కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 1/15 పేజీలు 28-31
  • “సిరియా ఎడారిలో నల్లజుత్తు యజమానురాలు”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “సిరియా ఎడారిలో నల్లజుత్తు యజమానురాలు”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎడారి అంచున ఉన్న నగరం
  • జనోబీయ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకోవాలని కోరుకుంటుంది
  • జనోబీయకు వ్యతిరేకంగా ఒక చక్రవర్తి ‘తన మనస్సును రేపుకొంటాడు’
  • ఆ ఎడారి నగరం నాశనం చేయబడింది
  • అంత్యకాలంలో “ఉత్తర రాజు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 1/15 పేజీలు 28-31

“సిరియా ఎడారిలో నల్లజుత్తు యజమానురాలు”

ఆమె కాస్త తెల్లగా ఉంటుంది. ఆమె పళ్ళు ముత్యాల్లా మెరుస్తుంటాయి, ఆమె కళ్ళు నల్లగా ఉండి ప్రకాశిస్తుంటాయి. ఆమె మంచి విద్యావంతురాలు, వివిధ భాషా ప్రవీణురాలు. యుద్ధవీరురాలైన ఈ రాణి క్లియోపాత్రా కన్న మేధాసంపత్తిగలదిగానూ, బహుశా ఆమె అంతటి అందమైనదిగానూ చెప్పబడుతుంది. ఆమె తన కాలంనాటి ప్రముఖ ప్రపంచ శక్తిని ఎదుర్కునేందుకు ధైర్యం చూపించింది గనుక, లేఖన నాటకంలోని ఒక ప్రవచనార్థక పాత్రను ఆమె నెరవేర్చింది. ఆమె చనిపోయి చాలా కాలం గడిసిన తర్వాత, రచయితలు ఆమెను పొగిడారు, చిత్రకారులు ఆమెను ఆమె ఉన్నదాని కన్నా సుందరంగా చిత్రీకరించారు. 19వ శతాబ్దపు ఒక కవి ఆమెను “సిరియా అరణ్యంలో నల్లజుత్తు యజమానురాలు” అని వర్ణించాడు. ఇంత ఉన్నతంగా ఎంచబడిన వనిత—పాల్మైరలోని సిరియా నగరపు రాణి—జనోబీయ.

జనోబీయ ఎలా ప్రముఖురాలైంది? ఆమె అధికారంలోకి రావడానికి నడిపిన రాజకీయ వాతావరణం ఎలాంటిది? ఆమె స్వభావం గురించి ఏమని చెప్పవచ్చు? ఈ రాణి ఏ ప్రవచనార్థ పాత్రను నెరవేర్చింది? ఈ నాటకం మొదలైన భౌగోళిక సన్నివేశాన్ని మొదట పరిశీలించండి.

ఎడారి అంచున ఉన్న నగరం

జనోబీయ యొక్క నగరమైన పాల్మైర దమస్కుకు ఈశాన్యమున 210 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది సిరియా ఎడారికి ఉత్తర సరిహద్దుల్లో ఉంటుంది. అక్కడ ఆన్టీ-లెబనోన్‌ పర్వతాలు రాను రాను ఎత్తు తగ్గి మైదానంలో కలిసిపోతాయి. ఎడారిలో నీటిచెలమగా ఉన్న ఈ నగరం పశ్చిమాన మధ్యధరా సముద్రానికీ, తూర్పున యూఫ్రటీసు నదికీ మధ్యలో ఉంటుంది. రాజైన సొలొమోనుకు అది తద్మోరుగానే తెలిసి ఉండవచ్చు. ఆ స్థలం రెండు కారణాల వల్ల ఆయన రాజ్య సంక్షేమానికి ప్రధానమై ఉండింది. తమ ఉత్తర సరిహద్దును కాపాడుకునేందుకు రక్షణ నగరంగా పనిచేయడమూ, ఎడారుల్లో ఉన్న నగరాలకు ప్రాముఖ్యమైన అనుసంధానంగా పనిచేయడమూనే ఆ కారణాలు. కనుక, ‘అరణ్యంలో ఉండే తద్మోరు’ను సొలొమోను ‘తిరిగి కట్టించాడు.’—2 దినవృత్తాంతములు 8:4.

