కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 10/1 పేజీలు 10-15
  • దేవుని వాక్యం నిరంతరం నిలుస్తుంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని వాక్యం నిరంతరం నిలుస్తుంది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దాన్ని అణిచివేసే ప్రయత్నాల్ని ఎదుర్కొన్నప్పుడు
  • భ్రష్టుపర్చబడకుండా దేవుని వాక్యాన్ని భద్రపర్చడం
  • సందేశం భూగోళమంతటా చేరుతోంది
  • యెహోవా సంభాషించే దేవుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • ఇన్ని రకాల బైబిళ్లు ఎందుకు ఉన్నాయి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2017
  • బైబిలు మన వరకు ఎలా వచ్చింది?
    తేజరిల్లు!: బైబిలు మన వరకు ఎలా వచ్చింది?
  • దేవుని ప్రేరేపిత వాక్యాన్ని యథార్థంగా హత్తుకొనడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 10/1 పేజీలు 10-15

దేవుని వాక్యం నిరంతరం నిలుస్తుంది

“మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.”—యెషయా 40:8.

1. (ఎ) “మన దేవుని వాక్యము” అనడంలో ఇక్కడ దాని భావం ఏమిటి? (బి) మానవుల వాగ్దానాలు దేవుని వాక్యంతో ఎలా పోల్చబడ్డాయి?

ప్రముఖ స్త్రీపురుషులు చేసిన వాగ్దానాలయందు మానవులు తమ నమ్మకాన్ని ఉంచడానికి మొగ్గుచూపుతారు. అయితే తమ జీవనగతిని మెరుగుపర్చుకోడానికి ఎదురుచూసే ప్రజలకు ఈ వాగ్దానాలెంత కోరదగినవిగా కన్పించినా, అవి దేవుని వాక్యంతో పోల్చినప్పుడు వాడిపోతున్న పుష్పాల్లా ఉన్నాయి. (కీర్తన 146:3, 4) 2,700 సంవత్సరాలకన్నా ఎక్కువ కాలం క్రిందట, “సర్వశరీరులు గడ్డియైయున్నారు వారి అందమంతయు అడవిపువ్వువలె ఉన్నది గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును” అని రాయడానికి ప్రవక్తయైన యెషయాను యెహోవా దేవుడు ప్రేరేపించాడు. (యెషయా 40:6, 8) నిలిచివుండే ఆ “వాక్యము” ఏది? అది దేవుని వాగ్దానాన్ని గూర్చిన ఆయన వాఙ్మూలమే. నేడు మనమా ‘వాక్యాన్ని’ బైబిల్లో లిఖితరూపమందు కల్గివున్నాం.—1 పేతురు 1:24, 25.

2. ప్రాచీన ఇశ్రాయేలు, యూదాలను గూర్చిన తన వాక్యాన్ని ఏ దృక్పథాలూ చర్యలూ ఉన్నా యెహోవా నెరవేర్చాడు?

2 ప్రాచీన ఇశ్రాయేలు కాలంలో జీవించిన ప్రజలు, యెషయా నమోదుచేసిన మాటల సత్యసంధతను చవిచూశారు. తన ఎడల ఘోరమైన అవిశ్వాస్యతను చూపించినందున, మొదట ఇశ్రాయేలు పదిగోత్రాల రాజ్యమూ అటు తర్వాత యూదా రెండు గోత్రాల రాజ్యమూ చెరపట్టబడతాయని తన ప్రవక్తల ద్వారా యెహోవా ప్రవచించాడు. (యిర్మీయా 20:4; ఆమోసు 5:2, 27) వాళ్లు యెహోవా ప్రవక్తల్ని హింసించి చంపినప్పటికీ, దేవుని హెచ్చరికా సందేశాన్ని కల్గివున్న ఓ గ్రంథపుచుట్టను కాల్చి, దాని నెరవేర్పు జరగకుండా అరికట్టేందుకు సైనిక సహాయార్థమై ఐగుప్తును అభ్యర్థించినప్పటికీ, యెహోవా వాక్యం విఫలంకాలేదు. (యిర్మీయా 36:1, 2, 21-24; 37:5-10; లూకా 13:34) అంతేగాకుండా, పశ్చాత్తాపపడిన యూదుల శేషాన్ని వారి స్వదేశంలో పునరుద్ధరిస్తాననే దేవుని వాగ్దానం, విశిష్టమైన నెరవేర్పును కల్గివుంది.—యెషయా, 35వ అధ్యాయం.

3. (ఎ) యెషయా రాసిన ఏ వాగ్దానాలు మనకు ప్రత్యేక ఆసక్తిని కల్గించేవిగా ఉన్నాయి? (బి) ఇవి నిజంగా నెరవేరతాయని మీరెందుకు ఒప్పించబడ్డారు?

3 మెస్సియా ద్వారా మానవజాతిపై పరిపాలించబోయే నీతియుక్త పరిపాలనాధిపత్యాన్ని గురించీ, పాప మరణాలనుండి విడుదలను గురించీ, భూమిని పరదైసుగా మార్చడాన్ని గురించీ యెహోవా యెషయా ద్వారా ప్రవచించాడు. (యెషయా 9:6, 7; 11:1-9; 25:6-8; 35:5-7; 65:17-25) ఇవి కూడా నెరవేరతాయా? నిస్సందేహంగా! ‘దేవుడు అబద్ధమాడనేరడు.’ మన ప్రయోజనం నిమిత్తం రాయబడిన తన ప్రవచన వాక్యాన్ని ఆయన కల్గివున్నాడు, మరి అది నిశ్చయంగా భద్రపర్చబడి ఉండేలా ఆయన చేశాడు.—తీతు 1:1; రోమీయులు 15:4.

4. బైబిలు ఆదిమ చేతిరాతప్రతులు భద్రపర్చబడనప్పటికీ, దేవుని వాక్యం ‘సజీవముగా’ ఉందనే విషయం ఏ విధంగా వాస్తవమైవుంది?

4 ఆ ప్రవచనాల్ని తన ప్రాచీన లేఖికులు ఏ ఆదిమ చేతిరాతప్రతుల్లో రాశారో ఆ ఆదిమ చేతిరాతప్రతుల్ని యెహోవా భద్రపర్చలేదు. కానీ ఆయన ప్రకటిత సంకల్పమైన ఆయన ‘వాక్యం’ సజీవమైన వాక్యమని రుజువైంది. ఆ సంకల్పం నిరాటంకంగా ముందుకు వెళ్తుంది. అదలా ముందుకు సాగుతుండగా, ఎవరి జీవితాలు దానిచే ప్రభావితం చేయబడ్డాయో ఆ ప్రజల అంతర్గత ఆలోచనా దృక్పధాలు ప్రత్యక్షపర్చబడతాయి. (హెబ్రీయులు 4:12) అంతేగాకుండా, ప్రేరేపిత లేఖనాల్ని భద్రపర్చి, అనువదించడమనేది దైవిక నడిపింపు ద్వారానే జరిగిందని రాతచరిత్ర చెబుతోంది.

దాన్ని అణిచివేసే ప్రయత్నాల్ని ఎదుర్కొన్నప్పుడు

5. (ఎ) ప్రేరేపిత హెబ్రీ లేఖనాల్ని నాశనం చేసేందుకు సిరియారాజు ఏ ప్రయత్నం చేశాడు? (బి) అతడు ఎందుకు విఫలుడయ్యాడు?

5 అనేక సందర్భాల్లో, ప్రేరేపిత రచనల్ని నాశనం చేసేందుకు పాలకులు ప్రయత్నించారు. సా.శ.పూ. 168లో, యెహోవాకు సమర్పించిన దేవాలయంలో సిరియా రాజైన అంతియొకసు ఎపిఫనెసు (10వ పేజీలో చిత్రీకరించబడింది) జియస్‌ దేవతకు ఓ బలిపీఠాన్ని నిర్మించాడు. ‘ధర్మశాస్త్ర గ్రంథాల్ని’ పట్టుకొని వాటిని కాల్చి, అలాంటి లేఖనాల్ని కల్గివున్న వాడెవడైనా చంపబడతాడని కూడా ప్రకటించాడు. యెరూషలేము యూదాల్లో అతడెన్ని ప్రతుల్ని కాల్చివేసినా, అతడు లేఖనాల్ని పూర్తిగా రూపుమాపలేక పోయాడు. యూదా గుంపులు ఆ కాలంలో అనేక ప్రాంతాలకు చెదిరిపోయారు, మరియు సమాజమందిరాలన్నీ గ్రంథపుచుట్టల సంచయాలను కల్గివుండేవి.—అపొస్తలుల కార్యములు 13:14, 15, పోల్చండి.

6. (ఎ) తొలి క్రైస్తవులు ఉపయోగించిన లేఖనాల్ని నాశనం చేసేందుకు ఏ తీవ్రమైన ప్రయత్నం జరిగింది? (బి) దాని ఫలితమేమిటి?

6 అదే విధంగా, సా.శ. 303లో, క్రైస్తవ కూటాలు జరిగే స్థలాలను కూలద్రోసి, వారి ‘లేఖనాలు అగ్నిలో కాల్చివేయాలి’ అని రోమా చక్రవర్తియైన డయక్లీషన్‌ ప్రకటించాడు. అలాంటి నాశనం ఓ దశాబ్దం వరకూ కొనసాగింది. ఆ హింస భయంకరమైనదైనా, క్రైస్తవత్వాన్ని తుడిచిపెట్టడంలో డయక్లీషన్‌ సఫలుడుకాలేదు. తన ప్రేరేపిత వాక్యంలోని ఏ భాగాన్నీ పూర్తిగా నాశనం చేయడానికి చక్రవర్తి ప్రతినిధుల్ని దేవుడు అనుమతించలేదు. కానీ దేవుని వాక్య పంపిణీకీ, ప్రకటనకూ వ్యతిరేకంగా తాము ప్రతిస్పందించడం ద్వారా, వ్యతిరేకులు తమ హృదయంలో ఉన్నదేంటో బయల్పర్చారు. సాతానుచే గ్రుడ్డితనం కలుగజేయబడిన వ్యక్తులుగానూ, వాడి చిత్తాన్ని నెరవేరుస్తున్న వారిగానూ వాళ్లు తమను గుర్తింపచేసుకున్నారు.—యోహాను 8:44; 1 యోహాను 3:10-12.

7. (ఎ) పశ్చిమ యూరప్‌లో బైబిలు జ్ఞానవ్యాప్తిని నిరోధించేందుకు ఏ ప్రయత్నాలు జరిగాయి? (బి) బైబిల్ని అనువదించి, ప్రచురించడంలో ఏమి సాధించబడింది?

7 బైబిలు జ్ఞానాన్ని వ్యాప్తిచెందనీయకుండా నిరోధించే ప్రయత్నాలు ఇతర రూపాలను కూడా దాల్చాయి. అనుదిన వాడుక భాషగా లాటిన్‌ గతించిపోయినప్పుడు, సామాన్య ప్రజలు మాట్లాడే భాషల్లో బైబిలు అనువదించబడడాన్ని అన్య పాలకులు కాదుగానీ క్రైస్తవులమని చెప్పుకున్న—పోప్‌ గ్రిగరీ VII (1073-85), పోప్‌ ఇన్నోసెన్ట్‌ III (1198-1216)—అనే వాళ్లే తీవ్రంగా వ్యతిరేకించారు. చర్చి అధికారాన్ని వ్యతిరేకించే అభిమతాన్ని అణగద్రొక్కే ప్రయత్నంలో, సామాన్య ప్రజలు మాట్లాడే భాషలో బైబిలు పుస్తకాల్ని పామరుడు కల్గివుండకూడదని 1229వ సంవత్సరంలో ఫ్రాన్స్‌నందు రోమన్‌ కాథోలిక్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ టౌలస్‌ ఆజ్ఞ జారీచేసింది. ఆ ప్రకటనను నిర్బంధంగా అమలుచేయడానికి క్రూరమత విచారణ సభను శక్తిమంతంగా ఉపయోగించింది. అయినప్పటికీ, క్రూరమత విచారణ జరిగిన 400 సంవత్సరాల తర్వాత, దేవునివాక్య ప్రేమికులు బైబిల్ని పూర్తిగా అనువదించి, దాని ముద్రిత ప్రతుల్ని దాదాపు 20 భాషల్లోనూ అలాగే అదనపు భాషామాండలికాల్లోనూ పంచిపెట్టడంతోపాటూ దాని ప్రధాన భాగాల్ని మరో 16 భాషల్లోనికి అనువదించి, పంచిపెట్టారు.

8. పందొమ్మిదవ శతాబ్దకాలంలో, రష్యాలో బైబిలు అనువాద పంపిణీ రంగంలో ఏమి జరిగింది?

8 సామాన్య ప్రజలనుండి బైబిల్ని దూరంగా ఉంచడానికి ప్రయత్నించింది రోమన్‌ కాథోలిక్‌ చర్చి మాత్రమే కాదు. 19వ శతాబ్దపు తొలి భాగంలో, సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ అకాడమీ ఆఫ్‌ డివినిటీలో ప్రొఫెసరైన పావ్‌స్కీ మత్తయి సువార్తను అనువదించాడు. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లోని ఇతర పుస్తకాలు కూడా రష్యన్‌ భాషలోనికి అనువదించబడ్డాయి, పావ్‌స్కీ వాటికి సంపాదకునిగా పనిచేశాడు. చర్చిసంబంధమైన గూఢాలోచన ద్వారా 1826లో రష్యన్‌ ఆర్థడాక్స్‌ చర్చికి చెందిన “పరిశుద్ధ మతసభ” నిర్వాహకవర్గ ఆధ్వర్యంలోకి రష్యన్‌ బైబిల్‌ సొసైటీ వచ్చేలా జార్‌ చక్రవర్తి చేసేంతవరకూ, ఇవి విస్తృతంగా పంచిపెట్టబడ్డాయి, అటు తర్వాత ఆ సొసైటీ కార్యకలాపాలు పూర్తిగా అణగద్రొక్కబడ్డాయి. ఆ తర్వాత, పావ్‌స్కీ హెబ్రీ లేఖనాల్ని హెబ్రీనుండి రష్యన్‌ భాషలోనికి అనువదించాడు. ఇంచుమించు అదే సమయంలో, ఆర్థడాక్స్‌ చర్చికి చెందిన ఓ ఆర్చిమన్‌డ్రైట్‌యైన (బిషప్పుకన్నా తక్కువ స్థాయిగల మతాధికారి) మకారియోస్‌ కూడా హెబ్రీ లేఖనాల్ని హెబ్రీనుండి రష్యన్‌ భాషలోనికి అనువదించాడు. తమ ప్రయత్నాల్నిబట్టి వారిరువురూ శిక్షించబడ్డారు, వారి అనువాదాలు చర్చి ప్రాచీన గ్రంథాలయాల్లో ఉంచబడ్డాయి. ఆ కాలంలో సామాన్య ప్రజలు చదవని లేక అర్థంచేసుకోలేని భాషయైన ప్రాచీన స్లావొనిక్‌ భాషకే బైబిల్ని పరిమితం చేయడానికి చర్చి నిశ్చయించుకొంది. బైబిలు జ్ఞానాన్ని ఆర్జించాలనే ప్రజల ప్రయత్నాల్ని “పరిశుద్ధ మతసభ” ఇంకెంత మాత్రం అణచివేయలేని తరుణంలో 1856లో, తన స్వంత అనువాదాన్ని చేపట్టి దానిలో ఉపయోగించిన పదబంధాలు చర్చి దృక్పథాల్ని బలపరుస్తున్నాయని నిశ్చయపర్చుకునేందుకు ఎంతో నైపుణ్యవంతంగా కూర్చిన నిర్దేశకసూత్రాలతో దాన్ని అనువదించింది. ఆ విధంగా, దేవుని వాక్య వ్యాప్తికి సంబంధించి, మత నాయకుల మాటలచే క్రియలచే బయల్పర్చబడినట్లుగా వారి బాహ్య స్వరూపానికీ, అసలు ఉద్దేశానికీ మధ్య ఉన్న తేడా స్పష్టం చేయబడింది.—2 థెస్సలొనీకయులు 2:3, 4.

భ్రష్టుపర్చబడకుండా దేవుని వాక్యాన్ని భద్రపర్చడం

9. కొంతమంది బైబిలు అనువాదకులు దేవుని వాక్యం ఎడలగల తమ ప్రేమను ఎలా చూపించారు?

9 లేఖనాల్ని అనువదించి, నకళ్లురాసిన వారిలో దేవుని వాక్యాన్ని నిజంగా ప్రేమించి, ప్రతి ఒక్కరికీ దాన్ని అందుబాటులో ఉంచేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేసిన పురుషులు ఉన్నారు. ఆంగ్లభాషలో బైబిలు లభ్యమయ్యేలా చేయడానికి తాను చేసిన దానినిబట్టి విలియమ్‌ టిన్‌డేల్‌ (1536లో) చంపబడ్డాడు. క్రైస్తవ గ్రీకు లేఖనాల్ని స్పానిష్‌ భాషలోనికి అనువదించి, ప్రచురించినందుకు ఫ్రాన్‌థిస్కో డి ఎన్‌థెనస్‌ను కాథోలిక్కు క్రూర మతవిచారణ సభ (1544 తర్వాత) చెఱసాలలో వేసింది. రాబర్ట్‌ మోరిసన్‌ తన ప్రాణాన్ని పణంగాపెట్టి, బైబిల్ని చైనా భాషలోనికి (1807 నుండి 1818 వరకూ) అనువదించాడు.

10. దేవుని వాక్యం ఎడలగల ప్రేమకన్నా ఇతరత్రా ప్రభావాలచే ప్రేరేపించబడ్డ అనువాదకులు ఉన్నారని ఏ ఉదాహరణలు చూపించాయి?

10 అయితే, నకళ్లురాసేవారి పనినీ అనువాదకుల పనినీ దేవుని వాక్యం ఎడలగల ఉన్నతమైన గౌరవంకన్నా ఇతర విషయాలే కొన్నిసార్లు ప్రభావితం చేశాయి. నాల్గు ఉదాహరణల్ని పరిశీలించండి: (1) యెరూషలోములో ఉన్న దేవాలయానికి పోటీగా సమరయులు గెరిజీము పర్వతంపై ఓ దేవాలయాన్ని నిర్మించారు. ఆ చర్యకు మద్దతుగా, సమరయ్యుల పంచగ్రంథంలో నిర్గమకాండము 20:17 వచనమందు ఓ ప్రక్షిప్తాంశం చేర్చబడింది. పది ఆజ్ఞల్లో భాగమైనట్లుగా, గెరిజీము పర్వతంపై రాతిబలిపీఠాన్ని నిర్మించి, అక్కడ బలుల్ని అర్పించమనే ఆజ్ఞ చేర్చబడింది. (2) గ్రీకు సెప్టాజింట్‌ కొరకు దానియేలు గ్రంథాన్ని మొట్టమొదట అనువదించిన వ్యక్తి తన అనువాదంలో నియమోల్లంఘనం చేశాడు. హెబ్రీ మూలపాఠంలో ఉన్నదాన్ని వివరిస్తుందనీ లేక మెరుగుపరుస్తుందనీ అతడు తలంచిన వ్యాఖ్యానాల్ని చేర్చాడు. పాఠకులు అంగీకరించరని తాను తలంచిన వివరాల్ని ఆయన విడిచిపెట్టాడు. దానియేలు 9:24-27 వచనాల్లో ఉన్న మెస్సియా కనిపించే కాలానికి సంబంధించిన ప్రవచనాన్ని అతడు అనువదించినప్పుడు, మక్కాబీయుల పోరాటానికి మద్దతునిస్తున్నట్టు ఆ ప్రవచనం కన్పించేలా చేసే ఉద్దేశంతో అతడు, చెప్పబడిన కాలగడువును వక్రీకరించాడు, పదాల్ని చేర్చాడు, మార్చాడు, స్థానభ్రంశం చేశాడు. (3) సా.శ. నాల్గవ శతాబ్దంలో, త్రిత్వవాదాన్ని అత్యంతాసక్తితో సమర్థించే ఒకరు “పరలోకంలో తండ్రి, వాక్యము, పరిశుద్ధాత్మ ఉన్నారు; ఈ ముగ్గురూ ఒక్కటే” అనే మాటలను 1 యోహాను 5:7 వచనంలో నుండి ఉదహరించబడ్డాయన్నంతగా లాటిన్‌ సంధిలో చేర్చినట్టు స్పష్టమౌతుంది. ఆ తర్వాత ఈ ప్రకరణం, లాటిన్‌ బైబిల్‌ చేతిరాతప్రతిలోనికి తిన్నగా చేర్చబడింది. (4) ఫ్రాన్స్‌లో లూయిస్‌ XIII (1610-43), ప్రొటెస్టెంట్ల ప్రయత్నాల్ని నిలిపివేసే ఉద్దేశంతో ఫ్రెంచ్‌ భాషలోనికి బైబిల్ని అనువదించడానికి ఝాక్‌ కార్భన్‌కు అధికారమిచ్చాడు. ఆ ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకొని, అపొస్తలుల కార్యములు 13:2 వచనంలో “మాస్‌ యొక్క పవిత్రార్పణ”కు సంబంధించిన రిఫరెన్సుతోపాటూ కొన్ని లేఖన ప్రక్షిప్తాంశాలను చేర్చాడు.

11. (ఎ) కొంతమంది అనువాదకులు నిజాయితీ లేనివారైనా, దేవుని వాక్యం ఎలా నిలబడగలిగింది? (బి) బైబిలు అసలుప్రతి చెప్పినదాన్ని రుజువుచేసేందుకు ప్రాచీన చేతిరాతప్రతుల రుజువు ఎంతవుంది? (బాక్సు చూడండి.)

11 తన వాక్యాన్ని అలా అనధికారికంగా సరిదిద్దడాన్నిగానీ లేక తన సంకల్పాల్ని సరిదిద్దే మార్పును చేయడాన్నిగానీ యెహోవా అడ్డుకోలేదు. అది ఏ ప్రభావాల్ని చూపించింది? గెరిజీము పర్వతానికి సంబంధించి రిఫరెన్సులను చేర్చడం, మానవజాతిని ఆశీర్వదించేందుకు దేవుని ఉపకరణమయ్యేలా సమరయ్యుల మతాన్ని చేయలేదు. బదులుగా, పంచగ్రంథాన్ని విశ్వసిస్తున్నట్లు సమరయుల మతం చెప్పుకున్నప్పటికీ సత్యాన్ని బోధించడంపై అది ఆధారపడిలేదనే విషయాన్ని, గెరిజీము పర్వతానికి సంబంధించి చేర్చిన రిఫరెన్సులు రుజువుచేశాయి. (యోహాను 4:20-24) సెప్టాజింట్‌లో పదాల్ని వక్రీకరించడం, దానియేలు ప్రవక్త ద్వారా ప్రవచించబడిన కాలంలో మెస్సియా రాకుండా ఆటంకపర్చలేకపోయింది. అంతేగాక, సెప్టాజింట్‌ మొదటి శతాబ్దంలో ఉపయోగమందు ఉన్నప్పటికీ, యూదులు తమ సమాజమందిరాల్లో హెబ్రీభాషలో చదువబడిన లేఖనాల్ని వినడానికి అలవాటుపడ్డారని లభ్యమౌతున్న రుజువుల్నిబట్టి తెలుస్తోంది. తత్ఫలితంగా, ఆ ప్రవచన నెరవేర్పు కాలం సమీపించినప్పుడు “ప్రజలు కనిపెట్టుచు” ఉండిరి. (లూకా 3:15) త్రిత్వాన్ని బలపర్చేందుకు 1 యోహాను 5:7లోనూ, మాస్‌కు సంబంధించిన బోధను సమర్థించేందుకు అపొస్తలుల కార్యములు 13:2లోనూ చేర్చబడ్డ ప్రక్షిప్తాంశాల విషయానికొస్తే, ఇవి సత్యాన్ని మార్చలేకపోయాయి. సకాలంలో ఆ మోసాలన్నీ సంపూర్ణంగా బహిర్గతమయ్యాయి. అధికసంఖ్యలో లభ్యమైన బైబిలు ఆదిమభాషా చేతిరాతప్రతులు, ఏ అనువాదపు విలువనైనా సరే, పరిశీలించడానికి ఓ మాధ్యమాన్ని అందిస్తాయి.

12. (ఎ) కొంతమంది బైబిలు అనువాదకులు ఏ గంభీరమైన మార్పుల్ని చేశారు? (బి) వీరు ఎంతవరకూ వెళ్లారు?

12 లేఖనాల్ని మార్పుచేసేందుకైన ఇతర ప్రయత్నాల్లో కొన్ని వచనాల్ని మార్చి తిరగరాయడానికన్నా ఇంకా ఎక్కువే చేరివున్నాయి. ఇవి సత్యదేవుని గుర్తింపుపైనే దాడికి రూపకల్పన చేయబడ్డాయి. ఏ మానవునికన్నా లేక ఏ మానవ సంస్థకన్నా మరింత శక్తిమంతమైన ఓ మూలం నుండి—అవును, యెహోవా ప్రధాన శత్రువైన అపవాదియగు సాతాను నుండే ఆ ప్రభావం వచ్చిందని ఆ మార్పుల స్వభావ విస్తృతులు స్పష్టమైన రుజువును ఇచ్చాయి. ఆ ప్రభావానికి లోనైన అనువాదకులూ, నకళ్లురాసేవారూ—కొంతమంది అత్యుత్సాహంతోనూ, ఇతరులు అయిష్టంగానూ—దేవుని ప్రేరేపిత వాక్యంలో వేలాదిసార్లు కన్పించిన ఆయన స్వకీయ వ్యక్తిగత నామమైన యెహోవాను దానిలోనుండి తొలగించడం ఆరంభించారు. తొలి కాలాల్లో హెబ్రీ నుండి గ్రీకు, లాటిన్‌, జర్మన్‌, ఆంగ్ల, ఇటాలియన్‌, డచ్‌ భాషల్లోనికి మరితర భాషల్లోనికి చేయబడిన కొన్ని అనువాదాలు దైవిక నామాన్ని పూర్తిగా విడిచిపెట్టాయి లేదా కొన్ని స్థలాల్లో మాత్రమే దాన్ని ఉంచాయి. అది క్రైస్తవ గ్రీకు లేఖనాల నకళ్లలోనుండి కూడా తొలగించబడింది.

13. బైబిల్ని మార్చివేసేందుకైన విస్తృత ప్రయత్నం, మానవ స్మృతిపథంలో నుండి దేవుని నామాన్ని ఎందుకు తొలగించలేక పోయింది?

