలా ప్రారంభమైందో మనం పరిశీలిద్దాం.

సిద్ధాంత ఆవిర్భావం

8. ఆత్మ అమర్త్యమైనదనే బోధను పెంపొందింపజేయడంలో సోక్రటీస్‌, ప్లేటోలు ఏ పాత్ర వహించారు?

8 అమర్త్యమైన ఆత్మ ఉందనే నమ్మకాన్ని పెంపొందింపజేసినవారిలో సా.శ.పూ. ఐదవ శతాబ్దానికి చెందిన గ్రీకు తత్త్వవేత్తలైన సోక్రటీస్‌, ప్లేటోలు మొదటివారని ప్రసిద్ధి గాంచారు. అయినప్పటికీ, దాని మూలకర్తలు మాత్రం వారుకాదు. బదులుగా, వారు ఆ నమ్మకానికి మెరుగులు దిద్ది, తత్త్వ సంబంధమైన ఒక బోధగా మార్చి తద్వారా దాన్ని తమ కాలంనాటి విద్యావంతులకూ, అలాగే ఆ తర్వాత కాలాలకు చెందిన విద్యావంతులకూ మరింత ఆమోదయోగ్యమైనదిగా ఉండేలా చేశారు. వాస్తవమేమిటంటే ప్రాచీన పర్షియాకు చెందిన జొరాష్ట్రియన్లూ, వారికి మునుపున్న ఐగుప్తీయులూ మానవునిలో అమర్త్యమైనదేదో ఉందని నమ్మేవారు. అయితే ప్రశ్నేమిటంటే, ఈ బోధకు మూలమేమిటి?

9. ఐగుప్తు, పర్షియా, గ్రీకుదేశాల ప్రాచీన సాంప్రదాయాలు మూడింటినీ ప్రభావితం చేసిన మూలమేమిటి?

9 “ప్రాచీన లోకంలో, ఐగుప్తు, పర్షియా, గ్రీకుదేశాలపై బబులోను మత ప్రభావం ఉండేది” అని ది రెలీజియన్‌ ఆఫ్‌ బాబిలోనియా అండ్‌ అస్సీరియా అనే పుస్తకం చెప్తుంది. ఐగుప్తీయుల మతనమ్మకాల గురించి ఆ పుస్తకం ఇంకా ఇలా చెప్తుంది: “ఎల్‌-అమర్నా పలకలు వెల్లడిస్తున్నట్లుగా, ఐగుప్తు బబులోనుల మధ్యనున్న తొలి సంబంధాన్ని బట్టి చూస్తే, బబులోను సంబంధ దృక్పథాలూ ఆచారాలూ ఐగుప్తీయుల మతతెగల్లోకి ప్రవేశించడానికి నిశ్చయంగా అనేక అవకాశాలు ఉండేవి.”a ప్రాచీన పర్షియా, గ్రీకు సంప్రదాయాల గురించి కూడా అదే విషయం చెప్పవచ్చు.

10. మరణానంతర జీవితాన్ని గురించి బబులోనీయుల దృక్కోణం ఏమిటి?

10 అయితే మానవునిలో అమర్త్యమైనదేదో ఉందని ప్రాచీన బబులోనీయులు నమ్మేవారా? ఈ విషయంపై, అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన పండితుడైన మోరీస్‌ జస్ట్రో జూనియర్‌ ఇలా వ్రాశాడు: “ఒకసారి ఉనికిలోకి వచ్చినదేదీ ఇక ఉనికిలో లేకుండా పూర్తిగా నాశనమయ్యే సాధ్యతను [బబులోను] ప్రజలుగానీ మతనాయకులుగానీ ఎన్నడూ తలంచలేదు. [వారి దృక్కోణంలో] మరణం మరో రకమైన జీవితానికి ప్రవేశ మార్గమే. [ప్రస్తుత జీవితపు] ఈ జీవితంలో అమర్త్యతను పొందలేకపోవడం, మరణం మరో విధమైన అస్తిత్వంలోకి తీసుకువెళ్తుందన్న విషయాన్ని మరింత ధృవీకరిస్తుంది.” అవును, మరణానంతరం ఏదోక విధమైన జీవితం, ఏదోక రూపంలో కొనసాగుతుందని బబులోనీయులు నమ్మేవారు. మరణానంతరం ఉపయోగించుకోవడానికి వస్తువులను కూడా మృతులతోపాటు పాతిపెట్టడం ద్వారా వారా నమ్మకాన్ని వ్యక్తపర్చారు.

11, 12. జలప్రళయం తర్వాత, మానవునిలో అమర్త్యమైన ఆత్మ ఉందనే సిద్ధాంతానికి జన్మస్థలం ఏది?

11 మానవునిలో అమర్త్యమైనదేదో ఉందనే బోధ ప్రాచీన బబులోనులో ప్రారంభమైందని స్పష్టమౌతుంది. అది గమనార్హమైనదేనా? నిజంగా గమనార్హమైనదే ఎందుకంటే, బైబిలు ప్రకారం, బాబెలు లేక బబులోను నగరాన్ని నోవహు ముని మనుమడైన నిమ్రోదు స్థాపించాడు. నోవహు కాలంనాటి జలప్రళయం తర్వాత, ప్రజలంతా ఒకే భాష మాట్లాడేవారు, అప్పుడు ఒకే మతం ఉండేది. నిమ్రోదు “యెహోవా యెదుట [“యెహోవాకు వ్యతిరేకంగా,” NW] పరాక్రమముగల వేటగాడు” మాత్రమే కాదుగానీ అతడూ అతని అనుచరులూ తమకు తాము “పేరు సంపాదించు”కోవాలని అభిలషించారు. అలా ఆ నగరాన్ని స్థాపించి, అక్కడ ఒక గోపురాన్ని కట్టడం ద్వారా నిమ్రోదు మరో మతాన్ని ప్రారంభించాడు.—ఆదికాండము 10:1, 6, 8-10; 11:1-4.

12 నిమ్రోదు దుర్మరణం పాలయ్యాడని భావించబడుతుంది. గనుక నిమ్రోదు మరణానంతరం, ఆ నగర స్థాపకునిగా, నిర్మాణకునిగా, మొదటి రాజుగా బబులోనీయులు అతడిని ఎంతో ఉన్నతంగా గౌరవించేందుకే సహేతుకంగా మ్రొగ్గు చూపించి ఉంటారు. దేవుడైన మార్దుక్‌ (మెరోదకు) బబులోను స్థాపకునిగా పరిగణింపబడేవాడు గనుకా, అనేకమంది బబులోను రాజులకు అతడి పేరే పెట్టబడింది గనుకా మార్దుక్‌ దేవునిగా చేయబడిన నిమ్రోదుకు ప్రాతినిధ్యం వహిస్తాడని కొంతమంది పండితులు సూచించారు. (2 రాజులు 25:27; యెషయా 39:1; యిర్మీయా 50:2) అదే నిజమైతే, మరణానంతరం ఉనికిలో కొనసాగే అమర్త్యమైనదేదో మానవునిలో ఉందన్న తలంపు కనీసం నిమ్రోదు మరణించే నాటికే ప్రాచుర్యంలో ఉండివుండవచ్చు. ఏదేమైనప్పటికీ, జలప్రళయం తర్వాత, మానవునిలో అమర్త్యమైన ఆత్మ ఉందన్న సిద్ధాంతానికి జన్మస్థలం బాబెలు లేక బబులోను అని చరిత్ర పుటలు చెప్తున్నాయి.

13. ఆత్మ అమర్త్యమైనదనే బోధ భూమియందంతటా ఎలా వ్యాపించింది, దాని ఫలితమేమిటి?

13 బబులోనులో గోపురాన్ని కడుతున్నవారి భాషను తారుమారు చేయడం ద్వారా దేవుడు వారి ప్రయత్నాలకు విఘాతం కలిగించాడని కూడా బైబిలు చూపిస్తుంది. వాళ్లు ఇక ఒకరితో ఒకరు సంభాషించుకోలేక ఆ పనిని మానుకుని, “అక్కడ నుండి భూమియందంతట” చెదిరిపోయారు. (ఆదికాండము 11:5-9) గోపురం కట్టబోయిన వీరి భాష మారిపోయినప్పటికీ, వారి ఆలోచనా విధానమూ భావనలూ మారలేదని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. తత్ఫలితంగా వాళ్లు ఎక్కడికెళ్లితే అక్కడికి వారి మత తలంపులు కూడా వారి వెంట వెళ్లాయి. ఆ విధంగా, ఆత్మ అమర్త్యమైనదనే సిద్ధాంతంతో సహా బబులోను మత సిద్ధాంతాలు భూమియందంతటా వ్యాపించి ప్రపంచంలోని ముఖ్య మతాలకు పునాది అయ్యాయి. అలా ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యం స్థాపించబడింది, అది బైబిల్లో “వేశ్యలకును భూమిలోని ఏహ్యమైనవాటికిని తల్లియైన మహా బబులోను” అని తగిన విధంగానే వర్ణించబడింది.—ప్రకటన 17:5.

ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యం తూర్పుదిశగా వ్యాపించడం

14. బబులోను మతసంబంధ నమ్మకాలు భారత ఉపఖండంలోకి ఎలా వ్యాపించాయి?

14 తెల్లని మేనిఛాయగల ఆర్యులు కొంతమంది 3,500 కంటే ఎక్కువ సంవత్సరాల క్రితం వాయవ్యప్రాంతం నుండి, ఇప్పుడు ప్రాముఖ్యంగా పాకిస్తాన్‌ భారతదేశాలలో నెలకొనివున్న సింధు లోయకు వలస వచ్చారని కొంతమంది చరిత్రకారులు చెప్తారు. అక్కడినుండి వాళ్లు భారతదేశంలోకి ప్రవేశించి, గంగానది పారివాహక ప్రాంతాలకు వచ్చారు. వలస వచ్చిన వారి మత తలంపులు ప్రాచీన ఇరాన్‌ బబులోను దేశాల బోధలపై ఆధారపడి ఉండేవని కొంతమంది నిపుణులు చెప్తారు. కాబట్టి ఈ మత తలంపులు, హిందూ మతానికి ఆధార భూమికలయ్యాయి.

15. ఆత్మ అమర్త్యమైనదనే సిద్ధాంతం ఆధునికకాల హిందూ మతాన్ని ఎలా ప్రభావితం చేయనారంభించింది?

15 ఆత్మ అమర్త్యమైనదనే సిద్ధాంతం, భారతదేశంలో పునర్జన్మ సిద్ధాంతంగా రూపాంతరం చెందింది. మానవులలో ఉన్న చెడుతనాన్ని గూర్చిన, బాధలను గూర్చిన విశ్వసమస్యతో తలమునకలవుతున్న హిందూమత ఋషులు, చివరకు కర్మ సిద్ధాంతానికి అంటే ఏది విత్తితే అదే కోస్తాము అనే సిద్ధాంతానికి చేరుకున్నారు. ఈ బోధను ఆత్మ అమర్త్యమైనదనే నమ్మకంతో కలిపి, వాళ్లు పునర్జన్మ సిద్ధాంతాన్ని రూపొందించారు. దాని ప్రకారంగా, ఒక జన్మలో చేసిన మంచి చెడులను బట్టి మరో జన్మలో ప్రతిఫలమో, శిక్షో లభిస్తుంది. నమ్మకమైన వారి లక్ష్యమేమిటంటే పునర్జన్మల చక్రభ్రమణం నుండి మోక్షం పొంది పరబ్రహ్మలో మమేకమైపోవడమే. శతాబ్దాలు గడుస్తుండగా, హిందూ మతం వృద్ధిచెంది విస్తరించింది, దానితోపాటు పునర్జన్మ సిద్ధాంతం కూడా విస్తరించింది. ఈ సిద్ధాంతం ఆధునికకాల హిందూ మతానికి ప్రధాన ఆధారమైంది.

16. మరణానంతర జీవితాన్ని గూర్చిన ఏ నమ్మకం, తూర్పు ఆసియాలోని అధికశాతం మంది ప్రజల మతసంబంధమైన ఆలోచనా విధానాన్నీ, ఆచారాలనూ అదుపు చేయనారంభించింది?

