కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 12/15 పేజీలు 4-7
  • ఆధునిక క్రిస్మస్‌ మూలాధారాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆధునిక క్రిస్మస్‌ మూలాధారాలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • లోపభూయిష్ఠమైన పునాది
  • భ్రష్టత్వం పరిచయం చేయబడింది
  • అంతర్జాతీయ సెలవుదినం
  • క్రొత్తరూపు దాల్చిన క్రిస్మస్‌
  • “సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి”
  • క్రిస్మస్‌—ప్రాచ్య దేశాల్లో కూడా ఎందుకుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • క్రిస్టమస్‌ మీకు ఏ భావాన్నిస్తుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • క్రిస్మస్‌ ఎందుకు క్రైస్తవులది కాదు
    తేజరిల్లు!—1992
  • క్రిస్మస్‌ సమయం దేనికి ప్రాధాన్యత ఇవ్వబడుతోంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 12/15 పేజీలు 4-7

ఆధునిక క్రిస్మస్‌ మూలాధారాలు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలకు, క్రిస్మస్‌ పండుగ కాలం, సంవత్సరంలో ఎంతో ఆనందమయమైన కాలం. ఘనమైన విందు భోజనాలకూ, దీర్ఘకాలంగా గౌరవించబడ్డ ఆచారాలకూ, కుటుంబమంతా కలుసుకోవడానికీ సమయమిదే. క్రిస్మస్‌ సెలవు దినమనేది బంధు మిత్రులు గ్రీటింగ్‌ కార్డుల్నీ, బహుమతుల్నీ ఇచ్చిపుచ్చుకునే సమయం కూడా.

అయితే, 150 ఏళ్ల క్రిందట, క్రిస్మస్‌ ఎంతో భిన్నమైన సెలవుదినంగా ఉండేది. క్రిస్మస్‌ కొరకైన పోరాటం (ఆంగ్లం) అనే తన పుస్తకంలో హిస్టరీ ప్రొఫెసరు స్టీఫెన్‌ నిసాన్‌భోమ్‌ ఇలా రాస్తున్నాడు: “క్రిస్మస్‌ . . . మితిమీరి త్రాగే సమయంగా ఉండేది. ఆ సమయంలో హద్దూ అదుపుల్లేని ‘కార్నవల్‌’ (అమిత వేడుక) పేరిట అంటే డిసెంబరులో జరిగే మర్డి గ్రాస్‌ తరహా వినోదం పేరిట ప్రజల సామాజిక ప్రవర్తనను అదుపుచేసే సూత్రాలు తాత్కాలికంగా విడిచిపెట్టబడేవి.”

క్రిస్మస్‌ను భక్తిభావంతో దృష్టించేవారికి, ఈ వర్ణన కలవరానికి గురి చేయవచ్చు. దేవుని కుమారుని జననాన్ని జ్ఞాపకం చేసుకునేదని చెప్పబడిన సెలవు దినాన్ని ఎవరైనా ఎందుకు అగౌరవపర్చాలి? జవాబు మిమ్మల్ని ఆశ్చర్యపర్చవచ్చు.

లోపభూయిష్ఠమైన పునాది

క్రిస్మస్‌ నాలుగవ శతాబ్దంలో ఆరంభమైననాటి నుండీ వివాదాలతో చుట్టుముట్టబడింది. ఉదాహరణకు, యేసు జన్మదినాన్ని గూర్చిన ప్రశ్న తలెత్తింది. బైబిలు క్రీస్తు జన్మించిన రోజునుగానీ, నెలను గానీ స్పష్టంగా తెలియజేయలేదు గనుక వివిధ తారీఖులు సూచించబడ్డాయి. మూడవ శతాబ్దంలో, ఈజిప్టుకు చెందిన మతగురువుల గుంపొకటి దాన్ని జరుపుకోవడానికి మే 20 నిర్ణయిస్తే, ఇతరులు దానికి ముందు తారీఖులైన మార్చి 28, ఏప్రిల్‌ 2, లేక ఏప్రిల్‌ 19 వంటి తారీఖుల్లో జరుపుకోవడానికి సుముఖత చూపించారు. 18వ శతాబ్దంనాటికి, యేసు జననం సంవత్సరంలోని ప్రతీ నెలకూ ముడిపెట్టబడింది! మరైతే, డిసెంబరు 25 చివరికెలా ఎంపిక చేసుకోబడింది?

డిసెంబరు 25ను యేసు జన్మదినంగా కేథలిక్‌ చర్చి చివరకు నిర్ణయించిందనే విషయాన్ని అనేకమంది విద్వాంసులు అంగీకరిస్తారు. ఎందుకు? “‘అజేయుడైన సూర్యుని జన్మదినాన్ని’ గుర్తించే అన్యులైన రోమన్ల పండుగనాడే అదీ రావాలని ఆనాటి తొలి క్రైస్తవులు ఆ తారీఖుని కోరుకోవడమే బహుశా కారణమైవుండవచ్చు”నని ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా తెలియజేస్తోంది. అయితే, రెండున్నర శతాబ్దాలకుపైగా అన్యులచే క్రూరంగా హింసించబడిన క్రైస్తవులు, ఎందుకంత ఆకస్మికంగా తమ్మును హింసించినవారికి లొంగిపోయారు?

భ్రష్టత్వం పరిచయం చేయబడింది

మొదటి శతాబ్దంలో, “దుర్జనులును వంచకులును” క్రైస్తవ సంఘంలోనికి చొరబడి, అనేకమందిని మోసపరుస్తారని అపొస్తలుడైన పౌలు తిమోతిని హెచ్చరించాడు. (2 తిమోతి 3:13) ఈ గొప్ప భ్రష్టత్వం అపొస్తలుల మరణానంతరం ఆరంభమైంది. (అపొస్తలుల కార్యములు 20:29, 30) నాలుగవ శతాబ్దంలో కాన్‌స్టన్‌టైన్‌ మతం మార్చుకున్నాడని తెలిసిన తర్వాత, అనేకమంది అన్యులు అప్పట్లో ప్రాబల్యమందున్న ఒక తరహా క్రైస్తవ మతాన్ని తీసుకున్నారు. దాని ఫలితమేమిటి? తొలి క్రైస్తవత్వం, అన్యమతం (ఆంగ్లం) అనే పుస్తకం ఇలా చెబుతోంది: “నిజంగా ఆసక్తిగల విశ్వాసుల యొక్క తులనాత్మక చిన్న సమూహం, క్రైస్తవులమని చెప్పుకుంటున్న గొప్ప గుంపులో కానరాకుండా పోయింది.”

పౌలు చెప్పిన మాటలు వాస్తవమని ఎంతగా రుజువయ్యాయో కదా! ఇది అన్యమత భ్రష్టత్వం యథార్థమైన క్రైస్తవత్వాన్ని మ్రింగివేసినట్లైంది. సెలవుదినాల్ని వేడుక చేసుకోవడంలోకన్నా ఈ భ్రష్టత్వం మరింత స్పష్టంగా ఇంకెక్కడా కనబడలేదు.

నిజానికి, ఆచరించాలని క్రైస్తవులకు ఆజ్ఞాపించబడిన ఏకైక ఆచరణ ప్రభురాత్రి భోజనమే. (1 కొరింథీయులు 11:23-26) రోమన్ల పండుగల్లో విగ్రహారాధన సంబంధమైన ఆచారాలు చేరివున్నందున, తొలి క్రైస్తవులు వాటిలో భాగం వహించలేదు. ఈ కారణాన్నిబట్టే మూడవ శతాబ్దంలోని అన్యులు క్రైస్తవుల్ని “మీరు ప్రదర్శనశాలల్ని చూడడానికి రారు; ప్రజా ప్రదర్శనల్లో మీకు శ్రద్ధ లేదు; మీరు బహిరంగ విందులను తిరస్కరిస్తారు, పవిత్రమైన పోటీలను ఏవగించుకుంటారు” అని నిందించారు. మరోవైపున, అన్యులు “మేము దేవుళ్లను ఉల్లాసంతోనూ, విందులతోనూ, పాటలతోనూ, ఆటలతోనూ ఆరాధిస్తాం” అని గొప్పలు చెప్పుకున్నారు.

