వారు యెహోవా చిత్తాన్ని చేశారు
ఒక సమరయుడు మంచి పొరుగువాడిగా నిరూపించుకుంటాడు
యేసు దినాల్లో, యూదులకూ అన్యులకూ మధ్యనున్న వైరం ఎంతో స్పష్టంగా కనిపించేది. కొంత కాలానికి, ఇశ్రాయేలు స్త్రీలు ఒక యూదేతర స్త్రీకి కానుపు సమయంలో సహాయం చేయకూడదని, ఎందుకంటే అది మరొక అన్యుణ్ని ఈ లోకంలోకి తీసుకువచ్చేందుకు సహాయం చేస్తుంది గనుక అలా చేయకూడదని చెప్పే ఒక న్యాయవిధిని యూదుల మిష్నాకు జత చేయడం కూడా జరిగింది.—అబోడ్హా జారా 2:1.
యూదులకు సమరయులు అటు మతపరంగానూ, ఇటు జాతిపరంగానూ అన్యులకంటే ఎక్కువ సమీపస్థులు. అయినప్పటికీ, వారు కూడా వెలివేయబడినవారిగా దృష్టించబడే వారు. “యూదులు సమరయులతో సాంగత్యము చేయరు” అని అపొస్తలుడైన యోహాను వ్రాశాడు. (యోహాను 4:9) వాస్తవానికి, సమరయుడు ఇచ్చే ఒక రొట్టె ముక్క పంది మాంసం కంటే అపవిత్రమైనదని” టాల్ముడ్ బోధించింది. కొంతమంది యూదులు ‘సమరయుడు’ అనే పదాన్ని ఒక తిట్టు ప్రయోగంగా, అవమానకరమైన దానిగా ఉపయోగించేవారు.—యోహాను 8:48.
ఈ పరిస్థితి దృష్ట్యా, ఒక యూదా ధర్మశాస్త్రోపదేశకునికి యేసు చెప్పిన మాటలు చాలా బోధనాత్మకంగా ఉన్నాయి. ఆ వ్యక్తి యేసు వద్దకు వచ్చి “బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని” అడిగాడు. దానికి సమాధానంగా, ‘యెహోవాను నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణమనస్సుతోను, నీ పూర్ణశక్తితోను, నీ పూర్ణవివేకముతోను ప్రేమింపవలెను’ మరియు ‘నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను’ అని ఆజ్ఞాపిస్తున్న మోషే ధర్మశాస్త్రం వైపుకు యేసు అతడి అవధానాన్ని మళ్లించాడు. అప్పుడు ఆ ఉపదేశకుడు, “అవునుగాని నా పొరుగువాడెవడని” యేసును అడిగాడు. (లూకా 10:25-29; లేవీయకాండము 19:18; ద్వితీయోపదేశకాండము 6:5) పరిసయ్యుల ప్రకారం, “పొరుగువాడు” అనే పదం యూదా ఆచారాలను పాటించే వాళ్లకు మాత్రమే అన్వయిస్తుంది గానీ, అన్యులకూ లేక సమరయులకూ అన్వయించదు. యేసు ఆ దృక్కోణానికి మద్దతునిస్తాడని జిజ్ఞాసగల ఈ ఉపదేశకుడు భావించి ఉంటే, ఆతగాడు దిగ్భ్రాంతికరమైన ఒక విషయాన్ని వినబోతున్నాడు.
కనికరంగల సమరయుడు
ఒక ఉపమానాన్ని చెప్పడం ద్వారా యేసు ఆ వ్యక్తి ప్రశ్నకు సమాధానమిచ్చాడు.a “ఒక మనుష్యుడు యెరూషలేమునుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్లు”చుండెను అని యేసు చెప్పడం ప్రారంభిస్తాడు. యెరూషలేముకూ యెరికోకూ మధ్య 23 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రెండు నగరాలనూ కలిపే దారి పాములా మెలికెలు తిరుగుతూ, మొనదేలిన రాళ్లతో ఉంటుంది, అందుకని దొంగలు దాక్కుని, దాడి చేసి, పారిపోయేందుకు వీలుగా ఉండేవి. కథ ముందుకు సాగుతుండగా, యేసు ఉపమానంలోని ప్రయాణీకుడు, “దొంగలచేతిలో చిక్కెను; వారు అతని బట్టలు దోచుకొని, అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయరి.”—లూకా 10:30.
“అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్లుట తటస్థించెను. అతడు అతనిని చూచి, ప్రక్కగా పోయెను. ఆలాగుననే లేవీయుడొకడు ఆ చోటికివచ్చి చూచి ప్రక్కగా పోయెను” అని యేసు ముందుకు సాగాడు. (లూకా 10:31, 32) యాజకులూ, లేవీయులు ధర్మశాస్త్రాన్ని బోధించే వారు—అందులో పొరుగువారి పట్ల ప్రేమ కలిగుండాలనే నియమం కూడా ఉంది మరి. (లేవీయకాండము 10:8-11; ద్వితీయోపదేశకాండము 33:1, 10) నిజంగా వేరెవ్వరికన్నా ఎక్కువగా, వీరు గాయపడిన ఆ ప్రయాణికుడికి సహాయం చేయాలని పురికొల్పబడి ఉండవలసింది.
యేసు ఇలా కొనసాగుతాడు: “ఒక సమరయుడు ప్రయాణమై పోవుచు, అతడు పడియున్నచోటికి” వస్తాడు. సమరయుని ప్రస్తావన ఆ ఉపదేశకుని కుతూహలాన్ని తప్పకుండా అధికం చేసి ఉంటుంది. ఈ ప్రజలను గురించి ఉన్న ప్రతికూల దృక్కోణాన్ని యేసు అంగీకరిస్తాడా? దానికి బదులుగా, దురవస్థలో ఉన్న ఆ ప్రయాణికుణ్ని చూసినప్పుడు, ఆ సమరయుడు “అతనిమీద జాలిపడి, దగ్గరకుపోయ, నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి, తన వాహనముమీద ఎక్కించి యొక పూటకూళ్లవాని యంటికి తీసికొనిపోయ అతని పరామర్శించెను.b మరునాడతడు రెండు దేనారములు తీసి ఆ పూటకూళ్లవానికిచ్చి—ఇతని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసినయెడల నేను మరల వచ్చునప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయెను” అని యేసు చెబుతాడు.—లూకా 10:33-35.
యేసు ఇప్పుడు తనను ప్రశ్నించిన వ్యక్తిని ఇలా అడుగుతాడు: “కాగా దొంగలచేతిలో చిక్కినవానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయెనని నీకు తోచుచున్నది?” ఆ ఉపదేశకునికి జవాబు తెలుసు, అయినప్పటికీ, “సమరయుడు” అని చెప్పేందుకు అహం అడ్డువచ్చింది. బదులుగా అతడు, “అతనిమీద జాలిపడినవాడే” అని సమాధానమిస్తాడు. “నీవును వెళ్లి ఆలాగు చేయుమని” యేసు అంటాడు.—లూకా 10:36, 37.
మన కొరకు పాఠాలు
యేసును ప్రశ్న అడిగిన వ్యక్తి “తాను నీతిమంతుడైనట్టు కనబరచుకొనగోరి” యేసును ప్రశ్నించాడు. (లూకా 10:29) తాను మోషే ధర్మశాస్త్రాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తున్నందుకు యేసు తనను పొగడుతాడని అతడు అనుకుని ఉండవచ్చు. అయితే, స్వయం నీతిపరుడైన ఈ వ్యక్తి, “ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు” అని చెబుతున్న బైబిలు సామెతలోని నిజత్వాన్ని నేర్చుకోవలసిన అవసరం ఉంది.—సామెతలు 21:2.
నిజంగా నీతిమంతుడైన వ్యక్తి దేవుని నియమాలకు విధేయుడవ్వడమే కాక ఆయన లక్షణాలను కూడా అనుకరిస్తాడని యేసు చెప్పిన ఈ ఉపమానం చూపిస్తుంది. (ఎఫెసీయులు 5:1) ఉదాహరణకు, “దేవుడు పక్షపాతి కాడని” బైబిలు మనకు చెబుతోంది. (అపొస్తలుల కార్యములు 10:34) ఈ విషయంలో మనం దేవుడ్ని అనుకరిస్తున్నామా? పొరుగు వారి పట్ల అనురాగం జాతీయ, సాంస్కృతిక, మరియు మతపర అడ్డంకులను అన్నింటినీ అధిగమించాలని యేసు యొక్క ప్రేరణాత్మక ఉపమానం చూపిస్తుంది. నిజంగా, క్రైస్తవులు సమాజంలో ఒకే తరగతికి, ఒకే జాతికి లేక ఒకే దేశానికి చెందిన ప్రజల పట్ల మాత్రమేకాక, మరియు తమ తోటి విశ్వాసుల పట్ల మాత్రమేకాక ‘అందరి పట్ల మేలు చేయాలని’ ఉపదేశించబడ్డారు.—గలతీయులు 6:10.
యెహోవాసాక్షులు ఈ లేఖనాధార సలహాను పాటించేందుకు కృషి చేస్తారు. ఉదాహరణకు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, వారు తమ తోటి విశ్వాసులకూ అలాగే సాక్షులు కాని వారికీ కూడా మానవతా దృక్పథంతో సహాయాన్ని అందిస్తారు.c దానికి తోడు, ప్రజలు బైబిలును గురించి ఎక్కువ తెలుసుకోడానికి వారికి సహాయం చేసేందుకు వారు ప్రతి సంవత్సరం వంద కోట్ల కంటే ఎక్కువ గంటలు సమష్ఠిగా గడిపారు. “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని” దేవుడు “యచ్ఛయంచుచున్నాడు” గనుక వాళ్లు ప్రతి ఒక్కరికీ రాజ్య వర్తమానాన్ని అందించేందుకు కృషి చేస్తారు.—1 తిమోతి 2:4; అపొస్తలుల కార్యములు 10:35.
[అధస్సూచీలు]
a ఒక ఉపమానమనేది, నైతిక లేక ఆధ్యాత్మిక సత్యాన్ని బోధించే ఒక చిన్న సాధారణంగా కల్పిత కథ.
b యేసు దినాల్లో కొన్ని పూటకూళ్ల ఇళ్లు బస చేసే వసతిని మాత్రమే కాక ఆహారాన్నీ, ఇతర సేవలనూ అందించేవి. యేసు ఈ విధమైన వసతిని గురించి చెప్పి ఉండవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఉపయోగించబడిన గ్రీకు పదం లూకా 2:7 నందు “సత్రము” అని అనువదించబడిన పదం నుండి వేరై ఉంది.
c ఉదాహరణకు, డిసెంబరు 1, 1996 కావలికోట 3-8 పేజీలనూ, జనవరి 15, 1998 3-7 పేజీలనూ చూడండి.