16 హిందూ మతంలో నుండి బౌద్ధమతం, జైనమతం, సిక్కుమతం వంటి ఇతర మతవిశ్వాసాలు వృద్ధి చెందాయి. ఇవన్నీ కూడా పునర్జన్మ సిద్ధాంతాన్ని విశ్వసిస్తాయి. అంతేగాక, బౌద్ధ మతం, తూర్పు ఆసియాకు చెందిన అనేక దేశాల్లోకి అంటే చైనా, కొరియా, జపాన్‌లలోకి, మరితర దేశాల్లోకి చొచ్చుకుపోతూ ఆ ప్రాంతమంతటిలోని సంస్కృతిని, మతాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. దాని మూలంగా, బౌద్ధమతంలో ఉన్న మూలపాఠాలనూ, అభిచారం, పితృదేవతల ఆరాధన వంటివాటిలో ఉన్న మూల పాఠాలనూ స్వీకరించి, మిశ్రిత విశ్వాసాలను ప్రతిబింబించే మతాలు ఆవిర్భవించాయి. వాటిలో ఎక్కువ ప్రభావవంతమైనవి టోయిజమ్‌, కన్ఫ్యూషనిజమ్‌, షింటో మతాలు. అలా, శరీరం మరణించిన తర్వాత అమర్త్యమైనదేదో ఉనికిలో కొనసాగుతుందనే నమ్మకం, ప్రపంచంలోని ఆ భూభాగమందు నివసిస్తున్న అసంఖ్యాకులైన ప్రజల్లో ఎక్కువమంది మతసంబంధమైన ఆలోచనా విధానాన్నీ, ఆచారాలనూ అదుపు చేయనారంభించింది.

జూడాయిజమ్‌, క్రైస్తవమత సామ్రాజ్యం, ఇస్లామ్‌ మతాల సంగతేమిటి?

17. మరణానంతర జీవితం గురించి ప్రాచీన యూదులు ఏమి విశ్వసించారు?

17 జూడాయిజమ్‌, క్రైస్తవమత సామ్రాజ్యం, ఇస్లామ్‌ మతాలను అనుసరించే ప్రజలు మరణానంతర జీవితం గురించి ఏమి విశ్వసిస్తారు? ఈ మతాల్లో, జూడాయిజమ్‌ ఎంతో ప్రాచీనమైనది. దాని వేర్లు దాదాపు 4,000 సంవత్సరాల క్రిందటి వరకూ అంటే అబ్రాహాము వరకూ వెళ్తాయి. సోక్రటీసు, ప్లేటోలు ఆత్మ అమర్త్యమైనదనే సిద్ధాంతానికి రూపం ఇవ్వక ముందుటి కాలానికన్నమాట. ప్రాచీన యూదులు మృతుల పునరుత్థానమందు నమ్మకముంచారు గాని మానవులు జన్మతః అమర్త్యతను సంతరించుకుంటారని విశ్వసించలేదు. (మత్తయి 22:31, 33; హెబ్రీయులు 11:17) అయితే ఆత్మ అమర్త్యమైనదనే సిద్ధాంతం జూడాయిజమ్‌లోకి ఎలా ప్రవేశించింది? చరిత్ర దానికి సమాధానమిస్తుంది.

18, 19. అమర్త్యమైన ఆత్మ సిద్ధాంతం జూడాయిజమ్‌లోకి ఎలా ప్రవేశించింది?

18 సా.శ.పూ. 332లో అలెగ్జాండర్‌ ది గ్రేట్‌ యెరూషలేముతో సహా మధ్యప్రాచ్యాన్ని జయించాడు. అలెగ్జాండర్‌ తర్వాత వచ్చిన పాలకులు అలెగ్జాండర్‌లానే గ్రీసు జాతీయతా భావం ప్రచారం చేయడం కొనసాగించడంతో గ్రీసు యూదుల సమ్మిళిత సంస్కృతి వాడుకలోకి వచ్చింది. కొంతకాలానికి, యూదులు గ్రీసు తలంపులను ఎక్కువగా హత్తుకున్నారు, కొంతమంది యూదులు తత్త్వవేత్తలు కూడా అయ్యారు.

19 సా.శ. మొదటి శతాబ్దంలోని, అలెగ్జాండ్రియాకు చెందిన ఫిలో అలాంటి యూదా తత్త్వవేత్తనే. అతడు ప్లేటోను గౌరవించేవాడు, జూడాయిజాన్ని గ్రీకు తత్త్వ భాషలో వివరించడానికి కృషి చేసి, తర్వాతి యూదా ఆలోచనాకర్తలకు మార్గాన్ని సుగమం చేశాడు. టాల్ముడ్‌—మౌఖిక సూత్రాలపై రబ్బీలు వ్రాసిన వ్యాఖ్యానాలు—కూడా గ్రీకు తలంపుచే ప్రభావితమైంది. “మరణానంతరం ఆత్మ ఉనికిలో కొనసాగుతుందని టాల్ముడ్‌ రబ్బీలు విశ్వసించారు” అని ఎన్‌సైక్లోపీడియా జుడైకా చెప్తుంది. ఆ తర్వాత, కాబాలా వంటి యూదా తత్త్వసంబంధమైన సాహిత్యం, పునర్జన్మ సిద్ధాంతాన్ని బోధించేంత వరకూ వెళ్తుంది. అలా గ్రీకు తత్త్వశాస్త్రపు దొడ్డిదారిన అమర్త్యమైన ఆత్మ సిద్ధాంతం జూడాయిజమ్‌లోకి ప్రవేశించింది. ఆ సిద్ధాంతం క్రైస్తవమత సామ్రాజ్యంలోకి ప్రవేశించడం గురించి ఏమి చెప్పవచ్చు?

20, 21. (ఎ) ప్లేటోనిక్‌ లేక గ్రీకు తత్త్వసిద్ధాంతాలకు సంబంధించి తొలి క్రైస్తవుల స్థానం ఏమిటి? (బి) ప్లేటో తలంపులను క్రైస్తవ బోధలతో మిళితం చేయడానికి నడిపినదేమిటి?

20 నిజమైన క్రైస్తవత్వం యేసుక్రీస్తుతో ప్రారంభమైంది. యేసు గురించి, మిగుల్‌ డె ఉనామునో ఇలా వ్రాశాడు: “ఆయన యూదా విధానం ప్రకారం శరీర పునరుత్థానమందు నమ్మకముంచాడు గాని [గ్రీకు] ప్లేటోనిక్‌ విధానం ప్రకారం అమర్త్యమైన ఆత్మ సిద్ధాంతమందు నమ్మకముంచలేదు.” ఆయనిలా ముగించాడు: “అమర్త్యమైన ఆత్మ . . . క్రైస్తవ వ్యతిరేక తత్త్వ సిద్ధాంతం.” దీని దృష్ట్యా, అపొస్తలుడైన పౌలు, “ఆయనను [క్రీస్తును] అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించే మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము”నకు వ్యతిరేకంగా మొదటి శతాబ్దపు క్రైస్తవులను ఎందుకు అంత గట్టిగా హెచ్చరించాడో మనం గ్రహించవచ్చు.—కొలొస్సయులు 2:8.

21 అయితే ఈ “క్రైస్తవ వ్యతిరేక తత్త్వ సిద్ధాంతం” ఎప్పుడు, ఎలా క్రైస్తవమత సామ్రాజ్యంలోకి ప్రవేశించింది? ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఇలా వివరిస్తుంది: “సా.శ. రెండవ శతాబ్ద మధ్యభాగం నుండి, గ్రీకు తత్త్వసిద్ధాంతంలో కొంత తర్ఫీదు పొందిన క్రైస్తవులు తమ మేధోసంబంధమైన సంతృప్తి కోసం, అలాగే విద్యావంతులైన క్రైస్తవేతరులను మార్చడం కోసం, తమ విశ్వాసాన్ని ఆ గ్రీకు తత్త్వ భాషలో వ్యక్తపర్చవలసిన అవసరతను గ్రహించనారంభించారు. వాళ్లకు చక్కగా అతికినట్టు సరిపోయిన తత్త్వసిద్ధాంతం ప్లేటో తత్త్వసిద్ధాంతమే.” క్రైస్తవమత సామ్రాజ్య సిద్ధాంతాలపై గొప్ప ప్రభావాన్ని చూపించిన అలాంటి ఇద్దరు తొలి తత్త్వవేత్తలు అలెగ్జాండ్రియాకు చెందిన ఒరిగెన్‌, హిప్పోకు చెందిన అగస్టీన్‌లు. వాళ్లిద్దరూ కూడా ప్లేటో తలంపులతో గాఢంగా ప్రభావితమై, ఆ తలంపులను క్రైస్తవ బోధలతో మిళితం చేయడంలో కీలకపాత్ర వహించారు.

22. ఆత్మ లేక రూహ్‌ అమర్త్యమైనదనే సిద్ధాంతం ఇస్లామ్‌ మతంలో ఎలా ప్రముఖమైనదిగానే నిలిచివుంది?

22 జూడాయిజమ్‌లోనూ, క్రైస్తవమత సామ్రాజ్యంలోనూ అమర్త్యమైన ఆత్మ సిద్ధాంతం ప్లేటో ప్రభావం మూలంగా వస్తే, ఆ బోధ ఇస్లామ్‌ మత ప్రారంభం నుండే దానిలోకి ప్రవేశపెట్టబడింది. ఇస్లామ్‌ మత పవిత్ర గ్రంథమైన ఖురాన్‌, మరణానంతరం ఉనికిలో కొనసాగే ఆత్మ (అరబిక్‌: రూహ్‌) మానవునికి ఉందని బోధిస్తుంది. ఆ ఆత్మ లేక రూహ్‌ యొక్క చివరి గమ్యం ఆనందభరితమైన జెన్నత్‌లో (పరలోకవనంలో) జీవితం లేక దోజక్‌లో (మండుతున్న నరకంలో) శిక్ష అని అది చెప్తుంది. అంటే దీని భావం అరబ్‌ పండితులు ఇస్లామ్‌ బోధలతో గ్రీకు తత్త్వాన్ని మిళితం చేయడానికి ప్రయత్నించలేదని కాదు. వాస్తవానికి, అరబ్‌ ప్రపంచం అరిస్టాటిల్‌ పనితో కొంతమేరకు ప్రభావితమైంది. అయితే, ఆత్మ లేక రూహ్‌ అమర్త్యమైనదన్న సిద్ధాంతాన్ని ముస్లిమ్‌లు ఇప్పటికీ విశ్వసిస్తున్నారు.

23. మరణానంతర జీవితాన్ని గురించి తలెత్తే ఏ ప్రశ్నలు తర్వాతి శీర్షికలో పరిశీలించబడతాయి?

23 స్పష్టంగా, ప్రపంచమంతటా ఉన్న మతాలు, మానవునిలో అమర్త్యమైనదేదో ఉందనే బోధ ఆధారంగా, మరణానంతర జీవితాన్ని గురించి గందరగోళమైనన్ని రకాల నమ్మకాలను వృద్ధి చేశాయి. అలాంటి నమ్మకాలు కోట్లాది మందిని ప్రభావితం చేశాయి. అవును, చివరికి వారిని తమ స్వాధీనంలోకి తీసుకుని వారిని బానిసలుగా చేసుకున్నాయి. ఇవన్నీ ఎదుర్కుంటున్న మనం ఇలా ప్రశ్నించడం సబబే: మనం మరణించినప్పుడు ఏమి జరుగుతుంది అనే దాన్ని గూర్చిన సత్యాన్ని తెలుసుకోవడం సాధ్యమేనా? మరణానంతర జీవితం ఉందా? దాని గురించి బైబిలు ఏమి చెప్తుంది? వీటిని మనం తర్వాతి శీర్షికలో పరిశీలిద్దాం.

[అధస్సూచీలు]

a ఎల్‌-అమర్నా అనేది ఐగుప్తు నగరమైన అక్కెటాటోన్‌ శిథిలాలున్న స్థలం, ఆ నగరం సా.శ.పూ. 14వ శతాబ్దంలో నిర్మించబడినట్లు చెప్పబడుతుంది.

మీరు వివరించగలరా?

◻ మరణానంతర జీవితాన్ని గురించిన అనేక మత నమ్మకాల్లో ఉన్న ఒకే ఇతివృత్తం ఏమిటి?

◻ ఆత్మ అమర్త్యమైనదనే సిద్ధాంతానికి జన్మస్థలం ప్రాచీన బబులోను అని చరిత్ర మరియు బైబిలు ఎలా సూచిస్తున్నాయి?

◻ ఆత్మ అమర్త్యమైనదన్న బబులోనీయుల నమ్మకాన్ని బట్టి ప్రాచ్య మతాలు ఏ విధంగా ప్రభావితమయ్యాయి?

◻ ఆత్మ అమర్త్యమైనదనే సిద్ధాంతం జూడాయిజమ్‌లోకి, క్రైస్తవమత సామ్రాజ్యంలోకి, ఇస్లామ్‌ మతంలోకి ఎలా ప్రవేశించింది?

[12, 13వ పేజీలోని చిత్రం]

అలెగ్జాండర్‌ ది గ్రేట్‌ సాధించిన విజయం, గ్రీసు యూదుల సమ్మిళిత సంస్కృతికి దారితీసింది

అగస్టీన్‌, ప్లేటో తత్త్వాన్ని క్రైస్తవత్వంతో సమ్మిళితం చేయడానికి ప్రయత్నించాడు

[చిత్రసౌజన్యం]

Alexander: Musei Capitolini, Roma; Augustine: From the book Great Men and Famous Women

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి