వారి పని “గౌరవాన్ని పుట్టించక మానదు”
అపొస్తలుడైన పేతురు తన తోటి క్రైస్తవులకు ఇలా సలహా ఇచ్చాడు: “అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి, వాటినిబట్టి దర్శనదినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.” (1 పేతురు 2:12) ఇటలీలోని యెహోవాసాక్షులు అనేక సంవత్సరాలుగా అలాంటి చక్కని ప్రవర్తననే బహిరంగంగా ప్రదర్శించారు. “మేడలమీద ప్రకటించుడి” అని యేసు ఇచ్చిన ఉపదేశానికి అనుగుణంగా, వాళ్లు తమ క్రైస్తవ కార్యకలాపాలనన్నింటినీ మరుగులేకుండా, బాహాటంగా జరుపుకున్నారు. (మత్తయి 10:27; యోహాను 18:20) అందుకనే, ఇటలీకి చెందిన ఒక అటార్నీ, ఒక ప్రీస్టూ యెహోవాసాక్షులు “బూటకపు మతానికి సంబంధించిన ఒక తెగ” అని అభిశంసించి “ప్రజలకు వలలు వేసే రహస్య సమాజాలలో” వాళ్లను కూడా చేర్చుతూ శీర్షికలను ప్రచురించినప్పుడు, తమ ప్రతిష్ఠకు భంగం కలిగించే వ్యాఖ్యానాలను చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సాక్షులు తీర్మానించారు.
మొదటి విచారణలో అటార్నీ, ప్రీస్టూ ఏ చట్టాన్నీ అతిక్రమించలేదని కోర్టు తీర్మానించి చెప్పింది. అయితే, 1997 జూలై 17న, వెనిస్ కోర్ట్ ఆఫ్ అపీల్స్ ఇద్దరు ప్రతివాదులనూ దోషులుగా గుర్తించి మొదటి కోర్టు తీర్మానాన్ని కొట్టివేసింది. కోర్ట్ ఆఫ్ అపీల్స్ ఇలా పేర్కొంది: “వివాదంలో ఉన్న ప్రచురిత శీర్షికలు రెండూ, ‘యెహోవాసాక్షుల’ మతస్థుల ప్రతిష్ఠను దెబ్బతీయగల వ్యక్తీకరణలనూ వాక్యాలను తప్పకుండా కలిగివున్నాయి. ఆ మతస్థులను బహిరంగ అవమానానికి గురిచేయాలన్నదే ఈ శీర్షికల లక్ష్యమనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఆ శీర్షికలు చేసిన పని, “నివేదించే, విమర్శించే హక్కును న్యాయసమ్మతంగా ఉపయోగించుకోవడంగా పరిగణించబడదు” అని కోర్టు పేర్కొన్నది. అప్రతిష్ఠ కలిగించాలని ప్రయత్నించిన ఆ ఇద్దరికీ కోర్టు జరిమానా విధించి, రెండు కేసుల విషయంలో యెహోవాసాక్షులకైన కేసు ఖర్చులతో పాటూ కోర్టువారికైన అన్ని ఖర్చులనూ చెల్లించవలసిందిగా ఆజ్ఞాపించింది.
వ్రాతపూర్వక తీర్పులో, వెనిస్ కోర్ట్ ఆఫ్ అపీల్స్ ఇలా వ్యాఖ్యానించింది: “[ఇటాలియన్] రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కులనన్నింటినీ సమానంగా అమలుపరచి, పరిరక్షించడం ద్వారానే, అసహనాన్నీ, మతపర విద్వేషాన్నీ పూర్తిగా నివారించడం సాధ్యమౌతుంది.” యెహోవాసాక్షుల కార్యకలాపాలు రహస్యమైనవి కావనీ, వారు ‘బూటకపు మతానికి చెందిన వారు కారనీ’ ఆ తీర్మానం ఒప్పుకుంటోంది. “ఆ మతం అనేక నగరాల్లోనూ ఉంది గనుక సాక్షులను రహస్య సమాజాల్లో ఒకరిగా చూపించడం చరిత్రలో రుజువైన వాస్తవాన్ని కూడా కించపర్చడం అవుతుంది మరియు వాళ్లు ప్రకటించే సిద్ధాంతాల విషయంలో ఒకరికి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ విస్తృత వ్యాప్తిలో దాని సభ్యులు ప్రాముఖ్యంగా ఆదివారాల్లోనూ ఇతర సెలవుదినాల్లోనూ చేసే ప్రకటనాకార్యకలాపం ఎంతో ప్రఖ్యాతి గాంచినది, అది గౌరవాన్ని పుట్టించక మానదు” అని కోర్టు పేర్కొంది. అలా ఇటలీలోని యెహోవాసాక్షుల ఆసక్తితో కూడిన ప్రకటనాపని, మాదిరికరమైన ప్రవర్తన యొక్క రికార్డు వారికి విరుద్ధంగా ఉండే దురభిమానాన్ని రూపుమాపేందుకు సహాయం చేశాయి.—మత్తయి 5:14-16; 1 పేతురు 2:15.