విజయవంతులైన విద్యార్థుల నుండి విజయవంతులైన మిషనరీలుగా
“మాకు ఈ ఆధిక్యత లభించిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను!” అని విల్ ఆనందంతో అన్నాడు. తాను, తన భార్య పాట్సీ కలిసి వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ యొక్క 103వ తరగతి విద్యార్థులుగా అప్పుడే పూర్తి చేసిన తమ శిక్షణ గురించి ఆయన అలా అన్నాడు. జేహీద్, జెనీ ఆయనతో ఏకీభవించారు. “మేమిక్కడ ఉండడం ఒక ఆధిక్యతగా భావిస్తున్నా”మని వాళ్లన్నారు. స్కూల్లోని విద్యార్థులందరూ శ్రద్ధగా పఠించారు. ఇప్పుడు మిషనరీలుగా తమ కెరీర్‌ని ప్రారంభించడానికి వారు ఉత్సుకతతో ఉన్నారు. కానీ దానికి ముందు 1997, సెప్టెంబరు 6న జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో వారు తమ మిషనరీ నియామకాలలో విజయం సాధించడానికి సహాయపడే ప్రేమపూర్వకమైన ఉపదేశాన్ని వారు పొందారు.
ఆ కార్యక్రమానికి పరిపాలక సభ సభ్యుడైన థియోడోర్ జారజ్ చైర్మన్. బేతేలు కుటుంబ సభ్యులు, వాచ్ టవర్ సొసైటీ యొక్క 48 బ్రాంచీల నుండి వచ్చిన ప్రతినిధులతోపాటు, అమెరికా, కెనడా, ప్యూర్టోరికో, యూరప్ దేశాల నుండి వచ్చిన స్నేహితులూ బంధువులూ—విద్యార్థులకు తమ మద్దతు ఉన్నదనీ వారిపట్ల తమకు ప్రేమ ఉందనీ హామీనివ్వడానికి అక్కడ హాజరయ్యారని ఆయన చెప్పాడు. క్రైస్తవమత సామ్రాజ్యపు చర్చీలు పంపించిన మిషనరీలు ఎక్కువగా తమ మిషనరీ పని నుండి అవధానాన్ని మళ్లించి విద్వాంసులవ్వడానికి ప్రయత్నించడమో లేక చివరికి రాజకీయాల్లో చిక్కుకుపోవడమో జరిగిందని బ్రదర్ జారజ్ పేర్కొన్నాడు. దానికి విరుద్ధంగా, గిలియడ్ పట్టభద్రులు వారు ఏమి చేయడానికి శిక్షణ పొందారో అదే చేస్తారు. వారు ప్రజలకు బైబిలును బోధిస్తారు.
అటుతర్వాత సొసైటీ యొక్క బ్రూక్లిన్ కార్యాలయం నుండి వచ్చిన రాబర్ట్ బట్లర్, “మీ మార్గాన్ని విజయవంతం చేసుకోండి” అన్న అంశంపై మాట్లాడాడు. మనుషులు విజయాన్ని ఆర్థిక లాభాల ఆధారంగా లేక మరితర వ్యక్తిగత లాభాల ఆధారంగా కొలిచినప్పటికీ, నిజానికి ముఖ్యమైనదేమిటంటే, దేవుడు విజయాన్ని దేని ఆధారంగా కొలుస్తాడన్నదే. యేసు పరిచర్య విజయవంతమైంది, దానికి కారణం ఆయన అనేకులను మతమార్పిడి చేయడం కాదు, ఆయన తన నియామకం విషయంలో నమ్మకంగా ఉండడమే. యేసు యెహోవాకు మహిమను తెచ్చాడు, ఈ లోక మాలిన్యాలు తనకు అంటకుండా తనను తాను కాపాడుకున్నాడు. (యోహాను 16:33; 17:4) ప్రతీ క్రైస్తవుడూ చేయగల్గే పనులే ఇవి.
“అందరికీ దాసులుగా ఉండండి” అని, ఒక ప్రాచ్య దేశంలో మునుపు మిషనరీగా ఉన్న రాబర్ట్ పీవి సలహా ఇచ్చాడు. అపొస్తలుడైన పౌలు ఒక విజయవంతమైన మిషనరీ. ఆయన విజయానికి రహస్యమేమిటి? ఆయన తనను తాను అందరికీ దాసునిగా చేసుకున్నాడు. (1 కొరింథీయులు 9:19-23) ప్రసంగీకుడు ఇలా వివరించాడు: “అటువంటి దృక్పథం ఉన్న గిలియడ్ పట్టభద్రుడు మిషనరీ సేవను ఒక రకమైన పదోన్నతిగానో లేక సంస్థలో మరింత ప్రాముఖ్యమైన స్థానాలకు చేరుకోవడానికి ఒక మెట్టుగానో దృష్టించడు. ఒక మిషనరీ కేవలం ఒకే ఒక్క ఉద్దేశంతో—సేవ చేయాలనే ఉద్దేశంతోనే తన నియామకాన్ని చేపడతాడు, మరి సేవకులు చేసేది కూడా అదే.”
పరిపాలక సభ సభ్యుడైన గెరిట్ లాష్ తన ఉపదేశాన్ని ముఖ్యంగా 2 కొరింథీయులు 3, 4 అధ్యాయాలపై ఆధారం చేసుకుంటూ, “అద్దాలవలె యెహోవా మహిమను ప్రతిబింబించండి” అని విద్యార్థులను పురికొల్పాడు. దేవుని గురించిన జ్ఞానము వెలుగు లాంటిదనీ, ఒక క్రైస్తవుడు దాన్ని స్వీకరించడానికి తన హృదయాన్ని తెరిచినప్పుడు అది అతన్ని ప్రకాశవంతం చేస్తుందనీ చెప్పి ఆయన వారిని ఆలోచింపజేశాడు. మనం సువార్తను ప్రకటించడం ద్వారా, మంచి నడవడిని కాపాడుకోవడం ద్వారా ఆ వెలుగును ప్రతిబింబిస్తాము. “మీరు అసమర్థులని ఒక్కోసారి భావించవచ్చు” అని ఆయన అంగీకరిస్తూ, “అటువంటి భావనలు తలెత్తినప్పుడు, ‘బలాధిక్యము దేవునిదై ఉండునట్లు’ యెహోవాపై ఆధారపడండి” అని చెప్పాడు. (2 కొరింథీయులు 4:7) 2 కొరింథీయులు 4:1లో నమోదు చేయబడిన పౌలు మాటల్ని ప్రతిధ్వనిస్తూ, బ్రదర్ లాష్ విద్యార్థులకు ఇలా విజ్ఞప్తి చేశాడు: “మీ మిషనరీ నియామకాన్ని త్యజించకండి. మీ అద్దానికి మెరుగుపెడుతూనే ఉండండి!”
గిలియడ్ బోధనా విభాగంలో సభ్యుడైన కార్ల్ ఆడమ్స్ “యెహోవా ఎక్కడున్నాడు?” అనే ఆసక్తిని రేకెత్తించే అంశంపై మాట్లాడాడు. ఈ విశ్వంలో దేవుడు ఎక్కడ ఉన్నాడన్న విషయాన్ని కాదు గాని, యెహోవా దృక్కోణాన్ని, ఆయన నిర్దేశాలను పరిగణనలోనికి తీసుకోవాల్సిన అవసరతను ఆ ప్రశ్న సూచిస్తుంది. “ఒత్తిడిలో ఉన్నప్పుడు దీర్ఘకాలంగా యెహోవా సేవలో ఉన్న వ్యక్తి కూడా దాన్ని మర్చిపోవచ్చని” ఆయన అన్నాడు. (యోబు 35:10) మన ఆధునిక కాలం విషయం ఏమిటి? 1942లో, దేవుని ప్రజలకు నడిపింపు అవసరమైంది. ప్రకటనా పని మూలన పడుతుందా, లేక ఇంకా ఎక్కువ చేయవలసి ఉందా? తన ప్రజల విషయంలో యెహోవా చిత్తం ఏమైవుంది? వారు దేవుని వాక్యాన్ని పఠిస్తున్న కొలదీ, జవాబు స్పష్టం కానారంభించింది. “ఆ సంవత్సరం ముగియక ముందే వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ కొరకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి” అని బ్రదర్ ఆడమ్స్ చెప్పాడు. ఆ స్కూలు నుండి పట్టభద్రులైన మిషనరీల పనిని యెహోవా నిశ్చయంగా ఆశీర్వదించాడు.
ఉపదేశకులలో ఒకరైన మార్క్ న్యూమర్ తర్వాత మాట్లాడారు. “మీరు మీ తలాంతును ఎలా ఉపయోగిస్తారు?” అనే తన ప్రసంగంలో, తాము గిలియడ్వద్ద పొందిన శిక్షణను తమ క్రొత్త నియామకాలకు చేరుకోగానే అన్వయించుకోవాలని విద్యార్థులను ఆయన ప్రోత్సహించాడు. “ఇతరుల ఎడల శ్రద్ధతీసుకోవడానికి శ్రమపడండి” అని అన్నాడాయన. “వారితో కలిసిపోండి. ఆ దేశపు ఆచారాలు, చరిత్ర, అక్కడి హాస్యము వీటన్నిటినీ నేర్చుకోవడానికి ఉత్సుకత చూపండి. మీరెంత త్వరగా భాషను నేర్చుకుంటే అంత త్వరగా మీరు మీ నియామకంలో ఇమిడిపోతారు” అని కూడా అన్నాడాయన.
ఉత్సాహవంతులైన విద్యార్థులు పరిచర్యలో ఆనందాన్ని అనుభవించారు
గిలియడ్‌లో ఉన్నంత కాలము విద్యార్థులు పాఠాలను నేర్చుకోవడమేకాక, స్థానికంగా ఉన్న 11 సంఘాలకు నియమించబడ్డారు. వారాంతాల్లో వారు ప్రకటనా పనిలో ఉత్సాహంతో పాల్గొన్నారు. తమ అనుభవాలను కొన్నింటిని ప్రేక్షకులతో పంచుకోమని వారిలో చాలామందిని గిలియడ్ బోధనా విభాగంలో ఉన్న వాలెస్ లివరెన్స్ ఆహ్వానించాడు. షాపింగ్ కేంద్రాల్లో, పార్కింగ్ చేసేచోట్ల, వ్యాపార ప్రాంతాల్లో, వీధుల్లో, ఇంటింటా సాక్ష్యం ఇస్తున్నప్పుడు తమకు ఎదురైన అనుభవాలను చెబుతుండగా వారి ఆనందం ప్రస్ఫుటంగా కనిపించింది. కొందరైతే తమ సంఘపు పరిచర్య ప్రాంతంలో నివసిస్తూ అక్కడ పనిచేస్తున్న విదేశీ భాషా ప్రజలను కలుసుకునేందుకు మార్గాలను వెదికారు. 103వ తరగతికి చెందిన విద్యార్థులు తమ ఐదు నెలల శిక్షణా సమయంలో కనీసం పది గృహ బైబిలు పఠనాలను ప్రారంభించి నిర్వహించారు.
దీర్ఘకాలం మిషనరీలుగా ఉన్నవారు విజయ రహస్యాలను పంచుకున్నారు
కార్యక్రమంలోని ఈ ఆహ్లాదకరమైన భాగం తర్వాత, ప్యాట్రిక్ లాఫ్రాంక, విలియమ్ వాన్ డీ వాల్లు, గిలియడ్ విద్యార్థుల ప్రయోజనార్థం తమ మిషనరీ జీవితాల్లో తాము నేర్చుకున్న విషయాలను చెప్పమని ఏడుగురు బ్రాంచ్ కమిటీ మెంబర్లను ఆహ్వానించారు. గిలియడ్ పట్టభద్రులు తమ నియామకం యెహోవా నుండి వస్తున్నట్లు పరిగణించాలనీ, తమ నియామకానికి అంటిపెట్టుకుని ఉండడానికి స్థిరనిశ్చయంతో ఉండాలనీ వారు ఉద్బోధించారు. గిలియడ్‌లో శిక్షణ పొందిన మిషనరీలు ఇతర దేశాల్లోని పరిచర్యపై ఎలాంటి అనుకూల ప్రభావాలను చూపించారో వివరించారు.
దశాబ్దాలపాటు సంతోషంగా, ఫలవంతమైన మిషనరీలుగా సేవచేయడానికి ఈ బ్రాంచ్ కమిటీ మెంబర్లకు ఏది సహాయం చేసింది? వారు స్థానిక సహోదరులతో సన్నిహితంగా కలిసి పనిచేసి, వారివద్ద నుండి నేర్చుకున్నారు. వారు తమ నియామకాలకు చేరుకున్న వెంటనే అక్కడి భాషను నేర్చుకోవడానికి శ్రమించారు. వారు పరిస్థితులకు తగ్గట్టు, స్థానిక ఆచారాలకు తగ్గట్టు తమను తాము మలుచుకోవడానికి నేర్చుకున్నారు. గిలియడ్ స్కూలు మొదటి తరగతి నుండి పట్టభద్రుడైన, 54 సంవత్సరాలుగా మిషనరీగా పనిచేస్తున్న ఛార్లెస్ ఐసెన్‌హోవర్ విజయవంతులైన మిషనరీలు నేర్చుకున్న ఐదు “రహస్యాలను” పంచుకున్నాడు: (1) బైబిలును క్రమంగా పఠించడం, (2) భాషను అధ్యయనం చేయడం, (3) పరిచర్యలో చురుకుగా ఉండడం, (4) మిషనరీ గృహంలో శాంతి కొరకు పాటుపడడం, (5) క్రమంగా యెహోవాకు ప్రార్థించడం. తాము పొందిన ఆచరణయోగ్యమైన సలహాలనుబట్టి మాత్రమే గాక అనుభవజ్ఞులైన ఈ మిషనరీలు యెహోవా సేవలో స్పష్టంగానే అనుభవించిన ప్రస్ఫుటమైన ఆనందాన్నిబట్టి కూడా విద్యార్థులు ముగ్ధులయ్యారు. ఆర్మాండో, లూప్‌లు చెబుతున్నట్లుగా “వారు తమ జీవితాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంతో సంతోషంగా కన్పించారు.”
ఇంటర్వ్యూల తర్వాత ఇంకొక్క ప్రసంగం మిగిలివుంది. పరిపాలక సభ సభ్యుడైన ఆల్బర్ట్ ష్రోడర్, “దేవుని వాక్యానికి విశ్వసనీయమైన సేవకునిగా ఉండడం విలువైన సత్య రత్నాలను వెల్లడిచేస్తుంది” అనేదాన్ని తన ప్రసంగానికి అంశంగా ఎంపిక చేసుకున్నాడు. గిలియడ్ స్కూలులో ప్రాథమిక పాఠ్యగ్రంథం బైబిలు కాబట్టి ఆయన చెప్పబోతున్న విషయంలో విద్యార్థులకు చాలా ఆసక్తి ఉంది. 50 ఏళ్ల క్రితం ఇంగ్లీషులో పరిశుద్ధ లేఖనముల నూతన లోక అనువాదము మీద పని ప్రారంభమైనప్పుడు, న్యూ వరల్డ్ బైబిల్ ట్రాన్స్లేషన్ కమిటీలోని అభిషిక్త సభ్యులు మనుష్యుల అంగీకారం కొరకు చూడక పరిశుద్ధాత్మ నడిపింపుపై ఆధారపడ్డారని బ్రదర్ ష్రోడర్ చెప్పాడు. (యిర్మీయా 17:5-8) అయితే, కొన్ని అధికారక మూలాలు నూతన లోక అనువాదము (ఆంగ్లం)లోవున్న ఉన్నత ప్రమాణాలను ఇటీవలనే గుర్తించాయి. సొసైటీకి వ్రాసిన ఒక ఉత్తరంలో ఒక విద్వాంసుడు ఇలా వ్రాశాడు: “నేను ఏదైనా ప్రచురణను చూసినప్పుడు అది ఉన్నత శ్రేణికి చెందినదో కాదో నాకు తెలుస్తుంది. మీ ‘న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ కమిటీ’ అద్భుతమైన పని చేసింది.”
ఈ ప్రసంగం తర్వాత విద్యార్థులు డిప్లొమాలను పొందారు, వారి నియామకాలు ప్రేక్షకులకు ప్రకటించబడ్డాయి. తరగతిలోని విద్యార్థుల హృదయాలను కదిలించి వేసిన సందర్భమది. తరగతి ప్రతినిధి ఒకరు కృతజ్ఞతా ఉత్తరాన్ని చదివినప్పుడు చాలామంది తమ గొంతుకలకు ఏదో అడ్డం పడినట్లై, ఆనందబాష్పాలతో వారి కళ్లు చెమర్చాయి. కొంతమంది విద్యార్థులు మిషనరీ పని కొరకు సంవత్సరాలుగా సిద్ధపడుతూ వచ్చారు. గిలియడ్ కోర్సు ఇంగ్లీషులో నిర్వహించబడుతుందని గుర్తించి ఆ భాషపైన పట్టు సాధించడానికిగాను ఇంగ్లీషు సంఘాలకు కొంతమంది తరలివెళ్లారు. ఇతరులు స్వదేశంలోనే లేక విదేశాల్లో పయినీర్ల అవసరత ఎక్కువగా ఉన్న ప్రాంతానికి తరలివెళ్లారు. మరి కొందరు అనుభవాలను చదవడం ద్వారా, పరిశోధన చేయడం ద్వారా, లేక సొసైటీ ఉత్పత్తి చేసిన భూదిగంతముల వరకు (ఆంగ్లం) అనే వీడియోక్యాసెట్టును మళ్లీ మళ్లీ చూడడం ద్వారా సిద్ధపడ్డారు.
మొదట్లో పేర్కొనబడిన విల్, పాట్సీలు విద్యార్థులపట్ల చూపబడిన వ్యక్తిగత ఆసక్తిని బట్టి ఎంతో ఆశ్చర్యచకితులయ్యారు. “మేమెవరమో అసలు ఏమాత్రం తెలియని ప్రజలు మమ్మల్ని హత్తుకుంటూ మా ఫోటోలు తీసుకున్నారు. పరిపాలక సభలోని ఒక సభ్యుడు మాతో కరచాలనం చేసి, ‘మిమ్మల్ని చూస్తుంటే మాకెంతో గర్వంగా ఉంది!’ అన్నారు.” అందులో సందేహమే లేదు, 103వ తరగతిలోని విద్యార్థులు అందరికీ ప్రీతిపాత్రులైనవారే. వారు చాలా బాగా శిక్షణ పొందారు. గిలియడ్‌లో వారు పొందిన శిక్షణ, విజయవంతులైన విద్యార్థులనుండి విజయవంతులైన మిషనరీలుగా తయారుకావడాన్ని సాధ్యం చేస్తుంది.
[22వ పేజీలోని బాక్సు]
తరగతి గణాంకాలు
ప్రాతినిధ్యం వహించబడిన దేశాలు: 9
నియమించబడిన దేశాలు: 18
విద్యార్థుల సంఖ్య: 48
వివాహిత జంటల సంఖ్య: 24
సగటు వయస్సు: 33
సత్యంలో సగటు సంవత్సరాలు: 16
పూర్తికాల పరిచర్యలో సగటు సంవత్సరాలు: 12
[23వ పేజీలోని చిత్రం]
వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ యొక్క 103వ పట్టభద్రుల తరగతి
ఈ క్రింది లిస్టులో, వరుసలు ముందు నుండి వెనక్కి లెక్కించబడ్డాయి, ప్రతి వరుసలోను పేర్లు ఎడమ నుండి కుడికి పేర్కొనబడ్డాయి.
(1) బన్, ఎ.; డాల్స్టెడ్, ఎమ్.; కాంపాన్యా, జెడ్.; బోయాజూలు, ఆర్.; ఓగాన్డో, జి.; నికన్చక్, టి.; మెల్విన్, ఎస్. (2) మే, ఎమ్.; మాపల, ఎమ్.; లూవన్, జె.; హైటమా, డి.; హెర్నాండెస్, సి.; బోయాజూలు, ఎన్.; స్టర్మ్, ఎ.; మెల్విన్, కె. (3) టామ్, జె.; మాపల, ఇ.; నోల్ట్, ఎమ్.; టీజ్డేల్, పి.; రైట్, పి.; పెరెస్, ఎల్.; షెనఫెల్ట్, ఎమ్.; పాక్, హెచ్. (4) మర్ఫీ, ఎమ్.; కాంపాన్యా, జె.; స్టూవర్ట్, ఎస్.; చరేడా, ఎమ్.; రీడ్, ఎమ్.; పెరెస్, ఎ.; టీజ్డేల్, డబ్ల్యు.; పాక్, జె. (5) స్టూవర్ట్, డి.; రైట్, ఎ.; చరేడా, పి.; నికన్చక్, ఎఫ్.; రీడ్, జె.; హైటమా, కె.; ఓగాన్డో, సి.; షెనఫెల్ట్, ఆర్. (6) మర్ఫీ, టి.; హెర్నాండెస్, జె.; నోల్ట్, ఎమ్.; బన్, బి.; టామ్, ఆర్.; డాల్స్టెడ్, టి.; లూవన్, జెడ్.; మే, ఆర్.; స్టర్మ్, ఎ.
[24వ పేజీలోని చిత్రం]
మేము ఎక్కడికి వెళుతున్నాము?