ఫ్రాన్సులో ఒక చిరస్మరణీయమైన సంఘటన
“యెహోవా నగరం మాకొద్దు!” అనే పోస్టర్లు టౌనంతా ప్రదర్శించబడి ఉన్నాయి. “రండి, యెహోవా ప్రాజెక్టుకు విరుద్ధంగా ఏకమౌదాం” అని ఒక వ్యతిరేక గుంపు ప్రేరేపించింది. అక్షరార్థంగా వందల కొలది పత్రికా శీర్షికలు ఆ విషయాన్ని విస్తృతంగా వ్యాప్తి చేశాయి. విజ్ఞాపన పత్రాలపై సంతకాలు జరిగాయి. ఆ ప్రాజెక్టును గురించి ప్రస్తావిస్తున్న ఐదు లక్షలకంటే ఎక్కువ ట్రాక్టులు వరదలా స్థానిక పోస్టు డబ్బాల్లో వచ్చిపడ్డాయి. ఫ్రాన్సుకు వాయవ్యంగా ఉన్న ప్రశాంత పట్టణమైన లూవీర్స్ యొక్క ప్రశాంతతను భంగం చేసిన ఆ ప్రాజెక్టు ఏమిటి? యెహోవాసాక్షుల క్రొత్త బ్రాంచి కార్యాలయం, నివాసస్థలం యొక్క నిర్మాణాన్ని గురించిన ప్రాజెక్టు.
యెహోవా వృద్ధి కలుగజేశాడు
ఫ్రాన్సులో యెహోవాసాక్షుల కార్యకలాపాలు 19వ శతాబ్దాంతంలోనే ప్రారంభమయ్యాయి. బైబిలు ప్రచురణలకు మొదటి డిపో దక్షిణ ఫ్రాన్సులోని బోవెన్‌నందు 1905లో ప్రారంభించబడింది, 1919 కల్లా పారిస్‌లో ఒక చిన్న కార్యాలయం నడుస్తోంది. 1930లో, ఒక బ్రాంచి కార్యాలయం నగరంలో అధికారికంగా ప్రారంభించబడింది, ఆ తర్వాతి సంవత్సరం కార్యాలయ సిబ్బంది పారిస్‌కు ఉత్తరానున్న ఆంగాన్-లే-బన్‌లో ఉన్న బేతేలు గృహంలో నివసించడం ప్రారంభించింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, బేతేలు కుటుంబం మళ్లీ పారిస్‌కు తిరిగి వచ్చింది, 1959లో బ్రాంచి రాజధాని నగర పశ్చిమ శివార్లలో ఉన్న బూలోన్-బియాంకుర్‌లోని ఐదంతస్థుల భవనంలోకి మారింది.
రాజ్య ప్రకటనాపని విస్తరించడం మూలంగా, 1973లో ప్రింటరీ మరియు షిప్పింగ్ సౌకర్యాలు పారిస్‌కు పశ్చిమాన 100 కిలోమీటర్ల దూరానున్న లూవీర్స్‌కు తరలించబడగా, కార్యాలయాలు బూలోన్-బియాంకుర్‌లోనే ఉండిపోయాయి. అయితే, ఫ్రాన్సు నందలి ప్రచారకుల సంఖ్యలో పెరుగుదల సంభవించడం మూలంగా, 1978 మరియు 1985లలో విస్తరణలు జరిగినప్పటికీ, లూవీర్స్‌లోని సౌకర్యాలు కుటుంబం అవసరతలకు తగినంతగా లేకపోయాయి. కాబట్టి సభ్యుల సంఖ్యను పెంచి బేతేలు కుటుంబాన్నంతటినీ ఒకే స్థలంలో ఏర్పాటు చేయాలని తీర్మానించడం జరిగింది. ప్రారంభంలో ప్రస్తావించబడిన విధంగా ఈ ప్రాజెక్టు అందరికీ రుచించలేదు. అలాంటి వ్యతిరేకత ఉన్నప్పటికీ, ప్రింటరీనుండి ఒకటిన్నర కిలోమీటరు దూరాన ఒక స్థలం దొరికింది. ఆరు సంవత్సరాలు కష్టించి శ్రమపడిన తర్వాత, తుదకు, అంటే 23 సంవత్సరాల ఎడబాటు తర్వాత పూర్తి బేతేలు కుటుంబం 1996 ఆగస్టులో లూవీర్స్‌నందు ఏకమయ్యింది.
అలా ఎంతో ఆనందంగా, 300 మంది ఫ్రెంచి బేతేలు కుటుంబ సభ్యులూ, 42 బ్రాంచీలనుండి వచ్చిన 329 మంది ప్రతినిధులూ చేరివున్న 1,187 మందితోకూడిన సమూహం, పరిపాలక సభ సభ్యుడైన బ్రదర్ లాయిడ్ బ్యారీ ఇచ్చిన సమర్పణ ప్రసంగాన్ని వినేందుకు 1997, నవంబరు 15 శనివారం నాడు సమావేశమైంది. అయితే, ఫ్రాన్సు అంతటా యెహోవాసాక్షులకు వ్యతిరేకంగా ఉన్న ద్వేషమూ, దీర్ఘ కాలంగా సాగిన అబద్ధ ప్రచారాల మధ్య ఈ ప్రతిష్ఠాపణ జరుగుతున్న దృష్ట్యా, ఈ విజయోత్సాహపు వేడుకలో ఫ్రెంచి సాక్షులు అందరూ పాల్పంచుకోవడం మంచిదని భావించడం జరిగింది. దాని ఫలితంగా, నవంబరు 16 ఆదివారం నాడు, పారిస్‌కు కాస్త ఉత్తరానున్న వీలేపింటే ఎగ్జిబిషన్ సెంటర్‌లో “క్రీస్తు ప్రేమలో నిలిచి ఉండండి” అనే అంశంతో ఒక కూటం ఏర్పాటు చేయబడింది. ఫ్రాన్సునందలి యెహోవాసాక్షులందరూ, వారితోపాటూ బెల్జియమ్ స్విట్జర్లాండ్‌లలోని ఫ్రెంచి మాట్లాడే సాక్షులూ మరియు జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్స్, లగ్జెంబర్గ్ దేశాల్లోని సంఘాల్లోని వారందరూ ఆహ్వానించబడ్డారు.
ఒక గణనీయమైన సమావేశం
ఈ సమావేశం కొరకు సిద్ధపాట్లు ఆరు నెలల ముందే ప్రారంభమయ్యాయి. తర్వాత, సమర్పణకు కేవలం రెండు వారాల ముందు, ప్రధాన రహదారులకూ ఇంధన సరఫరాలకూ ఆటంకాన్ని కలిగిస్తూ ఫ్రెంచి ట్రక్కు డ్రైవర్లు సమ్మె ప్రారంభించారు. కుర్చీలూ, ఇతరు సామాను ఇక్కడికి సమయానికి చేరుకోగలవా? రోడ్డు బ్లాకులు సహోదరులు రావడాన్ని అడ్డగిస్తాయా? ఒక వారంలోనే ఆ సమ్మె ముగిసి, రోడ్లు మళ్లీ తెరువబడే సరికి అందరికీ ఉపశమనం కలిగింది. సమర్పణ జరిగే వారాంతానికి ముందు రోజైన శుక్రవారం సాయంత్రం, ఆ సందర్భం కొరకు అద్దెకు తీసుకున్న రెండు విశాలమైన హాళ్లలోకి 38 ట్రక్కులు 84,000 కుర్చీలను చేరవేశాయి. 800కుపైగా సహోదరసహోదరీలు ఆ రాత్రంతానూ, ఆ తర్వాత శనివారం ఉదయం తొమ్మిదిన్నర వరకూ సీట్లనూ, ప్లాట్‌ఫారమ్‌నూ, సౌండ్ సిస్టమ్‌లనూ, తొమ్మిది పెద్ద పెద్ద వీడియో తెరలనూ ఇన్‌స్టాల్ చేయడంలో నిమగ్నమయ్యారు.
ఆదివారం ఉదయం 6 గంటలకు, తలుపులు తెరుచుకున్నాయి, అందరూ వెల్లువలా లోపలికి రావడం ప్రారంభించారు. ప్రత్యేకంగా అద్దెకు తీసుకున్న 17 ట్రయిన్‌లు 13,000 కంటే ఎక్కువమంది సాక్షులను రాజధానికి తీసుకువచ్చాయి. రెండొందలకుపైగా స్థానిక సహోదరసహోదరీలు, ప్రయాణికులను కలుసుకునేందుకూ వారిని ఒక్కొక్క గుంపుగా సమావేశ స్థలానికి తీసుకువచ్చేందుకూ రైల్వే స్టేషన్‌లలో సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రేమపూర్వక ఏర్పాటు తమకు “భద్రతా భావాన్ని, సంతోషాన్నీ కలిగించిందని” ఒక సహోదరి చెప్పింది.
ఇతరులు విమానాల్లోనూ కారుల్లోనూ పారిస్‌కు వచ్చారు. అనేకమంది 953 బస్సుల్లో రాగా, పారిస్‌లోనే ఉన్న సాక్షులు ఎగ్జిబిషన్ సెంటర్‌కు ప్రయాణమై వచ్చేందుకు ప్రజా రవాణా సదుపాయాలను ఉపయోగించుకున్నారు. అనేకులు రాత్రంతా ప్రయాణించారు లేక వేకువజామునే చాలా త్వరగా ఇంటినుండి బయల్దేరారు, అయితే ఈ సమావేశానికి హాజరవ్వడంలోని వారి ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఒకరినొకరు అనేక సంవత్సరాలుగా చూసుకోని స్నేహితులు మళ్లీ కలిసినప్పుడు వాళ్లు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు, ప్రేమగా ఆలింగనం చేసుకుంటున్నారు. వివిధ వర్ణాల్లో, విభిన్న సాంప్రదాయిక దుస్తులు ధరించిన ఆ ఆనందమయ గుంపును చూస్తుంటే అన్ని దేశాలనుండీ వచ్చారా అన్నట్లు అనిపించింది. నిస్సందేహంగా ఎంతో అసాధారణమైనదేదో జరగబోతోంది.
ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమయ్యే సరికి, ఇక సీట్లే లేవు, కానీ ప్రతి నిముషమూ వందలాది మంది వస్తూనే ఉన్నారు. ఎటు చూసినా చిరునవ్వులు చిందిస్తున్న ముఖాలే. వేలాది మంది నిలబడటమో లేక కాంక్రీటు నేలపై కూర్చోవడమో చేశారు. ఆ సమావేశ అంశానికి అనుగుణంగా, అనేకమంది యౌవనస్థులు పెద్దవయస్సువాళ్లు కూర్చునేందుకు వీలుగా తమ సీట్లు ఇచ్చేశారు. “మాకు తెలిసిన వారు కానప్పటికీ మాకు ఎంతో ప్రియమైన సహోదర సహోదరీల కొరకు మా సీట్లు ఇచ్చేసినందుకు మేమెంతో ఆనందించాం!” అని ఒక వివాహిత జంట వ్రాసింది. అనేకులు చక్కని స్వయంత్యాగ దృక్పథాన్ని కనుపర్చారు: “మేము శుక్రవారం రాత్రంతా కష్టపడి ఏ కుర్చీలను పేర్చామో వాటిలో మేము కూర్చోలేకపోయాము. అయితే కేవలం అక్కడ హాజరై ఉండగలిగినందుకు మా హృదయాలు యెహోవా పట్ల ఎంతో కృతజ్ఞతతో నిండిపోయాయి.”
అలసటగా, చికాకుగా ఉన్నప్పటికీ ఇతర దేశాలనుండి వచ్చిన నివేదికలనూ, బ్రదర్ లాయిడ్ బ్యారీ, పరిపాలక సభ సభ్యుడే అయిన బ్రదర్ డేనియల్ సిడ్లిక్‌లు ఇచ్చిన ప్రసంగాలనూ సభ్యులు ఎంతో శ్రద్ధగా విన్నారు. బ్రదర్ బ్యారీ “యెహోవా బలాభివృద్ధి కలుగజేస్తాడు” అనే అంశంపై తన ప్రసంగాన్ని ఇచ్చాడు, విభిన్నమైన శ్రమలు ఉన్నప్పటికీ తన ప్రజల్లో అభివృద్ధి కలిగేందుకు యెహోవా ఎలా ఆశీర్వదించాడో ఆయన సవివరంగా చెప్పాడు. బ్రదర్ సిడ్లిక్ “యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు” అనే అంశంగల ప్రసంగాన్ని ఇచ్చాడు. ఫ్రాన్సులో యెహోవాసాక్షులు ప్రస్తుతం ఎదుర్కుంటున్న వ్యతిరేకత దృష్ట్యా ఈ రెండు ప్రసంగాలూ కూడా ఎంతో సమయోచితమైనవి. నిజమైన ఆనందం అనేది బాహ్య కారణాలపై కాక యెహోవాతో మన సంబంధంపైనా, జీవితం పట్ల మన దృక్పథంపైనా ఆధారపడి ఉంటాయని బ్రదర్ సిడ్లిక్ చూపించాడు. “మీరు సంతోషంగా ఉన్నారా?” అని ఆయన ప్రేక్షకులను అడిగిన ప్రశ్నకు కరతాళ ధ్వనులతో హాలు మారుమోగిపోయింది.
తన “సంతోషాన్ని కోల్పోయి” ఉన్న ఒక సహోదరి అటు తర్వాత ఇలా వ్రాసింది: “సంతోషం నాకు చేరువలోనే ఉందని నేను అప్పుడే గ్రహించాను. నేను వేరే మార్గంలో ప్రయత్నిస్తూ ఉన్నాను, ఈ ప్రసంగం ద్వారా నేను ఎలా మార్పులు చేసుకోవాలనే విషయాన్ని యెహోవా నాకు చూపించాడు.” మరొక సహోదరుడు ఇలా చెప్పాడు: “నేను ఇప్పుడు యెహోవా హృదయానికి ఆనందాన్ని కలిగించేందుకు పోరాడాలని కోరుకుంటున్నాను. నా అంతరంగంలో నాకు కలిగిన ఆనందాన్ని దోచుకునేందుకు నేను దేనినీ అనుమతించకూడదని కోరుకుంటున్నాను.”
సమావేశం ముగింపుకు రాబోతుండగా, చైర్మన్ సమావేశ హాజరును ఎంతో ఉత్సాహంతో ప్రకటించాడు: 95,888—అది ఫ్రాన్సులోని యెహోవాసాక్షులు ఇంత వరకూ కలిగివున్న వాటిలోకెల్లా అత్యంత ఎక్కువ హాజరు!
ముగింపు పాట—దాన్ని అనేకులు ఆనందబాష్పాలతో ఆలపించారు—చివరి ప్రార్థన తర్వాత, సహోదరులు దుఃఖమూ, ఆనందాల సమ్మిళితమైన భావాలతో ఇంటికి ప్రయాణం సాగించేందుకు బయల్దేరారు. ఉత్సాహవంతమైన, స్నేహభావంగల వాతావరణాన్ని ఇతరులు గమనించకుండా పోలేదు. డెలిగేట్ల దృక్పథాన్ని గురించి బస్సు డ్రైవర్లు అనేక అనుకూల వ్యాఖ్యానాలు చేశారు. ఎగ్జిబిషన్ సెంటర్ నుండి రెండు గంటల్లో 953 బస్సులు ఎలాంటి ట్రాఫిక్ జామ్‌లు లేకుండా బయటకు వెళ్లగలిగేలా అంతా సంస్థీకరించడాన్ని బట్టి కూడా వాళ్లెంతో ముగ్దులయ్యారు! డెలిగేట్ల ప్రవర్తనను రైల్వే, ప్రజారవాణా సిబ్బంది కూడా ఎంతో మెచ్చుకున్నారు. తత్ఫలితంగా అనేక చక్కని చర్చలు జరిగాయి, మంచి సాక్ష్యం ఇవ్వబడింది.
“ఎడారిలో ఒయాసిస్”
“ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా . . . ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము” అని అపొస్తలుడైన పౌలు తోటి క్రైస్తవులను పురికొల్పాడు. (హెబ్రీయులు 10:24, 25) ఖచ్చితంగా, ఈ ప్రత్యేక సమావేశం అందరికీ ఎంతో గొప్ప ప్రోత్సాహాన్ని ఇచ్చింది, అది ఒక సహోదరి వర్ణించిన విధంగా నిజంగానే “ఎడారిలో ఒయాసిస్.” “మేము బలపర్చబడి, ప్రోత్సహించబడి, దృఢపర్చబడి, యెహోవా సేవలో మునుపెన్నటికన్నా ఎక్కువ ఆనందంగా కొనసాగేందుకు తీర్మానించుకుని తిరిగి వెళ్లాము” అని టోగో బ్రాంచి నుండి వచ్చిన సహోదరులు వ్రాశారు. “ఎంతో కృంగిపోయి ఉన్న వారు ఇంటికి ఆనందంగా తిరిగి వెళ్లారు” అని ఒక సర్క్యూట్ పైవిచారణకర్త చెప్పాడు. “సహోదరులు పురికొల్పబడి, బలపర్చబడ్డారు” అని మరొకరు అన్నారు. “మేము యెహోవా సంస్థతో ఇంత సన్నిహితత్వాన్ని మునుపెన్నడూ అనుభవించలేదు” అని వ్రాసేందుకు ఒక జంట పురికొల్పబడింది.
“సమభూమిలో నా పాదము నిలిపియున్నాను, సమాజములో యెహోవాను స్తుతించెదను” అని కీర్తనల గ్రంథకర్త పలికాడు. (కీర్తన 26:12) అలాంటి క్రైస్తవ సమావేశాలు అడ్డంకుల నడుమ ఆధ్యాత్మిక పటుత్వాన్ని తిరిగి పొందేందుకు అందరికీ వీలు కలిగిస్తాయి. “మేము ఏ విధమైన శ్రమలను అనుభవించినప్పటికీ, ఈ ప్రత్యేకమైన గడియలు మా హృదయాల్లో దృఢంగా ముద్రించబడి ఉంటాయి, అవి మాకు ఎల్లప్పుడూ ఆదరణను అందిస్తాయి” అని ఒక సహోదరి దృఢచిత్తంతో చెప్పింది. అదే విధంగా, ఒక ప్రయాణ పైవిచారణకర్త ఇలా వ్రాశాడు: “కష్ట కాలాలు వచ్చినప్పుడు, పరదైసు యొక్క ఈ ముంగుర్తు మేము తాళుకునేందుకు మాకు సహాయం చేస్తుంది.”
“జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి మహిమబలములు యెహోవాకు చెల్లించుడి” అని కీర్తన 96:7 ప్రోత్సహిస్తోంది. నిస్సందేహంగా, ఫ్రాన్స్‌లో క్రొత్త బ్రాంచిని సమర్పించడం యెహోవాకు ఒక ఘనవిజయం. అటువంటి తీవ్రమైన, విస్తృత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆ ప్రాజెక్టుకు వాస్తవరూపం ఇవ్వగలగడం కేవలం ఆయనకే సాధ్యం. ఫ్రాన్స్‌లోని యెహోవాసాక్షులు మునుపెన్నటికంటే ఇప్పుడు ‘క్రీస్తు ప్రేమయందు నిలిచి యుండేందుకూ,’ ‘తమ వెలుగును ప్రకాశింపనిచ్చేందుకూ’ కృత నిశ్చయంతో ఉన్నారు. (యోహాను 15:9; మత్తయి 5:16) సమర్పణ కార్యక్రమానికి హాజరైన వారందరూ “అది యెహోవావలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము” అని పలికిన కీర్తనల గ్రంథకర్త భావాలతో ఏకీభవిస్తారు.—కీర్తన 118:23.
[26వ పేజీలోని చిత్రం]
డేనియల్ సిడ్లిక్
[26వ పేజీలోని చిత్రం]
లాయిడ్ బ్యారీ
[26వ పేజీలోని చిత్రం]
వీలేపింటే ఎగ్జిబిషన్ సెంటర్‌నందలి ప్రత్యేక కార్యక్రమానికి 95,888 మంది హాజరయ్యారు
[28వ పేజీలోని చిత్రాలు]
హాజరైన వారిలో వేలాదిమంది కార్యకమాన్ని నిలుచుని లేక నేలమీద కూర్చుని విన్నారు