దర్యావేషు—న్యాయ భావనగల ఒక రాజు
తాను చేపట్టిన నిర్మాణ కార్యక్రమాల్ని గురించి, ఒక ప్రసిద్ధిగాంచిన రాజు ఒకప్పుడిలా గొప్పలు చెప్పుకున్నాడు: “బబులోను పట్టణ శివారున తూర్పున ఒక పటిష్టమైన గోడను నిర్మించాను. నేనొక కందకాన్ని త్రవ్వి . . . బిటుమన్‌తోనూ, ఇటుకలతోనూ ఒక బలమైన గోడను నిర్మించాను, అది ఒక పర్వతంలా కదిలించ శక్యంకానిదిగా ఉంది.” అవును, బబులోను రాజైన నెబుకద్నెజరు విస్తృతమైన నిర్మాణ కార్యక్రమాల్లో మునిగిపోయాడు, తన సామ్రాజ్య రాజధానిని పటిష్టపర్చేందుకు ఎంతగానో కృషిచేశాడు. కానీ ఆయన కలలుకన్నట్టుగా బబులోను పట్టణం దుర్భేధ్యమైన నగరంగా ఉండలేకపోయిందని రుజువైంది.
అలా అని సా.శ.పూ 539 అక్టోబరు 5న రుజువైంది. మాదీయ సైన్యాలు తోడురాగా, పారసీక పాలకుడైన కోరెషు II బబులోనును జయించాడు, దాని కల్దీయ పాలకుడైన బెల్షస్సరును హత్య చేశాడు. క్రొత్తగా జయించబడిన ఈ నగరానికి మొదటి పాలకుడు ఇప్పుడు ఎవరౌతారు? ఆ నగరం కూలిపోయినప్పుడు దాంట్లోనే ఉన్న దేవుని ప్రవక్తయైన దానియేలు ఇలా రాశాడు: “మాదీయుడగు దర్యావేషు అరువది రెండు సంవత్సరములవాడై సింహాసనము నెక్కెను.”—దానియేలు 5:30, 31.
ఎవరీ దర్యావేషు? ఆయన ఎలాంటి పాలకుడని రుజువైంది? 70 ఏళ్లకు పైగా బబులోనులో పరవాసిగా ఉన్న దానియేలు ప్రవక్తతో ఆయనెలా వ్యవహరించాడు?
అసంపూర్ణ చరిత్రగల రాజు
మాదీయుడైన దర్యావేషును గురించిన చారిత్రక సమాచారం అసంపూర్ణమైనది. మాదీయులకు బొత్తిగా రాతపూర్వకమైన రికార్డుల్లేవు. అంతేగాక, మధ్యాసియాలో త్రవ్వకాల్లో దొరికిన వేలాది క్యూనిఫారం (త్రికోణాకార) లిపిలోని పలకలు పూర్తి చరిత్రను అందించడంలేదు. కాలగమనంలో నిలిచివున్న ఇతర ప్రాచీన లౌకిక రాతలు సంఖ్యాపరంగా చూస్తే చాలా తక్కువ. అవి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ శతాబ్దాల తేడాతో దర్యావేషు ఇమిడివున్న సంఘటనల నుండి వేరైవున్నాయి.
అయినా, మాదీయుల రాజధానియైన ఇక్బటనాను ఆక్రమించిన తర్వాత పారసీక రాజైన కోరెషు II మాదీయుల నమ్మకాన్ని చూరగొన్నాడని లభ్యమౌతున్న రుజువులు సూచిస్తున్నాయి. అటు తర్వాత, అతని నాయకత్వం క్రింద మాదీయులు పారసీకులు కలిసి సమైక్యంగా యుద్ధాల్లో పోరాడారు. వారి మధ్యనున్న సంబంధాన్ని గురించి రచయితయైన రాబర్ట్ కొల్లిన్స్ మాదీయులు, పారసీకులు (ఆంగ్లం) అనే తన పుస్తకంలో ఇలా పేర్కొన్నాడు: “పారసీకులతో మాదీయులు శాంతియుతంగానే సమాన హోదాలో ఉండేవారు. వాళ్లు పౌరసంబంధమైన ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లోనూ, పారసీక సైన్యంలో ఉన్నత స్థానాల్లోనూ తరచుగా నియమించబడేవారు. విదేశీయులు, మాదీయ పారసీకులను గురించి ప్రస్తావించినప్పుడు, వారిరువురి మధ్యా ఏ విధమైన భేదాన్నీ అంటే పాలకులూ పాలితులూ అనే భేదాన్నీ చూపించరు.” ఆ విధంగా మాదీయుల దేశం, పర్షియా దేశంలోనికి సమ్మిళితమైపోయి, మాదీయ పారసీకుల సామ్రాజ్యంగా రూపొందింది.—దానియేలు 5:28; 8:3, 4, 20.
బబులోనును కూలద్రోయడంలో మాదీయులు నిశ్చయంగా ఒక ప్రముఖమైన పాత్రను నిర్వర్తించారు. “మాదీయుడగు అహష్వేరోషుయొక్క కుమారుడైన దర్యావేషు” మాదీయ పారసీక సామ్రాజ్యానికి మొదటి అధినేత అయినట్టుగా లేఖనాలు తెలియజేస్తున్నాయి, అప్పటికే బబులోను ఆ సామ్రాజ్యంలో భాగమై ఉంది. (దానియేలు 9:1) “మాదీయులయొక్కయు పారసీకులయొక్కయు పద్ధతి ననుసరించి స్థిరమగు శాసనము”ను ఏర్పాటుచేసే అధికారం ఆయన రాజాధికారానికి ఉంది. (దానియేలు 6:8) దర్యావేషును గురించి బైబిలు తెలియజేస్తున్న వృత్తాంతం, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి మనకు క్లుప్తమైన వివరణను ఇస్తుంది. అలాగే అది ఆయన్ని గూర్చిన లౌకిక సమాచారం అసంపూర్ణంగా ఉండడానికి గల యుక్తమైన కారణాన్ని కూడా ఇస్తుంది.
దానియేలు అనుగ్రహాన్ని పొందాడు
బబులోనులో అధికారాన్ని చేపట్టిన తర్వాత వెంటనే దర్యావేషు “తన రాజ్యమంతటిపైన అధిపతులుగా ఉండుటకై నూట ఇరువదిమంది యధిపతులను నియమిం[చి], . . . వారిపైన ముగ్గురిని ప్రధానులగా నియమించెను; ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు.” (దానియేలు 6:1, 2) అయితే, దానియేలుకున్న ఉన్నతాధికారాన్ని చూసి ఇతర అధికారులకు కన్ను కుట్టింది. ఆయన చూపించిన యథార్థత, నిస్సందేహంగా లంచగొండితనాన్ని అదుపులో ఉంచేలా పనిచేసింది, అది ఇతరులు ఆగ్రహంచెందడానికి కారణమైంది. రాజు దానియేలుపై అనుగ్రహాన్ని చూపి, అతడ్ని ప్రధానమంత్రిని చేయాలని అనుకున్నాడు గనుక, ఈర్ష్య ఉన్నతాధికారుల్ని కూడా ప్రలోభపెట్టి ఉంటుంది.
దీన్నిక కొనసాగించకుండా ఆపుచేయాలనే ఉద్దేశంతో, ఆ ఇద్దరు ఉన్నతాధికారులూ, ఇతర అధికారులూ చట్టపరమైన ఉచ్చు వేయాలని ఎత్తు వేశారు. వాళ్లు రాజు దగ్గరకు వెళ్లి, 30 రోజులపాటు దర్యావేషుకు తప్ప “ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను . . . మనవి చేయ[డాన్ని]” నిషేధించే ఓ రాజశాసనాన్ని రూపొందించి, ఆయన ఆమోదముద్ర పొందడం కోసం దాన్ని ఆయన ముందుంచారు. దాన్ని ఉల్లంఘించిన వ్యక్తి ఎవరైనప్పటికీ, వాడు సింహాల గుహలో వేయబడాలని వాళ్లు ప్రతిపాదన చేశారు. అలాంటి శాసనాన్ని ప్రభుత్వ ఉన్నత అధికారులందరూ ఆమోదిస్తారనీ, ఆ ప్రతిపాదన రాజుపట్ల వాళ్లు చూపించే యథార్థతను తెలియజేస్తున్నట్టుగా ఉంటుందనీ దర్యావేషును నమ్మించారు.—దానియేలు 6:1-3, 6-8.
దర్యావేషు ఆ ఆజ్ఞపై సంతకాన్ని చేశాడు, త్వరలోనే దాని పర్యవసానాలను ముఖాముఖిగా ఎదుర్కోవల్సి వచ్చింది. దానియేలు యెహోవా దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు గనుక, ఆ శాసనాన్ని ఉల్లంఘించినవారిలో దానియేలే మొదటివాడు అయ్యాడు. (పోల్చండి అపొస్తలుల కార్యములు 5:29.) ఆ స్థిరమైన శాసనాన్ని ప్రక్కకు మళ్లించడానికి రాజు ఎంతగా ప్రయత్నించినప్పటికీ, విశ్వాసియైన దానియేలు సింహాల గుహలో త్రోయబడ్డాడు. ఆ ప్రవక్తను సజీవునిగా కాపాడగల శక్తి దానియేలు దేవునికి ఉందనే నమ్మకాన్ని దర్యావేషు వ్యక్తపర్చాడు.—దానియేలు 6:9-17.
ఉపవాసంతో నిద్రపోకుండా రాత్రంతా గడిపిన తర్వాత, తెల్లవారుతూనే దర్యావేషు ఆతృతతో సింహాల గుహ దగ్గరకు వెళ్లాడు. ఏ విధమైన హానీ కలుగకుండా దానియేలు సజీవంగా ఉండడం చూసి ఎంతో సంతోషించాడు! జరిగిన దానికి ప్రతీకారంగా, రాజు దానియేలుపై నిందమోపినవారినీ, వారి కుటుంబ సభ్యుల్నీ సింహాల గుహలో వెంటనే పడవేయించాడు. ‘తన రాజ్యములోని సకల ప్రభుత్వములయందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకుచుండవలెను’ అని ఆయన ఒక ఆజ్ఞను వెంటనే జారీచేశాడు.—దానియేలు 6:18-27.
స్పష్టంగా, దానియేలు సేవించు దేవుడ్నీ, ఆయన మతాన్నీ దర్యావేషు గౌరవించి, జరిగిన తప్పును సరిదిద్దడానికి వేగిరపడ్డాడు. అయినప్పటికీ, దానియేలుపై నిందమోపినవారిని శిక్షించడం, మిగతా అధికారుల్లో పగను పెంచి ఉండవచ్చు. అంతేగాక, ‘దానియేలు యొక్క దేవునికి భయపడమని’ తన రాజ్యంలోని వారందరికీ దర్యావేషు ఆజ్ఞను జారీచేయడం, బబులోనులోని శక్తిమంతులైన మతనాయకులకు ఎంతో ఆగ్రహాన్ని రేకెత్తించి ఉండవచ్చు. ఆ వాస్తవాలు లేఖికుల్ని నిశ్చయంగా ప్రభావితం చేసి ఉంటాయి గనుక, దర్యావేషును గూర్చిన సమాచారాన్ని రూపుమాపేలా లౌకిక రికార్డులను మార్చడం అసాధారణమైన విషయమేమీకాదు. అయినప్పటికీ, దానియేలు గ్రంథంలోని సంక్షిప్త వృత్తాంతం, దర్యావేషును నిష్పక్షపాత న్యాయ భావనలుగల ఒక పరిపాలకునిగా చిత్రీకరిస్తోంది.