కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 10/15 పేజీలు 25-29
  • కరుడు హృదయాలు కరిగినప్పుడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కరుడు హృదయాలు కరిగినప్పుడు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • పని ప్రారంభించడం
  • అమోఘమైన విద్యా కార్యక్రమం
  • ప్రత్యేక సమావేశాలు ఆనందాన్ని తెస్తాయి
  • అద్భుతమైన మార్పు ప్రభావాన్ని చూపింది
  • పూర్వపు స్నేహితుల నుండి ఒత్తిళ్లు
  • దేవుని సమర్పిత సేవకులవ్వడం
  • చెరసాల అధికారుల అంగీకారం
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 10/15 పేజీలు 25-29

కరుడు హృదయాలు కరిగినప్పుడు

1989లో పోలాండ్‌లో యెహోవాసాక్షులకు మతసంబంధమైన సంస్థగా చట్టబద్ధమైన గుర్తింపు లభించింది. తమ క్రైస్తవ తటస్థతనుబట్టి నిర్బంధించబడిన సాక్షులు క్రమంగా విడుదలయ్యారు, తమ నుండి బైబిలు గురించి మరింత నేర్చుకోవాలని అభిలషిస్తున్న అనేకమంది ఖైదీలను వదిలి వారు బయటికి వచ్చేశారు. అలాంటి ఒక చెరసాలలోని ఒకప్పటి కఠిన హృదయులు దేవుని వాక్య శక్తికి ప్రతిస్పందించేందుకు యెహోవాసాక్షులు వారికి ఎలా సహాయం చేశారో తెలిపే ఒక ఉదంతం ఇక్కడుంది.

పోలాండ్‌కు నైరుతిగా ఉన్న పట్టణమైన వోవూఫ్‌ జనసంఖ్య 12,000. దానిలో 200 సంవత్సరాల నాటి చెరసాల ఒకటి ఉంది, అందులో పోలాండ్‌కు చెందిన కరుడుగట్టిన నేరస్థులు కొంతమంది ఉన్నారు. తమ పనికి అధికారపూర్వక గుర్తింపు లభించినప్పటి నుండి యెహోవాసాక్షులు దానిలోని ఖైదీలకు రాజ్య సువార్త అందించడానికి కృషి చేశారు, అదీ వారు ఎంతో ఉత్సాహంతో చేశారు.

1990 ఫిబ్రవరిలో పోలాండ్‌లోని చెరసాలలన్నిటికీ న్యాయనిర్వహణ శాఖ నుండి వెలువడిన ఒక ఉత్తరం దీనికంతటికీ మార్గం సుగమం చేసింది. వాచ్‌టవర్‌ ప్రచురణలను పొందాలనుకునే ఖైదీలకు లేదా యెహోవాసాక్షులను కలవాలనుకునే ఖైదీలకు ఏ విధమైన “ఇబ్బందినీ కలిగించవద్దని” ఆ ఉత్తరం ఆదేశించింది. కొంతమంది సాక్షులు చాలా సంవత్సరాలపాటు వోవూఫ్‌ చెరసాలలో ఉన్నారు కాబట్టి, అక్కడున్న కరుడుగట్టిన ఖైదీలలో చాలామంది వారికి పరిచయమే. అయితే, ఇతర ఖైదీల కరుడు హృదయాలను బైబిలు సత్యం మెత్తబరిచేందుకు తాము చేసే ప్రయత్నాలపై ఆశీర్వాదాల కోసం వాళ్లు యెహోవా మీద ఆధారపడ్డారు.

పని ప్రారంభించడం

దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్రోక్లా నగరానికి చెందిన సహోదరుడైన చెస్‌వాఫ్‌కు వోవూఫ్‌లోని చెరసాలను దర్శించేందుకు అనుమతి లభించింది, ఆయనిలా అంటున్నాడు, “కార్యక్రమాన్ని ప్రారంభించడం కష్టమయ్యింది. మన ‘మతసంబంధ సేవలు’ ఖైదీలకు ప్రయోజనకరమైనవని చెరసాల అధికారులను ఒప్పించడానికి ఎన్నో సుదీర్ఘ చర్చలు జరుపవలసి వచ్చింది.”

విషయాలను సంక్లిష్టం చేసేందుకు, “ఖైదీలు మతసంబంధ సేవలను వస్తుపరమైన లాభాలు పొందడానికి కేవలం ఒక సాకుగా ఉపయోగించుకుంటున్నారని ఒక ఉన్నతాధికారి నొక్కిచెప్పాడని” చెస్‌వాఫ్‌ తోటిపనివాడైన పావెవ్‌ గుర్తు చేసుకుంటున్నాడు. కాని మునుపు ప్రమాదకరమైన వారైన ముగ్గురు నేరస్థులు 1991లో బాప్తిస్మం కోసం తమను తాము సమర్పించుకున్నప్పుడు, చెరసాల అధికారులు తమ దృక్పథాన్ని మార్చుకున్నారు, దానితో వారి సహకారం మెరుగుపడింది.

“ఖైదీలకు, వారిని చూడడానికి చెరసాలకు వచ్చిన వారి కుటుంబాలకు, అలాగే చెరసాల ఉద్యోగులకు సాక్ష్యమివ్వడం ద్వారా మేము ఆ పనిని ప్రారంభించాము. తర్వాత మాకు వార్డు నుండి వార్డుకు సువార్త ప్రకటించేందుకు అనుమతి లభించింది, నిజంగా అది చాలా అసాధారణమైన విషయం. చివరికి, మేము ఆసక్తిగల మొదటి వ్యక్తులను కనుగొన్నప్పుడు, బైబిలు పఠనాలు నిర్వహించుకోవడానికి, క్రైస్తవ కూటాలు జరుపుకోవడానికి మాకు ఒక చిన్న హాలులోకి ప్రవేశం లభించింది” అని చెస్‌వాఫ్‌ వివరిస్తున్నాడు. అవును, ఖైదీల కరుడు హృదయాలకు యెహోవా మార్గాన్ని తెరిచాడు.

అమోఘమైన విద్యా కార్యక్రమం

ఆ చిన్న హాలు త్వరలోనే చాలా ఇరుకైపోయింది. బాప్తిస్మం తీసుకున్న ఖైదీలు, బయటి నుండి వస్తున్న సహోదరులు ప్రకటన పనిలో భాగం వహించేవారు కాబట్టి, దాదాపు 50 మంది ఖైదీలు కూటాలకు హాజరు కావడం మొదలెట్టారు. “మూడేళ్లకు పైగా, మేము అన్ని కూటాలూ అక్కడ నిర్వహించాము, ఖైదీలు వారపు కూటాలకు క్రమంగా హాజరయ్యేవారు” అని ఒక స్థానిక పెద్ద వివరిస్తున్నాడు. కాబట్టి 1995 మేలో వారికి మరింత పెద్ద హాలును ఉపయోగించుకోవడానికి అనుమతి లభించింది.

చెరసాలలో జరిగే కూటాలకు ఎవరు రావచ్చుననే విషయాన్ని బాధ్యతగల సహోదరులు ఎలా నిర్ధారించేవారు? “సత్యమందు యథార్థమైన ఆసక్తి కనబరుస్తున్న ఖైదీల పట్టిక మా దగ్గర ఉండేది. ఒక ఖైదీ అభివృద్ధి సాధించకుండా లేదా సరైన కారణం లేకుండానే కూటాలకు రావడం మానుకుంటూ అలాంటి ఏర్పాట్లపట్ల మెప్పులేనట్లు సూచిస్తే, మేము ఆ పట్టికలో నుండి అతని పేరును తొలగించి చెరసాల డైరెక్టర్‌కు ఆ విషయాన్ని తెలియజేస్తాము” అని సహోదరులు చెస్‌వాఫ్‌ మరియు జెష్‌వాఫ్‌ వివరిస్తున్నారు.

బైబిలు పఠనాల సమయంలో, కూటాల కోసం చక్కగా ఎలా సిద్ధమవ్వాలి, మన సాహిత్యాన్ని ప్రభావవంతంగా ఎలా ఉపయోగించాలి అనేది కూడా సహోదరులు ఖైదీలకు బోధించేవారు. కాబట్టి, ఖైదీలు కూటాలకు వచ్చినప్పుడు చక్కగా సిద్ధపడి, స్వేచ్ఛగా పాల్గొనేవారు. వాళ్లు ప్రోత్సాహకరమైన వ్యాఖ్యానాలు చేస్తూ, తమ బైబిళ్లను నైపుణ్యవంతంగా ఉపయోగిస్తూ, ఉపదేశాన్ని తమకు అన్వయించుకునేవారు. వాళ్లు తరచూ తమ వ్యాఖ్యానాల్లో ‘నేను ఇలా చేయాలనుకుంటా లేక అలా చేయాలనుకుంటా’ వంటి వాక్యాలను చేరుస్తారు.

“వోవూఫ్‌ చెరసాలలో మొత్తం 20 బైబిలు పఠనాలు నిర్వహించడం జరిగింది. వాటిలో ఎనిమిదింటిని ముగ్గురు ఖైదీ ప్రచారకులు నిర్వహించేవారు” అని సంఘ సెక్రెటరీ చెబుతున్నాడు. వార్డు నుండి వార్డుకు ప్రకటించేటప్పుడూ చెరసాల కాంపౌండ్‌లో నడిచేటప్పుడూ ఆ ఖైదీ ప్రచారకులకు మంచి ఫలితాలు లభించాయి. ఉదాహరణకు, 1993 సెప్టెంబరు నుండి 1994 జూన్‌ మధ్య కాలంలో అంటే పది నెలల్లో వాళ్లు 235 పుస్తకాలనూ, దాదాపు 300 బ్రోషూర్లనూ, 1,700 పత్రికలనూ పంచిపెట్టారు. ఇటీవల, చెరసాల అధికారుల్లో ఇద్దరు బైబిలు పఠనాల కోసం అడిగారు.

ప్రత్యేక సమావేశాలు ఆనందాన్ని తెస్తాయి

కొంతకాలానికి, ఆ చెరసాలలోని విద్యా కార్యక్రమానికి మరో అంశం తోడయ్యింది, అదే ప్రత్యేక సమావేశాలు. ప్రయాణ పైవిచారణకర్తలు, అర్హులైన ఇతర సహోదరులు చెరసాల వ్యాయామశాలలో ప్రాంతీయ సమావేశ కార్యక్రమంలోని ముఖ్యాంశాలనూ, ప్రత్యేక దిన సమావేశ కార్యక్రమంలోని ముఖ్యాంశాలనూ అందజేసేవారు. మొట్టమొదటి ప్రత్యేక దిన సమావేశం 1993 అక్టోబరులో జరిగింది. యాభైమంది ఖైదీలు హాజరయ్యారు, “వ్రోక్లా నుండి స్త్రీలు పిల్లలతో సహా మొత్తం కుటుంబాలు వచ్చాయి” అని స్వవో పోల్‌స్కీ వార్తాపత్రిక నివేదించింది, మొత్తం 139 మంది హాజరయ్యారు. సమావేశ కార్యక్రమ విరామ సమయంలో, సహోదరీలు సిద్ధం చేసిన భోజనాన్ని ఆస్వాదించడానికి అవకాశం, అలాగే చక్కని క్రైస్తవ సహవాసాన్ని ఆనందించడానికి సమయం లభించాయి.

అప్పటి నుండి మరితర ఏడు ప్రత్యేక సమావేశాలు జరిగాయి, అవి చెరసాలలోని వారికే కాక బయటి వారికి కూడా ప్రయోజనాన్ని చేకూర్చాయి. ఇప్పుడు పట్టణంలో నివసిస్తున్న మునుపటి వోవూఫ్‌ ఖైదీయైన ఒక వ్యక్తిని ఒక సాక్షి సహోదరి దర్శించినప్పుడు ఆయన మొదట్లో కాస్త ప్రతికూలంగా ఉన్నాడు. కాని ఒక ఫలాని ఖైదీ సాక్షి అయ్యాడని చెప్పినప్పుడు ఆ వ్యక్తి అపనమ్మకంతో ఇలా అన్నాడు: “ఆ హంతకుడు ఇప్పుడు ఒక సాక్షా?” ఫలితంగా ఆ వ్యక్తి బైబిలు పఠనానికి అంగీకరించాడు.

అద్భుతమైన మార్పు ప్రభావాన్ని చూపింది

ఈ భారీ విద్యా కార్యక్రమం ఖైదీల కఠిన హృదయాలను నిజంగా మెత్తబరిచిందా? తమ గాథలను వారినే చెప్పనివ్వండి.

“నా పసితనంలోనే నా తల్లిదండ్రులు నన్ను వదిలేశారు కాబట్టి నాకు నా తలిదండ్రులెవరో తెలియదు. ప్రేమను పొందాలని తపన పడేవాడిని,” అని స్వతహాగా ఆలోచనాపరుడైన జిస్‌లాఫ్‌ ఒప్పుకుంటున్నాడు. “నేను నా జీవిత తొలి భాగంలోనే నేరం చేయడంలో చిక్కుకున్నాను, చివరికి హత్య చేశాను. అపరాధ భావం నేను ఆత్మహత్య గురించి ఆలోచించేలా చేసింది, నేను నిజమైన నిరీక్షణ కోసం ఎంతగానో వెదికాను. అప్పుడు, 1987లో, నాకు కావలికోట పత్రిక దొరికింది. దాని నుండి పునరుత్థాన నిత్యజీవ నిరీక్షణల గురించి తెలుసుకున్నాను. ఇంకా అంతా చేయి దాటిపోలేదని గ్రహించి, ఆత్మహత్య తలంపును మానుకుని బైబిలు పఠించనారంభించాను. ఇప్పుడు నేను యెహోవా నుండి, సహోదరుల నుండి ప్రేమ అంటే ఏమిటో తెలుసుకున్నాను.” మునుపటి ఈ హంతకుడు 1993 నుండి పరచర్య సేవకునిగానూ సహాయ పయినీరుగానూ సేవచేస్తున్నాడు, గత సంవత్సరమే క్రమ పయినీరయ్యాడు.

మరో వైపున, టొమాష్‌ వెంటనే బైబిలు పఠనానికి అంగీకరించాడు. “అయితే, అది నిజాయితీతో తీసుకున్న చర్యేమీ కాదని” ఆయన ఒప్పుకుంటున్నాడు. “యెహోవాసాక్షుల నమ్మకాలను ఇతరులకు వివరించేటప్పుడు నేను నేర్పును ప్రదర్శించి గొప్పలు చెప్పుకోవడం నాకు ఇష్టంగా ఉండేది కాబట్టి నేను పఠించేవాడిని. కాని నేను బైబిలు సత్యం గురించి ఏమి చేయడం లేదు. ఒకరోజు, నేను మనస్సు మార్చుకుని క్రైస్తవ కూటానికి వెళ్లాను. బాప్తిస్మం తీసుకున్న ఖైదీలు నాకు ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలికారు. జ్ఞానాన్ని ప్రదర్శించి గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నించే బదులు నేను నా కఠిన హృదయాన్ని మెత్తబరుచుకుని, నా మనస్సు మార్చుకోవలసిన అవసరం ఉందని గుర్తించాను.” టొమాష్‌ నూతన క్రైస్తవ వ్యక్తిత్వాన్ని ధరించనారంభించాడు. (ఎఫెసీయులు 4:22-24) నేడు ఆయనొక సమర్పిత, బాప్తిస్మం పొందిన సాక్షిగా వార్డు నుండి వార్డుకు ప్రకటించడంలో ఆనందాన్ని పొందుతున్నాడు.

పూర్వపు స్నేహితుల నుండి ఒత్తిళ్లు

చెరసాలలో బైబిలు సత్యాన్ని నేర్చుకున్నవారు వార్డులో పూర్వపు స్నేహితుల నుండి, చెరసాల అధికారుల నుండి తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు. వారిలో ఒకరు ఇలా గుర్తు చేసుకుంటున్నారు: “నన్ను అదేపనిగా ఎగతాళిచేసి, అపహసించేవాళ్లు. కాని నేను సహోదరుల ప్రోత్సాహకరమైన మాటలను మనస్సులో ఉంచుకునే వాడిని. ‘యెహోవాకు ప్రార్థిస్తూ బైబిలు చదువుతూ ఉండు, నీకు అంతర్గత శాంతి లభిస్తుంది’ అని వాళ్లు నాకు చెప్పారు. అది నిజంగా నాకు సహాయం చేసింది.”

“నా తోటి ఖైదీలు ఎప్పుడూ నా గురించి దుర్భాషలాడుతూ ఉండేవారు” అని పుష్టిగావున్న, బాప్తిస్మం పొందిన సహోదరుడైన రిషార్డ్‌ చెబుతున్నాడు. “‘నువ్వు నీ కూటాలకు వెళ్లవచ్చు, కాని ఏదో నీవే గొప్పవాడివన్నట్లు, మంచివాడివన్నట్లు నటించకు, సరేనా?’ అని వాళ్లు నన్ను హెచ్చరించేవారు. బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం మూలంగా నేను నా జీవితంలో మార్పులు చేసుకున్నప్పుడు, దాని మూలంగా నేను బాధపడవలసి వచ్చింది. వాళ్లు నా పరుపును తలకిందులు చేసేవారు, నా బైబిలు సాహిత్యమంతా చిందరవందరగా పడేసేవారు, వార్డులో నాకు కేటాయించబడిన భాగంలో అంతా అస్తవ్యస్తం చేసేవారు. నన్ను నేను అదుపు చేసుకోవడానికి నాకు శక్తినివ్వమని నేను యెహోవాకు ప్రార్థించి, నెమ్మదిగా అన్నీ మళ్లీ చక్కగా సర్ది పెట్టుకునే వాడిని. కొంతకాలానికి, దాడులు జరగడం ఆగిపోయింది.”

బాప్తిస్మం తీసుకున్న కొంతమంది ఇతర ఖైదీలు ఇలా వివరిస్తున్నారు, “మేము యెహోవా సేవ చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నట్లు తోటి ఖైదీలు గమనించినప్పుడు, ఒత్తిడులు మరో రూపం దాల్చేవి. సాధారణంగా వారిలా చెప్పేవారు, ‘గుర్తుంచుకో, ఇకమీదట నీవు త్రాగకూడదు, పొగత్రాగ కూడదు, లేక అబద్ధాలు చెప్పకూడదు.’ అలాంటి ఒత్తిడి ఒకరు తమ చెడునడవడిని, దురలవాట్లను త్వరగా మానుకుని, తమ శరీరాన్ని అదుపులో ఉంచుకోవడానికి సహాయం చేస్తుంది. ఆత్మ ఫలాలను వృద్ధి చేసుకోవడానికి కూడా అది సహాయం చేస్తుంది.—గలతీయులు 5:22, 23.

దేవుని సమర్పిత సేవకులవ్వడం

చెరసాల అధికారుల అనుమతితో, మొట్టమొదటి బాప్తిస్మం 1991 వసంతఋతువులో వ్యాయామశాలలో జరిగింది. ఆ ఆనందభరితమైన సభ్యుడు జిస్‌లాఫ్‌. పన్నెండుమంది ఖైదీలు హాజరయ్యారు, బయటి నుండి 21 మంది సహోదరసహోదరీలు ఆ సందర్భం కోసం వచ్చారు. ఆ కూటమి ఖైదీలపై ప్రోత్సాహకరమైన ప్రభావాన్ని చూపింది. చాలామంది ఇతరులు విశేషమైన అభివృద్ధి సాధించడంతో, అదే సంవత్సరంలో ఆ తర్వాత మరో ఇద్దరు ఖైదీలు బాప్తిస్మం తీసుకున్నారు. రెండు సంవత్సరాల తర్వాత, 1993లో, రెండుసార్లు బాప్తిస్మ కార్యక్రమాలు జరిగాయి, మరో ఏడుగురు ఖైదీలు యెహోవాకు తమ సమర్పణను సూచించారు!

డిసెంబరులో జరిగిన బాప్తిస్మం గురించి నివేదిస్తూ స్థానిక దినపత్రిక వ్యీకోర్డ్‌ వ్రోట్సావ్యా ఇలా పేర్కొంది: “వ్యాయామశాల హాల్లోకి ప్రజలంతా అందరినీ పలకరిస్తూ, చేతులు కలుపుతూ ప్రవాహంలా వస్తూనే ఉన్నారు. ఇక్కడ ఎవ్వరూ అపరిచితులు కాదు. వాళ్లంతా ఒకే పెద్ద కుటుంబం, ఆలోచనలోనూ, జీవన విధానంలోనూ, యెహోవా దేవుని సేవ చేయడంలోనూ వాళ్లంతా ఐక్యంగా ఉన్నారు.” మరి ఆ “పెద్ద కుటుంబంలో” 50 మంది ఖైదీలతో సహా 135 మంది ఉన్నారు. వారిలో కొందరిని మనం కలుద్దాం.

జూన్‌లో బాప్తిస్మం తీసుకున్న యెర్జీ ఇలా చెబుతున్నాడు: “సంవత్సరాల క్రితం నాకు బైబిలు సత్యంతో కొంత పరిచయం ఉన్నప్పటికీ, నాలో నిజంగా ఉన్నది రాతి హృదయమే. మోసం, నా మొదటి భార్య నుండి విడాకులు, క్రిస్టీనాతో అక్రమ సంబంధం, వివాహం వెలుపల ఒక బిడ్డకు తండ్రి కావడం, పదే పదే చెరసాలకు వెళ్లడం—అలా ఉండేది నా జీవితం.” చెరసాలలో ఉన్నప్పుడు కఠినులైన ఇతర ఖైదీలు సాక్షులవ్వడం చూసి, ‘నేను కూడా మంచి వ్యక్తిని కాలేనా?’ అని ఆయన తనను తాను ప్రశ్నించుకోవడం మొదలెట్టాడు. ఆయన బైబిలు పఠనం కోసం విజ్ఞప్తి చేసి, కూటాలకు రావడం ప్రారంభించాడు. అయితే, మూడేళ్ల క్రితమే క్రిస్టీనా యెహోవాసాక్షి అయ్యిందని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ చెప్పినప్పుడు కథ అసలు మలుపు తిరిగింది. యెర్జీ ఇలా చెబుతున్నాడు, “నేను ఆశ్చర్యంతో తలమునకలైపోయాను! నేనిలా ఆలోచించాను, ‘నా సంగతేమిటి? నేనేం చేస్తున్నాను?’ యెహోవా అంగీకారం పొందాలంటే, నేను నా జీవితాన్ని చక్కబరచుకోవాలి అని గ్రహించాను.” ఫలితంగా, క్రిస్టీనాతోనూ, ఆమె 11 ఏళ్ల కుమార్తెయైన మార్జీనాతోనూ చెరసాలలో ఒక ఆనందభరితమైన పునఃకలయిక జరిగింది. త్వరలోనే వారు తమ వివాహాన్ని చట్టబద్ధం చేసుకున్నారు. చెరసాలలోనే ఉండి ఒడిదుడుకులను ఎదుర్కుంటున్నప్పటికీ, యెర్జీ ఈ మధ్యనే సంజ్ఞల భాష నేర్చుకుని, చెవిటివారైన ఖైదీలకు సహాయం చేయగల్గుతున్నాడు.

మీరోస్‌వాఫ్‌ ప్రాథమిక పాఠశాలలో ఉండగానే నేర కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాడు. తన స్నేహితులు చేస్తున్నదాన్ని చూసి అతడు ఎంతగానో మెచ్చుకుని, త్వరలోనే తాను కూడా అదే చేయడం మొదలుపెట్టాడు. ఆయన ఎంతోమందిని దోచుకున్నాడు లేదా కొట్టాడు. తర్వాత అతడు చెరసాలకు చేరుకున్నాడు. “నేను చెరసాలపాలయ్యాక సహాయం కోసం ప్రీస్టు దగ్గరికి వెళ్లాను” అని మీరోస్‌వాఫ్‌ ఒప్పుకుంటున్నాడు. “కాని నేను చాలా నిరాశకు గురయ్యాను. కాబట్టి నేను విషం తీసుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను.” అతడు తన జీవితాన్ని అంతమొందించుకోవాలనుకున్న దినాన్నే అతడు మరో వార్డుకు బదిలీ అయ్యాడు. అక్కడ అతడు జీవిత సంకల్పం గురించి చెబుతున్న కావలికోట ప్రతిని చూశాడు. “అందులో ఉన్న సరళమైన, స్పష్టమైన సమాచారమే నాకు సరిగ్గా కావలసింది,” అని అతడు జత చేస్తున్నాడు. “నాకిప్పుడు జీవించాలని ఉంది ! కాబట్టి నేను యెహోవాకు ప్రార్థన చేసి, సాక్షులను బైబిలు పఠనం కోసం అడిగాను.” అతడు తన బైబిలు పఠనంలో తీవ్రగతిన అభివృద్ధి సాధించి, 1991లో బాప్తిస్మం తీసుకున్నాడు. ఇప్పుడు అతడు చెరసాలలో సహాయ పయినీరుగా సేవచేస్తూ, వార్డు నుండి వార్డుకు ప్రకటించే ఆధిక్యత కల్గివున్నాడు.

ఇప్పటి వరకు మొత్తం 15 మంది ఖైదీలు బాప్తిస్మం తీసుకున్నారు. వాళ్లందరికి పడిన మొత్తం శిక్షను కలిపితే దాదాపు 260 సంవత్సరాలవుతుంది. కొంతమంది తమ శిక్షను పూర్తి చేయకముందే విడుదలయ్యారు. ఒక ఖైదీకి పడిన 25 సంవత్సరాల శిక్ష 10 సంవత్సరాలు తగ్గించబడింది. చెరసాలలో ఉండగా ఆసక్తి చూపించిన కొంతమంది, విడుదలైన తర్వాత బాప్తిస్మం పొందిన సాక్షులయ్యారు. అదనంగా, చెరసాలలో ఉన్న మరో నలుగురు ఖైదీలు బాప్తిస్మం కోసం సిద్ధమౌతున్నారు.

చెరసాల అధికారుల అంగీకారం

“ఖైదీల దృక్పథంలో వచ్చిన మార్పు ప్రాముఖ్యంగా గమనించదగినదిగా ఉంది” అని చెరసాల నివేదిక చెబుతుంది. “చాలామంది పొగత్రాగడం మానేశారు, తమ వార్డులను శుభ్రంగా ఉంచుకుంటున్నారు. చాలామంది ఖైదీల ప్రవర్తనలో అలాంటి మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.”

వోవూఫ్‌ చెరసాల యాజమాన్యం, “మారినవారు క్రమశిక్షణ కల్గివున్నారు; చెరసాల కాపలాదారులకు వాళ్లు సమస్యలు తెచ్చిపెట్టరు” అని అంగీకరించినట్లు జీకే వార్షావ వార్తాపత్రిక నివేదిస్తోంది. తమ శిక్షా కాలం పూర్తికాక ముందే విడుదలైనవారు యెహోవాసాక్షుల సమూహంలోకి చక్కగా కలిసిపోయారని, వాళ్లు మళ్లీ నేర మార్గానికి మళ్లరని కూడా ఆ శీర్షిక తెలియజేస్తోంది.

చెరసాల డైరెక్టర్‌ అభిప్రాయమేమిటి? “చెరసాలలో యెహోవాసాక్షుల పని ఎంతో మెచ్చుకోదగినదిగా, సహాయకరమైనదిగా ఉంది” అని ఆయన చెబుతున్నాడు. “[సాక్షులతో] తమ బైబిలు పఠన సమయంలో ఖైదీల లక్షణాలు, ప్రమాణాలు మారుతున్నాయి, అది వారి జీవితాల్లో వారికి క్రొత్త నడిపింపు శక్తినిస్తోంది. వారి ప్రవర్తన ఎంతో యుక్తిగా, మర్యాదపూర్వకంగా ఉంటుంది. వాళ్లు కష్టపడి పనిచేస్తారు, ఏ మాత్రం సమస్యలు తీసుకురారు” అని డైరెక్టర్‌ అంగీకరిస్తున్నాడు. అధికారులు చేసే అలాంటి అనుకూలమైన వ్యాఖ్యానాలు వోవూఫ్‌ చెరసాలలో ఖైదీలతో కలిసి పని చేసే సాక్షులకు ఆనందాన్ని కల్గిస్తాయి.

సందర్శించే సాక్షులు యేసు చెప్పిన ఈ మాటలను పూర్తిగా గుణగ్రహిస్తారు: “నేను నా గొఱ్ఱెలను ఎరుగుదును, నా గొఱ్ఱెలు నన్ను ఎరుగును. . . . అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱెల కాపరి ఒక్కడును అగును.” (యోహాను 10:15, 16) మంచికాపరియైన యేసుక్రీస్తు గొఱ్ఱెలవంటి వారిని సమకూర్చకుండా చివరికి చెరసాల గోడలు కూడా ఆయనను ఆపలేవు. వోవూఫ్‌ సాక్షులు ఈ ఆనందభరితమైన సేవలో భాగం వహించే ఆధిక్యత తమకు లభించినందుకు కృతజ్ఞత కల్గివున్నారు. అంతం రాకముందు ఇంకా అనేక కఠిన హృదయాలు రాజ్యసువార్తకు ప్రతిస్పందించేందుకు సహాయం చేయడంలో యెహోవా ఎడతెగని ఆశీర్వాదం కోసం వాళ్లు ఆయన వైపు చూస్తారు.—మత్తయి 24:14.

[27వ పేజీలోని బాక్సు]

“పెద్ద పిల్లల” సమస్య

“కొంతకాలం పాటు చెరసాలలో ఉన్న తర్వాత, ఖైదీ సాధారణంగా స్వేచ్ఛగా జీవించడం లేక తన స్వంతగా జీవించడం అంటే ఏమిటో మరిచిపోతాడు,” అని వోవూఫ్‌ చెరసాలలో పనిచేస్తున్న సాక్షులు పేర్కొంటున్నారు. “మాకు ప్రాముఖ్యంగా ‘పెద్ద పిల్లల’ సమస్య ఉంది, చెరసాల నుండి విడుదలైన వ్యక్తికి తన గురించి తాను ఎలా శ్రద్ధ తీసుకోవాలో తెలియదు. కాబట్టి సంఘం వారికి కేవలం బైబిలు సత్యం బోధించడం కంటే ఎక్కువ పాత్రే నిర్వహించవలసి ఉంటుంది. అతడికి ఎదురవ్వగల క్రొత్త ప్రమాదాల గురించి శోధనల గురించి అతడిని హెచ్చరిస్తూ, సమాజంలో ఒక భాగమయ్యేందుకు అతడిని సిద్ధం చేయవలసి ఉంటుంది. మరీ ఎక్కువగా కాపాడేవారిగా తయారవ్వకుండా జాగ్రత్త వహిస్తూ, అతడు జీవితాన్ని క్రొత్తగా ప్రారంభించడానికి మేము సహాయం చేయవలసి ఉంటుంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి