“క్యాథలిక్కులమైన మనం వాళ్లనుండి నేర్చుకోవలసింది ఎంతో ఉంది”
ఇటలీ నందలి బారిలోని ఒక ఉపాధ్యాయురాలు తన ఉన్నత పాఠశాలలో మత చరిత్ర సంబంధ తరగతిలో యెహోవాసాక్షులను గురించి అలా వ్యాఖ్యానించింది. వీడియో క్యాసెట్లను బోధనా సహాయకాలుగా ఉపయోగిస్తానని ఆమె తన తరగతిలో తెలియజేసింది. ఇది విని విద్యార్థుల్లో ఒకరైన 18 సంవత్సరాల రోబెర్టో తన మతాన్ని కూడా చర్చలో చేర్చమని సూచించాడు. అతడు జెహోవాస్ విట్నెసెస్—ది ఆర్గనైజేషన్ బిహైండ్ ది నేమ్ అనే వీడియోను ఇచ్చాడు. ఆమె రోబెర్టో ప్రతిపాదనను అంగీకరించింది, 30 మంది విద్యార్థులున్న తరగతి మొత్తం ఆ వీడియోను చూసింది. “యెహోవాసాక్షుల మధ్య ఉన్న ఐక్యత, సంస్థీకరణ, ప్రగాఢమైన ప్రేమ చూసి అందరూ ప్రభావితులయ్యారు” అని రోబెర్టో చెబుతున్నాడు. “ప్రతి నెల కావలికోట 400 లక్షల కాపీలు, తేజరిల్లు! 360 లక్షల కాపీలు ముద్రించబడుతున్నాయని తెలుసుకుని వాళ్లు మరింత ఆశ్చర్యపోయారు.”
వీడియో చూసిన తర్వాత రోబెర్టో తోటి విద్యార్థులు కొంతమంది, “మీరు ఇంత సంస్థీకరించబడివున్నారని నేననుకోలేదు” అన్నారు. యెహోవాసాక్షుల గురించి, ఆ ఉపాధ్యాయురాలు తరగతితో ఇలా చెప్పింది: “వాళ్ల విశ్వాసం వాళ్లను ఎంత ఐక్యంగా, సంస్థీకృతంగా ఉండేలా వారిని పురికొల్పుతుందో గమనించండి. క్యాథోలిక్కులమైన మనం వాళ్లనుండి నేర్చుకోవలసింది ఎంతో ఉంది.” ఆ వీడియో, దాని తర్వాత తరగతిలో జరిగిన చర్చ యెహోవాసాక్షుల గురించి మంచి అవగాహనను పెంపొందింపజేసుకోవడానికి ఎంతో దోహదపడ్డాయి.