కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 12/15 పేజీలు 5-9
  • యేసు జననం—వాస్తవిక వృత్తాంతం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యేసు జననం—వాస్తవిక వృత్తాంతం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వృత్తాంతాలను వ్రాయడంలో గల ఉద్దేశం
  • బేత్లెహేములో యేసు జననం
  • యెహోవా అనుగ్రహం సత్యం కోసం వినయంతో వెదికే వారిపైనే
  • ప్రమాదంలో శిశువు
  • క్రీస్తు జననం—మీకు దాని భావం?
  • యేసు జనన వివరాల నుండి పాఠాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • నిజంగా ముగ్గురు జ్ఞానులు చంటి బిడ్డయిన యేసును చూడడానికి వచ్చారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • యేసు ఎప్పుడు, ఎక్కడ పుట్టాడు?
    యేసే మార్గం, సత్యం, జీవం
  • యేసు—ఎక్కడ నుండి వచ్చాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 12/15 పేజీలు 5-9

యేసు జననం—వాస్తవిక వృత్తాంతం

మీ దేశ చరిత్రలో మీకు బాగా తెలిసిన ఒక సంఘటనను గూర్చి ఆలోచించండి. ఈ సంఘటన ఒకరి కంటే ఎక్కువ చరిత్రకారులచే పూర్తి ఆధారాలతో రికార్డు చేయబడిందనుకోండి. అయితే, ఈ సంఘటన ఎప్పుడూ జరగలేదని, అదంతా కేవలం కల్పితమని ఎవరైనా మీతో చెబితే అప్పుడేమిటి? అంతదాకా ఎందుకు మీ ఇంటి విషయమే తీసుకోండి. మీ తాతయ్యగారి జననం, ఆయన జీవితాన్ని గూర్చి మీ కుటుంబం మీకు చెప్పినది తప్పని ఎవరైనా వాదిస్తే అప్పుడేమిటి? అది మీకు కోపం తెప్పించవచ్చు. అటువంటి నిరాధారమైన వాదనలను మీరు ఖచ్చితంగా నిరాకరిస్తారు!

అయినా, యేసు జననాన్ని గూర్చి మత్తయి, లూకాలు వ్రాసిన సువార్త వృత్తాంతాలను నేటి విమర్శకులు సాధారణంగా నిరాకరిస్తుంటారు. ఈ వృత్తాంతాలు భిన్నమైనవి, పరస్పర విరుద్ధమైనవి, పూర్తిగా అబద్ధమని, అవి అజాగ్రత్తతో చేసిన పొరబాట్లని, చరిత్రపరంగా చూస్తే తప్పులతడక అని వారు చెబుతారు. అది నిజమా? వారి ఆరోపణల్ని అంగీకరించే బదులు సువార్త వృత్తాంతాలను మనమే వ్యక్తిగతంగా పరిశీలిద్దాం. ఈ పరిశీలనను చేస్తూ ఉండగా అవి మనకు ఏమి బోధిస్తున్నాయో చూద్దాం.

వృత్తాంతాలను వ్రాయడంలో గల ఉద్దేశం

మొట్టమొదటిగా బైబిలు వృత్తాంతాల సంకల్పాన్ని గుర్తించడం ప్రయోజనకరం. అవి జీవితచరిత్రలు కాదు; అవి సువార్తలు. ఈ తేడా ప్రాముఖ్యమైనది. ఒక జీవితచరిత్రలో రచయిత తన పాత్రలోని అంశాన్ని అభివృద్ధి పరచి బాగా కనపరచడానికైన ప్రయత్నంలో, వందలకొద్దీ పేజీలను నింపుతాడు. కొంతమంది చరిత్రకారులైతే, పాత్ర యొక్క వంశావళిని గూర్చిన, పుట్టుకను గూర్చిన, బాల్యాన్ని గూర్చిన వివరాల కోసం అనేకానేక పేజీలను వెచ్చిస్తారు. సువార్తలు వీటికి భిన్నమైనవి. నాలుగు సువార్త వృత్తాంతాల్లో, కేవలం మత్తయి, లూకాలు మాత్రమే యేసు జననాన్ని గూర్చి, బాల్యాన్ని గూర్చి చెప్పారు. యేసు మానవుడిగా ఎలా పెరిగాడో చూపించడం వారి లక్ష్యం కాదు. యేసు ఈ భూమి పైకి రావడానికి ముందు ఆత్మ ప్రాణిగా జీవించాడన్న విషయాన్ని ఆయన అనుచరులు గుర్తించారని జ్ఞాపకముంచుకోండి. (యోహాను 8:23, 58) కనుక, మత్తయి, లూకాలు యేసు ఎటువంటి వ్యక్తి అవుతాడనే దాన్ని వివరించడం కోసం వారు యేసు బాల్యంపై దృష్టిని కేంద్రీకరించలేదు. బదులుగా వారి సువార్తల ఉద్దేశానికి తగిన సంఘటనలనే వారు చెప్పారు.

వాటిని వ్రాయడంలో వారికి గల ఉద్దేశం ఏమిటి? “సువార్త” అంటే “మంచి వార్త.” రచయితలు ఇద్దరూ ఒకే సమాచారాన్ని కల్గి ఉన్నారు అదేమిటంటే, యేసు వాగ్దానం చేయబడిన మెస్సీయా లేదా క్రీస్తు; మానవజాతి పాపాల కోసం ఆయన మరణించాడు; ఆయన పరలోకానికి పునరుత్థానమయ్యాడు. వీరిద్దరూ భిన్నమైన నేపథ్యాలను కల్గి ఉన్నారు, వారు వేర్వేరు ప్రజలను ఉద్దేశించి వ్రాశారు. మత్తయి ఒక సుంకరి, తన వృత్తాంతాన్ని ఆయన యూదులను దృష్టిలో పెట్టుకొని వ్రాశాడు. లూకా ఒక వైద్యుడు, బహుశ ఏదో గొప్ప స్థానాన్ని కల్గివున్న “ఘనతవహించిన థెయొఫిలా”కు వ్రాశాడు—దీన్నే పొడిగిస్తే యూదులకూ అన్యులకూ వ్రాశాడని చెప్పవచ్చు. (లూకా 1:1-3) ఒక్కొక్కరు ప్రత్యేకించి తన పాఠకులను ఒప్పించేందుకు తగిన సంఘటనలను ఎన్నుకున్నారు. మత్తయి వృత్తాంతం యేసుక్రీస్తుకు సంబంధించిన హెబ్రీ లేఖన ప్రవచనాల నెరవేర్పును గూర్చి నొక్కి చెప్పింది. మరొక వైపు లూకా తన యూదేతర పాఠకులు గుర్తించగల్గేలా చరిత్రపుస్తకం శైలిలో వ్రాశాడు.

వారిద్దరి వృత్తాంతాలు భిన్నంగా ఉన్నాయంటే అందుకు ఆశ్యర్యపోనవసరం లేదు. కానీ, అవి రెండూ ఒకదానికొకటి విరుద్ధంగా లేవు. ఒక పూర్తి చిత్రాన్నివ్వడానికి ఆ రెండూ ఒకదానికొకటి సహాయపడుతున్నాయి.

బేత్లెహేములో యేసు జననం

మత్తయి, లూకాలు ఇద్దరూ యేసు జననాన్ని గూర్చిన అత్యంతాద్భుతకరమైన విషయాన్ని రికార్డు చేశారు, అదేమిటంటే, ఆయన ఒక కన్యకకు జన్మించాడు. ఈ అద్భుతం కొన్ని శతాబ్దాల క్రితం యెషయా ద్వారా ప్రవచించబడిన ప్రవచన నెరవేర్పని మత్తయి చూపించాడు. (యెషయా 7:14; మత్తయి 1:22, 23) యేసు బేత్లెహేములో జన్మించాడని లూకా వివరించాడు, ఎందుకంటే కైసరు ఏర్పాటు చేసిన ప్రజాసంఖ్యలో తమ పేర్లను నమోదు చేయించుకోవడానికి యోసేపు, మరియలు అక్కడికి ప్రయాణమయ్యారు. (7వ పేజీలోని బాక్సు చూడండి.) యేసు బేత్లెహేములో జన్మించాడన్నది గుర్తించవలసిన విషయం. యెరూషలేముకు దగ్గరలోని ఈ అల్పమైనదిగా కన్పిస్తున్న పట్టణంలోనే మెస్సీయా కన్పిస్తాడని కొన్ని శతాబ్దాల క్రిందటే ప్రవక్తయైన మీకా ప్రవచించాడు.—మీకా 5:2.

పశువుల కొట్టం చిత్రాలు లేదా బొమ్మలకు ఆధారంగా యేసు జన్మించిన రాత్రి ప్రఖ్యాతి గాంచింది. కానీ యేసు జననాన్ని గూర్చిన వాస్తవ వృత్తాంతం తరచూ చిత్రీకరించబడుతున్న ఇటువంటి చిత్రీకరణకు పూర్తిగా భిన్నంగా ఉంది. బేత్లెహేముకు యోసేపు, మరియలను కొనిపోయిన ప్రజాసంఖ్యను గూర్చి మనకు తెలియజేసిన చరిత్రకారుడైన లూకా, ప్రాముఖ్యమైన ఆ రాత్రివేళ కొందరు గొఱ్ఱెల కాపరులు తమ మందతో పొలములో గడుపుతున్నారని కూడా తెలియజేశాడు. ఈ రెండు సందర్భాలు అనేకమంది బైబిలు పరిశోధకులను యేసు డిసెంబరులో జన్మించలేదన్న ముగింపుకు తెస్తున్నాయి. అప్పటికే తిరుగుబాటు చేసేవారిగా ఉన్న యూదులకు ఇంకా ఆగ్రహం కలిగేలా కైసరు వారిని ఆ చలి, వర్షాకాలాల్లో తమ స్వంత పట్టణాలకు వెళ్లమని బలవంతం చేసి ఉండకపోవచ్చునని కూడా వారు అంటారు. అదే విధంగా, బాగా చలిగా ఉన్న అటువంటి వాతావరణంలో గొఱ్ఱెల కాపరులు తమ మందలతో పొలములో గడుపుతూ ఉండకపోవచ్చని కొందరు పండితులు చెబుతారు.—లూకా 2:8-14.

యెహోవా తన కుమారుని జననాన్ని గూర్చి తెలిపేందుకు మంచి విద్య, పలుకుబడి ఉన్న మతనాయకులను ఎన్నుకోలేదు గానీ పొలాల్లో నివసించే శ్రామికులను ఎన్నుకున్నాడు. కాపరులు నిర్ణీత పని సమయాన్ని కల్గి లేనందువల్ల అది, మౌఖిక నియమంలోని కొన్ని అంశాలకు వారిని దూరంగా ఉంచింది. తత్ఫలితంగా వీరికి శాస్త్రులు, పరిసయ్యులకు మధ్య సంబంధం ఉండేది కాదు. వేలాది సంవత్సరాల కొలది దేవుని ప్రజలు ఎదురుచూస్తున్న మెస్సీయా బేత్లెహేములో జన్మించాడన్న సమాచారాన్ని దేవదూతల సమూహం ద్వారా అందించడానికి దేవుడు విధేయత, విశ్వాసం గల ఈ మనుష్యులను ఎన్నుకోవడం ద్వారా వారిని ఘనంగా సన్మానించాడు. మరియ, యోసేపు, తొట్టిలో పండుకొని ఉన్న శిశువును దర్శించడానికి వచ్చిన మనుష్యులు వీరేగానీ చిత్రాలు లేదా బొమ్మలలో వర్ణించే “ముగ్గురు రాజులు” మాత్రం కాదు.—లూకా 2: 15-20.

యెహోవా అనుగ్రహం సత్యం కోసం వినయంతో వెదికే వారిపైనే

తనను ప్రేమించి, తన సంకల్ప నెరవేర్పు కోసం ఆసక్తితో ఎదురుచూసే వినయం గల ప్రజలపైన యెహోవా తన అనుగ్రహాన్ని చూపుతాడు. ఇది యేసు జననం చుట్టూ ఉన్న సంఘటనల్లో మళ్లీ మళ్లీ స్పష్టమైంది. యేసు జన్మించిన దాదాపు ఒక నెల తర్వాత యోసేపు, మరియలు మోషే ధర్మశాస్త్రానికి అనుగుణ్యంగా “గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను” అర్పించడానికి యేసుతో పాటు దేవాలయంలో హాజరయ్యారు. (లూకా 222-24) నిజానికి ధర్మశాస్త్రం గొఱ్ఱెపిల్లను అర్పించాలని కోరుతుంది కానీ, ఆర్థికపరంగా తక్కువ స్థాయిలో ఉన్నవారు గువ్వల జతను గానీ, లేదా రెండు పావురాలను గానీ ఇవ్వడాన్ని అనుమతిస్తుంది. (లేవీయకాండము 12:1-8) ఆలోచించండి. విశ్వసర్వాధికారియైన దేవుడు తన ప్రియమైన, అద్వితీయ కుమారుడు పెరగడానికి సంపద గల కుటుంబాన్ని కాదుగానీ, ఒక నిరుపేద కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. మీరు ఒక తల్లి గానీ ఒక తండ్రి గానీ అయితే ఇది మీకొక స్పష్టమైన జ్ఞాపికగా ఉండాలి—మీరు మీ బిడ్డకు గొప్ప ధన సంపదకన్నా లేదా ప్రతిష్ఠాత్మక విద్యకన్నా, వేరే దేనికన్నా మీరు మీ బిడ్డకు ఇవ్వగల గొప్ప బహుమతి ఆధ్యాత్మిక విలువలను ముందుంచే కుటుంబ వాతావరణమే.

దేవాలయంవద్ద విశ్వాసం, విధేయత గల మరో ఇద్దరు ఆరాధకులు యెహోవా అనుగ్రహాన్ని పొందారు. “దేవాలయము విడువక” ఉన్న 84 సంవత్సరాల అన్న ఒకరు. (లూకా 2:36, 37) మరొకరు సుమెయోను అను పేరు గల విశ్వాసియైన వయోవృద్ధుడు. వీరిద్దరూ దేవుడు తమకిచ్చిన ఆధిక్యతను బట్టి పులకించిపోయారు—తాము చనిపోకముందు వాగ్దత్త మెస్సీయాను చూడగల్గడం గొప్ప ఆధిక్యత. సుమెయోను శిశువును గూర్చి ప్రవచించాడు. ఈ ప్రవచనం ఆశతో నిండినది, కానీ కొద్దిపాటి విలాపం కూడా ఉంది. అక్కడున్న యౌవన తల్లి అయిన మరియ, తన ప్రియకుమారుని విషయమై హృదయంలోకి ఒక ఖడ్గము దూసికొనిపోయే రోజు ఒకటి వస్తుందని ఆయన ప్రవచించాడు.—లూకా2:25-35.

ప్రమాదంలో శిశువు

సుమెయోను ప్రవచనం ప్రకారం ఈ శిశువు ద్వేషించబడే వాడిగా అవుతాడన్నది ఒక దుఃఖకరమైన జ్ఞాపిక. ఆయన శిశువుగా ఉండగానే ఈ ద్వేషం కార్యరూపం దాల్చడం ప్రారంభించింది. ఇదెలా కార్యరూపం దాల్చిందనే దానికి మత్తయి వృత్తాంతం వివరణనిస్తుంది. కొన్ని నెలలు గడిచాయి, ఇప్పుడు మరియ, యోసేపులు బేత్లెహేములో ఒక ఇంటిలో నివసిస్తున్నారు. ఊహించని రీతిలో కొందరు విదేశీయులు తమ ఇంటిని దర్శించడాన్ని చూశారు. నేటి పశువుల కొట్టం చిత్రాలు లేదా బొమ్మలలో ఉన్న రీతిలో గాక, మత్తయి వృత్తాంతం ఎంతమంది మనుష్యులు సందర్శించారో ఖచ్చితంగా చెప్పడం లేదు. అలాగే, ఆయన వారిని “ముగ్గురు జ్ఞానులు” అని గానీ, “ముగ్గురు రాజులు” అని గానీ చెప్పడం లేదు. ఆయన వారికి మాగీ అనే గ్రీకు పదాన్ని ఉపయోగించాడు, దానర్థం “జ్యోతిష్కులు.” ఈ ఒక్కదానితోనే ఏదో దుష్టశక్తి ఇమిడివుందన్న విషయం చదువరులకు అర్థంకావాలి, ఎందుకంటే జ్యోతిష్యం అనేది దేవుని వాక్యము ఖండించే శాస్త్రం, దీన్ని విశ్వసనీయులైన యూదులు పూర్తిగా విసర్జించారు.—ద్వితీయోపదేశకాండము 18:10-12; యెషయా 47:13, 14.

ఈ జ్యోతిష్కులు “యూదుల రాజుగా పుట్టిన” వాని కోసం తూర్పునుండి ఒక నక్షత్రాన్ని అనుసరించి వచ్చి, బహుమతులు తెచ్చారు. (మత్తయి 2:2) కానీ నక్షత్రం వారిని బేత్లెహేముకు నడిపించలేదు. అది యెరూషలేములోని రాజైన హేరోదు దగ్గరకు నడిపించింది. బాలుడైన యేసుకు హాని తలపెట్టాలన్న కోరికా లేదా లక్ష్యమూ ఈ హేరోదుకు ఉన్నంతగా భూమ్మీద వేరే ఏ మనుష్యునికీ ఉండివుండకపోవచ్చు. ప్రసిద్ధి కావాలనే కోరిక గల వ్యక్తిగా, నరహంతకుడిగా హేరోదు తన ఇంటివారు తన స్థానాన్ని ఆక్రమిస్తారనే భయంతో తన సొంత ఇంటివారినే చంపేశాడు.a భవిష్యత్‌ “యూదుల రాజు” జన్మించాడన్న వార్తను విని కలతచెంది బేత్లెహేములో ఆయన ఉన్న స్థలాన్ని కనుగొనమని జ్యోతిష్కులను పంపించాడు. వాళ్లు వెళ్తూ ఉండగా అనూహ్యమైనదొకటి జరిగింది. వారిని యెరూషలేము వరకు నడిపించిన “నక్షత్రం” కదిలింది !—మత్తయి 2:1-9.

నిజానికి అది ఆకాశంలోని జ్యోతో లేక దర్శనమో మనకు తెలీదు. కానీ ఆ “నక్షత్రం” దేవుని నుండి రాలేదని మాత్రం మనకు తెలుసు. ఈ అన్యారాధకులను యేసు యొద్దకు నడిపించడంలో ఖచ్చితంగా ఏదో దుష్టశక్తి ఇమిడి ఉంది—అశక్తుడు, నిస్సహాయుడైన ఆ బాలుడి సంరక్షణకు కేవలం ఒక బీద వడ్రంగి, ఆయన భార్య మాత్రమే ఉన్నారు. హేరోదు చేతిలో తోలుబొమ్మలు మాత్రమే అయిన ఈ జ్యోతిష్కులు బాలుడ్ని నాశనం చేయాలని ప్రతీకారంతో ఉన్న హేరోదు రాజుకు సమాచారాన్ని అందించేవారే. కానీ, దేవుడు స్వప్నం ద్వారా జోక్యం చేసుకొని వారిని మరొక మార్గం గుండా పంపించాడు. ఈ “నక్షత్రం” మెస్సీయా నాశనానికై ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్న సాతాను ఉపకరణమై ఉండాలి. మరి, పశువుల కొట్టం చిత్రాలు లేదా బొమ్మల్లో ఈ నక్షత్రమూ, జ్యోతిష్కులూ దేవుని ప్రతినిధులుగా చిత్రీకరించడం ఎంత హాస్యాస్పదం!—మత్తయి 2: 9-12.

సాతాను ఇంకా విడిచిపెట్టలేదు. ఈ విషయంలో అతని చేతిలోని కీలుబొమ్మగా హేరోదు బేత్లెహేములో రెండు సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లల్నందర్నీ చంపాలని ఆజ్ఞను జారీ చేశాడు. కానీ యెహోవాకు విరుద్ధంగా జరిపిన పోరాటంలో సాతాను విజయం సాధించలేడు. పిల్లలపట్ల జరుగబోయే భయంకరమైన హత్యాకాండను గూర్చి దేవునికి ఎంతోకాలం ముందుగానే తెలుసని మత్తయి వ్రాశాడు. సంరక్షణ కోసం ఐగుప్తుకు పారిపొమ్మని తన దూత ద్వారా యోసేపుకు హెచ్చరించడం ద్వారా యెహోవా సాతానును మళ్లీ ఎదుర్కొన్నాడు. కొంతకాలం తర్వాత యోసేపు తన చిన్న కుటుంబాన్ని తిరిగి నజరేతుకు తరలించి, చివరకు అక్కడే నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడని మత్తయి నివేదించాడు. యేసు అక్కడ తన తమ్ముళ్లు, చెల్లెళ్లతో పెరిగాడు.—మత్తయి 2:13-23; 13:55, 56.

క్రీస్తు జననం—మీకు దాని భావం?

యేసు జననం, బాల్యం చుట్టూ ఉన్న సంఘటనల సారాంశాన్ని బట్టి ఆశ్చర్యపోతున్నారా? అనేకులు అలాగే ఆశ్చర్యపోయారు. కొంతమంది చెబుతున్నదానికి విరుద్ధంగా ఈ వృత్తాంతాలు ఒకదానికొకటి పొందికగాను, ఖచ్చితంగాను ఉండడాన్ని గమనించి వారు ఆశ్చర్యపోయారు. ఆ సంఘటనలు వందల సంవత్సరాలకు ముందుగానే ప్రవచించబడడాన్ని గూర్చి తెలుసుకొని మరింత ఆశ్చర్యపోయారు. పశువుల కొట్టం కథల, చిత్రాల చిత్రీకరణలకు పూర్తిగా భిన్నంగా సువార్తల్లోని కీలకాంశాలు ఉండడాన్నిబట్టి కూడా వారు విస్మయంచెందారు.

సాంప్రదాయక క్రిస్మస్‌ ఉత్సవాల్లో సువార్త వృత్తాంతాల్లోని ప్రధానాంశాలు లోపించడం బహుశా అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం. ఉదాహరణకు, యేసు తండ్రి గురించి—యోసేపు కాదు, యెహోవా దేవుని గురించి—ఎవరూ తలంచరు. ఆయన తన ప్రియ కుమారుడు పెరగడం కోసం, సంరక్షించబడడం కోసం యోసేపు మరియలకు అప్పగించేటప్పుడు ఆయన భావనలను ఊహించండి. కపటోపాయంతో హత్యలు చేయాలనుకొనే ద్వేషంతో నిండిన ఆ రాజు వంటి వారున్న ఈ లోకంలో శిశువుగా ఉన్న తన కుమారుడు పెరిగేలా అనుమతిస్తూ ఆ పరలోకపు తండ్రి అనుభవించిన మానసిక వ్యధను ఊహించండి ! మానవజాతిపట్ల ఆయనకు గల అపారమైన ప్రేమ ఆయన ఈ త్యాగం చేసేందుకు ఆయనను నడిపించింది.—యోహాను 3:16.

క్రిస్మస్‌ ఉత్సవాల్లో క్రీస్తు అసలు కనిపించడు. నిజానికి ఆయన తన జన్మదినాన్ని ఆచరించమని తన శిష్యులతో కనీసం చెప్పినట్లుగా కూడా ఏ విధమైన ఆధారమూ లేదు; ఆయన అనుచరులు ఆయన జన్మదినాన్ని జరుపుకున్నట్లు ఎటువంటి సూచనా లేదు.

యేసు తన జననాన్ని కాదుగానీ, చరిత్రను ప్రభావితం చేసిన ఆయన మరణాన్ని జ్ఞాపకముంచుకోమని తన అనుచరులకు ఆజ్ఞాపించాడు. (లూకా 22:19, 20) లేదు, తనను పశువుల తొట్టిలో నిస్సహాయ స్థితిలో ఉన్న శిశువుగా జ్ఞాపకముంచుకోవాలని కాదు ఆయన కోరుకుంటున్నది, ఆయన ఇప్పుడు ఆ విధంగా లేడు. యేసు తన మరణం తర్వాత 60 కంటే ఎక్కువ సంవత్సరాలకు అపొస్తలుడైన యోహానుకు కల్గిన దర్శనంలో యుద్ధానికి సన్నద్ధమైన శక్తివంతమైన రాజుగా తనను తాను కనబర్చుకున్నాడు. (ప్రకటన 19:11-16) దేవుని పరలోక రాజ్యానికి పరిపాలకునిగా ఉన్న యేసును గూర్చి తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే, లోకాన్ని మార్చే రాజు ఆయనే.

[అధస్సూచీలు]

a నిజానికి, హేరోదు కొడుకుగా పుట్టడం కంటే ఆయన ఇంటిలో పందిగా పుట్టడం మేలని కైసరు ఔగుస్తు వ్యాఖ్యానించాడు.

[8వ పేజీలోని చిత్రం]

క్రీస్తు జననాన్ని గూర్చిన సువార్తను యెహోవా దూతలు వినయంగల గొఱ్ఱెల కాపరులకు అందించారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి