పరిశుద్ధ సేవకు విలువైన ప్రతిఫలాలు
రీ బ్లుర్ చెప్పినది
దాదాపు ఒక వంద సంవత్సరాల క్రితం, మా తాతయ్య మెథడిస్టు చర్చీలో నమ్మకమైన సభ్యునిగా ఉన్నాడు. ఆయన గౌరవనీయుడైన ప్రసంగీకునిగా కూడా ఉన్నాడు, ఇంగ్లాండులోని పింగాణీ పరిశ్రమకు పేరొందిన పట్టణమైన స్టోక్-ఆన్-ట్రెంట్‌లోని అనేక ప్రార్థనాలయాలకు మద్దతునిచ్చేందుకు ఆయన ఉదారంగా ఇచ్చేవాడు. తర్వాత ఆయన ఆర్థికంగా కష్టసమయాల నెదుర్కొన్నాడు. తాతయ్యకు సహాయం చేయడానికి ఒక చిన్న గ్రామీణ దుకాణాన్ని ఆయన నడిపించేలా మా నాన్న ఏర్పాటు చేశాడు. ఆ దుకాణానికి బీరు అమ్మేందుకు లైసెన్సు ఉంది. మెథడిస్టులు దీని గురించి తెలుసుకున్నప్పుడు, వాళ్లు తాతయ్యను వెంటనే చర్చి నుండి బహిష్కరించారు.
నాన్న ఉగ్రుడైపోయి, మతంతో ఇంకెప్పుడూ ఏ సంబంధమూ పెట్టుకోనని ప్రమాణం చేశాడు—ఆయన తన మాట మీదే నిలబడ్డాడు. ఆయన పోలీసుగా పనిచేశాడు, కాని తర్వాత ఒక చిన్న హోటలు యజమాని అయ్యాడు. కాబట్టి నేను ఆ స్థలంలోని వాసనల మధ్యా పొగ మధ్యా పెరిగాను. నా జీవితంలో మతానికి ఏ స్థానం లేదు, కాని బోర్డు గేములు ఆడడం మాత్రం ప్రముఖస్థానం వహించింది, వాటిలో నేను సిద్ధహస్తుణ్ణయ్యాను! అయితే నాకు బైబిలు గురించి ఎక్కువగా తెలియక పోయినప్పటికీ, తాతయ్య తొలి ప్రభావం మూలంగా బైబిలంటే నాకు చెప్పుకోదగినంత గౌరవం ఏర్పడింది.
నేను బైబిలు సత్యం తెలుసుకున్నాను
1923లో నాకు 24 ఏళ్లున్నప్పుడు, నేను తూర్పు ప్రాంతానికి అంటే నాటింగ్‌హామ్‌కు వెళ్లాను. అక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో లీసెస్టర్‌కు నైరృతిగా ఉన్న వెట్‌స్టోన్ గ్రామంలో నివసిస్తున్న మారీని ప్రేమించ నారంభించాను. ఆమె తండ్రి ఆర్థర్ రెస్ట్ స్థానిక ప్రార్థనాలయంలో ఆర్గానిస్టుగా ఉండేవాడు, కాని ఆ సమయానికల్లా ఆయన ఉత్సాహవంతమైన బైబిలు విద్యార్థి అయ్యాడు, అప్పట్లో యెహోవాసాక్షులు అలా పిలువబడేవారు. ఆర్థర్ తాను క్రొత్తగా కనుగొన్న విశ్వాసాన్ని గురించి నాతో ఎప్పుడూ మాట్లాడుతుండేవాడు—నేను ఎక్కువ ఆసక్తి చూపించేవాణ్ణి కాదు. అయితే, పార్లమెంటు సభ్యుడూ ప్రముఖ బాప్టిస్టూ అయిన ఒకాయన ఇచ్చే ప్రసంగాన్ని వినడానికి ఆయనతోపాటు నేను 1924 జూలై 13 ఆదివారం మధ్యాహ్నం స్థానిక బాప్టిస్టు ప్రార్థనాలయానికి వెళ్లినప్పుడు నాకు ఆసక్తి కలిగింది. “పాస్టర్ రస్సెల్ బోధలు లేఖన వెలుగులో పరిశోధింపబడ్డాయి” అనే ఆయన అంశం నాలో ఆసక్తిని రేకెత్తించింది. అప్పుడు నేను వ్రాసుకున్న నోట్సు ఇంకా నా వద్ద ఉంది.
తమ నమ్మకాలపై చేయబడిన దాడికి జవాబిస్తామని బైబిలు విద్యార్థులు చేసుకున్న విజ్ఞప్తిని బాప్టిస్టులు నిరాకరించారు. దానితో నాకు చాలా కోపమొచ్చింది, అలాంటి కూటాన్ని ఏర్పాటు చేయడానికి మరో స్థలాన్ని సంపాదించేందుకు నేను నిశ్చయించుకున్నాను. సమీపంలో ఉన్న దాన్యపు గిడ్డంగి తగిన స్థలంగా అనిపించింది. మేము దాన్ని శుభ్రంగా ఊడ్చి, సాలెగూళ్లు తీసివేసి, నూర్పిడి యంత్రాలను ఒక ప్రక్కకు జరిపి, మేమంతా సిద్ధమయ్యాము. మేము 70 కుర్చీలు సమకూర్చుకుని, కరపత్రాలు ముద్రించాము.
ఫ్రాంక్ ఫ్రిర్ ప్రసంగమివ్వడానికి లీసెస్టర్ నుండి వచ్చినప్పుడు, కుర్చీలన్నీ నిండిపోయాయి, మరో 70 మంది నిలబడి ఉన్నారు! లేఖనాల నుండి ఫ్రాంక్ చేసిన సుస్పష్టమైన తర్కం నన్ను ఆకర్షించింది, అక్కడికి వచ్చిన అనేకమంది ఇతరులకు కూడా అలాగే అనిపించింది. ఆ సమయం నుండి, లీసెస్టర్ వద్దనున్న బ్లేబీలోని బైబిలు విద్యార్థుల చిన్న సంఘం త్వరితగతిన విస్తరించింది. అది నా జీవితంలోనూ, అలాగే మారీ జీవితంలోనూ కూడా ఒక మలుపే. 1925లో మేమిద్దరం యెహోవాకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకుని, వివాహం చేసుకున్నాము.
ఆధ్యాత్మికాశీర్వాదాలు
తర్వాతి సంవత్సరం నన్ను బ్లేబీ సంఘానికి సేవా నిర్దేశకునిగా నియమించారు. నా భార్యా నేను కల్‌పోర్టర్‌ల మాదిరిని అనుసరించి పూర్తికాల సువార్తికులం కావాలనుకున్నాము, కానీ అలా పని తీవ్రంగా ఉండే పరిస్థితుల్లో కొనసాగడానికి మారీ ఆరోగ్యం అనుమతించదని త్వరలోనే స్పష్టమైంది. ఆమె 1987లో మరణించేంత వరకు అనారోగ్యంగానే ఉన్నప్పటికీ, చక్కని సహచరిగా మంచి పరిచారకురాలిగా ఉంది. ఆమె అనియత సాక్ష్యమివ్వడంలోనూ, బైబిలు పఠనాలు ప్రారంభించడంలోనూ ప్రవీణురాలు. దాదాపు ప్రతి సాయంకాలం మేము కూటాలకు హాజరు కావడంలోనో లేక మా పొరుగువారితో బైబిలు సత్యాలు పంచుకోవడంలోనో గడిపేవాళ్లం.
నేను ఒక ఇంజనీరును, రంపపుమరకు అవసరమయ్యే పరికరాలను తయారు చేసే సంస్థలో పనిచేసేవాడిని. నేను నా పని గురించి బ్రిటన్ అంతటా, అలాగే ఫ్రాన్సుకు ఎక్కువగా ప్రయాణించవలసి వచ్చేది, సాధారణంగా మారీ నాతోపాటు వచ్చేది. ఈ ప్రయాణాలు మేము విస్తృతంగా సాక్ష్యమివ్వడానికి అవకాశాలనిచ్చాయి.
విస్తరణ కొరకు పునాదులు
మేము బ్లేబీలో మా కూటాల కొరకు 1925లో ఒక చక్కని భవనాన్ని నిర్మించాము, అక్కడి నుండి మేము ప్రభావవంతమైన సాక్ష్యపు కార్యక్రమాన్ని సంస్థీకరించాము. ప్రతి ఆదివారం ఉదయం, మేము ఒక బస్సు అద్దెకు తీసుకునేవాళ్లం, దానిలో చుట్టుప్రక్కల చెల్లాచెదరుగా ఉన్న గ్రామాలకు చిన్నచిన్న పట్టణాలకు వెళ్లేవాళ్లం. దారిలో వెళుతుండగా ప్రకటించడానికి ప్రచారకులు దిగిపోయేవారు, మళ్లీ తిరిగి వచ్చేటప్పుడు వాళ్లు అదే బస్సులో ఎక్కేవాళ్లు. వెచ్చని వేసవి నెలల్లో, ఆదివారం అపరాహ్ణవేళల్లో తాజా కావలికోట సంచికను ఉపయోగించి బైబిలు పఠనం చేసేవాళ్లం. ఆతర్వాత, ఎనిమిది గంటలకు, బహిరంగ ప్రసంగం కొరకు లీసెస్టర్ మార్కెట్ స్థలంలో కలిసేవాళ్లం. ఒకరాత్రి 200 మంది విన్నారు. ఇప్పుడు లీసెస్టర్‌లోనూ, చుట్టుప్రక్కలా ఉన్న అనేక సంఘాలకు ఈ కార్యక్రమం పునాదులు వేసింది.
1926లో ఒక చారిత్రాత్మక సమావేశం లండన్‌లోని అలెక్సాండ్రా భవనంలోనూ రాయల్ ఆల్బర్ట్ హాలులోనూ ఒకేసారి నిర్వహించబడింది. ఆ సందర్భంలో, వాచ్ టవర్ సంస్థ అప్పటి అధ్యక్షుడైన జోసెఫ్ ఎఫ్. రూథర్‌ఫోర్డ్ విడుదల (ఆంగ్లం) అనే పుస్తకాన్ని ఆవిష్కరించాడు. “ప్రపంచ పాలకులకు ఒక సాక్ష్యం” అనే తీర్మానం మరియు “ప్రపంచ శక్తులు ఎందుకు వణకుతున్నాయి—పరిష్కారం” అని సహోదరుడు రూథర్‌ఫోర్డ్ ఇచ్చిన శక్తివంతమైన బహిరంగ ప్రసంగం కూడా మరుసటి రోజు ఒక ప్రముఖ వార్తాపత్రికలో పూర్తిగా ముద్రించబడ్డాయి. 10,000 కంటే ఎక్కువమంది ఆ బహిరంగ ప్రసంగాన్ని విన్నారు, ఆ తర్వాత వెంటనే, తీర్మానం యొక్క 5,00,00,000 ప్రతులు ప్రపంచవ్యాప్తంగా పంచిపెట్టబడ్డాయి. బ్రిటన్‌లో ప్రకటన పనిని ఉధృతం చేయడానికి ఆ సమావేశం దోహదపడింది.
యుద్ధకాలంలో పెద్ద సమావేశం
రెండవ ప్రపంచ యుద్ధం 1939 సెప్టెంబరులో ప్రారంభమయ్యింది, 1941 కల్లా యుద్ధం ఉధృతమయ్యింది. జర్మను బాంబర్లు రాత్రింబగళ్లు దాడి చేశాయి, దేశవ్యాప్తంగా బ్లాకవుట్ విధించబడింది. ఆహార కొరత ఉంది, అందుబాటులో ఉన్నది కచ్చితంగా నియంత్రించబడింది. ప్రయాణ సౌకర్యాలు పరిమితంగా ఉండేవి, చివరికి రైలు ప్రయాణం కూడా పరిమితంగా ఉండేది. అధిగమించలేనివన్నట్లు అనిపిస్తున్న ఈ అడ్డంకులున్నప్పటికీ, మేము 1941 సెప్టెంబరు 3-7 వరకు ఐదు రోజుల జాతీయ సమావేశాన్ని జరుపుకున్నాము.
లీసెస్టర్ నందలి డీ మాంట్‌ఫర్ట్ హాలు సమావేశ స్థలంగా ఎంపిక చేసుకోబడింది, ఎందుకంటే లీసెస్టర్ ఇంగ్లాండు మధ్యలో ఉంది. నేను కలప వ్యాపారంలో ఉన్నందున, నేను ప్రచార చిహ్నాల నిర్మాణంలో తోడ్పడగలిగాను. నేను సమావేశానికి వచ్చేవారి కొరకు స్థానిక ప్రయాణ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశాను. ముందుగానే టిక్కట్లు కొనుక్కోవడం ద్వారా, సాధారణ ధరకన్నా ఎక్కువ డబ్బు చెల్లించడం ద్వారా, మేము లీసెస్టర్ ట్రాములు ఆదివారాన కూడా నడిచేలా చేశాము.
ప్రయాణాలపై నిర్భందాలు ఉండేవి గనుక, బహుశా 3,000 మంది సాక్షులు రావచ్చని మేము నిరీక్షించాము. 10,000 కంటే ఎక్కువమంది ప్రతినిధులు తాము వస్తామని చెప్పినప్పుడు ఎంత ఉత్తేజకరంగా ఉండివుంటుందో ఊహించండి! కానీ వాళ్లు ఎక్కడ బసచేస్తారు? లీసెస్టర్ పౌరులు తమ గృహాల్లో ఉండడానికి అనేకులను దయతో ఆహ్వానించారు. అంతేగాక, సమావేశ స్థలం నుండి మూడు కిలోమీటర్ల దూరంలోవున్న మైదానంలో వేయబడిన గుడారాలలో దాదాపు వెయ్యిమందికి బస ఏర్పాటు చేయబడింది. గిద్యోను గుడారం అని మేము పిలిచిన ఆ ప్రాంతం స్థానికంగా చాలా కలవరమే కలిగించింది.
సమావేశ విభాగాల కొరకు, తరలి వస్తున్న సమూహాలకు వసతి కొరకు ఉపయోగించడానికి పెద్ద పెద్ద తెల్లని గుడారాలు అద్దెకు తీసుకోవడం జరిగింది. ప్రకాశవంతమైన వెన్నెలలో ఆ గుడారాలు నాజీ బాంబర్ల దాడికి గురిగా ఉండగలవని నిర్దారించబడినప్పుడు, గబగబా వాటి రంగు మార్చేయడం జరిగింది. యుద్ధం, ప్రాముఖ్యంగా సాక్షులు దానిలో పాల్గొనకపోవడం ప్రజలకు ఆసక్తికరమైన విషయమైంది. ఆ సమయంలో వందలాదిమంది సాక్షులు తమ బైబిలు ఆధారిత తటస్థ స్థానాన్నిబట్టి జైల్లో ఉన్నారు.—యెషయా 2:4; యోహాను 17:16.
సండే పిక్టోరియల్ 1941, సెప్టెంబరు 7 సంచిక ఇలా నివేదించింది: “10,000 మంది ప్రజలు, వారిలో అనేకులు యౌవనస్థులు, వారంతా ఎప్పుడో పరోక్షంగా తప్ప యుద్ధం గురించి అసలు ప్రస్తావించకుండా మతం గురించి మాట్లాడుతూ ఒక వారం రోజులు గడిపారని తెలుసుకోవడం అమితాశ్చర్యకరంగా ఉంది.
“జర్మనీలో ఎవరైనా సాక్షులున్నారా అని నేను అడిగాను. ఉన్నారు, దాదాపు వారిలో అందరూ, ఇంచుమించు 6,000 మంది నిర్బంధ శిబిరాల్లో ఉన్నారని నాకు చెప్పడం జరిగింది.”
ఆ విలేఖరి ఇంకా ఇలా చెప్పాడు: “ఆ, అవును, నాజీలు వారికి శత్రువులే, కాని సాక్షులు వారితో పోరాడడానికి, కరపత్రాల్ని అమ్మడం ప్రసంగాలు వినడం తప్ప ఇంకేమీ చేయడం లేదు.”
మా గురించిన వార్తాపత్రిక వ్యాఖ్యానాలు సాధారణంగా ప్రతికూలంగా ఉండేవి, మా సమావేశానికి అవాంతరం కలిగించడానికి వ్యతిరేకులు దౌర్జన్యం కూడా చేశారు, కాని ఎన్నడూ వారు విజయం సాధించలేదు. అయినప్పటికీ, కొంతమేరకు అయిష్టంగానే లండన్ యొక్క డెయిలీ మెయిల్ ఇలా అంగీకరించింది: “సంస్థ అణుకువగా, వినమ్రంగా, సమర్థవంతంగా ఉంది.”
నగరంలో ఏర్పడిన సిగరెట్ల కొరతకు మేము బాధ్యులమని నిందించడం జరిగింది. కాని ది డెయిలీ మెయిల్ ఇలా వివరించింది: “లీసెస్టర్ సిగరెట్లను సాక్షులు కాల్చేస్తున్నారని లీసెస్టర్‌గానీ లేక పొగాకు నియంత్రకుడుగానీ ఫిర్యాదు చేయలేరు. సాక్షులు పొగ త్రాగరు.” సాక్షుల మూలంగా స్థానిక నివాసులకు ఆహార కొరత ఏర్పడుతోందని వచ్చిన ఫిర్యాదులు, సాక్షులు వచ్చేటప్పుడు చాలామటుకు తమ స్వంత ఆహారాన్ని తెచ్చుకున్నారని వివరించినప్పుడు కొట్టివేయబడ్డాయి. వాస్తవానికి, సమావేశ ముగింపులో, ఒకొక్కటి 1.8 కిలోల బరువున్న 150 బ్రెడ్డులు లీసెస్టర్ రాయల్ ఇన్‌ఫార్మరీకి విరాళంగా ఇచ్చివేయడం జరిగింది—ఆహార కొరతవున్న ఆ సమయంలో అది చెప్పుకోదగినంత విరాళమే.
బ్రిటన్‌లోవున్న దాదాపు 11,000 మంది సాక్షులకు ఆ సమావేశం గొప్ప ఆధ్యాత్మిక ఉన్నతిని కల్గించింది. దాదాపు 12,000 హాజరు కావడాన్ని బట్టి వాళ్లు పులకించిపోయారు! ప్రతినిధులు లీసెస్టర్‌లో మునుపెన్నటికన్నా ఎక్కువగా వీధి సాక్ష్యపు పనిలో ఆనందంగా పాల్గొన్నారు, వాళ్లు దూరప్రాంతాల్లో ఉన్న గ్రామాలను దర్శించి, ఫోనోగ్రాఫ్‌ను ఉపయోగించి ప్రసంగాలు వినిపించారు.
ఆ సమావేశంలోని ముఖ్య ప్రసంగాలు, గతనెలలో అమెరికా నందలి మిస్సోరిలోగల సెయింట్ లూయిస్ నందు యెహోవాసాక్షుల ఐదురోజుల సమావేశంలో ఇవ్వబడినప్పుడు రికార్డు చేయబడిన ప్రసంగాలే. సహోదరుడు రూథర్‌ఫోర్డ్ ఇచ్చిన “రాజు యొక్క పిల్లలు” అనే ప్రసంగ రికార్డింగు సమావేశ ముఖ్యాంశం. సెయింట్ లూయీస్‌లో విడుదల చేయబడిన పిల్లలు (ఆంగ్లం) అనే పుస్తక ప్రతులను దిగుమతి చేసుకోవడం సాధ్యం కాలేదు గనుక బ్రిటన్‌లో ఆ తర్వాత ఒక ప్రత్యేకమైన కాగితంఅట్ట సంచిక ఉత్పత్తి చేయబడింది. సమావేశానికి హాజరైన పిల్లలందరికీ దాని ప్రతి ఒక్కొక్కటి పంపించబడింది.
లీసెస్టర్ యొక్క విశేషమైన వార్షిక కూటమి
యుద్ధం తర్వాత బ్రిటన్‌లో రాజ్యప్రచారకుల అభివృద్ధి అద్భుతంగా ఉంది! 1980ల తొలిభాగంలో, లీసెస్టర్‌లోని సంఘాల సంఖ్య పదికి పెరిగింది. వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి యొక్క వార్షిక కూటమిని 1983లో లీసెస్టర్‌లో నిర్వహించడానికి యెహోవాసాక్షుల పరిపాలక సభ నిర్ణయించినట్లు మాకు తెలియజేయబడింది. నేను త్వరలోనే లీసెస్టర్ నగర పైవిచారణకర్తగా సిద్ధపాట్లలో నిమగ్నమయ్యాను. డీ మాంట్‌ఫర్ట్ హాలును మళ్లీ అద్దెకు తీసుకోవడం కూడా ఆ సిద్ధపాట్లలో భాగమే.
ఆ సందర్భంలో పరిపాలక సభకు చెందిన పదమూడుమంది సభ్యులు సంస్థ యొక్క బ్రూక్లిన్ ప్రధాన కార్యాలయం నుండి వచ్చారు. ఈసారి ప్రపంచమంతటి నుండి వచ్చిన, ప్రాముఖ్యంగా వృద్ధ సాక్షులతో సహా మొత్తం 3,671 మంది ప్రతినిధులతో హాలు నిండిపోయింది. సమీపంలోని సమావేశ హాలు నుండి అదనంగా 1,500 మంది కార్యక్రమాన్ని విన్నారు.
యుద్ధకాలంలోని లీసెస్టర్ సమావేశ సమయంలో వాచ్ టవర్ సంస్థ యొక్క లండన్ బ్రాంచి కార్యాలయాన్ని పర్యవేక్షిస్తున్న ఆల్బర్ట్ డి. ష్రోడర్ ఈ వార్షిక కూటానికి అధ్యక్షత వహించాడు. 1941లో జరిగిన సమావేశాన్ని పునరావలోకనం చేస్తూ, సహోదరుడు ష్రోడర్ ఇలా అడిగాడు: “నేడు మాతో ఉన్న ఎంతమంది అప్పుడు హాజరయ్యారు?” ప్రేక్షకులలోని సగంకంటే ఎక్కువమంది తమ చేతులు ఎత్తారు. “నమ్మకమైన యథార్థవంతులైన మీకు ఎంత చక్కని పునర్‌కలయిక!” అని ఆయన అన్నాడు. నిజంగా అదొక మరువలేని అనుభవం.
98 ఏళ్ల వయస్సులో, నేను ఇప్పటికీ మా సంఘంలో కార్యదర్శిగా సేవ చేస్తున్నాను, నేను ఇప్పటికీ బహిరంగ ప్రసంగాలిస్తున్నాను, అయితే నేను ఇప్పుడు కూర్చుని ప్రసంగాలిస్తాను. 1987లో మారీ మరణించిన తర్వాత నేను బెట్టీనా అనే విధవరాలిని వివాహం చేసుకున్నాను. ఆమె మారీకి నాకు ఎన్నో సంవత్సరాల నుండి తెలుసు. భౌతికంగానూ, ఆధ్యాత్మికంగానూ నా గురించి ఇంత శ్రద్ధ తీసుకోబడినందుకు నేను కృతజ్ఞత కలిగివున్నాను. మారీ అనారోగ్యం మూలంగా మరియు ఇప్పుడు నా స్వంత వృద్ధాప్యం మూలంగా నిర్భంధాలు ఏర్పడినప్పటికీ, పరిశుద్ధ సేవలో ఎంతో చేయడం ఎల్లప్పుడూ విలువైన ప్రతిఫలాలను తెస్తుందని నేను కనుగొన్నాను.—1 కొరింథీయులు 15:58.
[26వ పేజీలోని చిత్రం]
1920లలో పరిచర్యలో భాగం వహించేందుకు సిద్ధం
[26వ పేజీలోని చిత్రం]
లీసెస్టర్ సమావేశం నుండి దృశ్యాలు