సంతోషం—అంత పొందలేనిదా
కోపం, ఉత్కంఠ, క్రుంగుదల అనేవి ఎంతో కాలంగా విజ్ఞానశాస్త్ర అన్వేషణా అంశాలుగా ఉన్నాయి. అయితే, ఇటీవలి సంవత్సరాల్లో, పేరుగాంచిన శాస్త్రజ్ఞులు సకారాత్మకమైన, కోరదగిన మానవ అనుభవమైన సంతోషాన్ని గూర్చి పరిశోధన జరపడంలో తమ అవధానాన్ని కేంద్రీకరిస్తున్నారు.
ప్రజలను ఏది సంతోషింపజేస్తుండవచ్చు? వారు మరికాస్త యౌవనస్థులుగా, మరికాస్త ధనవంతులుగా, మరింత ఆరోగ్యవంతులుగా, మరికాస్త పొడగరులుగా, లేదా మరి కాస్త సన్నగా ఉండడమా? యథార్థ సంతోషానికి కీలకమేమిటి? ఆ ప్రశ్నకు జవాబివ్వడం అసాధ్యం కాక పోయినా, కష్టమేననీ కొందరు కనుగొంటారు. సంతోషాన్ని కనుగొనడంలో విస్తృతంగా కనిపించే ఓటమిని గూర్చి ఆలోచిస్తే, సంతోషానికి ఏది కీలకం కాదు అనే ప్రశ్నకు బదులివ్వడమే బహుశా మరింత సులభమని కొందరు కనుగొంటారు.
సంతోషానికి కీలకంగా, స్వంత విషయాల్లో శ్రద్ధ కేంద్రీకరించే మనశ్శాస్త్రాన్నే చాలా కాలంగా ప్రముఖ మనశ్శాస్త్రవేత్తలు సిఫారసు చేశారు. తమ వ్యక్తిగత అవసరాలను తీర్చుకోవడంపై మాత్రమే శ్రద్ధ నిలపాలని సంతోషం లేనివారిని వారు ప్రోత్సహించారు. “మీరెవరో అలాగే ఉండండి,” “మిమ్మల్ని గూర్చి మీరు ఎరిగి ఉండండి,” “మీరెవరో తెలుసుకోండి” అనే శ్రద్ధనాకట్టుకునే పదబంధాలు మనశ్శాస్త్ర చికిత్సలో ఉపయోగించబడుతున్నాయి. అయితే, ఈ తలంపును ప్రోత్సహించిన నిపుణుల్లోని కొందరు అలాంటి స్వార్థపూరితమైన దృక్పథం శాశ్వతంగా నిలిచే సంతోషాన్నివ్వదని ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. అహం తప్పనిసరిగా వేదననూ అసంతోషాన్నీ తెస్తుంది. సంతోషానికి కీలకం స్వార్థం కాదు.
అసంతోషానికి మూలకారణం
సుఖానుభూతిని అనుభవించడంలో సంతోషాన్ని పొందడానికి చూసేవారు సంతోషాన్ని కాని చోటే వెదుకుతున్నారు. ప్రాచీన ఇశ్రాయేలు యొక్క జ్ఞానియైన సొలొమోను రాజు ఉదాహరణనే తీసుకోండి. బైబిలు పుస్తకమైన ప్రసంగిలో ఆయన ఇలా వివరిస్తున్నాడు: “నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండ నేను అభ్యంతరము చేయలేదు; మరియు నా హృదయము నా పనులన్నిటినిబట్టి సంతోషింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండ నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము.” (ప్రసంగి 2:10) సొలొమోను తన కొరకు భవనాలను నిర్మించాడు, ద్రాక్షతోటలను నాటాడు, తన కొరకై తోటలను, పార్కులను, నీటి కొలనులను తయారు చేశాడు. (ప్రసంగి 2:4-6) ఒకసారి ఆయనిలా ప్రశ్నించాడు: “నా కన్నా శ్రేష్ఠమైనవి భుజించేవాడూ త్రాగేవాడూ ఎవడు?” (ప్రసంగి 2:25, NW) అత్యుత్తమ గాయకులూ, సంగీతజ్ఞులూ ఆయనకు వినోదాన్నిచ్చారు. తన రాజ్యములోని అత్యంత అందమైన స్త్రీల సహవాసంలో ఆయన ఆనందించాడు.—ప్రసంగి 2:8.
ముఖ్య విషయమేమిటంటే, సుఖానుభూతులనిచ్చే విషయాలకొచ్చినప్పుడు సొలొమోను వెనుకంజవేయలేదు. జీవితంలో కావలసినంతగా సుఖానుభూతులను అనుభవించిన తర్వాత ఆయన ఏ నిర్ధారణకు వచ్చాడు? ఆయనిలా అన్నాడు: “నేను చేసిన పనులన్నియు, వాటికొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నియు వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను, సూర్యుని క్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడెను.”—ప్రసంగి 2:11.
జ్ఞానియైన సొలొమోను కనుగొన్న ఈ విషయాలు నేటికీ వాస్తవంగానే ఉన్నాయి. అమెరికా వంటి ఒక సంపన్న దేశాన్ని ఉదాహరణగా తీసుకోండి. గత 30 సంవత్సరాల్లో, అమెరికా దేశస్థులు వాహనాలు, దూరదర్శినులు వంటి వస్తు సంపదలను దాదాపు రెట్టింపు చేసుకున్నారు. అయినప్పటికీ, మానసిక ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, అమెరికా దేశస్థులకు ఏ మాత్రం సంతోషం లేదు. ఒక పత్రిక ప్రకారం, “ఆ కాలవ్యవధిలోనే క్రుంగుదల రేటు ఆకాశాన్నంటింది. కౌమార ప్రాయంలోనివారి ఆత్మహత్యల రేటు మూడంతలయ్యింది. విడాకుల రేటు రెండింతలయ్యింది.” డబ్బుకు సంతోషానికి మధ్య గల సంబంధాన్ని గూర్చి దాదాపు 50 విభిన్న దేశాల్లోని జనాభాల్లో అధ్యయనం చేసిన తర్వాత ఇటీవల పరిశోధకులు ఇలాంటి నిర్ధారణలకే వచ్చారు. సరళంగా చెప్పాలంటే, మీరు సంతోషాన్ని కొనుక్కోలేరు.
దానికి భిన్నంగా, ధనార్జన కొరకైన అన్వేషణ అసంతోషానికి మూలకారణం అని సముచితంగానే చెప్పవచ్చు. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా హెచ్చరించాడు: “ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.”—1 తిమోతి 6:9, 10.
ధనంగానీ, ఆరోగ్యంగానీ, యౌవనంగానీ, సౌందర్యంగానీ, అధికారంగానీ, వీటిలోనీ ఏ రెండూ కూడా ఉండడం గానీ శాశ్వతమైన సంతోషానికి హామీ ఇవ్వలేవు. ఎందుకు హామీ ఇవ్వలేవు? చెడు విషయాలు జరగకుండా నివారించే శక్తి మనకు లేనందువల్లే. రాజైన సొలొమోను ఈ విధంగా సరిగ్గానే వ్రాశాడు: “తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు; చేపలు బాధాకరమైన వలయందు చిక్కుబడునట్లు, పిట్టలు వలలో పట్టబడునట్లు, అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుదురు.”—ప్రసంగి 9:12.
చేరుకోలేని లక్ష్యం
సంతోషం కొరకైన మానవ నిర్మిత ఫార్ములాను గానీ తంత్రాన్నిగానీ విజ్ఞానశాస్త్ర పరిశోధనలేవీ కూడా ఆవిష్కరించలేవు. సొలొమోను కూడా ఇలా అన్నాడు: “నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలువరు; బలముగలవారు యుద్ధమునందు విజయ మొందరు; జ్ఞానముగలవారికి అన్నము దొరకదు; బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు; తెలివిగలవారికి అనుగ్రహము దొరకదు; ఇవియన్నియు అదృష్టవశముచేతనే కాలవశముచేతనే అందరికి కలుగుచున్నవి.”—ప్రసంగి 9:11.
పై మాటలతో ఏకీభవించే అనేకులు నిజమైన సంతోషభరితమైన జీవితాన్ని ఆశించడం అవాస్తవికమై ఉంటుందనే నిర్ధారణకు వచ్చారు. ఒక ప్రముఖ విద్యావేత్త ఈ విధంగా పేర్కొన్నాడు: “సంతోషమనేది ఊహాత్మక పరిస్థితి.” సంతోషానికి గల కీలకం అద్భుతమైన రహస్యమనీ, ఆ రహస్యాన్ని బయల్పరచే శక్తి బుద్ధిపరమైన వరమూ ఆధ్యాత్మికశక్తులూ గల కొందరికి మాత్రమే పరిమితమై ఉండవచ్చనీ ఇతరులు నమ్ముతారు.
అయినప్పటికీ, సంతోషము కొరకైన తమ అన్వేషణలో, ప్రజలు అనేక రకాలైన జీవన విధానాలను అవలంభించి పరిశీలించడంలో కొనసాగుతారు. తమ పూర్వీకులు పరాజయం పొందినప్పటికీ, నేడు తమ అసంతోషాన్ని తొలగించుకునేందుకు అనేకులు ఇప్పటికీ ధనాన్ని, అధికారాన్నీ, ఆరోగ్యాన్ని, లేదా సుఖానుభూతులనూ అన్వేషిస్తున్నారు. శాశ్వతమైన సంతోషం కేవలం ఊహాత్మక పరిస్థితికాదని చాలామంది తమ అంతరంగంలో నమ్ముతున్నారు గనుక అన్వేషణ కొనసాగుతూనే ఉంది. సంతోషమనేది చేరుకోలేని స్వప్నంగా ఉండదని అనేక మంది ప్రజలు ఆశిస్తున్నారు. ‘నేను దానినెలా కనుగొనవచ్చు?’ అని మీరు ప్రశ్నించవచ్చు.