కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 2/15 పేజీలు 30-31
  • ప్రాచీన కాలాల్లో సంచులు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రాచీన కాలాల్లో సంచులు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • దావీదు సంచి, నయమాను సంచి
  • వ్యాపారస్థుల సంచి
  • కట్టబడిన, ముద్రించబడిన మూటలు
  • క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో డబ్బు సంచీలు
  • నిరంతరం నిలిచే సంచీలు
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 2/15 పేజీలు 30-31

ప్రాచీన కాలాల్లో సంచులు

యెహోవా ఆధునికదిన సాక్షుల ఉపకరణాలలో సంచులు చాలా ప్రాముఖ్యమైన భాగం. క్రైస్తవ కూటాలకు పఠన పుస్తకాలను తీసుకువెళ్లడానికీ, ప్రపంచవ్యాప్త ప్రకటనా పనిలో పంచిపెట్టేందుకు ప్రచురణలను తీసుకువెళ్లడానికీ అవి ఉపయోగపడతాయి. బైబిలు కాలాల్లో సంచుల సంగతేమిటి? అవి ఎక్కువగా ఉపయోగించబడేవా? అవెలా ఉండేవి?

అనేక రకాలైన జంతు చర్మాల నుండి, నేసిన పదార్థాల నుండి తయారు చేయబడిన ప్రాచీన కాలంనాటి సంచులు అనేక రకాలుగా ఉపయోగపడేవి. వాటిని ధాన్యం మరియు ఇతర ఆహారపదార్థాలు, తూనిక రాళ్లు, విలువైన వస్తువులు, బంగారు వెండి ముద్దలు, ముద్రితనాణేలు, చివరికి నీళ్లు, ద్రాక్షారసం వంటివాటిని ఉంచడానికి ఉపయోగించేవారు.—యెహోషువ 9:4; మత్తయి 9:17.

విస్తృతమైన పదసంపదతో పరిపుష్టమైన హెబ్రీ భాషలో, సంచుల ఉపయోగాన్ని బట్టి వాటికి సంచులు, డబ్బుసంచులు, జాలెలు, మూటలు అని వివిధ పదాలున్నాయి. సాక్‌ అనే ఇంగ్లీషు పదం సేక్‌ అనే హెబ్రీ పదం నుండి వచ్చింది; ఈ పదం బైబిల్లో గోనెపట్టను సూచించడానికి, ఆహారపదార్థాలను ధాన్యాన్ని భద్రపర్చడానికి గోనెపట్టతో తయారు చేయబడిన గోనె సంచులను సూచించడానికి ఉపయోగించబడింది. ఈ పదమూ, “వ్యాపించివున్న” అనే భావంగల క్రియాపదం నుండి వచ్చే ఆమ్టాఖాత్‌ అనే హెబ్రీ పదమూ, యోసేపు సహోదరులు ఐగుప్తును సందర్శించే వృత్తాంతంలో దాదాపు పర్యాయపదాలుగా ఉపయోగించబడ్డాయి. ఐగుప్తు నుండి ధాన్యాన్ని రవాణా చేసే సంచుల కోసం ఈ రెండు పదాలూ ఉపయోగించబడ్డాయి. ఆమ్టాఖాత్‌ అనే పదం ఆ సేక్‌ లేక ఆ సంచి ఏ పదార్థంతో తయారు చేయబడింది అనేదాన్ని వర్ణిస్తున్నట్లు అనిపిస్తుంది.—ఆదికాండము 42:25, 27, 28, 35.

దావీదు సంచి, నయమాను సంచి

గొల్యాతును ఎదుర్కోవడానికి వెళుతున్నప్పుడు దావీదు తన చిక్కములో ఐదు రాళ్ళు వేసుకున్నాడు. ఇది భుజాల మీదుగా వీపున వేలాడదీసుకునే రకమైన సంచిలా అనిపిస్తుంది. (1 సమూయేలు 17:40) అయితే ఇక్కడ ఉపయోగించబడిన కెలి అనే హెబ్రీ పదం మట్టి, కర్ర, లోహం లేక చర్మం వంటివాటితో చేయబడిన పాత్రను/సంచిని కూడా సూచించవచ్చు.

సిరియా సైనికాధికారియైన నయమానును భయంకరమైన కుష్ఠువ్యాధి నుండి స్వస్థపరిచే వృత్తాంతంలో, దురాశపరుడైన గేహజీకి ఆయన “రెండు సంచులలో నాలుగు మణుగుల [“రెండు తలాంతుల,” NW] వెండి కట్టి రెండు దుస్తుల బట్టలనిచ్చి, తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు . . . మోసికొని పోయిరి” అని మనం చదువుతాము. (2 రాజులు 5:23) ఇక్కడ సంచుల కోసం ఉపయోగించబడిన హెబ్రీ పదం చారిట్‌. ఒక తలాంతు దాదాపు 34 కిలోలతో సమానం గనుక అలాంటి పాత్ర ఒక తలాంతు వెండి దానితోపాటు ఒక జత బట్టలు సరిపోయేంత పరిమాణంలోనూ, దానికి తగినంత పటిష్టంగానూ ఉండేదని స్పష్టమౌతుంది. ఆ సంచులు నింపబడినప్పుడు ఒక్కో సంచి ఒక మనిషి మోసుకుపోగల్గేంత పెద్దవిగా ఉండేవంటే అందులో ఆశ్చర్యం లేదు. అయితే చారిట్‌ ఎల్లప్పుడూ పెద్ద సంచీనే సూచిస్తుందని చెప్పలేము, ఎందుకంటే గర్విష్టురాండ్రైన సీయోను కుమార్తెలు విలాసవంతమైన సౌందర్యోపకరణాలుగా ఉపయోగించిన డబ్బుసంచీలను సూచించడానికి కూడా ఇదే పదం ఉపయోగించబడింది.—యెషయా 3:16, 22.

