నిజమైన సంతోషానికి—కీలకమేమిటి?
మానవులు సంతోషంగా ఉండాలని ఉద్దేశించబడింది. మనం ఏ కారణం వల్ల ఆ విషయంలో నిశ్చయత కలిగి ఉండగలం? సరే, మానవుని ఆరంభాన్ని గూర్చి పరిశీలించండి.
యెహోవా దేవుడు మొదటి మానవ జతను సంతోషాన్ని అనుభవించే సామర్థ్యంతో సృష్టించాడు. ఆదాము హవ్వలు పరదైసులో అంటే ఏదెను అని పిలువబడిన ఆనందదాయకమైన తోటలో ఉంచబడ్డారు. జీవితంలో అవసరమైన భౌతిక వస్తువులనన్నింటినీ సృష్టికర్త వారికి ఇచ్చాడు. ఆ తోటలో “చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షము” ఉంది. (ఆదికాండము 2:9) ఆదాము హవ్వలు ఆరోగ్యంగా, దృఢంగా, అందంగా ఉండేవారు—వారు పరిపూర్ణులుగా, నిజంగా సంతోషం గలవారిగా ఉండేవారు.
అయితే వారి సంతోషానికి కీలకమైనదేది? వారి పరదైసు గృహమా, లేక వారి శారీరక పరిపూర్ణతయై ఉండవచ్చా? దేవుడి నుండి వచ్చిన ఈ కానుకలు వారు జీవితంలో ఆనందించేందుకు తోడ్పడ్డాయి. కానీ వారి సంతోషం అలాంటి దృశ్య విషయాలపై ఆధారపడినది కాదు. ఏదెను తోట అందమైన ఒక పార్కు కన్నా మించినది. అది పవిత్ర స్థలం. దేవుడ్ని ఆరాధించే స్థలం. వారి శాశ్వత సంతోషానికి కీలకం సృష్టికర్తతో ప్రేమ పూర్వకమైన సంబంధాన్ని ఏర్పరచుకుని కాపాడుకునే వారి సామర్థ్యమే. సంతోషంగా ఉండేందుకు వారు మొదట ఆధ్యాత్మికతగలవారై ఉండాలి.—మత్తయి 5:3 పోల్చండి.
ఆధ్యాత్మికత సంతోషానికి దారితీస్తుంది
ఆదాముకు మొదట్లో యెహోవాతో ఆధ్యాత్మిక అనుబంధం ఉండేది. అది తండ్రికి కుమారునికి మధ్య ఉండేటువంటి ప్రేమపూర్వకమైన, సున్నితమైన అనుబంధం. (లూకా 3:38) ఏదెను తోటలో, ఆదాము హవ్వలు ఆరాధనను జరపాలన్న తమ కోరికను తీర్చుకునేందుకు అవసరమైన ఆదర్శవంతమైన పరిస్థితులు ఉండేవి. యెహోవాకు తాము ఇష్టపూర్వకంగాను, ప్రేమపూర్వకంగానూ విధేయత చూపడం ద్వారా దేవునికి జంతు సృష్టి ఇచ్చేదానికన్నా ఎక్కువ మహిమనూ ఘనతనూ వాళ్ళు ఇచ్చేవారు. వారు ఆయన అద్భుతమైన గుణాలను వివేకముతో స్తుతించగల్గేవారు, ఆయన సర్వాధికారానికి మద్దతునివ్వగల్గేవారు. అలాగే యెహోవా యొక్క ప్రేమపూర్వకమైన వాత్సల్యపూరితమైన సంరక్షణను పొందడంలో వారు కొనసాగగల్గేవారు.
సృష్టికర్తతో గల ఈ సన్నిహితత్వమూ, ఆయన చట్టాల ఎడల విధేయతా మన మొదటి తల్లిదండ్రులకు యథార్థమైన సంతోషాన్నిచ్చాయి. (లూకా 11:28) సంతోషానికి కీలకమేమిటో తెలుసుకునేందుకు ఆదాము హవ్వలు అనేక సంవత్సరాలు ప్రయత్నించి పరీక్షించాలని ఆశించబడలేదు. వారు సృష్టించబడిన సమయం నుండీ సంతోషంగానే ఉన్నారు. దేవునితో సమాధానంగా ఉండడమూ, ఆయన అధికారానికి లోబడడమూ వారిని సంతోషపరచాయి.
అయితే, వారు దేవునికి అవిధేయత చూపించిన క్షణం నుండే ఆ సంతోషం లేకుండా పోయింది. ఆదాము హవ్వలు తిరుగుబాటు చేయడం ద్వారా యెహోవాతో తమకు గల ఆధ్యాత్మిక అనుబంధాన్ని తెంచుకున్నారు. వారు ఇక ఎన్నటికీ దేవుని స్నేహితులు కారు. (ఆదికాండము 3:17-19) వారు తోట నుండి బహిష్కరించబడిన రోజు నుండే యెహోవా వారితో సమాచార వినిమయం జరపడాన్ని పూర్తిగా ఆపేశాడు. వారు తమ పరిపూర్ణతనూ, నిరంతరం జీవించే ఉత్తరాపేక్షనూ, తమ గృహమైన తోటనూ కోల్పోయారు. (ఆదికాండము 3:23) అయితే మరి ముఖ్యంగా, వారు దేవునితో తమకు గల అనుబంధాన్ని కోల్పోయారు. వారు సంతోషానికి గల కీలకాన్ని కోల్పోయారు.
ఎన్నుకునే మన సామర్థ్యం
ఆదాము హవ్వలు చనిపోకముందు, తమ మానవ లక్షణాలనూ తమ ఆంతరంగిక మనస్సాక్షినీ, ఆధ్యాత్మికతను కలిగి ఉండగల తమ సామర్థ్యాన్నీ తమ సంతతికి అందజేశారు. మానవ కుటుంబం జంతువుల స్థాయికి దిగజారలేదు. మనం సృష్టికర్తతో సమాధానపడగలం. (2 కొరింథీయులు 5:18) తెలివిగల ప్రాణులుగా, దేవుడికి విధేయత చూపాలా వద్దా అని నిర్ణయించుకునే శక్తి మానవులకు ఇప్పటికీ ఉంది. అనేక శతాబ్దాల తర్వాత క్రొత్తగా రూపొందిన ఇశ్రాయేలు జనాంగం ముందు జీవాన్నో మరణాన్నో ఎంచుకునే నిర్ణయాన్ని యెహోవా ఉంచినప్పుడు ఇది ఉదాహరించబడింది. తన ప్రతినిధియైన మోషే ద్వారా దేవుడు ఇలా అన్నాడు: “నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ యెదుట ఉంచియున్నాను.”—ద్వితీయోపదేశకాండము 30:15-18.
మొదటి పరదైసును కోల్పోయి వేల సంవత్సరాలు గడిచాక కూడా, మానవులమైన మనం ఇప్పటికీ సరైన ఎంపికను చేసుకోగలవారమై ఉన్నాం. మనకు పనిచేస్తున్న మనస్సాక్షీ, దేవుని చట్టాలకు విధేయత చూపించగల ప్రాథమిక సామర్థ్యమూ ఉన్నాయి. “ఆంతర్య” పురుషుని గురించి, “అంతరంగ పురుషుని” గురించి బైబిలు మాట్లాడుతోంది. (2 కొరింథీయులు 4:16; రోమీయులు 7:22) ఈ వ్యక్తీకరణలు దేవుని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేందుకు, ఆయన తలంచే విధంగా తలంచేందుకూ, ఆధ్యాత్మికత గలవారిగా ఉండేందుకూ మనందరికీ గల జన్మసిద్ధమైన సామర్థ్యంతో సంబంధం కలిగి ఉన్నాయి.
మన నైతిక స్వభావాన్ని గురించీ, మనస్సాక్షిని గురించీ అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు.”—రోమీయులు 2:14, 15.
దైవిక జ్ఞానము మరియు విధేయత—కీలకము
అయితే, ‘దేవుడ్ని ఆరాధించే సహజ స్వభావం మనందరికీ ఉంటే, మనం యథార్థ సంతోషాన్ని అనుభవించే బదులు అంతటా అసంతోషం ఎందుకు అలుముకుని ఉంది?’ అని ఒకరు అడగవచ్చు. ఎందుకంటే, సంతోషంగా ఉండేందుకు మనలో ప్రతి ఒక్కరమూ తప్పనిసరిగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలి. మానవుడు మొదట్లో దేవుని ప్రతిరూపంలో సృష్టించబడినప్పటికీ, అతడు తన సృష్టికర్త నుండి దూరమయ్యాడు. (ఎఫెసీయులు 4:17, 18) కనుక, మనలో ప్రతి ఒక్కరమూ దేవునితో ఆధ్యాత్మిక అనుబంధాన్ని ఏర్పరచుకుని దానిని కాపాడుకునేందుకు కచ్చితమైన చర్యలను తప్పనిసరిగా గైకొనాలి. అలాంటి అనుబంధం దానంతటదే వృద్ధి కాదు.
ఆధ్యాత్మికత వృద్ధికావడంలోని రెండు ముఖ్యమైన సూత్రాలను యేసు సంక్షిప్తపరచాడు. ఒకటి, దేవుడ్ని గూర్చిన కచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడం. మరొకటి, ఆయన చిత్తానికి విధేయతాపూర్వకంగా లోబడడం. (యోహాను 17:3) దేవుని వాక్యాన్ని ఉదాహరిస్తూ యేసు ఇలా చెప్పాడు: “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నది.” (మత్తయి 4:4) మరో సందర్భంలో యేసు ఇలా పేర్కొన్నాడు: “నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది.” (యోహాను 4:34) సంతోషం కొరకు ప్రయత్నించి పరీక్షించి అన్వేషించేందుకు అనేక శతాబ్దాలు మనం వ్యయం చేయవలసిన అవసరం లేదు. సంతోషానికి కీలకం అనుభవం కాదు. కేవలం దైవిక జ్ఞానమూ, మన సృష్టికర్త ఎడల విధేయతా జీవితంలో నిజమైన ఆనందానికి నడిపించగలవు. —కీర్తన 19:7, 8; ప్రసంగి 12:13.
స్పష్టంగా, దైవిక జ్ఞానాన్ని అభ్యసించడం ద్వారా, దేవుని ఎదుట మంచి స్థానాన్ని కలిగి ఉండడం ద్వారా వచ్చే సంతోషం అందుకోలేనిదేమీ కాదు. (అపొస్తలుల కార్యములు 17:26, 27) యెహోవాను గురించిన ఆయన సంకల్పాన్ని గురించిన జ్ఞానం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంది. బైబిలు ప్రతులు అనేక భాషల్లో కోట్ల లెక్కన పంచిపెట్టబడుతూ ప్రపంచంలో అత్యధికంగా విస్తృతంగా పంచిపెట్టబడుతున్న పుస్తకంగా బైబిలు కొనసాగుతుంది. మీరు దేవుని స్నేహితుడు(రాలు) అయ్యేందుకూ యథార్థమైన సంతోషాన్ని కాపాడుకునేందుకూ బైబిలు మీకు సహాయపడగలదు. ఎలాగంటే, “యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు” అని లేఖనాలు మనకు చెబుతున్నాయి.—కీర్తన 144:15.
[6వ పేజీలోని బాక్సు]
సంతోషం కొరకైన చర్యలు
1. ఆధ్యాత్మికత అంటే ఏమిటో గుణగ్రహించి, దానిని పెంపొందించుకోండి. “దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని” యేసు చెప్పాడు.—లూకా 11:28.
2. సంపదకన్నా లేదా విలాసాల కన్నా దేవుని అంగీకారమే ఎక్కువ ప్రాముఖ్యమైనదని గ్రహించండి. “సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది. . . . అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము” అని పౌలు వ్రాశాడు.—1 తిమోతి 6:6-8.
3. బైబిలు తర్ఫీదుగల మనస్సాక్షిని పెంపొందించుకునేందుకూ, దానికి ప్రతిస్పందించేందుకూ కృషి చేయండి.—రోమీయులు 2:14, 15.
4. యెహోవా దేవునికి విధేయత చూపాలనీ, అలా ఆయన ప్రజలలో ఒకరిగా యోగ్యత పొందాలనీ నిర్ణయించుకోండి. “యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు” అని ప్రాచీన కాలపు దావీదు వ్రాశాడు.—కీర్తన 144:15.
[7వ పేజీలోని చిత్రం]
“ఆత్మ [“ఆధ్యాత్మిక,” NW] విషయమై దీనులైనవారు ధన్యులు.”—మత్తయి 5:3