దైవిక జీవితమార్గాన పయనించాలని కృతనిశ్చయం
దేవుని సేవ చేయాలనుకునేవారికి “దైవిక జీవిత మార్గము” సమావేశాలు ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చాయి! హాజరైన ఒక స్త్రీ సమావేశాన్ని ఇలా అభివర్ణించింది: “నిర్దేశమూ ప్రోత్సాహమూ ఇవ్వబడిన, జ్ఞానాభివృద్ధి కలిగిన అద్భుతమైన సమయం.”
“ఆనందించడానికి, ఆలోచించడానికి, అందుకోడానికి ఎంతో ఉంది” అని హాజరైన మరో వ్యక్తి చెప్పాడు. మనం ఇప్పుడు ఆ కార్యక్రమాన్నే పరిశీలిద్దాము.
యేసుక్రీస్తు—మార్గము, సత్యము, జీవము
సమావేశం మొదటి రోజు ముఖ్యాంశం ఇదే. (యోహాను 14:6) మనం సమావేశానికి సమకూడిన దాని ఉద్దేశాన్ని మొదటి ప్రసంగం తెలియజేసింది, అదేమిటంటే, సాధ్యమైనంత శ్రేష్ఠమైన జీవిత మార్గాన్ని గురించి అంటే దైవిక జీవిత మార్గాన్ని గురించి మరింతగా బోధించబడాలన్నదే. తన మార్గంలో ఎలా నడవాలో యెహోవా తన ప్రజలకు బోధిస్తాడు. ఇది ఆయన బైబిలు ద్వారా, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా చేస్తాడు. (మత్తయి 24:45-47; లూకా 4:1; 2 తిమోతి 3:16) విశ్వసర్వాధిపతిచే ఉపదేశించబడటం ఎంతటి ఆధిక్యతో కదా!
ఆ రోజు కొరకైన అంశానికి పొందికగా, “క్రీస్తు విమోచన క్రయధనం—దైవిక రక్షణ మార్గము” అన్నది ముఖ్యాంశ ప్రసంగం. దైవిక జీవిత మార్గానికి అనుగుణంగా ఉండేందుకు, యెహోవా సంకల్పంలో యేసుక్రీస్తు పాత్ర ఏమిటన్నది గుర్తించడం ప్రాముఖ్యం. ప్రసంగీకుడు ఇలా చెప్పాడు: “యేసుక్రీస్తు విమోచన క్రయధన బలి లేకుండా ఏ మానవుడైనా, ఆయనకు ఏ నమ్మకాలున్నప్పటికీ లేక ఏ క్రియలు చేసినప్పటికీ, దేవుని నుండి నిత్యజీవాన్ని పొందలేడు.” ఆ తర్వాత ఆయన, “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” అని చెబుతున్న యోహాను 3:16ను ఆయన ఎత్తి చెప్పాడు. క్రీస్తు విమోచన క్రయధన బలి యందు విశ్వాసాన్ని ప్రదర్శించడానికి మనం సత్యాన్ని గూర్చిన కచ్చితమైన జ్ఞానాన్ని పొందడం అవసరం. దానిలో, యెహోవాకు మన జీవితాలను సమర్పించుకోవడం, దాన్ని నీటి బాప్తిస్మం ద్వారా సూచించడం, యేసుక్రీస్తు చూపించిన మాదిరి అనుసారంగా జీవించడం కూడా ఇమిడివున్నాయి.—1 పేతురు 2:21.
మధ్యాహ్న కార్యక్రమం “ప్రేమ మార్గం ఎన్నడూ విఫలం కాదు” అనే ప్రసంగంతో ప్రారంభమయ్యింది. దానిలో 1 కొరింథీయులు 13:4-8 నందు వ్రాయబడివున్న ప్రేమ గురించి పౌలు ఇచ్చిన ప్రేరణాత్మక వివరణ యొక్క ప్రతీ వచన చర్చ జరిగింది. స్వయం త్యాగపూరిత ప్రేమ క్రైస్తవత్వానికి ఒక గుర్తింపు చిహ్నమనీ, దేవునిపట్ల ప్రేమా పొరుగువారిపట్ల ప్రేమా యెహోవా ఆమోదించే ఆరాధనకు ప్రాముఖ్యమైన చిహ్నమనీ ప్రేక్షకులకు గుర్తుచేయబడింది.
ఆ తర్వాత, “తల్లిదండ్రుల్లారా—మీ పిల్లలకు దైవిక మార్గాన్ని అభ్యసింపజేయండి” అనే మూడు భాగాల గోష్ఠి జరిగింది. దేవుని వాక్యాన్ని చదవడంలోనూ పఠించడంలోనూ చక్కని మాదిరిని ఉంచడం ద్వారా తమ పిల్లలు దేవుని సేవ చేసేందుకు తల్లిదండ్రులు సహాయం చేయవచ్చు. క్రమ కుటుంబ పఠనం ద్వారా, పఠనాన్ని కుటుంబ అవసరాలకు తగినట్లు మలుచుకోవడం ద్వారా వారు తమ పిల్లల్లో సత్యాన్ని నాటవచ్చు. పిల్లలు సంఘ కార్యకలాపాల్లోనూ, ప్రాంతీయ పరిచర్యలోనూ భాగం వహించేలా వారికి సహాయం చేయడం కూడా ప్రాముఖ్యం. ఈ దుష్టలోకంలో దైవభయం గల పిల్లలను పెంచడం ఒక సవాలే అయినప్పటికీ, అలా చేయడం గొప్ప ప్రతిఫలాలను తెస్తుంది.
ఆ గోష్ఠి తర్వాత, “ఘనమైన ఉపయోగం నిమిత్తం యెహోవా మిమ్మల్ని మలచనివ్వండి” అనే ప్రసంగం ఇవ్వబడింది. ఎలాగైతే ఒక కుమ్మరి మట్టి పాత్రలను మలుస్తాడో, అలాగే దేవుడు తన సేవ చేయాలనుకునేవారిని మలుస్తాడు. (రోమీయులు 9:20, 21) తన వాక్యంలోనూ, తన సంస్థ ద్వారానూ ఉపదేశాన్ని ఇవ్వడం ద్వారా ఆయనలా చేస్తున్నాడు. మనల్ని మనం అందుబాటులో ఉంచుకుంటే, వచ్చే అవకాశాలకు ప్రతిస్పందిస్తే, మన అడుగులను ఆయన నిర్దేశించడానికి మనం ఇష్టపడితే, మనం మన సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకోవడానికి యెహోవా మనకు సహాయం చేస్తాడు.
ఆ తర్వాత కార్యక్రమంలోని ఉత్తేజకరమైన భాగం ప్రారంభమయ్యింది, అదే “మిషనరీ క్షేత్రంలో సేవ.” మిషనరీ హోదా ఉన్నట్లు పరిగణింపబడుతున్న 2,390 మంది క్రైస్తవ పరిచారకులు ప్రస్తుతం భూవ్యాప్తంగా 148 దేశాల్లో సేవచేస్తున్నారు. వారు యథార్థతా ఆసక్తుల విషయంలో చక్కటి మాదిరిని ఉంచి, విదేశీ క్షేత్రంలో సేవ చేసే ఆధిక్యత తమకు లభించినందుకు ఎంతో కృతజ్ఞతాభావాన్ని కల్గివున్నారు. ఈ అంతర్జాతీయ సమావేశాల్లో, కార్యక్రమంలోని ఈ భాగంలో, మిషనరీ జీవితంలోని సవాళ్ల గురించి, ఆనందాల గురించి మిషనరీలు మాట్లాడారు.
“మరణం తర్వాత జీవితం ఉందా?” అన్నది మొదటి రోజున ఇవ్వబడిన చివరి ప్రసంగం. ఈ ప్రశ్న మానవజాతిని వేల సంవత్సరాలుగా కలవరపరుస్తోంది. అన్ని సమాజాలకు చెందిన ప్రజలూ ఈ విషయాంశంతో మల్లగుల్లాలు పడ్డారు. జవాబులని చెప్పబడుతున్నవాటికి కొదువేమీలేదు. ఆ జవాబులను ఇస్తున్న వారి ఆచారాలూ మతాలూ ఎంత భిన్నంగా ఉన్నాయో, ఆ జవాబులూ అంతే భిన్నంగా ఉన్నాయి. అయినప్పటికీ, ప్రజలు సత్యాన్ని తెలుసుకోవలసిన అవసరం ఉంది.
ఆ తర్వాత, మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? అనే 32 పేజీల రంగుల క్రొత్త బ్రొషూరు విడుదలను ప్రసంగీకుడు ప్రకటించాడు. ఈ బ్రొషూరు, ఆత్మ అమర్త్యమైనదనే బోధ యొక్క ఆవిర్భావాన్ని వివరించి, నేటి ప్రపంచంలోని దాదాపు అన్ని మతాల్లో అది ప్రాథమికాంశంగా ఎలా తయారయిందో చూపిస్తుంది. ఆత్మ గురించి, మనం ఎందుకు మరణిస్తామనే దాని గురించి, మరణిస్తే మనకు ఏమి సంభవిస్తుందనే దాని గురించి బైబిలు ఏమి చెబుతుందో అది స్పష్టంగా, హత్తుకుపోయే విధంగా పరిశీలిస్తుంది. మరణించిన వారికి, జీవించివున్న వారికి ఏ నిరీక్షణ ఉందనేదాన్ని కూడా బ్రొషూరు వివరిస్తుంది. అంతటావున్న సత్యాన్వేషకులకు ఈ ప్రచురణ ఎంతటి ఆశీర్వాదంగా ఉంటుందో కదా!
మీరెలా నడుచుకుంటున్నారో జాగ్రత్తగా చూసుకోండి
సమావేశ రెండవ దినానికి ఇదెంతటి తగిన అంశం ! (ఎఫెసీయులు 5:15) ఉదయకాల కార్యక్రమం ప్రకటన మరియు శిష్యులను చేసే పనులపై కేంద్రీకరించబడింది. దినవచన చర్చ తర్వాత, “జీవమార్గంలోకి రావడానికి ప్రజలకు సహాయం చేయడం” అనే ప్రసంగంతో కార్యక్రమం కొనసాగింది. ఈ అత్యవసర పనిని కొనసాగించడంలో, సత్యాన్ని ఇతరులతో పంచుకోవడం ఆధిక్యతే కాదు మన బాధ్యత కూడా అని గుర్తించి అనుకూల దృక్పథాన్ని కల్గివుండడం ప్రాముఖ్యం. సా.శ. మొదటి శతాబ్దంలో, చాలామంది దేవుని వాక్యాన్ని నిరాకరించారు. అయితే, వ్యతిరేకత ఉన్నప్పటికీ, ‘నిత్యజీవానికి నిర్ణయింపబడినవారై విశ్వాసులైన వారు’ ఉన్నారు. (అపొస్తలుల కార్యములు 13:48, 50; 14:1-5) నేడు కూడా అలాంటి పరిస్థితే ఉంది. చాలామంది బైబిలు సత్యాన్ని నిరాకరించినప్పటికీ, అనుకూలంగా ప్రతిస్పందించే వారి కోసం మనం వెదుకుతూనే ఉంటాము.—మత్తయి 10:11-13.
జీవ సందేశంతో ఇతరులను చేరడంలోని సవాలు గురించి తర్వాతి ప్రసంగం చర్చించింది. ఈ రోజుల్లో ప్రజలను ఇళ్ల వద్ద కలుసుకోవడం కష్టం గనుక, వీలైనంత ఎక్కువమందిని రాజ్య సందేశంతో కలుసుకోవడానికి మనకు నైపుణ్యమూ, సామర్థ్యమూ ఉండాలి. అనేక దేశాల్లో, సువార్త ప్రచారకులు టెలిఫోను సాక్ష్యం ద్వారా వ్యాపార ప్రాంతాల్లో ప్రకటించడం ద్వారా, మరో విధంగానైతే కలుసుకోవడం సాధ్యం కాని వారిని కలుసుకుంటూ చక్కని ఫలితాలను పొందుతున్నారు.
“క్రీస్తు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ శిష్యులకు బోధించడం” అనే ప్రసంగం, మనం మన పరిచర్యలో నిపుణులమవ్వవలసిన దాని ప్రాముఖ్యత గురించి తెలియజేసింది. మనం ఇతరుల నుండి నేర్చుకుని, సంఘ కూటాల్లో అందజేయబడే చక్కని తర్ఫీదును ఆచరణలో పెడ్తూ ఉండగా మన బోధనా నైపుణ్యాలు పదునుదేలుతాయి. మనం మన బోధనాపనిలో నిపుణులమౌతుండగా, బైబిలు సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రజలకు సహాయం చేసే మన పనిలో మనం అధిక ఆనందాన్ని, సంతృప్తిని పొందుతాం.
సమర్పణ బాప్తిస్మాల భావాన్ని తెలియజేసే ప్రసంగంతో ఉదయకాల కార్యక్రమం ముగిసింది. ప్రసంగీకుడు చెప్పిన విషయాల్లో ఒకటేమిటంటే, మనం దేవుణ్ని పూర్తిగా విశ్వసించి, ఆయన చిత్తాన్ని చేయడానికి తీవ్రంగా కృషి చేస్తే ఆయన మనల్ని ఆశీర్వదించి, బలపరుస్తాడు. జ్ఞాని ఇలా వ్రాశాడు: “నీ ప్రవర్తన అంతటియందు [దేవుని] అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు, ఆయన నీ త్రోవలను సరాళము చేయును.” (సామెతలు 3:6) అనేకులు దైవిక జీవితానికి అనుగుణ్యంగా ఉండనారంభించారని చూపిస్తున్న ఆనందభరితమైన బాప్తిస్మమే సమావేశ ఉన్నతాంశంగా ఉంది.
మధ్యాహ్న భోజన విరామం తర్వాత, “నిరంతర జీవితాన్ని దృష్టిలో ఉంచుకుని సేవచేయడం” అనే ప్రసంగంతో మధ్యాహ్న కార్యక్రమం ప్రారంభమైంది. విధేయులైన మానవజాతి భూమిమీద నిరంతరం తన సేవ చేయాలనే దేవుని సంకల్పం నెరవేరుతుంది. మనం మన ఆలోచనలను, ఆశయాలను, నిరీక్షణలను నిరంతర జీవితాన్ని దృష్టిలో ఉంచుకుని సేవ చేయడంపై కేంద్రీకరించడం ఎంత సరైందో కదా! మనం “యెహోవా దినాన్ని” ఆశతో అపేక్షించవలసి ఉన్నప్పటికీ, అనంత కాలం సేవచేయాలన్నది మన లక్ష్యమని జ్ఞాపకముంచుకోవడం ప్రాముఖ్యం. (2 పేతురు 3:12) దేవుని తీర్పును యేసు ఎప్పుడు అమలుపరుస్తాడనే కచ్చితమైన సమయం తెలియకపోవడం మనం జాగరూకత కల్గివుండడానికి సహాయం చేసి, మనం నిస్వార్థ ఉద్దేశాలతో యెహోవా సేవ చేయడానికి ప్రతిరోజు అవకాశాలను ఇస్తుంది.
ఆ తర్వాత ఇవ్వబడిన రెండు ప్రసంగాలు, పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక యొక్క నాలుగవ అధ్యాయాన్ని పరిశీలించాయి. పరిశీలించబడిన విషయాల్లో, పరిశుద్ధాత్మచే నియమించబడి ఆధ్యాత్మికంగా అర్హతగల పురుషులైన “మనుష్యులలో ఈవుల” రూపంలో మనకున్న ఆశీర్వాదం ఒకటి. ఈ పెద్దలు మన ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం ఉపదేశాన్ని, నిర్దేశాన్ని ఇస్తారు. పౌలు ప్రేరేపిత లేఖ కూడా “నవీన స్వభావమును” ధరించుకోమని క్రైస్తవులకు ఉద్బోధిస్తుంది. (ఎఫెసీయులు 4:8, 24) దైవిక వ్యక్తిత్వంలో జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ప్రేమ వంటి లక్షణాలు ఇమిడివున్నాయి.—కొలొస్సయులు 3:12-14.
మనం ఎలా నడుచుకుంటున్నామనేదాన్ని జాగ్రత్తగా గమనించడంలో మనల్ని మనం లోక మాలిన్యం అంటకుండ చూసుకోవడం కూడా చేరివుంది—ఇదే తర్వాతి ప్రసంగపు అంశం. వినోదం, సామాజిక కార్యకలాపాలు వంటి వాటిని ఎంపిక చేసుకోవడంలోనూ, వస్తుసంబంధమైన ఆస్తులను సంపాదించుకోవడంలోనూ సమతూకం అవసరం. మనకు లోక మాలిన్యం అంటకుండా చూసుకోమని యాకోబు 1:27 నందివ్వబడిన ఉపదేశాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా, మనం దేవుని ఎదుట పవిత్రమైన స్థానాన్ని, మంచి మనస్సాక్షిని కల్గివుంటాము. మనం సంకల్పసహితమైన జీవితాలను కూడా గడపగల్గుతాము, మనం శాంతితో ఆధ్యాత్మిక సంక్షేమంతో, ఆహ్లాదకరమైన సహవాసులతో ఆశీర్వదించబడతాము.
ఆ తర్వాత, “యౌవనస్థులారా—దైవిక మార్గాన్ని అనుసరించండి” అనే మూడు భాగాల గోష్ఠి జరిగింది. దేవుడు తమను ప్రేమిస్తున్నాడని, స్వచ్ఛారాధనను ఉన్నతపర్చడానికి తాము చేసే కృషిని ఆయన మెచ్చుకుంటాడని తెలుసుకుని, యౌవనస్థులు నమ్మకంగా ఆయన సేవ చేయడానికి తమ గ్రహణశక్తులకు తర్ఫీదునిచ్చుకోవాలి. గ్రహణశక్తులను పెంపొందింప జేసుకోవడానికి ఒక మార్గం ఏమిటంటే, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదివి దాని గురించి ధ్యానించడం. మనమలా చేస్తే, మనం యెహోవా మార్గాలను తెలుసుకోగల్గుతాము. (కీర్తన 119:9-11) తలిదండ్రులు, పెద్దలు, సంస్థ ప్రచురణలు ఇచ్చే పరిణితి చెందిన ఉపదేశాన్ని తీసుకోవడం ద్వారా కూడా గ్రహణ శక్తులు పెంపొందుతాయి. యౌవనస్థులు తమ గ్రహణశక్తులను సరైన విధంగా ఉపయోగించుకోవడం ద్వారా, వస్తుసంబంధ ఆస్తులను గూర్చిన అమితమైన చింత, అశుద్ధమైన సంభాషణ, దేవుని నుండి వేరైపోయిన ఈ ప్రపంచానికి గుర్తింపు చిహ్నంగా ఉన్న విశృంఖల వినోదం వంటివాటికి దూరంగా ఉంటారు. దైవిక జీవిత మార్గాన్ని అనుసరించడం ద్వారా, యౌవనులు వృద్ధులు ఒకేలా నిజమైన సాఫల్యాన్ని ఆస్వాదించగల్గుతారు.
“సృష్టికర్త—ఆయన వ్యక్తిత్వము, ఆయన మార్గాలు” అన్నది ఆనాటి చివరి ప్రసంగం. లక్షలాదిమందికి సృష్టికర్త గురించి తెలియదని చెప్పిన తర్వాత ప్రసంగీకుడు ఇలా అన్నాడు: “జీవిత సార్థకత, మన వ్యక్తిగత దేవుడైన సృష్టికర్తను తెలుసుకోవడంతో, ఆయన వ్యక్తిత్వాన్ని గుర్తించడంతో, ఆయన మార్గాలతో సహకరించడంతో ముడిపడి ఉంది. . . . సృష్టికర్తను అంగీకరించి, ఆయనకు సంబంధించి భావాన్ని కనుగొనేందుకు ప్రజలకు సహాయం చేయడానికి మీరు ఉపయోగించగల, మన ప్రపంచానికీ మనకూ సంబంధించిన వాస్తవాలు ఉన్నాయి.” తర్వాత జ్ఞానియైన ప్రేమగల సృష్టికర్త ఉనికిలో ఉన్నాడనడానికిగల సాక్ష్యాధారాన్ని గురించి ప్రసంగీకుడు చర్చించాడు. మీపట్ల శ్రద్ధగల సృష్టికర్త ఉన్నాడా? (ఆంగ్లం) అనే క్రొత్త పుస్తకాన్ని విడుదల చేయడంతో ప్రసంగం ముగింపుకొచ్చింది.
“ఇదే త్రోవ దీనిలో నడువుడి”
సమావేశ మూడవ దిన ముఖ్యాంశం ఇదే. (యెషయా 30:21) యెహెజ్కేలు యొక్క ఆలయ దర్శనంపై కేంద్రీకరించబడిన, మూడు భాగాల ఉత్తేజకరమైన గోష్ఠితో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ దర్శనం మన కాలంలోని స్వచ్ఛారాధనతో సంబంధం కల్గివుంది గనుక నేడు దేవుని ప్రజలకు అది ఎంతో భావాన్ని కల్గివుంది. యెహోవా యొక్క గొప్ప ఆధ్యాత్మిక ఆలయం స్వచ్ఛారాధన కోసం ఆయన చేసిన ఏర్పాటుకు ప్రాతినిధ్యం వహిస్తుందన్నదే ఆ దర్శనాన్ని అర్థం చేసుకోవడానికి కీలకం. దర్శనంలోని అంశాలు చర్చించబడుతుండగా, అభిషిక్త శేషపు ప్రేమగల పైవిచారణ కర్తలు మరియు అధిపతి తరగతికి చెందే భావి సభ్యులు చేసే పనికి మద్దతుగా తాము చేస్తున్న పని గురించి శ్రోతలు ఆలోచించారు.
ఉదయం వేళ ఆ తర్వాత, పూర్తి క్యాస్ట్యూమ్స్ ధరించిన పాత్రధారులు వేసిన ఆసక్తికరమైన బైబిలు నాటకం మొదలైంది. ఆ నాటకం పేరు “కుటుంబములారా—అనుదిన బైబిలు పఠనాన్ని మీ జీవిత మార్గంగా చేసుకోండి!” రాజైన నెబుకద్నెజరు బబులోనులో నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించడానికి నిరాకరించిన ముగ్గురు హెబ్రీయుల విశ్వాసాన్ని, ధైర్యాన్ని అది చిత్రీకరించింది. బైబిలు కేవలం ఒక ప్రాచీన చరిత్ర పుస్తకమే కాదు గాని దాని ఉపదేశం నేటికీ యౌవనులకు, పెద్దవారికి ఒకేలా నిజంగా ప్రయోజనకరమైనదని చూపించడమే ఆ నాటకం ఉద్దేశం.
మధ్యాహ్న కార్యక్రమం “నిత్యజీవానికి ఏకైక మార్గం” అనే బహిరంగ ప్రసంగానికి సమయం. మానవజాతి పాప మరణాలలోకి పడిపోవడానికి సంబంధించిన చరిత్ర గురించి చెప్పిన తర్వాత, ప్రసంగీకుడు ఆలోచన రేకెత్తించే ఈ మాటలతో ముగించాడు: “ఈ సమావేశ దినపు ముఖ్యాంశ బైబిలు లేఖనంగా యెషయా 30వ అధ్యాయం, 21వ వచనం తీసుకోబడింది. అదిలా చెబుతుంది: “మీరు కుడి తట్టయనను ఎడమ తట్టయనను తిరిగినను—ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండియొక శబ్దము నీ చెవులకు వినబడును.” మనం ఈ శబ్దాన్ని ఎలా వింటాం? దేవుని వాక్యమైన పరిశుద్ధ బైబిలు చెబుతున్నదేమిటో ఆలకించడం ద్వారా, ఇంకా మన మహాగొప్ప బోధకుడైన యెహోవా దేవుడు బైబిలు ద్వారానూ తన ఆధునిక-దిన క్రైస్తవ సంస్థ ద్వారానూ అందజేస్తున్న నడిపింపును అనుసరించడం ద్వారా మనమా శబ్దాన్ని వింటాం. వాస్తవానికి, నిత్యజీవాన్ని పొందడానికి ఇదే ఏకైక మార్గమై ఉంది.”
ఆ వారం కొరకైన కావలికోట పఠన సమీక్ష తర్వాత, “యెహోవా మార్గంలో నడవడంలో కొనసాగండి” అనే చివరి ప్రసంగం ఇవ్వబడింది. ఆ ప్రసంగంలో కొంతవరకు, కార్యక్రమంలోని ముఖ్యాంశాలు పునఃపరిశీలించబడ్డాయి. ఆ తర్వాత, దైవిక జీవిత మార్గంలో జీవితాన్ని కొనసాగించాలనే నిశ్చయతను వ్యక్తపర్చే తీర్మానాన్ని ప్రసంగీకుడు ప్రవేశపెట్టాడు.
ఆ తీర్మానం ప్రేరణాత్మకమైన ఈ మాటలతో ముగిసింది: “లేఖనాధార సూత్రాలకు, ఉపదేశానికి, నిర్దేశానికి అనుగుణంగా జీవించడం నేడు శ్రేష్ఠమైన జీవితాన్ని గడిపేలా సహాయం చేస్తుందని, భవిష్యత్తుకు చక్కని పునాదిని వేస్తుందని, తద్వారా నిజమైన జీవితంపై మనం గట్టి పట్టును కల్గివుండవచ్చునని మనం పూర్తిగా ఒప్పించబడ్డాము. అన్నిటికంటే ముఖ్యంగా, మనం యెహోవా దేవుణ్ని మన పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో ప్రేమిస్తున్నాము గనుక మనం ఈ తీర్మానాన్ని తీసుకుంటున్నాము!” హాజరైన వారందరూ ప్రతిధ్వనించేలా అవును అని చెబుతూ తమ అంగీకారాన్ని తెల్పారు!
[8వ పేజీలోని బాక్సు]
మీపట్ల శ్రద్ధగల సృష్టికర్త ఉన్నాడా?
ఈ పేరుగల క్రొత్త పుస్తకం సృష్టికర్తయైన యెహోవా ఉనికి గురించి ఒప్పింపజేసే సాక్ష్యాధారాన్ని అందజేస్తూ, ఆయన లక్షణాలను చర్చిస్తుంది. లౌకిక సంబంధ విషయాల్లో బాగా విద్యావంతులైవుండి దేవుణ్ని నమ్మని వారి కోసం ప్రాముఖ్యంగా ఇది రూపొందించబడింది. 192 పేజీల ఈ పుస్తకం దేవుని యందు ఇప్పటికే నమ్మకం వున్న వారి విశ్వాసాన్ని కూడా బలపర్చి, ఆయన వ్యక్తిత్వం పట్ల మార్గాల పట్ల మెప్పును పెంపొందింపజేస్తుంది.
మీపట్ల శ్రద్ధగల సృష్టికర్త ఉన్నాడా? (ఆంగ్లం) అనేది పాఠకుడికి దేవుని మీద నమ్మకం ఉందని అనుకోవడం లేదు. బదులుగా, అది సృష్టకర్త ఉనికికి నిదర్శనాన్నిస్తున్న వైజ్ఞానికపరమైన ఇటీవలి అన్వేషణలను తలంపులను చర్చిస్తుంది. అందులోని కొన్ని అధ్యాయాలు ఇలా ఉన్నాయి: “ఏది మీ జీవితానికి అర్థాన్ని చేకూర్చగలదు?,” “మన విశ్వం ఇక్కడికెలా వచ్చింది?—ఒక వివాదం,” “మీరెంత అనుపమానంగా ఉన్నారు!” బైబిలు దైవికంగా ప్రేరేపించబడినదని మనం ఎందుకు నమ్మకం కల్గివుండవచ్చనే దాన్ని ఇతర అధ్యాయాలు పరిశీలిస్తాయి. ఈ క్రొత్త పుస్తకం సృష్టికర్త వ్యక్తిత్వాన్ని, మార్గాలను బయల్పర్చే బైబిలు గురించి పూర్తి అవగాహనను ఇస్తుంది. దేవుడు ఇంత బాధను ఎందుకు అనుమతించాడు అనే కాక ఆయన దాన్ని ఎన్నడూ ఉండకుండా ఎలా నిర్మూలిస్తాడు అనేది కూడా అది వివరిస్తుంది.
[7వ పేజీలోని చిత్రాలు]
ఎంతోమంది బాప్తిస్మం తీసుకున్నారు
[7వ పేజీలోని చిత్రాలు]
యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యుడైన ఏ. డి. ష్రోడర్ క్రొత్త బ్రొషూర్‌ను విడుదల చేశారు
[8, 9వపేజీలోనిచిత్రం]
ఉత్తేజకరమైన నాటకం, ప్రతిరోజు బైబిలును చదవమని ప్రోత్సహించింది