వ్యాపారస్థుల సంచి

వ్యాపారులు తీసుకువెళ్లే సంచి కోసం ఉపయోగించబడిన హెబ్రీ పదం కిస్‌. అది తప్పకుండా ఇటీవలి కాలాల వరకు ప్రాచ్య దేశాల్లో ఉపయోగంలో ఉన్న వాటిలా ఉండివుంటుందనడంలో సందేహం లేదు. ఈ తర్వాతి రకాలను బట్టి చూస్తే, అవి బహుశ నేసిన నూలుతోనూ, నారతోనూ లేక తోలుతోనూ చేయబడివుండవచ్చు. పదార్థాలను, ధాన్యాన్ని, లేక అమూల్యమైన వస్తువులను తూకం వేయవలసి వచ్చినప్పుడు వర్తకులకు అవసరమయ్యే తూనిక రాళ్లను తీసుకువెళ్లడానికి ఇవి ఉపయోగించబడేవి. మోసపూరితమైన వ్యాపార పద్ధతుల గురించి మోషే ధర్మశాస్త్రంలోని ఒక హెచ్చరిక కిస్‌ను ఉద్దేశించి ఇలా పేర్కొన్నది: “హెచ్చుతగ్గులుగల వేరువేరు తూనికె రాళ్లు నీ సంచిలో నుంచుకొనకూడదు.” (ద్వితీయోపదేశకాండము 25:13) యెహోవా తన ప్రవక్త ద్వారా ఇలా అడిగాడు: “తప్పుత్రాసును తప్పురాళ్లుగల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా?” (మీకా 6:11) కిస్‌ను డబ్బు మరియు విలువైన వస్తువులు తీసుకువెళ్లడానికి సంచీలా లేక పర్సులా కూడా ఉపయోగించవచ్చు.—యెషయా 46:6.

కట్టబడిన, ముద్రించబడిన మూటలు

సెరోహ్‌ అనే హెబ్రీ పదం, “చుట్టిపెట్టు” అనే భావంగల క్రియాపదం నుండి వచ్చింది. అది, ఒక త్రాడుతో లేక బొందుతో ఒక మూటగా గానీ లేక కేవలం మూతి దగ్గర కలిపి బిగించబడిన ఒక సంచిగా గానీ కట్టబడిన సాధారణమైన సంచిని వర్ణిస్తుంది. ఈ రకమైన సంచిలోనే యోసేపు తన సహోదరులు తీసుకున్న ధాన్యం కొనడానికైన డబ్బును పెట్టాడు, దాని గురించి ఆ వృత్తాంతం, ఒక్కో సంచిలోవున్న “రూకల మూట” అని చెబుతుంది.—ఆదికాండము 42:35.

ఆలయంలోని కానుక పెట్టెలో నుండి తీయబడిన డబ్బును బహుశా అలాంటి మూటలుగానే కట్టేవారని స్పష్టమౌతుంది, అయితే ఆ మూటలన్నిటిలోను ఒకే మొత్తంలో డబ్బును ఉంచేవారనడంలో సందేహం లేదు. ప్రాచీన కాలాల్లో, ఒక్కోసారి ఎక్కువ మొత్తంలో డబ్బు ఇమిడివుండే వ్యాపార లావాదేవీల్లో నాణేలను తూకంవేసి అలాంటి మూటల్లో లేక సంచుల్లో పోసి ముడేసి దానికి ముద్ర వేసేవారు. అవసరమైనప్పుడు ఆ సంచి, ఒప్పుకొనబడిన మొత్తం ఉన్నట్లు హామీ ఇవ్వబడినదిగా ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తి దగ్గరికి చేరవచ్చు. విడదీయబడని ఆ ముద్ర, ఆ సంచిలో ఉన్న వెండి, బంగారం, లేక ఇతర లోహాల మొత్తానికి హామీగా ఉంటుంది. యోబు 14:17 నందు, “నా అతిక్రమము సంచిలో ముద్రింపబడియున్నది నేను చేసిన దోషమును భద్రముగా ఉంచియున్నావు” అని యోబు దేవునితో చెబుతున్నప్పుడు ఆయన అలాంటి రూపకాలంకారాన్నే ఉపయోగిస్తున్నాడని స్పష్టమౌతుంది. దావీదు శత్రువు దావీదును చంప జూసినప్పుడు ఆయన ప్రాణం “[ఆయన] దేవుడైన యెహోవాయొద్ద నున్న జీవపుమూటలో కట్టబడు[తుందని]” చెబుతూ అబీగయీలు, యెహోవా దావీదును కాపాడడం విషయంలో నమ్మకాన్ని వ్యక్తపరిచింది.—1 సమూయేలు 25:29.

క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో డబ్బు సంచీలు

క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో డబ్బు సంచీల గురించి, నడుముకట్టుసంచీల గురించి జాలెల గురించి ప్రస్తావించబడింది. డబ్బు సంచీ అనేది బంగారం, వెండి, రాగి, నాణేలు, లేక ఇతర పదార్థాలు తీసుకు వెళ్లడానికి స్త్రీ పురుషులు ఉపయోగించే చిన్న సంచీ వంటిది. (లూకా 10:4) కొన్నిసార్లు స్త్రీల వద్ద అలంకరణ సంచీలు లేక చేతి సంచీలు ఉండేవి, బహుశ అవి పొడవుగా గుండ్రంగా ఉండివుండవచ్చు; ఈ విధమైన సంచీలకు హెబ్రీ భాషలో చారిట్‌ మరియు కిస్‌ అనే పదాలు ఉపయోగించబడేవి. (యెషయా 3:22; 46:6) తొలి పర్సులు తోలు నుండి, నేయబడిన నార లేక నూలు నుండి చేయబడేవి. అవి మూతి దగ్గర తోలు పట్టీలతో లేక ఇతర నాడావంటి తాళ్లతో బిగించి కట్టబడేవి.

యేసు తన శిష్యులను బహుశ యూదయకు ప్రకటన పని మీద పంపించి, తమతో (నడుముకట్టు) సంచిని గాని లేక జాలెను గాని తీసుకువెళ్లవద్దని వారికి చెప్పాడు. అంటే తమ తోటి ఇశ్రాయేలీయుల సంప్రదాయబద్దమైన అతిథి సత్కారాల ద్వారా యెహోవా వారికి కావలసినవి అందజేస్తాడని ఆయన సూచించాడు. (మత్తయి 10:9, 10) నడుముకట్టు సంచి (అక్షరార్థంగా ‘నడుముకట్టు’; గ్రీకు జోన్‌) అనేది బహుశ డబ్బు పెట్టుకునే ఒక విధమైన దట్టి వంటిదై ఉండవచ్చు. డబ్బు పెట్టుకోగలిగేలా నడుముకట్టులో ఖాళీస్థలమైనా ఉండివుండవచ్చు లేక నడుముకట్టు బట్టతో చేయబడి మధ్యన మడతలు ఉన్నదైతే ఆ మడతల్లోనైనా డబ్బును పెట్టుకోగలిగేలా ఉండవచ్చు.

జాలె అని అనువదించబడిన గ్రీకు పదమైన పెరా, ప్రయాణికులు తమ భుజంమీదుగా వేలాడదీసుకునే సంచిని సూచిస్తుంది, దావీదు తన చిక్కమును తప్పకుండా అలాగే వేసుకుని ఉంటాడు. దానిలో ఆహారం, బట్టలు, ఇతర వస్తువులు పెట్టుకోవచ్చు.

నిరంతరం నిలిచే సంచీలు

“జ్ఞానసంపాద్యము [“సంచినిండా జ్ఞానము,” NW] [సంచినిండా] కెంపులకన్న కోరతగినది” అని నేడు కోట్లాదిమంది ప్రజలు గుణగ్రహిస్తున్నారు. (యోబు 28:18) యెహోవాసాక్షులు ఇతరులకు ఈ జ్ఞానాన్ని అందజేయడంలో తమ క్రైస్తవ ప్రకటనా పనిలో అక్షరార్థమైన సంచులనూ, డబ్బు సంచులనూ చక్కగా ఉపయోగించుకుంటున్నారు. వాళ్లు కీర్తన గ్రంథకర్త చెప్పినట్లు, దేవుని రాజ్యం ద్వారా భూమి మీద పునఃస్థాపించబడిన పరదైసును గురించిన సువార్తగల దేవుని వాక్య సత్యమనే ‘పిడికెడు [“సంచెడు,” NW] విత్తనాలను చేతపట్టుకొని విత్తుతూ పోతున్నారు.’ ఇతర సత్యాన్వేషకులు కూడా దైవిక జ్ఞానాన్ని పొందుతుండగా వారు “సంతోషగానము చేయుచు” తమ శ్రమకు ప్రతిఫలాన్ని కోస్తారు.—కీర్తన 126:6.

ఆధ్యాత్మిక విషయాల ఉత్కృష్టమైన విలువను ఎత్తి చూపిస్తూ యేసు తన అనుచరులకు ఇలా ఉద్బోధించాడు: “పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి.” అవును, డబ్బుసంచి, లేక సంచి, లేక జాలె, లేక మూట నిండా పరలోక ధనం నిజమైన భద్రతను ఇస్తుంది, చిరకాలం నిలిచివుంటుంది.—లూకా 12:33.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి