“ప్రశాంత వాతావరణాన్ని నేను గమనించగలిగాను”
సాక్షులపై “నిఘా” వేసేందుకు, జర్మను భాష మాట్లాడే ఒక వ్యక్తి యెహోవాసాక్షులు ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లాడు. ఎందుకు? “ఈ తెగను బట్టబయలు చేసి, తప్పుదారి పట్టిపోతున్న తన స్నేహితులను రక్షించాలన్నదే” ఆయన లక్ష్యం. సమావేశానికి హాజరైన తర్వాత, ఆయన తన స్నేహితునికి ఈ క్రింది ఉత్తరం వ్రాశాడు:
“నేను సమావేశ స్థలం దగ్గరికి వెళ్లేసరికి, నేను సరైన అడ్రస్‌కే వచ్చానా లేదా అని నాకు అనుమానం వచ్చింది. స్టేడియం బయట ఒక్క మనిషి కూడా లేడు, కనీసం నేలపైన చెత్త, బీరు క్యాన్లు కూడా లేవు. నేను దగ్గరికి వెళ్లేసరికి, స్టేడియం ద్వారం దగ్గర ఇద్దరు పురుషులు నిలబడి ఉండడం నాకు కనిపించింది. వాళ్లు నాకు అభివాదం చేసి, నన్ను లోనకు వెళ్లనిచ్చారు.
“అక్కడ ఉండవలసిన వేలమంది నుండి రణగొణ ధ్వని వస్తుందని నేను ఊహించాను, కాని అక్కడంతా ఎంతో నిశ్శబ్దంగా ఉంది. ‘బహుశ, మొత్తం స్థలంలో ఎక్కడో అక్కడొకరు అక్కడొకరు ఉన్నారేమో’ అని నాలో నేను అనుకున్నాను.
“నేను లోపలికి వెళ్లేసరికి, వేదిక మీద జరుగుతున్న డ్రామా నా దృష్టిని ఆకర్షించింది. స్టేడియం నిండుగా వేలాదిమంది ప్రేక్షకులు ఉన్నారని వాళ్లంతా శ్రద్ధగా వింటున్నారని నేను కొంతసేపటి తర్వాతే గ్రహించాను. అక్కడున్న ప్రశాంత వాతావరణాన్ని నేను గమనించగలిగాను. సమావేశపు మిగతా భాగంలో నేను విన్నది, చూసినది, అనుభవించినది నన్నెంతగానో ప్రభావితం చేసింది.
“సాక్షులతో కలిసిపోయి, నేను వారి ఆనందభరితమైన ముఖాలను, ప్రేమతో నిండిన వ్యక్తీకరణలను గమనించగలిగాను. హఠాత్తుగా, ‘నిజంగా వీళ్లు దేవుని ప్రజలే’ అన్న తలంపును నేను అణిచివేసుకోలేకపోయాను!’”
‘తప్పుదారి పట్టిపోకుండా తన స్నేహితులను కాపాడే’ బదులు ఆ యువకుడు తనతో బైబిలు పఠించమని వారిని కోరాడు. ఫలితం? నేడు, ఆయనొక క్రైస్తవ పెద్ద. స్విట్జర్లాండ్‌లోని జుగ్లోవున్న సంఘాల్లోని ఒకదాంట్లో ఆయనా ఆయన కుటుంబం చురుగ్గా ఉన్నారు.