వారు యెహోవా చిత్తాన్ని చేశారు
యేసు 70 మంది శిష్యులను పంపిస్తాడు
అది సా.శ. 32వ సంవత్సరంలోని వసంత కాలం. యేసు మరణానికి ముందు కేవలం ఆరు నెలలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి, ప్రకటనా పనిని త్వరితం చేసేందుకూ, తన అనుచరుల్లోని కొంతమందికి అదనపు తర్ఫీదును ఇచ్చేందుకూ, ఆయన 70 మంది శిష్యులను నియమించి “తాను వెళ్లబోవు ప్రతి ఊరికిని ప్రతిచోటికిని తనకంటె ముందు ఇద్దరిద్దరినిగా పంపెను.”—లూకా 10:1.a
యేసు తన శిష్యులను “తనకంటె ముందు” పంపించాడు. ఎందుకంటే అటుతర్వాత తాను వెళ్లినప్పుడు ప్రజలు తాము మెస్సీయ పక్షాన ఉన్నామా లేక ఆయనకు విరుద్ధంగా ఉన్నామా అనే విషయాన్ని మరింత త్వరగా నిర్ణయించుకోగలరు. అయితే ఆయన వాళ్లను “ఇద్దరిద్దరినిగా” ఎందుకు పంపాడు? వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు వాళ్లు పరస్పరం ప్రోత్సహించుకునేందుకేనని రుజువులు చూపుతున్నాయి.
వాళ్ల ప్రకటనా పని యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, యేసు తన అనుచరులకు ఇలా చెప్పాడు: “కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమందియే; కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి.” (లూకా 10:2) ప్రకటనాపనిని కోత పనికి పోల్చడం సముచితమైన విషయమే, ఎందుకంటే కోత కోసే సమయంలో జరిగే ఏ విధమైన జాప్యమైనా సరే, విలువైన పంటలను పాడు చేస్తుంది. అదే విధంగా, శిష్యులు తమ ప్రకటనా నియామకాన్ని అలక్ష్యం చేస్తే, విలువైన జీవితాలు నాశనమవ్వగలవు!—యెహెజ్కేలు 33:6.
పరధ్యానం చెందని పరిచారకులు
యేసు తన శిష్యులకు ఇంకా ఇలా ఉపదేశించాడు: “మీరు సంచినైనను జాలెనైనను చెప్పులనైనను తీసికొనిపోవద్దు; త్రోవలో ఎవనినైనను కుశలప్రశ్న లడుగవద్దు.” (లూకా 10:4) ఒక ప్రయాణీకుడు జాలెను, ఆహారాన్నీ మాత్రమే కాకుండా ఒక జత చెప్పులను అదనంగా తీసుకెళ్లడం వాడుకైన విషయం, ఎందుకంటే చెప్పులు అరిగిపోవచ్చు, వారులు తెగిపోవచ్చు. అయితే యేసు శిష్యులు అలాంటి విషయాలను గురించి చింతించవలసిన అవసరం లేదు. బదులుగా, ఆతిథ్యమివ్వడమనేది ఒక అలవాటుగా కలిగివున్న తోటి ఇశ్రాయేలీయుల ద్వారా యెహోవా వారి అవసరతలను తీరుస్తాడని వాళ్లు నమ్మకముంచాల్సి ఉంది.
అయితే త్రోవలో ఎవనినీ కుశలప్రశ్నలు అడుగవద్దని యేసు తన శిష్యులకు ఎందుకు చెప్పాడు? వాళ్లు ముభావంగా లేక కఠినంగా ఉండాలా? ఎంత మాత్రం కాదు! కుశలప్రశ్నలు అడగడం అనే భావంగల అస్పజోమాయ్ అనే గ్రీకు పదం, మర్యాద కొరకు “హలో” లేక “బాగున్నారా” అని అనడం కంటే ఎంతో ఎక్కువ అర్థాన్ని కలిగి ఉండగలదు. అందులో వాడుక ప్రకారం ముద్దు పెట్టుకోవడం, ఆలింగనం చేసుకోవడం, ఇద్దరు పరిచయస్థులు కలిసినప్పుడు సాగే సుదీర్ఘ సంభాషణ కూడా ఇమిడి ఉండవచ్చు. ఒక వ్యాఖ్యానకర్త ఇలా చెబుతున్నాడు: “తూర్పు దేశస్థుల మధ్య సాగే అభివాదాల్లో మనకు అలవాటుగా ఉన్న కాస్త వంగి నమస్కరించడం లేక చేతులు కలపడం ఇమిడి లేవు, అందులో అదే పనిగా ఆలింగనం చేసుకోవడమూ, వంగి వంగి నమస్కరించడమూ, చివరకు సాష్టాంగ నమస్కారమూ చేరి ఉన్నాయి. ఇవన్నీ చేయడానికి ఎంతో సమయం అవసరమయ్యేది.” (2 రాజులు 4:29 పోల్చండి.) అలా వాడుకైనవే అయినప్పటికీ అనవసరమైన పరధ్యానానికి గురికాకుండా జాగ్రత్తపడేందుకు యేసు తన అనుచరులకు సహాయపడ్డాడు.
చివరకు, శిష్యులు ఒక ఇంట్లోకి ప్రవేశించినప్పుడు వారు ఆహ్వానించబడితే, “వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ యింటిలోనే యుండుడి” అని యేసు వారికి చెప్పాడు. అయితే వాళ్లు ఒక నగరంలోకి ప్రవేశించినప్పుడు ఆహ్వానించబడనట్లైతే, వాళ్లు “దాని వీధులలోనికి పోయి—మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళినికూడ మీ యెదుటనే దులిపివేయుచున్నాము” అని చెప్పాలి. (లూకా 10:7, 10, 11) పాదాలకు అంటిన ధూళిని తుడిచి వేయడం లేక దులిపివేయడం అనేది, వారిని ఆహ్వానించని ఆ ఇంటినీ లేక నగరాన్నీ తుదకు దేవునినుండి రాబోయే పర్యవసానాలకు విడిచిపెట్టి శిష్యులు శాంతియుతంగా వెళ్లిపోతున్నారని అది సూచిస్తుంది. అయితే యేసు శిష్యులను దయాపూర్వకంగా అంగీకరించే వారు దీవెనలను పొందబోవు వారి వరుసలో ఉంటారు. మరొక సందర్భంలో యేసు తన అపొస్తలులకు ఇలా చెప్పాడు: “మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనును. మరియు శిష్యుడని యెవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.”—మత్తయి 10:40, 42.
మన కొరకు పాఠాలు
దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం, శిష్యులనుగా చేయడం అనే నియామకాన్ని ప్రపంచ వ్యాప్తంగా 50,00,000 కంటే ఎక్కువమంది యెహోవాసాక్షులు ఇప్పుడు నెరవేరుస్తున్నారు. (మత్తయి 24:14; 28:19, 20) తమ వర్తమానం చాలా ప్రాముఖ్యమైనదని వాళ్లు గుర్తిస్తారు. కాబట్టి, తమ ప్రాముఖ్యమైన నియామకానికి పూర్తి అవధానాన్ని ఇవ్వకుండా అడ్డుపడే వాటిని నివారిస్తూ వాళ్లు తమ సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగిస్తారు.
యెహోవాసాక్షులు తాము కలిసే వాళ్లందరితో స్నేహపూర్వకంగా ఉండేందుకు కృషి చేస్తారు. అయినప్పటికీ, వాళ్లు ఊసుపోని కబుర్లు చెప్పుకోవడంలో మునిగిపోరు, లేక సామాజిక వివాదాలపైనో లేక అన్యాయాలను సరిదిద్దడంలో విఫలమౌతున్న ఈ ప్రపంచ ప్రయత్నాలపైనో జరిగే చర్చల్లో వాళ్లు భాగం వహించరు. (యోహాను 17:16) బదులుగా, మానవుని సమస్యలకు శాశ్వత పరిష్కారమైన దేవుని రాజ్యంపై తమ చర్చను కేంద్రీకరిస్తారు.
తరచు యెహోవాసాక్షులు ఇద్దరిద్దరు కలిసి ప్రకటించడాన్ని మీరు చూస్తారు. అయితే వాళ్లు ఒంటరిగా పని చేస్తే మరింత ఎక్కువ సాధించలేరా? బహుశ సాధించవచ్చునేమో. అయినప్పటికీ, తోటి విశ్వాసితో కలిసి ప్రకటించడంలోగల ప్రయోజనాన్ని క్రైస్తవులు నేడు గుర్తిస్తారు. ప్రమాదకరమైన ప్రాంతాల్లో సాక్ష్యం ఇస్తున్నప్పుడు అది వాళ్లకు కొంత కాపుదలను కూడా ఇస్తుంది. క్రొత్త వాళ్లు, సువార్తను ప్రకటించడంలో ఎక్కువ అనుభవాన్ని కలిగి ఉన్న వాళ్లతో కలిసి ప్రకటించడం వారి అనుభవం నుండి ప్రయోజనాన్ని పొందేందుకు కూడా వీలు కల్పిస్తుంది. వాస్తవానికి, ఇరువురూ కూడా పరస్పర ప్రోత్సాహాన్ని పొందవచ్చు.—సామెతలు 27:17.
నిస్సందేహంగా, ప్రకటనా పని అనేది ఈ “అంత్యదినములలో” జరుపబడుతున్న అత్యంత ప్రాముఖ్యమైన పని. (2 తిమోతి 3:1) యెహోవాసాక్షులు “ఒక్క భావముతో సువార్త విశ్వాసపక్షమున” ప్రకటించడంలో ఒక ప్రపంచవ్యాప్త సహోదరత్వపు మద్దతును కలిగి ఉన్నందుకు సంతోషిస్తున్నారు.—ఫిలిప్పీయులు 1:27.
[అధస్సూచి]
a కొన్ని బైబిళ్లూ ప్రాచీన గ్రీకు వ్రాతప్రతులూ యేసు “డెబ్బది రెండు మంది” శిష్యులను పంపించాడని చెబుతున్నాయి. అయితే, “డెబ్బది మంది” పంపబడ్డారనేందుకు తగినన్ని వ్రాతప్రతుల ఆధారం ఉంది. ఈ సాంకేతిక వివరణ, యేసు తన శిష్యుల పెద్ద గుంపును ప్రకటించేందుకు పంపాడనే ముఖ్య విషయం నుండి మనల్ని పక్కకు మళ్లించకూడదు.