13 అయితే, ఆ మహిమాయుక్తమైన నామం మానవ స్మృతి పథాల్లోనుండి తుడిచివేయబడలేదు. స్పానిష్‌, పోర్చుగీసు, జర్మన్‌, ఆంగ్ల, ఫ్రెంచ్‌ భాషలలోనికి, మరనేక ఇతర భాషలలోనికి అనువదించబడిన హెబ్రీ లేఖనాల అనువాదాలు దేవుని వ్యక్తిగత నామాన్ని నిజాయితీగా చేర్చాయి. 16వ శతాబ్దం నాటికి క్రైస్తవ గ్రీకు లేఖనాల వివిధ హెబ్రీ అనువాదాల్లోనూ, 18వ శతాబ్దం నాటికి జర్మనీలోనూ, 19వ శతాబ్దం నాటికి క్రొయటియన్‌, ఆంగ్ల భాషల్లోనూ దేవుని వ్యక్తిగత నామం మరలా కన్పించడం ఆరంభించింది. ప్రజలు దేవుని నామాన్ని మరుగుపర్చడానికి ప్రయత్నించినప్పటికీ, “నేను యెహోవానై యున్నానని అన్యజనులు అనేకులు తెలిసికొం[టారని]” దేవుడు ప్రకటించినట్లుగానే వాళ్లు “ప్రభువు [“యెహోవా,” NW] దినము” వచ్చినప్పుడు తెలుసుకోవాల్సిందే. దేవుని యొక్క ఆ ప్రకటిత సంకల్పం విఫలం కాబోదు.—2 పేతురు 3:10; యెహెజ్కేలు 38:23; యెషయా 11:9; 55:11.

సందేశం భూగోళమంతటా చేరుతోంది

14. (ఎ) బైబిలు 20వ శతాబ్దంనాటికి ఎన్ని యూరోపియన్‌ భాషలలోనికి ముద్రించబడింది, ఏ ప్రభావంతో? (బి) 1914 ముగిసేనాటికి, ఆఫ్రికాలోని ఎన్ని భాషల్లో బైబిలు లభ్యమైంది?

14 ఈ 20వ శతాబ్దోదయం నాటికి, యూరప్‌లో 94 భాషల్లో అప్పటికే బైబిలు ముద్రించబడింది. 1914లో అన్యజనుల కాలం ముగియడంతో ప్రపంచాన్ని కదిలించే సంఘటనలు జరగనైవున్నాయనే వాస్తవాన్ని గ్రహించడానికి ప్రపంచంలో ఆ భాగమందున్న బైబిలు విద్యార్థుల్ని అది అప్రమత్తుల్ని చేసింది, మరి నిజానికి అవి రానేవచ్చాయి! (లూకా 21:24) విశిష్టఘటనలతో కూడిన ఆ చారిత్రక శకారంభ సంవత్సరమైన 1914 ముగియక ముందే, విస్తృతంగా మాట్లాడబడుతున్న ఆంగ్ల, ఫ్రెంచ్‌, పోర్చుగీసు భాషలతోపాటూ ఆఫ్రికాలోని 157 భాషల్లో బైబిలు పూర్తిగాగానీ లేక దానిలో కొన్ని పుస్తకాలుగానీ ప్రచురించబడ్డాయి. ఆ విధంగా, అక్కడ జీవిస్తున్న అనేక తెగలకూ, జాతీయ గుంపులకూ చెందిన వినయస్థులను ఆధ్యాత్మికంగా స్వతంత్రులను చేసే బైబిలు సత్యాల్ని బోధించేందుకు పునాది వేయబడింది.

15. అంత్యదినాలు ఆరంభమవుతుండగా, అమెరికా ఖండాల్లోని ప్రజలు మాట్లాడే భాషల్లో ఏ మేరకు బైబిలు లభ్యమైంది?

15 ప్రవచించబడిన అంత్యదినాల్లోనికి లోకం ప్రవేశించగానే, అమెరికా దేశాల్లో బైబిలు విస్తృతంగా లభ్యమైంది. యూరప్‌ నుండి వచ్చిన వలసదారులు తాము మాట్లాడే వివిధ భాషా బైబిళ్లను తీసుకొని వచ్చారు. అటు తర్వాత యెహోవాసాక్షులు అని పిలువబడిన అంతర్జాతీయ బైబిలు విద్యార్థుల బహిరంగ ప్రసంగాలతోనూ, తాము ప్రచురించిన బైబిలు సాహిత్యాల్ని అత్యధికంగా పంచిపెట్టడంతోనూ విస్తృతమైన బైబిలు విద్యా కార్యక్రమం ముందుకు సాగింది. అంతేగాక, పశ్చిమార్థ గోళపు నివాసుల అవసరాన్ని తీర్చేందుకు బైబిలు సొసైటీలు అప్పటికే 57 ఇతర భాషల్లో బైబిల్ని ముద్రించాయి.

16, 17. (ఎ) భూవ్యాప్త ప్రకటనాపనికి సమయం ఆసన్నమయ్యేటప్పటికి ఎంతమేరకు బైబిలు లభ్యమైంది? (బి) మనగల్గే, ఎంతో ప్రభావాన్ని చూపగల్గే ఓ గ్రంథంగా బైబిలు నిజంగా ఎలా రుజువుచేయబడింది?

16 ‘అంతం రావడానికి’ ముందు భూవ్యాప్తంగా సువార్త ప్రకటించబడే సమయం ఆసన్నమైనప్పుడు ఆసియా ఖండానికీ, ఫసిఫిక్‌ ద్వీపాలకూ బైబిలు క్రొత్తేమీకాదు. (మత్తయి 24:14) భూగోళంలోని ఆ భాగానికి చెందిన 232 భాషల్లో అప్పటికే అది ప్రచురించబడింది. వాటిలో కొన్ని పూర్తి బైబిళ్లు; అనేకం, క్రైస్తవ గ్రీకు లేఖన అనువాదాలు; మిగిలినవి, పరిశుద్ధ లేఖనాల్లోని ఏదొక పుస్తకం.

17 స్పష్టంగా, బైబిలు కేవలం ఒక పాత గ్రంథంలా ఉండిపోలేదు. ఉనికిలో ఉన్న గ్రంథాలన్నింటిలో, విస్తృతంగా అనువదించబడి, పంచిపెట్టబడిన గ్రంథమదే. దైవిక అనుగ్రహాన్ని గూర్చిన ఆ రుజువుకు సంగతంగా, ఆ గ్రంథంలో రాయబడినది నెరవేరింది. దాని బోధలూ, వాటిని ప్రేరేపించిన ఆత్మా అనేక దేశాల్లోని ప్రజల జీవితాలపై ఓ శాశ్వతమైన ప్రభావాన్ని కూడా కల్గివున్నాయి. (1 పేతురు 1:24, 25) అయితే నెరవేరాల్సిందెంతో—మరెంతో ఉంది.

మీకు జ్ఞాపకం ఉన్నాయా?

◻ నిరంతరం నిలిచివుండే “మన దేవుని వాక్యము” ఏది?

◻ బైబిల్ని అణచివేయడానికి ఏ ప్రయత్నాలు జరిగాయి, వాటి ఫలితాలేవి?

◻ బైబిలు యథార్ధత ఎలా కాపాడబడింది?

◻ దేవుని సంకల్పాన్ని గూర్చిన వాఙ్మూలం సజీవమైన వాక్యమని ఎలా రుజువైంది?

[12వ పేజీలోని బాక్సు]

బైబిలు అసలుప్రతి ఏమి చెప్పిందో మనకు నిజంగా తెలుసా?

హెబ్రీ లేఖనాల్లో ఉన్నదాన్ని దాదాపు 6,000 హెబ్రీ చేతిరాత ప్రతులు ధృవపరుస్తాయి. వీటిలో కొన్ని క్రైస్తవపూర్వ శకానికి చెందినవి. ఇప్పటికీ నిలిచివున్న కనీసం 19 హెబ్రీలేఖనాల పూర్తి చేతిరాతప్రతులు, టైపు ఫేసుల్ని సులభంగా మార్చుకోడానికి వీలయ్యే ముద్రణాయంత్ర ఆవిష్కరణకు ముందున్న కాలానికి చెందినవి. అంతేగాక, అదే కాలంలో 28 ఇతర భాషల్లోనికి అనువదించబడిన అనువాదాలు ఉనికిలో ఉన్నాయి.

క్రైస్తవ గ్రీకు లేఖనాలైతే, గ్రీకులో దాదాపు 5,000 చేతిరాతప్రతులు ఉన్నాయని లెక్కించబడ్డాయి. వీటిలో ఒకటి అది రచించబడ్డ కాలానికి కొన్ని సంవత్సరాల తర్వాతదేనని అంటే సా.శ. 125కు ముందుదని లెక్కించబడింది. కొన్ని గ్రంథావశేషాలు చెప్పుకోదగినంతగా అంతకుముందు కాలానికి చెందినవని తలంచబడ్డాయి. 27 ప్రేరేపిత గ్రంథాల్లో ఇరవైరెండింటికి 10 నుండి 19 వరకూ పూర్తిగావున్న అన్‌సియల్‌ (పెద్దక్షరాల) చేతిరాతప్రతులు ఉన్నాయి. ప్రకటన గ్రంథం అతి తక్కువ పూర్తి అన్‌షియల్‌ చేతిరాతప్రతులను అంటే కేవలం మూడింటిని మాత్రమే కల్గివుంది. పూర్తి క్రైస్తవ గ్రీకు లేఖనాల చేరాతప్రతి ఒకటి, సా.శ. నాల్గవ శతాబ్దం నాటిదని లెక్కించబడింది.

ఏ ఇతర ప్రాచీన సాహిత్యమూ అలాంటి ప్రాచీన అధికారికపత్రాధారిత రుజువుల వెల్లువచే ధృవపర్చబడలేదు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి