మీరు వివాహం గురించి ఆలోచిస్తున్నారా?
ఒకవేళ ప్రపంచంలోని విడాకులను భూకంపంతో పోలిస్తే, దానికి అమెరికా ముఖ్యకేంద్రంగా ఉంటుంది. అక్కడ ఇటీవలి సంవత్సరంలో చూస్తే సరాసరి ప్రతి నిమిషానికి రెండు చొప్పున, పది లక్షల కన్నా ఎక్కువ వివాహాలు విచ్ఛిన్నమయ్యాయి. కానీ వైవాహిక జీవితాలు దైన్యస్థితిలో ఉన్నది ఒక్క అమెరికాలో మాత్రమే కాదని మీకు తెలిసేవుంటుంది.
ఒక అధ్యయనం ప్రకారం, విడాకుల రేట్లు 1970 నుండి ఇంగ్లాండు, కెనడా, గ్రీస్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, వేల్స్‌లలో రెండింతలకన్నా ఎక్కువగా పెరిగాయి.
చాలా జంటలు ఒకరినొకరు ప్రేమించి భావిజీవితాన్ని కూడా వారు కలిసి గడపాలనుకుంటూ వారు వైవాహిక జీవితంలోనికి ప్రవేశిస్తారని మనం నమ్మడానికి ప్రతీ కారణముంది. అయితే విచారకరంగా, వివాహబంధం సంతోషంగా ఉండాలని వారు కన్న కలలు కేవలం కలలుగానే మిగిలిపోతున్నాయి. కలనుంచి బయటకి వచ్చి వాస్తవంలోకి చూస్తే, వారు చాలా త్వరగా వివాహం చేసుకున్నామని, లేక తప్పు వ్యక్తిని ఎన్నుకున్నామని, లేక ఈ రెండూ జరిగాయని అంటారు.
ఎందుకు అనేక వివాహాలు విఫలమౌతున్నాయి? “దానికి ముఖ్య కారణం, వివాహానికి సిద్ధపాటు లేకపోవడమే” అని కోర్ట్‌షిప్ గురించిన తన పుస్తకములో ఒక రచయిత్రి చెప్పింది. ఆమె ఇంకా ఇలా అంటుంది: “వైవాహిక సమస్యలలో చిక్కుకున్న జంటలతో నేను వ్యవహరిస్తున్నప్పుడు రెండురకాల భావోద్రేకాలు నాకు ముంచుకొస్తున్నాయి—జాలి, కోపము. వారు పరస్పరం సంతృప్తికరమైన బంధాన్ని అనుభవించాలన్న తమ కలల్ని నిజం చేసుకోలేక పోయారన్న కారణంగా జాలి; ఇక కోపం ఎందుకంటే వివాహం అనేది ఎంత సంక్లిష్టమైనదో వారికి తెలియనందుకు.”
వాస్తవానికి, చాలామంది వివాహాన్ని విజయవంతంగా ఎలా చేసుకోవచ్చన్న దానిగురించి ఏమాత్రం తెలుసుకోకుండా వివాహ జీవితంలోనికి ప్రవేశిస్తారు. కానీ, ఇది ఆశ్చర్యమేమీ కాదు. ఒక విద్యావేత్త ఇలా అన్నాడు: “మన యౌవనుల్లో ఎంతమంది కళాశాల చదువులకు వెళ్ళి ఎలుకలు, బల్లుల ప్రవర్తనను గురించి తెలుసుకుంటూనే, భార్య భర్త అనే ఇద్దరు వ్యక్తుల ప్రవర్తనను గురించి తెలుసుకోవడంలో విఫలమవుతున్నారు?”
మీరు వివాహం చేసుకోవాలనైనా లేదా ఇప్పటికే వివాహితులుగా ఉండి మీ వైవాహిక జీవితం గురించైనా ఆలోచిస్తున్నారా? అలా అయితే నిజజీవితంలోని సంబంధం సినిమాల్లో, టీవీ కార్యక్రమాల్లో, రొమాన్స్ నవలల్లో వర్ణించే దానికన్నా చాలా భిన్నంగా ఉంటుందని మీరు గ్రహించాలి. అదే సమయంలో, పరిణతి చెందిన ఇద్దరు వ్యక్తులు నిజంగా ప్రేమించుకున్నప్పుడు వారి వివాహాన్ని దేవుని నుండి ఒక ఆశీర్వాదంగా దృష్టించవచ్చు. (సామెతలు 18:22; 19:14) అయితే, వివాహంలోని సవాళ్లను స్వీకరించడానికి మీరు సంసిద్ధంగా ఉన్నారని మీరెలా నిశ్చయపర్చుకోవచ్చు? జతను ఎన్నుకుంటున్నప్పుడు మీరు ఎలాంటి విషయాలు పరిగణలోనికి తీసుకోవాలి? లేక మీకు ఇప్పటికే వివాహం అయివుంటే, మీ వివాహంలో నిత్యం నిలిచే సంతోషాన్ని అనుభవించే అవకాశాల్ని మీరు ఎలా పెంపొందించుకోగలరు?