నాలుగవ శతాబ్దపు మధ్యకాలంనాటికి, ఆ సణుగుడు సన్నగిల్లిపోయింది. ఎలా? మందలోనికి కోకొల్లలుగా నకిలీ క్రైస్తవులు ప్రవేశిస్తుండగా, భ్రష్టత్వపు ఆలోచనలు అంతకంతకూ పెరిగాయి. ఇది రోమన్‌ ప్రపంచంతో రాజీపడడానికి నడిపించింది. దీనిపై వ్యాఖ్యానిస్తూ, మన క్రైస్తవత్వంలో అన్యమతం (ఆంగ్లం) అనే పుస్తకం, ఇలా తెలియజేసింది: “తరతరాలుగా ప్రజలకు అతిప్రియమైపోయిన అన్యమత పండుగలపై అదుపును సంపాదించడమూ, మరి వాటికి క్రైస్తవత్వపు ప్రాముఖ్యతను ఇవ్వడమూ అనేది ఒక నిర్దిష్టమైన క్రైస్తవత్వపు విధానమైంది.” అవును, గొప్ప భ్రష్టత్వం దాని హానికరమైన ప్రభావాల్ని చూపించింది. అన్యమత ఆచరణలను స్వీకరించడానికి క్రైస్తవులమని చెప్పుకున్నవాళ్లు చూపించిన సుముఖత, సమాజంలోపల తగినంతమేరకు సమ్మతిని ఇప్పుడు తీసుకొచ్చింది. త్వరలోనే, అన్యులు ఎన్ని వార్షిక పండుగల్ని ఆచరించేవారో అన్నింటినీ క్రైస్తవులు ఆచరించడం మొదలు పెట్టారు. వాటిలో క్రిస్మస్‌ అత్యంత ప్రధానమైనది కావడంలో ఆశ్చర్యమేమీ లేదు.

అంతర్జాతీయ సెలవుదినం

క్రైస్తవత్వపు ప్రముఖభాగం యూరప్‌ అంతటా వ్యాపిస్తుండగా, క్రిస్మస్‌ను అనేకమంది ప్రజలు ఆచరించనారంభించారు. యేసు జన్మదినాన్ని ఘనపర్చడంలో ఓ ఆనందమయమైన పండుగగా శాశ్వతంగా నిలబెట్టేందుకు అది తగినదనే అభిప్రాయాన్ని కేథలిక్‌ చర్చి స్వీకరించింది. అదే ప్రకారంగా, సా.శ. 567లో, ది కౌన్సిల్‌ ఆఫ్‌ టూర్స్‌ “క్రిస్మస్‌ నుండి ఎపిఫనీ అనే పండుగ వరకూ ఉన్న 12 రోజులను ఒక పవిత్రమైన కాలంగానూ, పండుగ కాలంగానూ ప్రకటించింది.”—ది కేథలిక్‌ ఎన్‌సైక్లోపీడియా ఫర్‌ స్కూల్‌ అండ్‌ హోమ్‌.

ఉత్తర యూరప్‌లోని లోకసంబంధమైన కోత పండుగల నుండి అనేకమైన ఆచారాల్ని క్రిస్మస్‌ త్వరలోనే కైవసం చేసుకుంది. ఆనందడోలికల్లో తేలిపోయేవాళ్లు తినడంలోనూ త్రాగడంలోనూ మునిగిపోగా దైవభక్తికన్నా ఉత్సవాల్ని జరుపుకోవడమే (మెర్రీమేకింగ్‌) మరింత సర్వసాధారణమైపోయింది. లైంగిక దుర్నీతికి వ్యతిరేకంగా మాట్లాడడానికి బదులు, చర్చి దాన్ని ఆమోదించింది. (రోమీయులు 13:13; 1 పేతురు 4:3 పోల్చండి.) సా.శ. 601లో, “అలాంటి ప్రాచీన అన్యమత పండుగల్ని నిలిపివేయవద్దు కానీ ఆ అన్యమతాచారాలను క్రైస్తవ మతాచారాలుగా మారుస్తూ, వాటిని చర్చి సంబంధమైన ఆచారాలుగా మలచమని” తన మిషనరీయైన మెలటస్‌కు పోప్‌ గ్రిగరీ I రాశాడని ఈజిప్టు ప్రభుత్వం తరపున ప్రాచీన ప్రజల ఒకప్పటి ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ అయిన ఆర్థర్‌ వెయ్‌గల్‌ నివేదిస్తున్నాడు.

మధ్యయుగాల్లో, అలాంటి విశృంఖలత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలని సంస్కరణను అపేక్షించే వ్యక్తులు భావించారు. “క్రిస్మస్‌ వేడుక యొక్క దురుపయోగాలకు” వ్యతిరేకంగా వాళ్లనేక శాసనాల్ని పంపించారు. క్రిస్మస్‌ ఇన్‌ అమెరికా—ఎ హిస్టరీ అనే తన పుస్తకంలో డా. పెన్నె రిస్టాడ్‌ ఇలా తెలియజేస్తోంది: “క్రైస్తవ పర్యవేక్షణ అనే గొడుగుక్రింద అది కొనసాగినంతవరకూ, అపరిపూర్ణ మానవులకు సహజ ప్రేరణలకు లోబడే పండుగ కాలమూ, విశృంఖలత్వమూ అవసరమని కొంతమంది మతగురువులు నొక్కి చెప్పారు.” ఈ అభిప్రాయం క్రిస్మస్‌ను గురించిన గందరగోళాన్ని మరింతగా పెంచింది. అయినా, అనేకమంది అన్యమత ఆచారాల్ని విడనాడడానికి సుముఖత చూపకుండేలా అవి అప్పటికే క్రైస్తవత్వంతో మరింత సన్నిహితంగా కలిసిపోయాయి గనుక ఇది పెద్ద వ్యత్యాసాన్నేమీ సృష్టించలేదు. రచయిత ట్రిస్ట్రమ్‌ కొఫన్‌ ఇలా చెబుతున్నాడు: “మొత్తం మీద ప్రజలు తామెప్పుడూ చేసే వాటినే చేశారు, మరి నైతికతావాదుల చర్చలకు వాళ్లు కొద్దిపాటి అవధానాన్నే చూపించారు.”

యూరోపియన్లు పశ్చిమార్థగోళంలో స్థిరనివాసం ఏర్పర్చుకునేనాటికి, క్రిస్మస్‌ ఓ పేరుగాంచిన సెలవుదినమైపోయింది. అయినప్పటికీ, క్రిస్మస్‌ వలసరాజ్యాల్లో అంగీకరించబడలేదు. ప్యూరిటన్‌ సంస్కరణకర్తలు ఆ ఆచరణను అన్యమతానికి చెందినదిగా దృష్టించి, దాన్ని 1659 మరియు 1681 సంవత్సరాల మధ్యకాలంలో మస్సాచుసెట్స్‌లో నిషేధించారు.

నిషేధం ఎత్తివేయబడిన తర్వాత, వలసరాజ్యాలయందంతటా, విశేషంగా న్యూ ఇంగ్లాండ్‌కు దక్షిణ ప్రాంతంలో క్రిస్మస్‌ను ఆచరించడం ఎక్కువైపోయింది. అయితే, సెలవు దినాలకున్న గత చరిత్ర దృష్ట్యా, కొందరు దేవుని కుమారుని ఘనపర్చడం కన్నా సరదాగా గడపడంపైనే మరింత శ్రద్ధను చూపించారనే విషయం ఆశ్చర్యాన్ని కల్గించనక్కర్లేదు. విశేషంగా విఘాతం కల్గించేదిగా ఉండే ఒక క్రిస్మస్‌ ఆచారం ఏమిటంటే తాగితందనాలు ఆడడంలో మునిగిపోవడాన్ని గూర్చినదే. కుర్రకారు రౌడీ మూకలు ఐశ్వర్యవంతులైన పొరుగువాళ్ల ఇళ్లల్లో జొరబడి, బెదిరింపుల ధోరణిలో ఆహారపానీయాల్ని ఉచితంగా పెట్టమని అడుగుతారు. ఇంటి యజమాని తిరస్కరిస్తే, సాధారణంగా అతన్ని నానా తిట్లు తిడతారు, ఒక్కోసారి అతని ఇంటిని ధ్వంసం చేస్తారు.

“క్రిస్మస్‌ అస్తవ్యస్థత” అనేది “తీవ్రమైన సామాజిక ముప్పు”గా తయారయ్యేంత అధ్వాన్నస్థాయికి 1820లలో పరిస్థితులు చేరుకున్నాయని ప్రొఫెసర్‌ నిసన్‌బౌమ్‌ అంటున్నాడు. న్యూయార్కు, ఫిలడెల్ఫియా వంటి నగరాల్లో, ఐశ్వర్యవంతులైన భూస్వాములు తమ ఎస్టేట్లను కాపాడేందుకు కావలివారిని పెట్టుకోవడం మొదలుపెట్టారు. 1827/28 క్రిస్మస్‌ కాలంలో హింసాత్మక దుశ్చర్యకు ప్రతిస్పందనగా న్యూయార్కు నగరం దాని ప్రథమంగా సాయుధ పోలీసు బలగాన్ని సంస్థీకరించుకుందని కూడా చెప్పబడింది!

క్రొత్తరూపు దాల్చిన క్రిస్మస్‌

19వ శతాబ్దం మానవజాతికి అపూర్వమైన మార్పుల్ని తీసుకొచ్చింది. ఒకదానితో ఒకటి కలుపబడిన వేర్వేరు రోడ్ల, వేర్వేరు రైల్వే రహదారుల రాకతో ప్రజలూ, వస్తువులూ, మరి వార్తలూ ఎంతో వేగంగా ప్రయాణించడం ఆరంభమైంది. పారిశ్రామిక విప్లవం కోట్లకొలది ఉద్యోగాల్ని సృష్టించింది, నిరాటంకంగా సరఫరా చేయగలిగినన్ని అమ్మకపు వస్తువులను ఫ్యాక్టరీలు త్వరితంగా ఉత్పత్తిచేశాయి. పారిశ్రామికీకరణ కూడా క్రొత్తవీ, సంక్లిష్టమైనవీ అయిన సామాజిక సమస్యల్ని ప్రవేశపెట్టింది, చివరకవి క్రిస్మస్‌ ఆచరించే విధానాన్ని ప్రభావితం చేశాయి.

కుటుంబ బంధాల్ని బలపర్చేందుకు ఒక మాధ్యమంగా సెలవుదినాల్ని ప్రజలు దీర్ఘకాలం నుండీ ఉపయోగించేవారు, మరి క్రిస్మస్‌ విషయంలోనూ ఆలాగే జరిగింది. క్రిస్మస్‌ను సమర్థించేవాళ్లు క్రిస్మస్‌ పాత ఆచారాల్లో కొన్నింటిని సవరించడం ద్వారా, దానిని ఆటవికమైన, అల్లరితోకూడిన ఉత్సవంవంటి పండుగస్థాయి నుండి కుటుంబపరమైన సెలవుదినంగా ఉండే స్థాయికి మార్చివేశారు.

నిజానికి, 19వ శతాబ్దపు చివరి కాలంనాటికి, ఆధునిక అమెరికా జీవన విధానపు అస్వస్థతలకు ఓ విధమైన ఔషధంలా క్రిస్మస్‌ దృష్టించబడింది. “మతాన్నీ, మతపరమైన భావాన్నీ ఇళ్లల్లోకి తీసుకెళ్లడానికీ, జన సామాన్యమైన విచ్చలవిడితనాన్నీ వైఫల్యాలనూ సరిదిద్దడానికి క్రిస్మస్‌ ఒక పరిపూర్ణమైన ఉపకరణమైంది” అని డా. రిస్తాడ్‌ అన్నారు. ఆమె ఇంకా ఇలా తెలియజేసింది: “బహుమతుల్ని ఇవ్వడమూ, దయార్ద్ర క్రియలు చూపించడమూ, స్నేహపూర్వకంగా పరస్పరం అభినందించుకోవడమూ, ఇంటి ముందుగదినిగానీ లేక ఆరాధనా గదినిగానీ, సన్‌డే స్కూల్‌ జరుపుకునే హాల్‌నిగానీ అలంకరించి, సతతహరిత చెట్టును పెట్టుకునే ఆనందమూ ప్రతీ కుటుంబంలోని సభ్యుల్ని ఒకరితో మరొకర్నీ, చర్చితోనూ, సమాజంతోనూ కలుపుతుంది.”

అదే విధంగా, ఒకరి ఎడల ఒకరికిగల తమ ప్రేమను నిశ్చయపర్చుకునేందుకూ, కుటుంబ సమైక్యతను కాపాడుకోవడానికి సహాయపడేందుకూ ఓ మాధ్యమంగా నేడు అనేకమంది క్రిస్మస్‌ను జరుపుకుంటారు. ఆధ్యాత్మిక కోణాలు ఉన్నాయనే విషయాన్ని నిస్సందేహంగా ఉపేక్షించకూడదు. కోట్లాదిమంది ప్రజలు యేసు జన్మదినాన్ని ఘనపర్చేందుకు క్రిస్మస్‌ పండుగను జరుపుకుంటారు. వాళ్లు చర్చిలో జరిగే ప్రత్యేక ఆరాధనా కార్యక్రమాలకు హాజరుకావచ్చు, ఆయన జననానికి సంబంధించిన చిత్రాల్ని గృహాల్లో అలంకరించుకోవచ్చు, లేదా యేసుకే కృతజ్ఞతా ప్రార్థనల్ని చెల్లించవచ్చు. అయితే దేవుడు దీన్ని ఎలా దృష్టిస్తాడు? ఇవి ఆయన అంగీకారాన్ని చూరగొంటాయా? బైబిలు ఏమి చెబుతుందో పరిశీలించండి.

“సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి”

యేసు భూమిపై ఉన్నప్పుడు, ఆయన తన అనుచరులతో ఇలా చెప్పాడు: “దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలె(ను.)” (యోహాను 4:24) యేసు ఆ మాటలకు అనుగుణ్యంగా జీవించాడు. ఆయన ఎల్లవేళలా సత్యాన్నే మాట్లాడాడు. ఆయన తన తండ్రియైన ‘సత్యదేవుడైన యెహోవాను’ పరిపూర్ణంగా అనుకరించాడు.—కీర్తన 31:5; యోహాను 14:9.

అన్నిరకాలైన మోసాల్నీ తాను ద్వేషిస్తున్నానని బైబిలు పుటల ద్వారా యెహోవా స్పష్టపర్చాడు. (కీర్తన 5:6) దీని దృష్ట్యా, క్రిస్మస్‌ పండుగలో చేరివున్న అనేక అంశాలు అబద్ధాలపుట్టయై ఉండడం వ్యంగ్యాత్మకమైన విషయం కాదంటారా? ఉదాహరణకు, వట్టి కట్టుకథయైన శాంటాక్లాస్‌ గురించి ఆలోచించండి. అనేక దేశాల్లో అధికంగా నమ్మబడుతున్నట్లుగా శాంటా ఎందుకు ప్రవేశ ద్వారం నుండిగాక, పొగగొట్టం ద్వారా ప్రవేశించడానికి సుముఖత చూపిస్తాడో ఒక పిల్లవానికి వివరించడానికి మీరు ఎన్నడైనా ప్రయత్నించారా? కేవలం ఒక్క సాయం సమయంలోనే కోట్లాదిమంది ఇళ్లను శాంటా ఎలా సందర్శిస్తాడు? ఎగిరే రేన్‌డీర్‌ (హిమసారంగం) అనే దుప్పి సంగతేమిటి? శాంటా ఓ నిజమైన వ్యక్తియనే నమ్మేలా తాను మోసగించబడ్డానని ఒక పిల్లవాడు గ్రహిస్తే, మరి అది తన తల్లిదండ్రులమీద తనకున్న నమ్మకాన్ని కోల్పోయేలా చేయదా?

ది కేథలిక్‌ ఎన్‌సైక్లోపీడియా తేటతెల్లంగా ఇలా తెలియజేస్తోంది: “అన్యమత ఆచారాలు . . . క్రిస్మస్‌కు ఆకర్షించబడ్డాయి.” ఎందుకు కేథలిక్‌ చర్చీ, మరితర క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలూ క్రైస్తవ మతానికి చెందని ఆచారాలుగల పండుగను జరుపుకుంటూనే ఉన్నాయి? అన్యమత బోధల్ని మన్నిస్తున్నట్లు అది సూచించడం లేదా?

యేసు భూమిపై ఉన్నప్పుడు తనను ఆరాధించాలని ఆయన మనుష్యుల్ని ప్రోత్సహించలేదు. యేసే ఇలా తెలియజేశాడు: “ప్రభువైన నీ దేవునికి [“నీ దేవుడైన యెహోవాకు,” NW] మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను.” (మత్తయి 4:10) అదే విధంగా, యేసు పరలోకంలో మహిమపర్చబడిన తర్వాత, “దేవునికే నమస్కారము చేయుము” అని ఒక దేవదూత అపొస్తలుడైన యోహానుతో చెప్పడం ఈ విషయంలో మార్పేమీలేదని సూచిస్తుంది. (ప్రకటన 19:10) క్రిస్మస్‌ కాలంలో తన తండ్రికిగాక తనకే చెల్లించే ఆరాధనాపూర్వకమైన భక్తినంతటినీ యేసు అంగీకరిస్తాడా? అనే ప్రశ్నకు ఇది నడిపిస్తోంది.

స్పష్టంగా, ఆధునిక క్రిస్మస్‌ను గూర్చిన వాస్తవాలు గోరంతల్ని కొండంతలు చేసి చెప్పడం కాదు. ఇది ముఖ్యంగా కల్పితమైన పండుగే. ఆలాగే అనేక రుజువులు దీని హీనమైన గతాన్ని ఎత్తి చూపుతున్నాయి. అయితే, మంచి మనస్సాక్షినిబట్టి, లక్షలాదిమంది క్రైస్తవులు క్రిస్మస్‌ను ఆచరించకూడదని నిర్ణయించుకున్నారు. ఉదాహరణకు, క్రిస్మస్‌ను గురించి రియన్‌ అనే ఒక అబ్బాయి ఇలా చెబుతున్నాడు: “సంవత్సరంలో కొన్ని రోజులపాటు కుటుంబమంతా కలుసుకున్నప్పుడు ప్రజలు ఎంతో ఉత్తేజపర్చబడతారు, అందరూ సంతోషంగా ఉంటారు. కానీ దాంట్లో అంత విశేషమేముంది? మా అమ్మానాన్నలు సంవత్సరం పొడవునా నాకు బహుమతులు ఇస్తారు!” మరొక పన్నెండేళ్ల అమ్మాయి ఇలా అంటోంది: “నాకు ఏదో లోటున్నట్టు నేను భావించను. బహుమతుల్ని కొనాల్సిందేనని ప్రజలు భావించే ఏదొక ప్రత్యేకమైన రోజున మాత్రమేగాక, సంవత్సరం పొడుగునా నేను బహుమతుల్ని పొందుతాను.”

“సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి” అని ప్రవక్తయైన జెకర్యా తన తోటి ఇశ్రాయేలీయుల్ని ప్రోత్సహించాడు. (జెకర్యా 8:19) జెకర్యావలే, మరితర విశ్వాసులైన ప్రాచీనకాల వ్యక్తుల వలే, మనమూ ‘సత్యాన్ని ప్రియంగా’ ఎంచితే, ‘జీవముగలవాడును సత్యవంతుడునగు దేవుడైన’ యెహోవాను కించపర్చే ఏ అబద్ధ మత ఆచరణనైనా మనం విడనాడమా?—1 థెస్సలొనీకయులు 1:9.

[7వ పేజీలోని చిత్రం]

“నాకు ఏదో లోటున్నట్టు నేను భావించను. సంవత్సరం పొడవునా నేను బహుమతుల్ని పొందుతాను”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి