“మంచు బిందువులను పుట్టించువాడెవడు?”
పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన ఒక విలేఖరి మంచు బిందువులను “ఈ భూమిపై గాలి సృష్టించిన ముత్యాలని” అభివర్ణించాడు. ప్రాచీనకాలంలోని పితరుడైన యోబును “మంచు బిందువులను పుట్టించువాడెవడు?” అని మన సృష్టికర్త అడిగాడు. (యోబు 38:28) ప్రశస్తమైన మంచును పుట్టించింది దేవుడేనని—అంటే తానేనని యోబుకు దేవుడు గుర్తు చేస్తున్నాడు.
ముత్యంలా మిలమిల్లాడుతూ మెరిసే మంచుకున్న అందానికి తోడు, అది బైబిలులో దీవెనలతోనూ, పుష్కలమైన పాడిపంటలతోనూ, అలాగే సుఖ జీవనంతోనూ జతచేయబడింది. (ఆదికాండము 27:28; ద్వితీయోపదేశకాండము 33:13, 28; జెకర్యా 8:12) ఇశ్రాయేలులోని ఎండలుగల వేసవి కాలంలో, “హెర్మోను మంచు” ఆ దేశంలోని పచ్చదనాన్ని తద్వారా ప్రజలను కాపాడేది. అడవులతో నిండిన మంచుగల హెర్మోను పర్వతపంక్తులు నేడు కూడా రాత్రివేళ తేమను ఉత్పత్తి చేస్తాయి, అది ప్రభాతవేళ మంచుగా తయారౌతుంది. కీర్తనల గ్రంథకర్తయైన దావీదు ఈ మంచువల్ల లభించే ఉత్తేజాన్ని, తోటి యెహోవా ఆరాధికులతో ఐక్యంగా కలిసివుండటమనే ఆహ్లాదకర అనుభవంతో పోల్చాడు.—కీర్తన 133:3.
ఇశ్రాయేలీయులకు ప్రవక్తయైన మోషే ఇచ్చిన ఉపదేశాలు మంచు బిందువులవలె మృదువుగానూ, ఉత్తేజానిచ్చేవిగానూ ఉన్నాయి. ఆయనిలా చెప్పాడు: “నా వాక్యము మంచువలెను లేతగడ్డిమీద పడు చినుకులవలెను పచ్చికమీద కురియు వర్షమువలెను ఉండును.” (ద్వితీయోపదేశకాండము 32:2) నేడు, యెహోవాసాక్షులు దేవుని రాజ్యాన్ని గురించిన జీవాన్నిచ్చే సువార్తను భూదిగంతముల వరకూ ప్రకటిస్తున్నారు. (మత్తయి 24:14) దేవుడు ఈ ఆహ్వానాన్ని అందిస్తున్నాడు: “రమ్ము . . . దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయంచువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.” (ప్రకటన 22:17) సమస్త జనాంగాలకూ చెందిన లక్షలాదిమంది ప్రజలు, నిరంతరమూ జీవాన్ని కాపాడగల దేవుడిస్తున్న ఆధ్యాత్మిక ఉత్తేజాన్ని గురించిన ఈ ఏర్పాటును అందుకుంటున్నారు.