కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 10/15 పేజీలు 30-31
  • పాఠకుల ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవాసాక్షులు పుట్టినరోజు ఎందుకు చేసుకోరు?
    తరచూ అడిగే ప్రశ్నలు
  • మనం ఎలాంటి పార్టీలకు వెళ్లినా దేవునికి నచ్చుతుందా?
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
  • అన్ని ఆచారాల్ని, పండుగల్ని దేవుడు ఇష్టపడతాడా?
    దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుండండి
  • దేవునికి ఇష్టంలేని పండుగలు, ఆచారాలు
    ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 10/15 పేజీలు 30-31

పాఠకుల ప్రశ్నలు

యెహోవా సాక్షుల్లో చాలామంది తమ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటారా? ఒక విధంగా పుట్టినరోజు కూడా వార్షికోత్సవమే కదా. అలాంటప్పుడు వివాహ వార్షికోత్సవం ఎందుకు పాటించాలి. జన్మదిన వార్షికోత్సవాన్ని ఎందుకు పాటించకూడదు?

నిర్మొహమాటంగా చెప్పాలంటే ఈ రెంటిలో దేనినీ ఆచరించాల్సిన అవసరం లేదు. అయిననూ, రెండింటికీ ఒకే విధమైన ప్రాముఖ్యత ఉందనిగానీ, క్రైస్తవులు జన్మదినాచరణలను ఎలా దృష్టిస్తారో అలాగే వివాహ వార్షికాచరణలనూ దృష్టించాలనిగానీ దాని భావం కాదు.

జరిగిన ఒకానొక సంఘటన ఏ తేదీన జరిగిందో ఆ తేదీ ఏటేటా పునరావృతమవ్వడమే “వార్షికం” గనుక ఆ రెండూ కూడా వార్షికాచరణలేనని పైన పేర్కొన్నట్టుగానే చెప్పవచ్చు. ఏ సంఘటనకైనా వార్షికం ఉండొచ్చు, బహుశా అది మీకు వాహన ప్రమాదం జరిగిన రోజో, చంద్రగ్రహణం చూసిన రోజో, కుటుంబసమేతంగా స్మిమ్మింగ్‌కి వెళ్లిన రోజో, మరేదైన ఒక సంఘటన జరిగిన రోజో కావచ్చు. క్రైస్తవులు ప్రతి వార్షికాన్ని ఓ ప్రత్యేక దినంగానో, వేడుకగానో ఆచరించరనేది సుస్పష్టమే. ఎవరైనా ఒక సంఘటన యొక్క వివిధాంశాలను ఆలోచించి, యుక్తమని భావించేదానిని గూర్చి ఓ నిర్ణయం తీసుకోవాలి.

ఉదాహరణకు, దేవుడు ఐగుప్తులో తన దేవదూత ఇశ్రాయేలీయుల ఇళ్లను దాటివెళ్లడాన్ని, తత్ఫలితంగా జరిగిన ఇశ్రాయేలీయుల నిర్గమనాన్ని మీరు ఆచరించాలని ప్రత్యేకంగా ఉపదేశించాడు. (నిర్గమకాండము 12:14) యేసుతోసహా యూదులు ఏటేటా ఆ సంఘటనను ఆచరించారు, అయితే వాళ్లు దాన్ని దేవుని నడిపింపుకు విధేయత చూపించడంలో భాగంగానే ఆచరించారుగానీ ఒక విందుగానో లేక బహుమతులను ఇచ్చిపుచ్చుకునేదిగానో ఆచరించలేదు. ఆలయ పునఃప్రతిష్ఠాపనను కూడా యూదులు ఓ ప్రత్యేక వార్షికాచరణగా పరిగణించారు. ఈ చారిత్రక సంఘటనను జ్ఞాపకంచేసుకోమని బైబిల్లో ఆజ్ఞాపించబడకపోయినప్పటికీ, అలా ఆచరించడాన్ని యేసు ఆక్షేపించలేదని యోహాను 10:22, 23 వచనాలు సూచిస్తున్నాయి. చివరగా, యేసు మరణ వార్షిక దినాన క్రైస్తవులు ఒక ప్రత్యేక కూటాన్ని జరుపుకుంటారు. దేవుని వాక్యంలో ఉన్న స్పష్టమైన ఆజ్ఞకు విధేయత చూపించడం మూలంగానే అలా చేస్తారు.—లూకా 22:19, 20.

వివాహ వార్షికోత్సవాల సంగతేంటి? కొన్ని దేశాల్లో భార్యాభర్తలు దేవుని ఆది ఏర్పాటైన వైవాహిక బంధంలోనికి ప్రవేశించిన దినాన్ని ఏటేటా ఆచరించడం సర్వసాధారణం. (ఆదికాండము 2:18-24; మత్తయి 19:4-6) నిశ్చయంగా బైబిలు వివాహాన్ని చెడుగా చూపడం లేదు. యేసు ఒక వివాహ విందుకు హాజరై, అది విజయవంతమయ్యేలా తోడ్పడ్డాడు.—యోహాను 2:1-11.

కాబట్టి, తమ వివాహ వార్షిక దినాన దంపతులు సమయాన్ని తీసుకొని తమ పెండ్లినాటి ఆనందాల్నీ, దంపతులుగా కృతార్థులయ్యేలా కృషి చేద్దామనుకొన్న తమ తీర్మానాన్ని స్మృతిపథానికి తెచ్చుకోవడం అసాధారణమైన విషయమేమీ కాదు. ఈ సంతోష సందర్భాన్ని దంపతులు ఏకాంతంగా చేసుకుందామన్నా, లేక తమతో కూడా కొందరు బంధువులూ, సన్నిహిత స్నేహితులూ ఉండాలనుకున్నా సరే, నిర్ణయించుకోవాల్సింది మాత్రం వాళ్లే. కానీ ఇది, ఓ పెద్ద సామాజిక గుంపు కూడుకోవడానికొక సాకు కాకూడదు. తమ జీవితాల్లో అనుదినమూ అన్వయించే సూత్రాలే ఆ రోజు కూడా నడిపింపునివ్వాలని క్రైస్తవులు కోరుకుంటారు. కాబట్టి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవాలా వద్దా అనేది వ్యక్తిగత విషయం.—రోమీయులు 13:13, 14.

అయితే, జన్మదినాన్ని ప్రత్యేకంగా ఆచరించడం విషయం ఏమిటి? అటువంటి వార్షికోత్సవాలను గూర్చి బైబిల్లో మనకు సూచనలేమైనా ఉన్నాయా?

ఈ శతాబ్దపు తొలిభాగంలో, బైబిలు విద్యార్థులు—యెహోవాసాక్షులు అప్పట్లో అలా పిలువబడేవారు—జన్మదినాల్ని పాటించారు. వారిలో చాలామంది దగ్గర బైబిలు దినవచనముండే పరలోకపు ప్రతిదిన మన్నా అనే చిన్న పుస్తకాలు ఉండేవి. వాటిలో తమ తోటి బైబిలు విద్యార్థుల జన్మదినాల్ని గుర్తించి, ఆ తారీఖుల దగ్గర వారి చిన్న ఫొటోలను ఉంచుకునేవారు. అమెరికానందు ఫ్లోరిడాలో జాక్సన్‌ విల్లీలో జరిగిన సమావేశంలో సహోదరుడు రస్సెల్‌ వేదికమీదికి సాదరంగా ఆహ్వానించబడడాన్ని గూర్చి ది వాచ్‌ టవర్‌ ఫిబ్రవరి 15, 1909 సంచిక వివరించింది. ఎందుకు? జన్మదిన సందర్భంగా ఎదురుచూడని ఒక కానుకగా ఆయనకు ద్రాక్ష, అనాస, నారింజ పళ్లు ఉన్న పెట్టెలను ఇవ్వడానికే. అది మనకు గతంలో జరిగిందేంటో తెలియజేస్తోంది. జన్మదినానికి సంబంధించిన వాస్తవాలన్నిటినీ సమగ్రంగా పరిశీలించాలంటే, ఆ కాలంలో సహోదరులు డిసెంబరు 25ను యేసు వార్షిక జన్మదినంగా లేక పుట్టిన రోజుగా ఆచరించేవారనే విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. బ్రూక్లిన్‌ ప్రధాన కార్యాలయంలో క్రిస్మస్‌నాడు ప్రత్యేక సాయంకాల విందును తీసుకోవడం కూడా వాడుకగా ఉండేది.

అప్పటినుండీ దేవుని ప్రజలు అనేక రీతుల్లో ఆధ్యాత్మికంగా ఎదిగారు. 1920వ దశాబ్ద కాలంలో అభివృద్ధిచెందిన సత్యపు వెలుగు ఈ క్రింది వాటిని గ్రహించేలా చేసింది:

యేసు డిసెంబరు 25న జన్మించలేదు, ఆ తేదీ అన్యమతముతో సంబంధం కలిగివుంది. బైబిలు యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోమని సూచిస్తుందే తప్ప, ఆయన జన్మదినాన్నో, మరొకరి జన్మదినాన్నో ఏటేటా ఆచరించమని చెప్పడంలేదు. అలా చేయడం ప్రసంగి 7:1కీ, ఒక విశ్వాసి జన్మదినముకంటే అతని జీవితం చివరికి ఏమౌతుంది అనేదే ప్రాముఖ్యమనే వాస్తవానికీ పొందికగా ఉంటుంది. నమ్మకమైన సేవకులెవరూ జన్మదినాన్ని ఆచరించినట్టు బైబిలు తెలియజేయడంలేదు. అన్యులు చేసుకున్న పుట్టిన రోజు పండుగల్ని గురించి అది తెలియజేస్తూ, వాటిని అకృత్యాలతో ముడిపెడుతోంది. ఆ జన్మదినాచరణల పుట్టు పూర్వోత్తరాల్ని తెలుసుకుందాం.

మొదటిది, యోసేపు కాలంలో జీవించిన ఫరో జన్మదినోత్సవం. (ఆదికాండము 40:20-23) ఈ విషయంలో హేస్టింగ్స్‌ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ రిలిజియన్‌ అండ్‌ ఎథిక్స్‌లో జన్మదినాల్ని గూర్చిన శీర్షిక ఇలా ఆరంభమౌతుంది: “పుట్టినరోజును జ్ఞాపకంచేసుకునే ఆచారం, పైపైన చూస్తే జన్మదినాన్ని లెక్కించడంతో ముడిపెట్టబడినట్టు కన్పిస్తున్నా దాని పూర్వాపరాల్ని చూస్తే, అది కొన్ని ప్రాచీన మతపర సూత్రాలతో ముడిపెట్టబడివుంది.” తర్వాత, “ప్రతీ ఐగుప్తీయుడూ తన జన్మదినానికీ, తాను పుట్టిన గడియకూ ఎంతో ప్రాముఖ్యాన్ని ఇచ్చేవాడు; పర్షియాలో వలే, ప్రతీ ఒక్కడూ తన జన్మదినాన్ని ఎంతో సంతోషంగా ఆచరించేవాడు, సమాజంలోని సకలవిధములైన వినోద కాలక్షేపాలతోనూ, రకరకాల రుచికరమైన భోజన పదార్థాలతోనూ తన స్నేహితుల్ని ఆహ్వానించేవాడు” అని సర్‌ జె. గార్డెనర్‌ విల్‌కిన్సన్‌ అనే ఈజిప్టియాలజిస్ట్‌ రాసిన విషయాన్ని ఎన్‌సైక్లోపీడియా ఎత్తి రాసింది.

బైబిల్లో ప్రస్తావించబడిన మరొక జన్మదిన ఆచరణ హేరోదుది, ఆ ఆచరణలో బాప్తిస్మమిచ్చు యోహాను శిరస్సు ఖండించబడింది. (మత్తయి 14:6-10) ది ఇంటర్నేషనల్‌ స్టాండార్డ్‌ బైబిల్‌ ఎన్‌సైక్లోపీడియా (1979 సంపుటి) ఈ క్రింది అంతర్దృష్టిని అందిస్తోంది: “హెల్లేనీయ సంస్కృతికి ముందున్న గ్రీకులు దేవతల జన్మదినాల్నీ, ప్రఖ్యాతిగాంచిన పురుషుల జన్మదినాల్నీ ఆచరించేవారు. గ్రీకు భాషలోని గెనెథిలియా అనే పదం ఈ ఆచరణల్ని సూచిస్తుంది, అయితే గెనెషియా మరణించిన ఓ ప్రముఖుని జన్మదిన స్మారకోత్సవ ఆచరణను సూచిస్తుంది. 2 మక్కాబీయులు 6:7లో రాజైన అంతియొకసు IV యొక్క నెల నెలా జరిగే గెనెథిలియాను గురించిన రిఫరెన్సును మనం చూస్తాం, ఆ ఆచరణలో ‘బలినైవేద్యాల్ని భుజించాలని’ యూదులు ఒత్తిడి చేయబడేవారు. . . హేరోదు తన జన్మదినోత్సవాన్ని చేసుకున్నప్పుడు, అతడు హెల్లెనీయ ఆచారానికి అనుగుణంగానే ప్రవర్తించాడు; హెల్లెనీయ సంస్కృతికి ముందున్న కాలాల్లో ఇశ్రాయేలునందు జన్మదినోత్సవాలు ఆచరించేవారనడానికి ఏ విధమైన రుజువూ లేదు.”

నేడు నిజ క్రైస్తవులు, ప్రతీ ఆచరణకూ లేదా ఆచారాలకూ సంబంధించిన మూలాల్ని గురించీ, వాటికున్న ప్రాచీన మతసంబంధాల్ని గురించీ అధికంగా చింతించరు, అయితే దేవుని వాక్యంలో ఉన్న తత్సంబంధిత సూచనల్ని నిర్లక్షపర్చేందుకు మ్రొగ్గుచూపరు అనే విషయాన్ని ఒప్పుకోవాల్సిందే. వాటిలో, బైబిల్లో తెలియజేయబడిన జన్మదిన ఆచరణలు కేవలం అన్యులకు సంబంధించినవన్న, అవి అకృత్యాలతో ముడిపెట్టబడి ఉన్నాయన్న విషయాలు చేరివున్నాయి. కాబట్టి, జన్మదిన ఆచరణలను లేఖనాలు ఓ ప్రతికూల స్థానంలో ఉంచాయనేది స్పష్టం, ఆ వాస్తవాన్ని యథార్థవంతులైన క్రైస్తవులు ఉపేక్షించరు.

కాబట్టి, క్రైస్తవులు తమ వివాహ వార్షికోత్సవాన్ని ఆచరించాలని ఎంపికచేసుకుంటారా లేదా అన్నది పూర్తిగా వారి వ్యక్తిగత విషయం. అయితే, పరిణతి చెందిన క్రైస్తవులు జన్మదినాచరణలకు దూరంగా ఉండడానికి మంచి కారణాలే ఉన్నాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి