విజయవంతమైన వివాహానికి ఏమి అవసరం?
మొదట ఎలా ఈదాలో నేర్చుకోకుండానే మీరు నదిలో దూకాలనుకుంటారా? అలాంటి తెలివితక్కువ పని ప్రమాదకరం—కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు. అయితే, వివాహంలో ఇమిడివున్న బాధ్యతలను ఎలా చేపట్టాలో కొంచెం కూడా తెలుసుకోకుండానే ఎంతమంది వ్యక్తులు వివాహం చేసుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి.
యేసు ఇలా చెప్పాడు: “మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా?” (లూకా 14:28) గోపురము కట్టే విషయంలో ఏది నిజమో వివాహాన్ని కట్టే విషయంలో కూడా అదే నిజం. వివాహం చేసుకోవాలనుకుంటున్న వారు వివాహంలోని తగులుబడిని జాగ్రత్తగా చూసుకుని దానిలోని సవాళ్లను ఎదుర్కోగలరో లేదోనని నిర్ధారించుకోవాలి.
వివాహంవైపు ఒక దృష్టి
జీవితంలోని సుఖదుఃఖాలను పంచుకోవడానికి ఒక తోడు ఉండడం నిజంగా ఒక ఆశీర్వాదమే. ఒంటరితనం లేక నిరాశ వలన కలిగే వెలితిని వివాహం పూడ్చవచ్చు. మనం సహజంగా కోరుకొనే ప్రేమ, సాహచర్యం, సాన్నిహిత్యాల్ని అది అందిస్తుంది. మంచి కారణాన్ని బట్టే, ఆదామును సృష్టించిన తర్వాత దేవుడు ఇలా చెప్పాడు: “నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదు[ను].”—ఆదికాండము 2:18; 24:67; 1 కొరింథీయులు 7:9.
అవును, వివాహితులంగా ఉంటే కొన్ని సమస్యల్ని పరిష్కరించవచ్చు. కానీ వివాహం కొన్ని క్రొత్త సమస్యల్ని సృష్టిస్తుంది కూడాను. ఎందుకు? ఎందుకంటే, వివాహమనేది రెండు విభిన్నమైన వ్యక్తిత్వాల కలయిక, బహుశా వారు పొసుగుతున్నప్పటికీ ఇద్దరూ ఒక్కటి మాత్రం కాదు. అందుకే, ఎంతో ఈడూజోడుగా కన్పించే జంటలు కూడా కొన్ని సందర్భాలలో పరస్పర విరుద్ధతను ఎదుర్కొంటారు. క్రైస్తవ అపొస్తలుడైన పౌలు వ్రాసేదేమంటే, వివాహం చేసుకున్న వారికి “శరీర సంబంధమైన శ్రమలు కలుగును”—లేక ద న్యూ ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం, “ఈ శారీరక జీవితంలో నొప్పిని, బాధను పొందుతారు.”—1 కొరింథీయులు 7:28.
పౌలు మరీ నిరాశావాదిగా మాట్లాడుతున్నాడా? ఎంతమాత్రం కాదు! వివాహం చేసుకోవాలని అనుకునేవారిని ఆయన వాస్తవికంగా దృష్టించేవారిగా ఉండమని కోరుతున్నాడు. ఒక వ్యక్తిపట్ల ఆకర్షితులు కావడంలో ఉండే మత్తు, పెళ్లిరోజు తర్వాత వచ్చే నెలల్లో సంవత్సరాల్లో వారి వైవాహిక జీవితం ఎలా ఉంటుందన్నదానికి సరియైన కొలబద్ద కాదు. ప్రతి వివాహంలోను దానికైన సవాళ్లూ సమస్యలూ ఉంటూనే ఉంటాయి. అవి ఎదురౌతాయా లేదా అన్నది కాదు ప్రశ్న; అవి ఎదురైనప్పుడు వాటితో ఎలా తలపడాలన్నదే ప్రశ్న.
సమస్యలు ఏర్పడినప్పుడు భార్యా, భర్తలు ఒకరిపట్ల ఒకరికి ఉన్న ప్రేమ యొక్క యథార్థతను చూపించుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తాయి. ఉదాహరణకు: ఓడరేవులో నిలిచివున్న ఓడ ఎంతో గంభీరంగా ఉండవచ్చు. అయితే అది సముద్రయానానికి యోగ్యత గలదా కాదా అనేది సముద్రంలోకి వెళ్తేనే తెలుస్తుంది—బహుశ తుపానులో చెలరేగే అలల మధ్య దాని సత్తా తెలియవచ్చు. అదే ప్రకారం, కేవలం ప్రణయ భావాల ప్రశాంతత ఉన్న పరిస్థితిలో ఒక వివాహ బంధం ఎంత బలమైనదన్నది తెలియదు. ఒకజంట కష్టకాలాన్ని తాళుకొనే శ్రమలున్న పరిస్థితుల్లోనే ఆ బలం ఎంతో రుజువౌతుంది.
అలా నిలబడడానికి, వివాహిత జత ఒకరికొకరు కట్టుబడి ఉండడం అవసరం, ఎందుకంటే దేవుడు సంకల్పించిన ప్రకారం, పురుషుడు “తన భార్యను హత్తుకొనును” వారిరువురూ “ఏక శరీరమైయుందురు.” (ఆదికాండము 2:24) ఒకరికొకరు కట్టుబడి ఉండడం అనే తలంపు నేడు అనేకమందిలో భయాన్ని పుట్టిస్తుంది. కానీ, ఒకరినొకరు నిజంగా ప్రేమించుకొనే ఇద్దరు వ్యక్తులు తాము కలిసి జీవించాలని వాగ్దానం చేసుకోవడం సహేతుకం. వివాహంలో కట్టుబడి ఉండాలన్న నిర్ణయం వివాహానికే గౌరవాన్నిస్తుంది. భార్యా భర్తలకి ఏమి సంభవించినా ఒకరినొకరు మద్దతు ఇచ్చుకుంటారని నమ్మడానికి అది ఆధారాన్ని ఇస్తుంది.a మీరు కట్టుబడి ఉండాలన్న నిర్ణయానికి సిద్ధంగా లేనట్లయితే, నిజంగా వివాహానికి కూడా సిద్ధంగా లేనట్లే. (ఎఫెసీయులు 5:4, 5 పోల్చండి.) ఇప్పటికే వివాహమైన వారు కూడా, కట్టుబడి ఉండాలన్న తలంపు ఒక శాశ్వత వివాహ బంధానికి ఎంత కీలకం అన్న విషయాన్ని మరింత గుణగ్రహించాల్సిన అవసరం ఉండవచ్చు.
మీవైపు ఒక దృష్టి
మీ జతలో ఉండవలసిన లక్షణాల గురించి మీరు నిస్సందేహంగా ఒక చిట్టా చదువుతుండవచ్చు. అయితే, వివాహానికి మీరెంత మేరకు సహకరించగల్గుతారు అని మీరంతట మీరే స్వయంగా చూసుకోవడం మాత్రం కష్టంగా అనిపిస్తుంది. వివాహ బంధానికి ఒప్పందం చేసుకొనే ముందూ, తర్వాత కూడా ఆత్మ పరిశీలన చేసుకోవడం ప్రాముఖ్యం. ఉదాహరణకు, మీకు మీరే ఈ క్రింది ప్రశ్నలను వేసుకోండి.
• జీవితాంతం నా జతతో కట్టుబడి ఉండటానికి నేను ఇష్టతను కనపరుస్తున్నానా?—మత్తయి 19:6.
బైబిలు ప్రవక్తయైన మలాకీ కాలంలో, చాలామంది భర్తలు బహుశ యౌవన స్త్రీలను వివాహం చేసుకోవడం కోసం తమ భార్యలను విడిచిపెట్టారు. అలా విడిచిపెట్టబడిన భార్యల కన్నీళ్ళతో తన బలిపీఠం నిండివుందని యెహోవా చెప్పాడు, వారి భార్యలతో అలాంటి ‘విశ్వాస ఘాతుకానికి’ పాల్పడిన పురుషులను నిందించాడు.—మలాకీ 2:13-16.
• ఒకవేళ నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లయితే, వివాహం విషయంలో మంచి తీర్మానం చేసుకోకుండా నా ఆలోచనల్ని ప్రభావితం చేసే లైంగిక భావోద్రేకాలు బాగా బలంగా ఉండే కౌమారదశను నేను దాటానా?—1 కొరింథీయులు 7:36.
“మరీ యౌవనంలో ఉన్నప్పుడే వివాహం చేసుకోవడం చాలా ప్రమాదకరమని” 22 సంవత్సరాలకే వివాహం చేసుకున్న నిక్కీ ఇలా హెచ్చరిస్తుంది: “మీ భావావేశాలు, గమ్యాలు, అభిరుచులు 25-29 మధ్య, కాల కాలానికి మారుతూ ఉంటాయి.” నిజమే వివాహం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నదీ లేనిదీ ఒక వయస్సుతో కొలవలేము. ఏదేమైనా, లైంగిక భావోద్రేకాలు క్రొత్తగానూ, మరి ముఖ్యంగా బలంగానూ ఉన్నప్పుడు అంటే కౌమారదశలో వివాహం చేసుకుంటే అది ఒకరి ఆలోచనా విధానం మీద ప్రభావితం చూపి, తలెత్తగల సమస్యలను కూడా చూసి చూడనట్లు చేస్తుంది.
• విజయవంతమైన వివాహానికి తోడ్పడేందుకై ఎలాంటి విశిష్టలక్షణాలు నాకు ఉన్నాయి?—గలతీయులు 5:22, 23.
కొలొస్సయులకు అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి.” (కొలొస్సయులు 3:12) వివాహం చేసుకోవాలనుకుంటున్న వారికి, అలాగే ఇదివరకే వివాహం అయినవారికి కూడా ఈ సలహా ప్రయోజనకరమైనది.
• క్లిష్ట సమయాల్లో సహితం నా జతకి సహాయాన్ని అందించడానికి అవసరమైన పరిణతి నాలో ఉందా?—గలతీయులు 6:2.
ఒక డాక్టర్ ఇలా చెప్పాడు, “సమస్యలు ఎదురైనప్పుడు సాధారణంగా తమ జతని నిందిస్తారు. తప్పు ఎవరిది అనేది ఏమంత ప్రాముఖ్యమైనది కాదు. గానీ, భార్యా భర్త ఇరువురూ కలసి వైవాహిక బంధాన్ని ఎలా అభివృద్ధి పరుచుకోవాలి అనే దానిలో కలిసి పనిచేయడం ప్రాముఖ్యం.” జ్ఞానియైన సొలొమోను రాజు మాటలు వివాహిత దంపతులకి వర్తిస్తాయి. “ఒంటిగాడై యుండుటకంటె ఇద్దరు కూడియుండుట మేలు” అని అంటూ ఆయన ఇంకా ఇలా అన్నాడు, “వారు పడిపోయినను ఒకడు తనతోడివానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయినయెడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును.”—ప్రసంగి 4:9, 10.
• నేను మామూలుగా ఉత్సాహవంతంగా నవ్వుతూ ఆశావాదిగా ఉంటానా, లేక ముఖం వ్రేలాడేసుకొని, ప్రతికూల భావాల్ని కల్గి ఉంటానా?—సామెతలు 15:15.
ప్రతికూల స్వభావం గల వ్యక్తి ప్రతీరోజుని చెడుగానే భావిస్తాడు. వివాహం అయినంత మాత్రం ఈ స్వభావం ఏదో అద్భుతంగా మారిపోదు! పురుషుడైనా, స్త్రీయైనా—అవివాహితులుగా ఉన్నప్పుడు బాగా విమర్శనాత్మకంగా, నిరాశావాదంగా ఉంటే వివాహం అయిన తర్వాత కూడా అంతే విమర్శనాత్మకంగా, నిరాశావాదిగా ఉంటారు. అలాంటి వ్యతిరేక స్వభావం వలన వివాహంలో గొప్ప ఒత్తిడి ఏర్పడుతుంది.—సామెతలు 21:9 పోల్చండి.
• ఒత్తిడి ఏర్పడినప్పుడు ప్రశాంతతను కనపరుస్తానా, లేక అదుపు చేసుకోలేనంతగా కోపాన్ని ప్రదర్శిస్తానా?—గలతీయులు 5:19, 20.
క్రైస్తవులు ‘కోపించుటకు నిదానించువారునై యుండవలెనని’ ఆజ్ఞాపించబడ్డారు. (యాకోబు 1:19) వివాహానికి ముందు, వివాహమైన తర్వాత కూడా స్త్రీ, పురుషులు వారి జీవితాలలో ఈ సలహాకు అనుగుణ్యంగా జీవించే సామర్థ్యాన్ని అలవర్చుకోవాలి: “కోపపడుడిగాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు.”—ఎఫెసీయులు 4:26.
భావి భాగస్వామిపై ఒక దృష్టి
“వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును” అని బైబిలు సామెత చెబుతుంది. (సామెతలు 14:15) వివాహజతను ఎంపిక చేసుకునే విషయంలో ఇది ఖచ్చితంగా నిజమైవుంది. వివాహజతని ఎంపిక చేసుకోవడం అనేది స్త్రీ, పురుషులు తీసుకొనే అతి ప్రాముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటి. అయితే, చాలామంది ప్రజలు ఏ వ్యక్తిని వివాహం చేసుకోవాలో అని నిర్ణయించే దానికన్నా, ఎలాంటి కారు కొనాలో, ఏ కళాశాలలో చేరాలో అని ఆలోచించడానికే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారని గమనించడం జరిగింది.
క్రైస్తవ సంఘంలో, బాధ్యతలు అప్పగించబడినవారు “మొదట పరీక్షింపబడవలెను.” (1 తిమోతి 3:10) ఒకవేళ మీరు వివాహం చేసుకోవాలి అని అనుకున్నట్లయితే, ఆ వ్యక్తి ‘పరీక్షించబడిందో/ పరీక్షించబడ్డాడో’ నిశ్చయపర్చుకోవాలి. ఉదాహరణకు క్రింద ఇవ్వబడిన ప్రశ్నలను గమనించండి. ఈ ప్రశ్నలు స్త్రీల దృక్కోణంలోనుండి చూపించడం జరిగినప్పటికీ, చాలా సూత్రాలు పురుషులకు కూడా వర్తిస్తాయి. వివాహమైన వారు సహితం ఈ విషయాలనుండి ప్రయోజనం పొందవచ్చు.
• ఆయనకు ఎలాంటి పేరు ఉంది?—ఫిలిప్పీయులు 2:19-22.
సామెతలు 31:23 ఒక భర్తను వర్ణిస్తూ, “దేశపు పెద్దలతోకూడ కూర్చుండును గవినియొద్ద పేరుగొనినవాడై యుండును” అని చెబుతుంది. దేశపు పెద్దలు తీర్పు తీర్చడానికి దేశపు గవినియొద్ద కూర్చుంటారు. గనుక ఖచ్చితముగా, సమాజంలో ఆయనకు మంచి నమ్మకం ఉందన్నమాట. ఒక పురుషుడిని ఇతరులు ఎలా దృష్టిస్తారనేది ఆయనకు ఉన్న ప్రతిష్టను గురించి చెబుతుంది. ఒకవేళ ఆయనకు అన్వయిస్తే, ఆయన అధికారం క్రింద ఉన్నవాళ్ళు ఆయనను ఎలా దృష్టిస్తున్నారనేది కూడా పరిశీలించండి. ఇలా పరిశీలించడం ఎందుకంటే, కొంతకాలం అయిన తర్వాత ఆయన జతగా మీరు ఎలా దృష్టించాలో ఇది సూచిస్తుండవచ్చు.—1 సమూయేలు 25:3, 23-25.
• ఎలాంటి నైతిక గుణాలు ఆయనకు ఉన్నాయి?
దైవీక జ్ఞానము “మొట్టమొదట పవిత్రమైనది.” (యాకోబు 3:17) దేవుని ఎదుట తన స్థానం, మీ స్థానం కన్నా ఎక్కువగా తన స్వంత లైంగిక కోర్కెల మీద ఆసక్తి చూపుతున్నాడా? వివాహం కాకముందు ఆ వ్యక్తి దేవుని నైతిక ప్రమాణాలకు కట్టుబడి ఉండడానికి ప్రయత్నిస్తుండకపోతే, వివాహం అయిన తర్వాత ఉంటాడు అని నమ్మడానికి ఏ ఆధారం ఉంది?—ఆదికాండము 39:7-12.
• ఆయన నాతో ఎలా ప్రవర్తిస్తాడు?—ఎఫెసీయులు 5:28, 29.
బైబిలు పుస్తకమైన సామెతలు ఒక భర్త గురించి చెబుతూ ఆయన తన భార్యపై “నమ్మికయుంచును” అంతేకాక, “ఆమె పెనిమిటి ఆమెను పొగడును” అంటుంది. (సామెతలు 31:11, 28, 29) ఆయన తీవ్రంగా అసూయపడేవాడు కాదు. లేదా తాను ఆశించే దానిలో మరీ అన్యాయంగా ఉండడు. యాకోబు పైనుండి వచ్చే జ్ఞానమును గురించి వ్రాస్తూ, అది “సమాధానకరమైనది, మృదువైనది . . . కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది” అని అంటున్నాడు.—యాకోబు 3:17.
• తన స్వంత కుటుంబ సభ్యులతో ఎలా వ్యవహరిస్తాడు?—నిర్గమకాండము 20:12.
పిల్లలు తల్లి తండ్రులను గౌరవించాలి అని బైబిలు కోరడం మాత్రమే కాదు అలాగని ఆజ్ఞాపిస్తుంది. బైబిలు ఇలా చెబుతుంది: “నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము.” (సామెతలు 23:22) ఆసక్తికరంగా డాక్టర్. డబ్ల్యూ. హ్యూ మిసెల్‌డీన్ ఇలా వ్రాశాడు: “వివాహం చేసుకోబోయే స్త్రీపురుషులు అప్పుడప్పుడు ఒకరింటిని ఒకరు దర్శించడం వలన కాబోయే భర్తకు అతని తల్లిదండ్రులకు మధ్య ఎలాంటి బంధం ఉన్నదో తెలుసుకోవచ్చు. ఆ విధంగా, వివాహజీవితంలో వచ్చే సమస్యలను, పరస్పర విరుద్ధతలను దూరం చేసుకోవచ్చు—లేక వాటిని ముందే ఊహించవచ్చు. తను తన తల్లిదండ్రులను ఎలా దృష్టిస్తున్నాడనేది తనను ఎలా చూసుకుంటాడనే దాన్ని ప్రభావితం చేయవచ్చు. ఆమె ఇలా ప్రశ్నించుకోవాలి: ‘తన తల్లిదండ్రులను అతను ఎలా దృష్టిస్తాడో అలానే నన్నూ దృష్టించాలనుకుంటున్నానా?’ అతని తల్లిదండ్రులు అతనిని దృష్టించే విధానం ద్వారా ఆయన తనను తాను ఎలా దృష్టించుకుంటున్నాడు, మీరు తనపట్ల—హనీమూన్ తర్వాత కూడా—ఎలా ప్రవర్తించాలని ఆశిస్తున్నాడు అనేది తెలుసుకోగలము.”
• అతను త్వరగా కోపపడేవాడు, లేక దుర్భాషలాడేవాడునా?
బైబిలు ఇలా హెచ్చరిస్తుంది: “సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.” (ఎఫెసీయులు 4:31) కొంతమంది క్రైస్తవులను గురించి పౌలు తిమోతిని హెచ్చరిస్తూ, వారు ‘తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధులగుదురు’ అన్నాడు. వీరు “అసూయ కలహము దూషణలు దురనుమానములును, చెడిపోయన మనస్సుకలిగి సత్యహీనులై” ఉందురు.—1 తిమోతి 6:4, 5.
దానికితోడు, పౌలు వ్రాస్తూ సంఘంలో ప్రత్యేక ఆధిక్యతలు ఇవ్వబడిన వ్యక్తి “కొట్టువాడును కాక”—మూల గ్రీకు పదాన్ని బట్టి “పిడిగుద్దులు గుద్దేవాడు కాకుండా” ఉండాలని చెబుతున్నాడు. (1 తిమోతి 3:3) శారీరకంగా దెబ్బలు కొట్టేవాడు లేక మాటలతో హింసించేవాడు కాకూడదు. క్షణాలలోనే కోపపడి హింసాత్మకంగా తయారయ్యేవారు వివాహభాగస్వామిగా ఉండడానికి సరిపోరు.
• అతని లక్ష్యాలు ఏమిటి?
కొంతమంది ధనాన్ని వెంబడించడం ద్వారా అనివార్యంగా ఏర్పడే ఫలితాలను కూడా అనుభవిస్తారు. (1 తిమోతి 6:9, 10) ఇతరులు జీవితంలో ఎలాంటి లక్ష్యాలు లేకుండా వృథాగా కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటారు. (సామెతలు 6:6-11) అయితే, దైవీక వ్యక్తి యెహోషువ కనపరచిన స్థిరనిశ్చయాన్నే కనపరచాలి, ఆయన ఇలా చెప్పాడు: “మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా యంటివారును యెహోవాను సేవించెదము అనెను.”—యెహోషువ 24:15.
ప్రతిఫలాలు మరియు బాధ్యతలు
వివాహమనేది దైవసంస్థాపనై ఉంది. యెహోవా దేవుడు దీనిని అధికారికంగా ఏర్పాటు చేశాడు. (ఆదికాండము 2:22-24) ఈ వైవాహిక బంధం స్త్రీపురుషుల మధ్య చిరకాల బంధంగా ఉండేలా, తద్వారా ఒకరినొకరు పరస్పరం సహకరించుకోవడం కోసం ఏర్పాటుచేయబడింది. భార్యా భర్తలు ఎప్పుడైతే బైబిలు సూత్రాలను వారి జీవితాలలో అనువర్తించుకుంటారో అప్పుడు తమ జీవితాల్లో ఎంతో సంతోషం ఉంటుందని వారు ఎదురుచూడగలరు.—ప్రసంగి 9:7-9.
అయితే, మనం “అంత్యదినములలో అపాయకరమైన కాలము”లలో జీవిస్తున్నామని గుర్తించుకోవలసిన అవసరముంది. ఈ కాలములను గురించి బైబిలు ముందుగనే ఇలా తెలియజేసింది, “మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు . . . అవిధేయులు కృతజ్ఞతలేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు”గా ఉంటారు. (2 తిమోతి 3:1-4) ఒకని వివాహంలో ఈ లక్షణాలు శక్తివంతమైన ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఆ విధంగా, వివాహం చేసుకోవాలని ఎవరైతే ఆలోచిస్తున్నారో వారు దాని తగులుబడిని గంభీరంగా చూసుకోవాలి. వివాహం అయిన వారు సహితం బైబిలులో కనుగొనబడే దైవిక నడిపింపును నేర్చుకొని దానిని అనుసరిస్తూ దాని ఆధారంగా పనిచేయడానికి ప్రయత్నించాలి.
అవును, వివాహం గురించి ఆలోచిస్తున్నవారు, వివాహదినం తరువాతి కాలం గురించి ఆలోచించడం మంచిది. అందరూ వివాహం చేసుకోవడం మాత్రమే కాదు గానీ వివాహ జీవితంలో ఇమిడి ఉన్న దానిని కూడా దృష్టించాలి. యెహోవావైపుకి మార్గదర్శనం కోసం తిరిగినట్లయితే, భావనాత్మకంగా మాత్రమే వివాహాన్ని దృష్టించకుండా, వాస్తవికంగా దృష్టించడానికి వీలవుతుంది. అలా చేయడం ద్వారా విజయవంతమైన వివాహాన్ని అనుభవిస్తారు.
[అధస్సూచీలు]
a పునర్వివాహం చేసుకునే సాధ్యతతో విడాకులు తీసుకునేందుకు బైబిలు ఒకే ఆధారాన్ని ఇస్తుంది, అది “వ్యభిచారం”—వివాహం వెలుపల లైంగిక సంబంధాలు.—మత్తయి 19:9.
[5వపేజీలోనిబాక్సు]
“నేను చదివిన వాటన్నిటిలో కెల్లా ప్రేమను గురించిన శ్రేష్టమైన వర్ణన”
“మీ ప్రేమ నిజమైనదో కాదో మీకు ఎలా తెలుస్తుంది?” అని డాక్టర్. కివన్ లిమన్ వ్రాస్తున్నాడు. “అతి పురాతనమైన పుస్తకమొకటి ప్రేమను గురించిన వర్ణనను కలిగి ఉన్నది. ఆ పుస్తకం దాదాపు రెండు వేల సంవత్సరాల నాటిది, అయినా నేను చదివిన వాటన్నిటిలో కెల్లా ప్రేమను గురించి శ్రేష్టమైన వర్ణనను అది ఇస్తుంది.”
బైబిలులోని 1 కొరింథీయులు 13:4-8లోని అపొస్తలుడైన పౌలు మాటలను గురించి మాట్లాడుతూ డాక్టర్. లిమన్ ఇలా అన్నాడు:
“ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వతకాలముండును.”
[8వపేజీలోనిబాక్సు]
భావోద్రేకాలు మోసపూరితం కావచ్చు
బైబిలు కాలాల్లోని షూలమ్మీతీ, ప్రణయ భావాలు మోసపూరితమైనవని ఖచ్చితంగా ఎరిగి ఉన్నది. శక్తిగల రాజైన సొలొమోను ఆమెను తన మోహంలో పడవేసుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు, ఆమె తన తోటి స్త్రీలతో ఇలా చెప్పింది: “ప్రేమకు ఇష్టమగువరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.” (పరమగీతము 2:7) జ్ఞానవంతురాలైన ఈ యౌవన స్త్రీ తన భావోద్రేకాలు తనను ప్రభావితం చేసేలా తన స్నేహితులు తనపై ఒత్తిడి తీసుకురాకూడదనుకుంది. ఇప్పుడు వివాహం గురించి ఆలోచిస్తున్నవారికి కూడా ఇది ఆచరణయోగ్యమే. మీ భావావేశాల మీద పట్టును కల్గివుండండి. వివాహం చేసుకుంటే మాత్రం ఆ వ్యక్తి మీద ఉన్న ప్రేమను బట్టి అయుండాలి గానీ, కేవలం వివాహం కావాలన్న భావన మూలంగా చేసుకోకూడదు.
[6వ పేజీలోని చిత్రం]
ఎంతోకాలం క్రితమే వివాహమైన వారు కూడా తమ వివాహబంధాన్ని పటిష్ఠపర్చుకోవచ్చు
[7వ పేజీలోని చిత్రం]
ఆయన తన తల్లిదండ్రులతో ఎలా వ్యవహరిస్తాడు?