సొలొమోను పరిపాలన తర్వాతి వెయ్యి సంవత్సరాల చరిత్ర తద్మోరు గురించి ఏమీ చెప్పడం లేదు. పాల్మైరను సరిగ్గా గుర్తుపడితే, సా. శ. పూ. 64లో రోమా సామ్రాజ్యానికి సిరియా రక్షణ రాష్ట్రంగా మారిన తర్వాత, పాల్మైర ఉన్నత శిఖరాలను అధిరోహించనారంభించిందని చెప్పవచ్చు. “పాల్మైర రోమ్‌కు రెండు ముఖ్య విషయాల్లో, అంటే ఆర్థికంగాను, సైనిక సంబంధంగాను చాలా ప్రాముఖ్యమైనదిగా ఉండేది” అని పాల్మైర ఆన్డ్‌ ఇట్స్‌ ఎంపైర్‌—జనోబీయ’స్‌ రివోల్ట్‌ అగైన్‌స్ట్‌ రోమ్‌ అనే తన పుస్తకంలో రిచార్డ్‌ స్టోన్‌మన్‌ చెబుతున్నాడు. ఈ ఈత చెట్ల నగరం రోమ్‌ను మెసపటోమియాకూ, తూర్పు దేశాలకూ కలిపే ప్రముఖ వర్తక మార్గంలో ఉండేది. దాని ద్వారా, ప్రాచీన లోకపు వాణిజ్య సిరిసంపదలు రోమ్‌కు చేరుకునేవి. ఈస్టిండీస్‌ నుండి మసాలా దినుసులు చైనా నుండి పట్టూ, పర్షీయా నుండి, క్రింది మెసపటోమియా నుండి, మధ్యధరా ప్రాంతాల నుండి ఇతర వస్తువులూ రోమ్‌కు వచ్చేవి. రోమ్‌ ఈ వస్తువుల దిగుమతిపై ఆధారపడేది.

సిరియా రాష్ట్రం సైనిక సంబంధంగా చూస్తే, రోమ్‌, పర్షీయా అనే శత్రు శక్తుల మధ్య మధ్యస్థ మండలంగా పని చేసేది. మన సామాన్య శకపు మొదటి 250 సంవత్సరాల కాలంలో, యూఫ్రటీస్‌ నది రోమ్‌ను దాని తూర్పు వైపునున్న పొరుగు ప్రాంతం నుండి వేరు చేసింది. యూఫ్రటీస్‌ నది పైన ఉండే డురాయురోపస్‌కు పడమట ఉండే ఎడారికి అవతల ఉంటుంది పాల్మైర. పాల్మైర ప్రముఖ స్థానాన్ని గుర్తించిన హాడ్రియన్‌, వాలరియన్‌ వంటి రోమా చక్రవర్తులు పాల్మైరను సందర్శించారు. హాడ్రియన్‌ దాని వాస్తుశిల్ప ఘనతను పెంచాడు, దానికి ఉదారంగా ఎన్నో విరాళాలను ఇచ్చాడు. సా.శ. 258లో వాలరియన్‌ పాల్మైరన్‌ రాజవంశీకుడైన ఆడయనేథస్‌కు—జనోబీయ భర్త—ప్రమోషన్‌ ఇస్తూ, రోమ్‌ కాన్సల్‌ అనే స్థానాన్ని ఇచ్చాడు. ఎందుకంటే, ఆయన పర్షీయాకు వ్యతిరేకంగా విజయవంతంగా దండయాత్ర చేసి, రోమా సామ్రాజ్యాన్ని మెసపటోమియా వరకు విస్తరింపజేశాడు. తన భర్త అధికారానికి రావడంలో జనోబీయ చాలా ప్రాముఖ్యమైన పాత్రను నిర్వహించింది. “ఆడయనేథస్‌ విజయాన్ని చాలా మట్టుకు ఆమె [జనోబీయ] అసామాన్య శక్తి సామర్థ్యాలకు ఆపాదించవచ్చు” అని చరిత్రకారుడైన ఎడ్‌వార్డ్‌ గిబ్బన్‌ వ్రాశాడు.

ఇంతలో, పర్షీయా రాజైన సేపూర్‌ రోమా ఉన్నతాధికారాన్ని సవాలు చేసి, పర్షీయాలోని మునుపటి రాష్ట్రాలన్నింటిపైనా తన సర్వాధిపత్యాన్ని ప్రకటించుకోవాలనుకున్నాడు. భయంకలిగించేంతటి సైన్యంతో, ఆయన పడమటివైపుగా దండయాత్ర చేసి, నిసబస్‌లోని, కారే (హారాన్‌)లోని రోమా కోటలను స్వాధీనం చేసుకుని, ఉత్తర సిరియా మరియు సిలిసియాలను దోచుకోవడానికి బయలుదేరాడు. చక్రవర్తి వాలరియన్‌ ఆక్రమించడానికి వచ్చినవారితో పోరాడడంలో తన సైన్యానికి స్వయంగా నాయకత్వం వహించాడు. కానీ, పరాజితుడై, పార్శీలకు పట్టుబడ్డాడు.

ఆడయనేథస్‌ పర్షీయా ప్రభువుకు ఖరీదైన బహుమానాలను ఇస్తూ, శాంతి సందేశాన్ని పంపడం సమయోచితమని అనుకున్నాడు. సేపూర్‌ రాజు ఎంతో గర్వంగా, ఆ బహుమానాలను యూఫ్రటీస్‌లో పారవేయమని ఆజ్ఞాపించి, బంధీగా తన ముందుకు వచ్చి విజ్ఞాపన చేసుకోమని ఆడయనేథస్‌కు చెప్పాడు. దానికి జవాబుగా, పాల్మైరవాళ్ళు దేశదిమ్మరులనూ రోమా సైన్యంలో మిగిలినవాళ్ళనూ సమకూర్చి ఇప్పుడు వెనుదిరిగి వెళ్తున్న పార్శీలను కొల్లగొట్టనారంభించారు. అప్పటికే పోరాడి దోచుకున్న వస్తువుల బరువుతో ఉన్న సేపూర్‌ సైనికులు కొట్టి పారిపోయే తంత్రం ఉపయోగించే ఎడారి యోధులకు ఎదురు నిలవలేక, పారిపోవడం తప్పనిసరి అయ్యింది.

ఆడయనేథస్‌ సేపూర్‌పై సాధించిన విజయానికి గుర్తింపుగా, వాలరియన్‌ కుమారుడు, వాలరియన్‌ తర్వాత అధికారానికి రావలసినవాడూ అయిన గాలినస్‌ ఆడయనేథస్‌కు కరెక్టర్‌ టోట్యుస్‌ ఆర్యన్టిస్‌ (యావత్‌ తూర్పుకు గవర్నర్‌) అనే బిరుదును ఇచ్చాడు. కొంతకాలానికి, ఆడయనేథస్‌ తనకు తాను “రాజులకు రాజు” అనే బిరుదును ఇచ్చుకున్నాడు.

జనోబీయ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకోవాలని కోరుకుంటుంది

సా. శ. 267లో తాను అత్యున్నత స్థానంలో ఉన్నప్పుడు, ఆడయనేథస్‌, ఆయన వారసుడూ చంపబడ్డారు. ప్రతీకార భావంతో ఆయన దగ్గరి బంధువే చంపి ఉంటాడని అనుకుంటున్నారు. తన కుమారుడు మరీ చిన్న పిల్లవాడు గనుక, తన భర్త స్థానాన్ని జనోబీయ తీసుకుంది. అందం, లక్ష్యం ప్రకారం ప్రయత్నించే గుణం, కార్యనిర్వహణలో సమర్థత, తన భర్త జీవించి ఉన్నప్పుడు ఆయనతో పాటు దండయాత్రలకు వెళ్ళిన అనుభవం, అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడగల్గడం ఇవన్నీ సొత్తుగాగల ఈమె తన ప్రజల నుండి ఎంతో గౌరవాన్నీ, మద్దతునూ పొందగల్గింది. బెడోయిన్‌ల మధ్య ఇది అంత చిన్న విషయం కాదు. జనోబీయకు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. ఆమె ఎప్పుడూ మేధావులను తన చుట్టూ ఉంచుకునేది. ఆమె సలహాదారుల్లో తత్త్వశాస్త్రవేత్తా, గొప్ప ఉపన్యాసకుడూ అయిన కాషీయస్‌ లాంజైనస్‌ ఒకరు. ఆయన గురించి, “జీవిస్తున్న గ్రంథాలయం, నడుస్తున్న మ్యూజియం” అని చెప్పుకోబడుతుంది. “ఆడయనేథస్‌ మరణించిన తర్వాతి ఐదు సంవత్సరాల కాలంలో . . . జనోబీయ తూర్పు దేశాల్లోని ప్రజల మనస్సుల్లో యజమానురాలిగా స్థానాన్ని ఆక్రమించుకుంది” అని స్టోన్‌మన్‌ అనే రచయిత అన్నాడు.

జనోబీయ ఆధిపత్యం క్రింద ఒక వైపు పర్షీయా ఉంది. ఆమే, ఆమె భర్తా దానిని బలహీనపర్చారు. మరొక వైపు కృంగిపోతున్న రోమ్‌ ఉంది. రోమా సామ్రాజ్యంలోని ఆనాటి పరిస్థితుల గురించి, “మూడవ శతాబ్దం . . . రోమ్‌ యొక్క తూర్పు పడమర సరిహద్దులకు ఒకేలా చాలా కష్టకాలంగా ఉండేది. రోమ్‌లో అంతర్యుద్ధాల, వివాద పరంపరల కాలం మొదలయ్యింది. ఇరవై రెండు మంది చక్రవర్తులు (తాము చక్రవర్తులమని చెప్పుకునేవారిని మినహాయించి) పరిపాలించారు” అని చరిత్రకారుడైన జె. ఎమ్‌. రాబర్ట్స్‌ అంటారు. మరొక వైపు, సిరియా యజమానురాలు తన రాజ్యంలో సామ్రాజ్ఞి స్థానాన్ని సంపూర్ణంగా చక్కగా స్థిరపరచుకుంది. “రెండు సామ్రాజ్యాలను [పర్షీయా, రోమన్‌] సమతుల్యంగా ఉంచుతూ,” “ఆ రెండు సామ్రాజ్యాలపైనా ఆధిపత్యం చెలాయించగల మూడవ సామ్రాజ్యానికి ఆమె ఊపిరి పోయగల్గింది” అని స్టోన్‌మన్‌ అంటున్నాడు.

సా.శ. 269లో ఈజిప్టులోని ఒకరు తనే చక్రవర్తి అని చెప్పుకుంటూ రోమా ఆధిపత్యాన్ని ఎదిరించినప్పుడు, తన రాజ్యాధికారాన్ని విస్తరింపజేసుకునే అవకాశం జనోబీయకు లభించింది. జనోబీయ సైన్యం అతి త్వరగా ఈజిప్టులోకి వెళ్ళి, తిరుగుబాటు చేసిన వ్యక్తిని అణగగొట్టి, ఆ దేశాన్ని కైవశం చేసుకుంది. తనను తాను ఈజిప్టు రాణిగా ప్రకటించుకుంటూ ఆమె తన పేరిట నాణెములను ముద్రించింది. ఆమె రాజ్యం ఇప్పుడు నైలు నది మొదలుకొని యూఫ్రటీస్‌ నది వరకు విస్తరించింది. తన జీవితంలోని, ఈ సమయంలోనే, ఆమె దానియేలులోని బైబిలు ప్రవచనంలో చెప్పబడిన “దక్షిణ దేశపు రాజు” స్థానాన్ని తీసుకుంది. ఎందుకంటే, అప్పట్లో, ఆమె రాజ్యం దానియేలు యొక్క స్వదేశానికి దక్షిణ వైపునున్న ప్రాంతంపై అధికారం చేసింది. (దానియేలు 11:25, 26) ఆమె ఆసియా మైనర్‌లోని చాలా భాగాన్ని కూడా జయించింది.

జనోబీయ తన రాజధానియైన పాల్మైరను అది రోమా ప్రపంచంలోని పెద్ద నగరాల శ్రేణిలో ఉండేంతగా, మరింత పటిష్ఠపరచుకొని, మరింత అలంకరింపజేసింది. దాని జనాభా 1,50,000 కన్నా ఎక్కువగా పెరిగిందని అంచనా. 13 మైళ్ళ వెడల్పు గల గోడల మధ్య నగరమంతా, ప్రకాశమానమైన ప్రజా కట్టడాలూ, ఆలయాలూ, తోటలూ, స్తంభాలూ, స్మారక చిహ్నాలతో నిండిపోయింది. ఒక ముఖ్య వీధికి ఇరువైపులా 50 అడుగుల కన్నా ఎత్తు గల 15,000 కొరింథీ స్తంభాలు వరుసగా సమ దూరంలో బారులుగా (కాలనేడ్‌లు) నిలుచుని ఉన్నాయి. నగరం నిండా మహాపురుషుల, ధనవంతులైన దాతల నిలువెత్తు ప్రతిమలూ, బస్ట్‌లూ (వక్షం వరకు ఉండే ప్రతిమలు) బహుళంగా ఉన్నాయి. సా.శ. 271లో జనోబీయ తన భర్త ప్రతిమను తన ప్రతిమనూ నిలబెట్టించింది. ఎడారి అంచున, పాల్మైర కాంతిలీనుతున్న రత్నంలా ఉండేది.

పాల్మైరలోని అతి శ్రేష్ఠమైన నిర్మాణాల్లో ఒకటి సూర్యదేవుడి ఆలయం. ఆ ఆలయం నగరంలో మత సంబంధంగా ప్రముఖ స్థానంలో ఉండేది. జనోబీయ కూడా సూర్య దేవుడితో సంబంధమున్న దేవతను ఆరాధించి ఉండవచ్చు. అయితే, మూడవ శతాబ్దంలో సిరియా అనేక మతాలుగల దేశంగా ఉంది. జనోబీయ సంస్థానంలో, క్రైస్తవులమని చెప్పుకునేవాళ్ళూ, యూదులు, ఖగోళశాస్త్రజ్ఞులు, సూర్యచంద్రుల ఆరాధకులూ ఉండేవారు. తన రాజ్యంలో ఉన్న వివిధ ఆరాధనల విషయమై ఆమె దృక్పథం ఏమిటి? “బుద్ధిశాలియైన పరిపాలకురాలు తన ప్రజలకు సరైనదని అనిపించే ఆచారాలను అలక్ష్యపెట్టదు. . . . దేవుళ్ళు . . . పాల్మైర పక్షంగా సముచితమైన విధంగా బారులుగా నిలబడతారని ఆశించబడేది” అని రచయితయైన స్టోన్‌మన్‌ అభిప్రాయపడ్డాడు. జనోబీయ మత సహిష్ణుతను చూపించేదన్నది స్పష్టం. దేవుళ్ళు నిజంగానే “పాల్మైర పక్షంగా నిలబడ్డారా”? పాల్మైర సమీప భవిష్యత్తూ, దాని “బుద్ధిగల సామ్రాజ్ఞి” భవిష్యత్తూ ఏమి కానైవున్నాయి?

జనోబీయకు వ్యతిరేకంగా ఒక చక్రవర్తి ‘తన మనస్సును రేపుకొంటాడు’

సా.శ. 270లో ఆరేలియన్‌ రోమ్‌ చక్రవర్తి అయ్యాడు. ఆయన సైన్యాలు ఉత్తరం నుండి వచ్చిన విదేశీయుల దాడిని విజయవంతంగా త్రిప్పి కొట్టి, వాళ్ళకు శిక్ష ఇచ్చింది. సా.శ. 271లో, దానియేలు ప్రవచనంలోని “ఉత్తరదేశపు రాజు”కు ప్రాతినిథ్యం వహించిన ఆరేలియా ‘దక్షిణ దేశానికి’ అప్పుడు ప్రాతినిథ్యం వహించిన జనోబీయకు వ్యతిరేకంగా, ‘తన మనస్సును రేపుకొన్నాడు.’ (దానియేలు 11:25) ఆరేలియన్‌ తన సైన్యాల్లో కొన్నింటిని నేరుగా ఈజిప్టుకు పంపించి, తన ముఖ్య సైన్యాన్ని ఆసియా మైనర్‌ గుండా తూర్పు వైపుకు పంపించాడు.

దక్షిణ దేశపు రాజు—జనోబీయ నాయకత్వంలో జరిగిన పరిపాలన—ఆరేలియన్‌కు వ్యతిరేకంగా, జాబ్‌దాస్‌, జేబై అనే ఇద్దరు జనరల్‌ల నేతృత్వం క్రింద “గొప్ప సైన్యమును సమకూర్చుకొని మహా బలము”తో ‘యుద్ధమునకు సిద్ధపడ్డాడు.’ (దానియేలు 11:25) కానీ ఆరేలియన్‌ ఈజిప్టును కైవశం చేసుకుని, ఆ తర్వాత ఆసియా మైనర్‌కూ, సిరియాకూ దండయాత్ర మొదలుపెట్టాడు. జనోబీయ ఎమసాలో (ఇప్పుడు హోమ్స్‌) ఓడిపోయి, పాల్మైరకు తిరిగి వెళ్ళింది.

ఆరేలియన్‌ పాల్మైరను ముట్టడిచేసినప్పుడు, తనకు సహాయం లభిస్తుందేమోనన్న ఆశతో, తన కుమారుడితోపాటు జనోబీయ పర్షీయాకు పారిపోయింది. కానీ, యూఫ్రటీస్‌ నది దగ్గర రోమన్‌లకు పట్టుబడిపోయింది. సా.శ. 272లో పాల్మైరన్‌లు తమ నగరాన్ని వదులుకున్నారు. ఆరేలియన్‌ పాల్మైర నివాసులతో మర్యాదపూర్వకంగానే వ్యవహరించి, చాలా వస్తువులను, సూర్యదేవుడి ఆలయంలోని విగ్రహాన్ని సహితం తీసుకుని రోమ్‌కు వెళ్ళిపోయాడు. ఆ రోమా చక్రవర్తి జనోబీయను చంపకుండా, సా.శ. 274లో రోమ్‌ గుండా జరిగిన తన విజయోత్సవ ఊరేగింపులో ఆమెను ముఖ్య ఆకర్షణగా చేశాడు. ఆమె తన శేష జీవితాన్ని గౌరవనీయురాలైన ఒక మహిళగా గడిపింది.

ఆ ఎడారి నగరం నాశనం చేయబడింది

ఆరేలియన్‌ పాల్మైరను కైవశం చేసుకుని కొన్ని నెలలు గడిచిన తర్వాత, ఆయన వదిలివెళ్ళిన రోమా సైనికదళాలను పాల్మైరన్‌లు సామూహికంగా వధించేశారు. ఇలా తిరుగుబాటు రేగిందన్న వార్త ఆరేలియన్‌కు చేరుకోగానే, తన సైనికులను తిరిగి అక్కడికి వెళ్ళమని వెంటనే ఆజ్ఞాపించాడు. ఈ సారి వాళ్ళు ఆ జనాభాపై భయంకరంగా ప్రతీకారం తీర్చుకుని వాళ్ళకు తగిన శాస్తి చేశారు. కనికరం చూపకుండా జరిగిన ఆ నరమేధాన్ని తప్పించుకున్నవారిని బానిసలుగా తీసుకువెళ్ళారు. ఎంతో గర్వించిన ఆ నగరం విధ్వంసం చేయబడింది, ఇక ఏ మాత్రం మరమ్మతులు చేయలేని విధంగా నాశనమయ్యింది. ఎంతో కోలాహలంగా ఉండే ఆ రాజధాని నగరం ‘అరణ్యంలో ఉండే తద్మోరు’ అనే పూర్వ స్థితికి చేరుకుంది.

జనోబీయ రోమ్‌ను ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడు, ఆమే, చక్రవర్తియైన ఆరేలియనూ తమకు తెలియకుండానే, “దక్షిణ దేశపు రాజు,” “ఉత్తర దేశపు రాజు”ల పాత్రలను వహించి, దాదాపు 800 సంవత్సరాల క్రితం యెహోవా ప్రవక్త ద్వారా ఎంతో విశదంగా లిఖించబడిన ప్రవచనంలో కొంత భాగాన్ని నెరవేర్చారు. (దానియేలు 11వ అధ్యాయం) తన ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో, జనోబీయ అనేకుల ప్రశంసలను అందుకుంది. అయితే, దానియేలు ప్రవచనంలో ముందుగా తెలియజేయబడిన రాజకీయ ఉనికికి ప్రాతినిధ్యం వహించడంలోని ఆమె పాత్ర అంతకన్నా ప్రాముఖ్యమైనది. ఆమె పరిపాలన ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం కొనసాగలేదు. జనోబీయ రాజ్యపు రాజధానియైన పాల్మైర నేడు కేవలమొక గ్రామమే తప్ప మరేమీ కాదు. శక్తివంతమైన రోమా సామ్రాజ్యం కూడా ఎంతోకాలం క్రితమే తన ప్రాభవాన్ని కోల్పోయింది, ఆధునిక రాజ్యాలకు లొంగిపోయింది. ఈ శక్తుల భవిష్యత్తు ఏమై ఉంటుంది? వాటి భవితవ్యం కూడా బైబిలు ప్రవచనం యొక్క ఖచ్చితమైన నెరవేర్పు చేతే శాసించబడుతుంది.—దానియేలు 2:44.

[29వపేజీలోనిబాక్సు]

జనోబీయ వారసత్వం

పాల్మైర రాణియైన జనోబీయను ఓడించిన తర్వాత, రోమ్‌కు తిరిగి వచ్చిన ఆరేలియన్‌ చక్రవర్తి సూర్యదేవుడికి ఒక ఆలయాన్ని కట్టించాడు. ఆమె నగరం నుండి తీసుకువచ్చిన సూర్యదేవుడి ప్రతిమలను ఆయన ఆ ఆలయంలో నిలబెట్టాడు. తర్వాత జరిగిన మార్పులను గురించి వ్యాఖ్యానిస్తూ, “ఆరేలియన్‌ దక్షిణాయనమున డిసెంబర్‌ 25న, జరుపుకునే సూర్యదేవుడి వార్షిక పండుగను సా.శ. 274లో స్థాపించాడు. ఆరేలియన్‌ అమలులో పెట్టిన విషయాల్లో, బహుశా ఎంతోకాలం కొనసాగినది ఈ పండుగే. ఆ సామ్రాజ్యం క్రైస్తవత్వాన్ని స్వీకరించినప్పుడు, క్రీస్తు జన్మ దినాన్ని ఈ తేదికి మార్చారు. పాత మతానికి చెందిన పండుగలను జరుపుకుని ఆనందించినవారు క్రొత్త మతానికి మారడం సులభమయ్యేందుకే అలా చేశారు. మన క్రిస్మస్‌ను . . . చివరికి సామ్రాజ్ఞి జనోబీయ మూలంగానే జరుపుకుంటున్నామన్నది వింతైన తలంపే” అని హిస్టరీ టుడే అనే పత్రిక చెబుతుంది.

[28, 29వ పేజీలోని చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

మధ్యధరా సముద్రం

సిరియా

అంతియొక

ఎమసా (హోమ్స్‌)

పాల్మైర

దమస్కు

మెసపటోమియా

యూఫ్రటీస్‌

కారే (హారాన్‌)

నిసబస్‌

డురా-యురోపస్‌

[క్రెడిట్‌ లైను]

Map: Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.

Colonnade: Michael Nicholson/Corbis

[29వ పేజీలోని చిత్రం]

ఈ రోమన్‌ నాణెము బహుశా ఆరేలియన్‌నే చిత్రీకరిస్తుంది

[30వ పేజీలోని చిత్రం]

పాల్మైరలోని సూర్యదేవుడి ఆలయం

[క్రెడిట్‌ లైను]

The Complete Encyclopedia of Illustration/J. G. Heck

[31వ పేజీలోని చిత్రం]

జనోబీయ రాణి తన సైనికులను సంబోధిస్తుంది

[క్రెడిట్‌ లైను]

Giovanni Battista Tiepolo, Queen Zenobia Addressing Her Soldiers, Samuel H. Kress Collection, Photograph © Board of Trustees, National Gallery of Art, Washington

[28వ పేజీలోని చిత్రసౌజన్యం]

Detail of: Giovanni Battista Tiepolo, Queen Zenobia Addressing Her Soldiers, Samuel H. Kress Collection, Photograph © Board of Trustees, National Gallery of Art, Washington

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి