“మనం ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడో, అలా ఉన్నారు మీరు”
“ప్రభువు నిమిత్తమై” లౌకిక అధికారాలతో సహకరిస్తూ, ‘సన్మార్గులుగా మెప్పు’ పొందవచ్చని క్రైస్తవులు నిరీక్షించగలరు. (1 పేతురు 2:13-15) కొంతకాలం క్రితం దక్షిణ ఆఫ్రికాలోని ఒక కాలెజ్ క్యాంపస్ హాల్లో యెహోవాసాక్షుల జిల్లా సమావేశం జరిగినప్పుడు ఈ విషయం అనుభవంలోకి వచ్చింది.
సాధారణంగా సమావేశాలు జరిగేటప్పుడు చికాకుపడే, సహకరించని ధోరణి గల సందర్శకులతో అనుభవం గల ఆ కాలెజ్ సెక్యూరిటీ పోలీసులు జిల్లా సమావేశం మొదటిరోజు కూడా అలాంటి సందర్శకులు ఎదురౌతారని వారిని ఎదుర్కోవడానికని సన్నద్ధులయ్యారు. అయితే, యెహోవాసాక్షులతో ఇంతకు ముందెన్నడూ వ్యవహరించని వీళ్ళు ఆశ్చర్యానికి గురయ్యారు!
సెక్యూరిటీలో భాగంగా సెక్యూరిటీ పోలీసులు కాలెజ్ ప్రాంగణం లోపలికి వచ్చే ప్రతీ కారును అలాగే బయటకు వెళ్ళే ప్రతీ కారును గేటు వద్ద చెక్ చేసేవారు. సందర్శకుల కార్లను చెక్ చేసేటప్పుడు ఆలస్యమైనా వాళ్ళు స్నేహపూర్వకంగా, సహనంతో, గౌరవంగా తమను పలకరించినప్పుడు సెక్యూరిటీ పోలీసులు ఎంతో ఆశ్యర్యపోయారు. సాధారణంగా సందర్శకులు వ్యతిరేకించడం, వాదించడం, దుర్భాషలాడడం లాంటివి చేస్తారు. కానీ, వీళ్ళు అలా చేయలేదు. “ఇతర సందర్శకుల వలె కాక, మీరు వినయంతో, సౌమ్యతతో కూడిన హుందాతనాన్ని ప్రదర్శించడం మేమంతా గమనించాం” అని ఒక సెక్యూరిటీ ఆఫీసర్ అన్నారు.
ఒకసారి సెక్యూరిటీ ప్రధాన అధికారి యెహోవాసాక్షుల సహకరించే స్వభావాన్ని తెలుసుకొన్న తర్వాత వాళ్ళ కార్లను చెక్ చేయవలసిన అవసరం లేదని నిర్ణయించుకున్నాడు. “ఎందుకంటే మీకు మంచి క్రమశిక్షణ ఉంది” అని ఆయన అన్నారు. అలా, “జె.డబ్ల్యూ” అని పార్కింగ్ స్టిక్కర్ ఉన్న కార్లు తనిఖీ చేయకుండానే లోపలికి ప్రవేశించడానికి అనుమతిని ఇచ్చారు.
సమావేశం ముగిశాక, యెహోవాసాక్షులు త్వరలోనే తిరిగి రావాలని ఆశిస్తున్నానని ఆ సెక్యూరిటీ అధికారి అన్నారు. “ఇంత మంచి ప్రవర్తన గల వాళ్ళను మేమెన్నడూ చూడలేదు, మనం ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడో, అలా ఉన్నారు మీరు” అని ఆయనన్నారు. ‘తమ సత్క్రియలను చూసి’ ప్రజలు ‘దేవుడ్ని మహిమపరచేలా’ నిజ క్రైస్తవులు తమ ‘మంచి ప్రవర్తనను’ అలాగే కొనసాగించేందుకు అలాంటి ప్రశంస అదనపు ప్రేరణనిస్తుంది.—1 పేతు. 2:12.