అగోరా—ప్రాచీన ఏథెన్సుకు ఆయువుపట్టు
ఏథెన్సులోని మేధావి వర్గంలో అలజడి చెలరేగింది! ఆ గ్రీకు నగర అగోరాలో లేక సంతవీధిలో ఎప్పుడూ క్రొత్త తలంపులు ప్రచురమౌతూనే ఉంటాయి. అయితే, ఈసారి మాత్రం అదెంతో భిన్నంగా ఉంది. అప్పుడే నగరంలోకి ప్రవేశించిన ఒక యూదుడు ‘అన్య దేవతలను ప్రచురిస్తున్నట్లుంది.’ “తన్ను కలిసికొనువారితో” ఆయన విశేషమైన వ్యాఖ్యానాలు చేస్తున్నాడు. అహంకారులైన ఎపికూరీయులు, గంభీర-వదనులైన స్తోయికులు, “ఈ వదరుబోతు చెప్పునది ఏమిటని” అడిగారు. అవును, ఏథెన్సులోని అగోరా, సూర్యుని క్రిందవున్న దాదాపు ఏ అంశంపైనైనా బహిరంగ చర్చలు జరిపే స్థలం. కాని క్రొత్త దేవుళ్లను ప్రవేశపెట్టడం—నిజంగా ఇది అసాధారణం!—అపొస్తలుల కార్యములు 17:17, 18.
అపొస్తలుడైన పౌలు ఏథెన్సులోని అగోరాలో మొదటిసారి ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు ఏథెన్సువాసుల అనుమానంతో కూడిన ప్రతిస్పందన అది. ఆయన యేసుక్రీస్తు గురించీ, పునరుత్థానం గురించీ మాట్లాడుతున్నాడు. అయితే, నూతన భావాలను ఆహ్వానించేదిగా కన్పించే ఏథెన్సు సంస్కృతికి, అగోరాలో క్రొత్త తలంపులను ప్రవేశపెట్టడం ఎందుకు అసాధారణమైనది?
ఏథెన్సులో బహిరంగ కూడలి సిద్ధమవ్వడం
వాస్తవానికి అగోరా ఎంతో విశేషమైనది, అంతేగాక ఏథెన్సు వాసుల మత జీవితంలోనూ ప్రజా జీవనంలోనూ అది నిర్వహించిన ప్రాముఖ్యమైన పాత్ర కూడా విశేషమైనది. ఏథెన్సులోని అగోరా, అక్రోపోలిస్‌కు వాయవ్యంగా దాదాపు 25 ఎకరాల ఏటవాలు ప్రాంతంలో నెలకొల్పబడి ఉంది. సా.శ.పూ. ఆరవ శతాబ్దంలో, ఏథెన్సు రాజనీతివిశారదుడూ శాసకుడూ అయిన సొలోన్ జీవితకాలంలో, ఈ ప్రాంతం నగర కూడలి ప్రాంతంగా నియుక్తం చేయబడినట్లు కనిపిస్తుంది. పౌర జీవనానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఏథెన్సులో ప్రజాస్వామ్యం స్థాపించబడడం, తర్వాతి శతాబ్దపు తొలి సంవత్సరాల్లో నిర్మాణ కార్యక్రమం ఉద్ధృతమయ్యేలా చేసింది. ఇది అగోరాకు క్రొత్త ఉత్తేజాన్నీ, నిర్వహించడానికి మరింత విశేషమైన పాత్రనూ ఇచ్చింది.
అగోరా అనే గ్రీకు పదానికి, “సమకూర్చడం, సమావేశపర్చడం” అనే భావాలుగల క్రియాపదం మూలమైవుంది. ఇది, అగోరాను నగరంలోని ప్రాథమిక సమావేశ స్థలంగా ఉపయోగించడంతో పొందిక కల్గివుంది. అగోరా సామాజిక ప్రజా జీవనానికి ఆయువుపట్టు అయింది. అది పౌర వ్యవహారాల నిర్వహణకు, న్యాయపాలనకూ పీఠంగా, క్రయవిక్రయాలకూ వ్యాపారానికీ ముఖ్యస్థలంగా, గ్రీకు నాటక ప్రదర్శనలకు రంగస్థలంగా, వ్యాయామ క్రీడలకు ప్రదర్శనాస్థలంగా, మేధావి చర్చలు జరుపుకునేందుకు ఇష్టమైన కూటమిస్థలంగా మారింది.
ఏథెన్సులోని అగోరా యొక్క ఆలయాలు, మండపాలు, విగ్రహాలు, స్మృతి చిహ్నాలు, ప్రజా భవనాల అవశేషాలను సందర్శించాలని మీరు ఇష్టపడుతున్నారా? అగోరా గతాన్ని పరిశీలించడానికి, మనం ఆధునిక-దిన నగర రణగొణ ధ్వనులనూ కోలాహలాన్నీ విడిచి కంకర మార్గాల గుండా, చలవరాయి నిశ్శబ్ద శిధిలాల గుండా, చెక్కబడిన రాళ్ల మధ్యన, కలుపు మొక్కలూ అడవి మొక్కలూ పిచ్చిగా పెరిగిన చిన్న చిన్న ద్వారాల గుండా ప్రయాణిద్దాం.
గుళ్లు, గోపురాలు, అధిష్ఠానదేవతలు
వివిధ దేవతలకు సమర్పించబడిన అనేకానేక ఆలయాలు, గుడులు, పవిత్రస్థలాలూ ఉండడం చూసి సందర్శకులు ప్రభావితులౌతారు. ఇదంతా కూడా, అక్రోపోలిస్ తర్వాత అగోరాయే ముఖ్య ఆరాధనా కేంద్రమయ్యేలా చేసింది. ప్రామాణిక ఏథెన్సు యొక్క స్వర్ణ యుగంలో, మతం ప్రజా జీవనంలోని ప్రతి అంశంలోకీ ప్రవేశించింది. అంటే ప్రభుత్వ విభాగాలకూ, కార్యనిర్వాహక సేవలకూ “అధిష్ఠాన దేవతలుగా” నియుక్తమైన వివిధ దైవాల కోసం అగోరాలో పవిత్రస్థలాలు కేటాయించబడ్డాయని అర్థమౌతుంది.
ఈ కట్టడాల్లో ప్రముఖమైనది హెఫేస్టస్ ఆలయం. ఏథెనా దేవతకు హెఫేస్టస్‌తో సంబంధం ఉంది. ఈ ఇద్దరు దేవతలూ కళల, చేతిపనుల అధిష్ఠాన దేవతలుగా పూజింపబడేవారు. ఈ ఆలయం చుట్టుప్రక్కల్లో జరిగిన భూగర్భ పరిశోధనల్లో వెల్లడైన కమ్మరిపని, కుమ్మరిపని వంటివి, ఆ ఆలయం, అగ్ని అవసరమైన కళల దేవుడైన హెఫేస్టస్‌కు సంబంధించినదని వెల్లడిచేశాయి. చక్కగా కాపాడబడిన ఈ ఆలయం బహుశ సా.శ. ఏడవ శతాబ్దంలో, సెయింట్ జార్జ్ గ్రీకు ఆర్థడాక్స్ చర్చిగా మార్చబడింది, అయితే అది నేడు ఆ విధంగా కూడా ఉపయోగంలో లేదు.
అగోరాకు కూడా దాని స్వంత అధిష్ఠానదేవత అవసరమైంది. అతడే అగ్యోరాస్ జీయస్ (ద్యుపతి), ఉపన్యాస కళను ప్రేరేపించేవాడు, విలువైన పెన్టెలిక్ చలువరాతితో మలచబడి అలంకరించబడిన బలిపీఠం ఆయనకు సమర్పించబడింది. (పోల్చండి అపొస్తలుల కార్యములు 14:11, 12.) సమీపంలోనే దేవమాత యొక్క బలిపీఠం ఉంది, దానికిరువైపులా వీరుల స్మృతిచిహ్నాలు చక్కగా అలంకరించబడి ఉన్నాయి.
మరికొంత దూరంలో, ఒక చిన్న అయోనిక్ ఆలయం కనిపిస్తుంది. అది పితామహుడైన అపోలో ఆలయమని భూగోళశాస్త్రవేత్తయైన పాసేనియస్ తెలియజేశాడు. ఎందుకు? ఎందుకంటే, ఒక ప్రాచీన గ్రీకు పురాణగాథ ప్రకారం, అపోలో కుమారుడు అయోన్, ఈ అయోన్ తన పేరుమీదున్న జాతికి మూలపురుషుడు, ఏథెన్సువారు ఆ జాతిలోని వారే.a ఈ స్థానాన్నిబట్టి, ప్రాముఖ్యంగా నగరంలోవున్న వివిధ తెగలకు సంబంధించి, రాష్ట్ర కార్యనిర్వాహక సంస్థ అధిష్ఠాన దేవతల్లో అపోలో ఒకడు.
ఉత్తరాన, సా.శ.పూ. నాలుగవ శతాబ్ద మధ్యకాలంలో నిర్మించబడిన ఒక చిన్న ఆలయానికి సంబంధించిన సున్నపు అవశేషాలను చూడవచ్చు. అక్కడ పూర్వీకుల మతతెగల ప్రముఖ దేవతలైన జీయస్ ఏథెనా పాత్రోయస్‌లు పూజించబడేవారు. ఈ మతతెగల్లో సభ్యత్వం, ఏథెన్సు పౌరత్వం పొందడానికి దాదాపు తప్పనిసరి. ఆ వీధికి కొంచెం అవతల, పన్నెండుమంది దేవుళ్ల బలిపీఠం యొక్క అవశేషాలు మనకు కనిపిస్తాయి.
సమీపంలోవున్న జీయస్ ఎల్యూథెర్యోస్‌కు చెందిన మండపంలో, గ్రీకుల ముఖ్య దేవత ఇప్పుడుమటుకు స్వేచ్ఛా విడుదలల దేవునిగా గౌరవించబడేవాడు. ఈ మండపం పేరుపొందిన, రాళ్లుపరిచిన బహిరంగమార్గంగా, కూటమి స్థలంగా ఉండేది. పేరుగాంచిన తత్వవేత్తయైన సోక్రటీసు తన స్నేహితులను ఈ మండపంలోనే కలిసేవాడని చెప్పబడుతుంది, ఇక్కడే వాళ్లు కూర్చోవడం, మాట్లాడుకోవడం లేక వ్యాహాళికి వెళ్లడం చేసేవారు. ఈ మండపాన్ని అలకరించేందుకు చేయబడిన అనేక రకాల అర్పణలకు, అంటే ఏథెన్సును కాపాడే పోరాటంలో మరణించిన వీరుల డాలులు వంటి అర్పణలకూ, నగరాన్ని దాని శత్రువుల నుండి విడుదల చేయడంతో లేక స్వేచ్ఛను కాపాడడంతో సూటియైన సంబంధం ఉండేది.
పానథేనియన్ మార్గం
అగోరా మధ్యన కంకరతో వేయబడిన, వెడల్పైన మార్గం ఉంది, అది పానథేనియన్ మార్గం అని పిలువబడేది. దాని పేరూ, ప్రత్యేక లక్షణాలూ ఏథెన్సు యొక్క జాతీయ పండుగయైన పానథేనియ నుండి తీసుకోబడ్డాయి. ఆ పండుగ సమయంలో ఏథెనా దేవత ముసుగు, ఊరేగింపు భవనం (నగర ద్వారానికి ప్రక్కన) నుండి అక్రోపోలిస్ వరకు ఈ మార్గంగుండా ఊరేగింపుగా తీసుకువెళ్లబడేది. పండుగ ఊరేగింపు వైభవాన్నీ మహిమనూ ఊహించుకోవడానికి, పార్థెనాన్ గోడలమీద చెక్కబడిన అశ్వికదళం, పరుగులు తీస్తున్న రథాలు, బలి ఇవ్వబడే ఆవులు గొర్రెలు, బలి దగ్గర ఉపయోగించడానికి అవసరమైన సామాగ్రిని మోస్తున్న యువతీయువకులు వంటి ఉబ్బెత్తు శిల్పదృశ్యాలు మనకు సహాయం చేస్తాయి. ఊరేగింపును ఏథెన్సు పౌరులూ, వారి అతిథులూ చూసేవారు, అలాంటివారి సౌకర్యార్థం అగోరాను రూపొందించేటప్పుడే శిల్పకారులు తగినంత స్థలం వుండేలా చూశారు. ఉదాహరణకు, ఊరేగింపు ఏ మార్గంగుండా వెళుతుందో, ఆ మార్గాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ మండపాల ముందు భాగంలో ఎంతో నైపుణ్యంతో మెట్లు నిర్మించడం జరిగింది. ఈ మెట్లు చాలా ఎక్కువ సంఖ్యలో ఉండేవి, అందుకే చాలామంది ప్రేక్షకులు వాటిలో కూర్చోగలిగేవారు.
‘విగ్రహాలతో నిండివుంది’
ఎన్నో ఆలయాలు, విగ్రహాలు, స్మృతిచిహ్నాలు పోగుచేయబడివుండగా, అపొస్తలుడైన పౌలు, “ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను” అంటే అందులో ఆశ్చర్యం లేదు. (అపొస్తలుల కార్యములు 17:16) అగోరాలోకి ప్రవేశించిన వెంటనే తాను చూసిన దృశ్యాన్ని బట్టి పౌలు కలవరపడివుండవచ్చు. హెర్మేస్ దేవుని లింగ విగ్రహాలు ఎంత ఎక్కువగా ఉండేవంటే, వాటిని పెట్టడానికి హెర్మేస్ మండపమని పిలువబడే మండపం మొత్తం అవసరమైంది. హెర్మేస్ యొక్క రంగువేయబడిన ఇతర విగ్రహాల వస్త్రాలమీద స్వస్తిక్ గుర్తులు ఉన్నాయి, అవి ఫలప్రదత్వానికీ, జీవానికీ చిహ్నాలు. శృంగార దేవతయైన వీనస్ జెనెట్రిక్స్ ప్రతిమ, అలాగే అనేక లింగ సిలువలున్న డైనిసస్ ప్రతిమ ఉండేవి. అగోరా “పరిశుద్ధత”ను సూచిస్తూ, అక్కడికి ప్రవేశించే వారందరూ తమను తాము ఆచారప్రకారంగా శుద్ధిపర్చుకోవడానికి “పరిశుద్ధ” నీళ్లున్న బేసిన్‌గల సరిహద్దు రాయి ఉండేది.
అలాంటి గంభీరమైన మత వాతావరణం దృష్ట్యా, పౌలు పరిస్థితి ఎందుకంత ప్రమాదకరమైనదిగా ఉందో మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఆయన “అన్య దేవతలను ప్రచురపరిచేవాడని” అనుమానించబడ్డాడు, ‘ఎవరికీ వేరే దేవుళ్లు, లేక క్రొత్త దేవుళ్లు ఉండకూడదనీ, బహిరంగంగా అంగీకరించబడితే తప్ప ఒకరు క్రొత్త దేవుళ్లను వ్యక్తిగతంగా ఆరాధించకూడదనీ’ ఆ కాలంలో చట్టం ఉండేది. ప్రశ్నించబడడానికి అపొస్తలుని అరియోపగుకు తీసుకువెళ్ళారంటే అందులో ఆశ్చర్యం లేదు.—అపొస్తలుల కార్యములు 17:18, 19.
కార్యనిర్వహణా కేంద్రం
తోలోస్ అని పిలువబడే ఒక గుండ్రని భవనం ఏథెన్సు ప్రభుత్వానికి కేంద్రంగా ఉండేది. బాధ్యతగల అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా ఆ నగర అధ్యక్షులు చాలామంది రాత్రులు ఆ భవనంలో నిద్రించేవారు. తోలోస్‌లో కొన్ని కొలతలూ తూకముల ప్రమాణాలు ఉంచబడేవి. కార్యనిర్వాహక విభాగాల కోసం భవనసదుపాయాలు సమీపంలోనే ఉండేవి. తోలోస్‌కు వాయవ్యంగా కొండలోకి చెక్కబడివున్న అంతస్థులో కౌన్సిల్ హౌస్ ఉండేది. అక్కడ, 500 మంది కౌన్సిల్ సభ్యులు కూటమి జరుపుకునేవాళ్లు, దానిలో వాళ్లు కమిటీ పని చేసుకుంటూ శాసన సభ కొరకు శాసన నిర్మాణం చేసేవారు.
మరో ప్రాముఖ్యమైన పౌర భవనం రాచ మండపం. అందులో, ఏథెన్సు యొక్క రాజరిక ముఖ్య న్యాయపాలనాధికారి, అంటే నగరంలోని ముగ్గురు ముఖ్య న్యాయపాలనాధికారుల్లో ఒకరు, ఉండేవాడు. అక్కడి నుండి ఆయన, మతసంబంధమైన మరియు చట్టసంబంధమైన ఎన్నో కార్యనిర్వాహక బాధ్యతలను చేపట్టేవాడు. అమర్యాదగా ప్రవర్తించాడని నిందించబడినప్పుడు సోక్రటీసు బహుశ ఇక్కడే హాజరు కావలసివచ్చి ఉండవచ్చు. ఏథెన్సు యొక్క పూర్వీకుల చట్టాలు దానికి ఎదురుగా ఉన్న భవన గోడలపై చెక్కబడ్డాయి. ప్రతి సంవత్సరం ఆర్కాన్‌లు లేక ప్రముఖ న్యాయపాలనాధికారులు తాము ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు, అదే భవనం ఎదుట ఉంచబడిన ఒక రాతిపై నిలబడి ప్రమాణ స్వీకారం చేసేవారు.
అట్టాలుస్ మండపం
అగోరాలోని బాగా కాపాడబడిన భవనం అట్టాలుస్ మండపం. పెర్గమమ్ రాజైన అట్టాలుస్ (సా.శ.పూ. రెండవ శతాబ్దం) యౌవనస్థుడిగా ఉన్నప్పుడు, మధ్యధరా ప్రపంచంలోని అనేక ఇతర రాజరిక కుటుంబాల పిల్లల్లానే ఏథెన్సు పాఠశాలల్లో చదువుకున్నాడు. సింహాసనాన్ని అధిష్టించిన తర్వాత, అట్టాలుస్ మండపమనే ఈ అద్భుతమైన బహుమానాన్ని తాను చదువుకున్న పాఠశాల ఉన్న నగరానికి బహుకరించాడు.
అట్టాలుస్ మండపం అనియత, పరస్పర సహవాసం కొరకు ఒక దాపువున్న చక్కని మండపంగా ఉండేలా నిర్మించబడింది. ఊరేగింపులను చూడడానికి దాని అంతస్థులూ, మేడలూ చక్కని స్థలాలుగా ఉండేవి, మండపంగా దానికున్న ప్రజాదరణ కూడా విక్రయ కేంద్రంగా దాని విజయానికి దోహదపడి ఉండవచ్చు. రాష్ట్రం దుకాణాలను వ్యాపారస్థులకు అద్దెకిచ్చేది, అలా ఆ భవనం ద్వారా రాబడి వచ్చేది.
దాని పూర్వ స్థితికి తీసుకురాబడిన అట్టాలుస్ మండపం, రేఖాగణిత రూపకల్పనకు చక్కని ఉదాహరణగా ఉంది. మొత్తం దాని కొలతలూ, స్తంభాల క్రింది మరియు పైభాగాల మధ్యనున్న చక్కని తేడాలు, వెలుగునీడల కలయిక, దాని నిర్మాణంలో ఉపయోగించబడిన వస్తుసామాగ్రి యొక్క సంపన్నతా, సౌందర్యమూ ఇవన్నీ కలిసి దాన్ని విశేషమైనదిగా చేస్తున్నాయి. ప్రాముఖ్యంగా, డోరిక్, అయోనియన్, ఈజిప్షియన్ వంటి మూడు వివిధ రకాల స్తంభాలను ఉపయోగించడం ద్వారా అనేక విధాలుగా దానిలో వైవిధ్యం జొప్పించబడింది.
వినోద కార్యకలాపాల కొరకు ఒక స్థలం
ఏథెన్సులో అనేక వినోద కార్యక్రమాలకు రంగస్థలంగా పని చేసిన భవనం గానసభ. రోమా చక్రవర్తి అగస్టస్ అల్లుడైన విప్సేనియస్ అగ్రిప్ప దాన్ని బహుకరించాడు. దాని ముందు భాగం వివిధ వర్ణాల చలవరాతితో తాపడం చేయబడింది. దాదాపు 1,000 మంది కూర్చోగల ఆడిటోరియమ్, 25 మీటర్ల వైశాల్యం కలిగి, అంతర్భాగంలో ఏ ఆధారాలు లేని పైకప్పు కల్గివుండేది. ప్రాచీన ప్రపంచానికి తెలిసిన, పైకప్పు వేసే విధానంలోని అత్యంత సాహసోపేత ప్రయోగాల్లో ఇదొకటి. అయితే, అక్కడ అందజేయబడే వినోదం చాలామట్టుకు, ఉన్నతమైన నైతిక ప్రమాణాలుగల నిజక్రైస్తవులకు అభ్యంతరం కల్గించేదిగా ఉండేది.—ఎఫెసీయులు 5:3-5.
బహుశ, ప్రాచీన కాలానికి చెందిన, జిజ్ఞాసగల వ్యక్తులు పాన్‌థేన్యోస్ గ్రంథాలయానికి వెళ్లేవారు. దాని గోడల నిండా చిన్న సొరుగులు ఉండేవి, వాటిలో పపైరస్ మరియు పార్చమెంట్ చేతివ్రాత గ్రంథపు చుట్టలు భద్రపర్చబడి ఉండేవి. గ్రంథాలయం ముఖ్య గది పశ్చిమ దిశగా ఉండేది, స్తంభాల వరుస మధ్య నుండి చూస్తే మండపాలు గల ప్రాంగణం కనిపిస్తుంది—పచార్లు చేయడానికి, చదువుకోవడానికి, లేక ధ్యానించడానికి అది చక్కని స్థలంగా ఉండేది. గ్రంథాలయ నియమాలు రెండు వ్రాసివున్న స్మారకచిహ్నం ఒకటి కనుగొనబడింది. అవి: “పుస్తకాలేవీ తీసుకువెళ్లకూడదు,” మరియు “[గ్రంథాలయం] మొదటి గంట నుండి ఆరో గంట వరకు తెరిచి ఉంటుంది.”
అగోరా నేడు
ఇటీవలి సంవత్సరాల్లో, అమెరికన్ స్కూల్ ఆఫ్ క్లాసికల్ స్టడీస్ అగోరాను దాదాపు పూర్తిగా త్రవ్వి వెలికితీసింది. ఎత్తైన అక్రోపోలిస్ నీడన ప్రశాంతంగా విశ్రమిస్తున్న అగోరా ప్రాచీన ఏథెన్సు చరిత్ర సంక్షిప్తంగా పరికించాలనుకునే సందర్శకునికి ఇష్టమైన స్థలంగా మారింది.
అగోరా, అక్రోపోలిస్‌లకు కొంతదూరంలోవున్న మోనాస్టిరాకి మార్కెట్టు మరో అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. అది సందర్శకునికి, గ్రీకు గ్రామీణ జీవనం గురించీ, మధ్యప్రాచ్య క్రయవిక్రయాలు బేరసారాల గురించిన ఆనందభరితమైన సమాచారాన్ని ఇస్తుంది. 1,900 సంవత్సరాల కంటే ఎక్కువకాలం క్రితం అపొస్తలుడైన పౌలు చేసిన పనినే యెహోవాసాక్షులు అక్కడ ఆనందంగా చేస్తుండడాన్ని కూడా సందర్శకుడు చూడవచ్చు, అదేమిటంటే తమను “కలిసికొను వారి”కి రాజ్యసువార్తను బహిరంగంగా ప్రకటించడం.
[అధస్సూచి]
a అయోనిక్ అనే పేరు, నోవహు మనుమడూ యాపెతు కుమారుడూ అయిన యావాను నుండి వస్తుంది.—ఆదికాండము 10:1, 2, 4, 5.
[28వ పేజీలోని బాక్సు]
ఏథెన్సులో వాణిజ్యం
అగోరా ఏథెన్సులోని మేధావి వర్గానికీ, పౌర వ్యవహారాలకూ ఆయువుపట్టుగా ఉండడమే గాక నగర ప్రాథమిక వ్యాపార స్థలంగా కూడా ఉండేది. ఏథెన్సు వాణిజ్యానికి కేంద్రమయ్యింది, అది దాని నాణేల విలువకూ, న్యాయపాలనాధికారుల విశేష జాగ్రత్తకూ పేరుపొందింది, ఆ న్యాయపాలనాధికారులకు అన్ని వ్యాపార లావాదేవీలు యథార్థంగా, న్యాయంగా జరిగేలా చూసే అధికారం ఇవ్వబడింది.
ద్రాక్షామద్యం, ఒలీవ నూనె, తేనె, చలవరాయి, పింగాణి మరితర ప్రక్రియ చేయబడిన లోహాలు వంటి పారిశ్రామిక ఉత్పత్తులను ఏథెన్సు ఎగుమతి చేసేది. బదులుగా అది, ప్రాముఖ్యంగా గోధుమలు దిగుమతి చేసుకునేది. అట్టికా (ఏథెన్సు చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశం) దాని నివాసులకు తగినన్ని ఉత్పాదనలను ఉత్పత్తి చేయలేకపోయేది గనుక, వాణిజ్య వర్తకాల ప్రమాణాలు చాలా ఖచ్చితంగా ఉండేవి. పిరేయస్ దగ్గరున్న మార్కెట్టులో, నగర వాసులకూ అలాగే సైన్యానికీ కావలసినంత తాజా ఆహారాన్ని సరఫరా చేసేందుకు తగినంత సరుకు ఉండేది. అవసరత ఉన్న సమయంలో ఎక్కువ ధరలకు అమ్మగలిగేలా సరుకులను దాచివుంచడానికి వ్యాపారస్థులు అనుమతించబడేవారు కాదు.