మీ మాటలు కత్తిపోటువంటివాలేక ఆరోగ్యదాయకమైనవా?
కష్టతరమైన ఈ కాలాల్లో, అనేకులు “విరిగిన హృదయము”నూ “నలిగిన మనస్సు”నూ కలిగి ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. (కీర్తన 34:18) అందుకని, అపొస్తలుడైన పౌలు మాటల్లో చెప్పాలంటే, ‘ధైర్యము చెడినవారిని ధైర్యపరచి, బలహీనులకు ఊత నివ్వవలసిన’ అవసరత ఎల్లప్పుడూ ఉంది. (1 థెస్సలొనీకయులు 5:14) అయితే మన తోటి వారు మన మనస్సు నొప్పిస్తే లేక ఏదైనా గంభీరమైన తప్పిదం చేస్తే అప్పుడేమిటి? అలాంటి పరిస్థితిలో, ఆ వ్యక్తిని గద్దించడమే సరైన పని అని మనం భావించవచ్చు. అయితే, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. సలహా కఠినమైన పద్ధతిలో ఇస్తే హానికరంగా ఉండవచ్చు—అది యుక్తమైనప్పుడు కూడా. సామెతలు 12:18 ఇలా పేర్కొంటోంది: “కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు.”
కాబట్టి, సరిదిద్దబోయే ముందు లేక ఒక అపార్థాన్ని గురించి వ్యవహరించే ముందు, “జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము” అని చెబుతున్న సామెతలు 12:18 యొక్క తర్వాతి భాగాన్ని గుర్తుంచుకోవడం ఎంతో ప్రాముఖ్యం. ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, ‘నన్ను సరిదిద్దవలసిన అవసరం వచ్చినప్పుడు, నాతో ఎలా వ్యవహరించాలని నేను కోరుకుంటాను?’ మనలో చాలామందిమి విమర్శ కంటే ప్రోత్సాహం అంటేనే మరింత ఎక్కువ ప్రతిస్పందిస్తాము. కాబట్టి మెచ్చుకోవడంలో ఔదార్యాన్ని కనపర్చండి. ఇది తప్పిదస్థుడు తన తప్పును సరిదిద్దుకునేందుకు ప్రేరేపిస్తుంది, మరి ఆయన తనకు ఇవ్వబడిన సహాయం విషయంలో కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటాడు.
మన మాటలకు ఎల్లప్పుడూ మృదుత్వాన్ని జత చేయడం ఎంత ప్రాముఖ్యమో కదా! అలాంటి ఆరోగ్యదాయకమైన మాటలు, వాటిని వినేవారిని “నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక” అని వ్రాసిన కీర్తనల గ్రంథకర్త వలె భావించేలా చేస్తాయి.—కీర్తన 141:5.