వృద్ధ తలిదండ్రులను సన్మానించడం ద్వారా లభించే ప్రతిఫలాలు
దేవుని యథార్థ ఆరాధికులు తమ వృద్ధ తలిదండ్రులను ప్రేమిస్తారు గనుక వాళ్లు వారిని గౌరవించి, సన్మానించి, వారి గురించి శ్రద్ధ తీసుకుంటారు. అది వాళ్ల ఆరాధనలో ఒక భాగం. బైబిలు ఇలా చెబుతోంది: “[పిల్లలు గాని మనుమలు గాని] మొదట తమ యింటివారియెడల భక్తి కనుపరచుటకును, తమ తలిదండ్రులకు [“మరియు తాతామామ్మలకు,” NW] ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను; ఇది దేవుని దృష్టికనుకూలమైయున్నది.” (1 తిమోతి 5:4) మనం పిల్లలమైనా లేక పెద్దలమైనా, మనం మన తలిదండ్రులకూ తాతామామ్మలకూ “ప్రత్యుపకారము” చేయడం తగినది. ఈ విధంగా మనం వారి ప్రేమా, వారి శ్రమా, అనేక సంవత్సరాలపాటు వారు మన గురించి తీసుకున్న శ్రద్ధల ఎడల మన మెప్పును కనబరుస్తాము. అంతెందుకు, మనం మన జీవాన్నే మన తలిదండ్రులకు ఋణపడివున్నాము!
తలిదండ్రులకూ తాతామామ్మలకు ప్రత్యుపకారం చేయడం “దేవుని దృష్టికనుకూలమైయున్నది” అని గమనించండి. అది మన “భక్తి”కి జత చేయబడింది. అందుకే, ఈ ఉపదేశాన్ని అనుసరించడం ద్వారా మనం ప్రతిఫలాన్ని పొందుతాము. మనం చేస్తున్నది దేవునికి ప్రీతికరమైనదని మనకు తెలుసు. అది మనకు ఆనందాన్ని తెస్తుంది.
ఇతరులకు ఇవ్వడంలో, ప్రాముఖ్యంగా మనకు ఎంతో ఉదారంగా ఇచ్చిన వారికి మనం ఇవ్వడంలో ఆనందం ఉంది. (అపొస్తలుల కార్యములు 20:35) కాబట్టి, “నీ తలిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను” అనే బైబిలు సూత్రానికి అనుగుణంగా ప్రవర్తించడంలో ఎంతటి ప్రతిఫలం ఉందో కదా!—సామెతలు 23:25.
మనం తలిదండ్రులకు, తాతా మామ్మాలకు ఎలా ప్రత్యుపకారం చేయగలం? మూడు మార్గాల్లో: వస్తుసంబంధంగా, భావోద్రేకపరంగా, ఆత్మీయంగా. ఒక్కొక్కటీ దాని దాని ప్రతిఫలాలను తెస్తుంది.
వస్తుసంబంధంగా ఆదరించడం
సమీప కుటుంబ సభ్యులకు వస్తుపరంగా సమకూర్చడం ప్రాముఖ్యమని దేవుని సేవ చేసేవారికి తెలుసు. అపొస్తలుడైన పౌలు ఇలా ఉపదేశించాడు: “ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును.”—1 తిమోతి 5:8.
టున్జీ మరియు జాయ్ పశ్చిమాఫ్రికాలో నివసిస్తున్నారు. ఆర్థికపరంగా ఇబ్బందులున్నప్పటికీ, వాళ్లు జాయ్ వృద్ధ తలిదండ్రులను తమతో వచ్చి ఉండమని ఆహ్వానించారు. జాయ్ తండ్రికి అనారోగ్యం, చివరికి ఆయన మరణించాడు. టున్జీ ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు: “మా మామగారు మరణించినప్పుడు అత్తయ్య నా భార్యను హత్తుకుని, ‘మీకు సాధ్యమైనదంతా మీరు చేశారు. మీ నాన్న మరణాన్ని బట్టి మీరు ఎంతమాత్రం అపరాధభావం కలిగివుండకూడదు’ అని అంది. మేము మామయ్య లేని లోటు అనుభవిస్తున్నప్పటికీ, మేము ఆయన కోసం అన్నిటికన్నా శ్రేష్ఠమైన మందులు తెచ్చామని మాకు తెలుసు. ఆయనంటే మాకిష్టమనీ ఆయన మాకవసరమనీ ఆయన భావించేలా చేసేందుకు మేము ఎల్లప్పుడూ ప్రయత్నించాము: దేవుడు మాకిచ్చిన బాధ్యతను నెరవేర్చడానికి మేము చేయగలిగినదంతా చేశాము. ఆ సంతృప్తి మాకుంది.”
నిజమే, అందరూ ఇతరులకు వస్తుపరంగా సహాయం చేసే స్థితిలో ఉండరు. నైజీరియాలో నివసించే ఒక వ్యక్తి ఇలా అన్నాడు: “ఒక వ్యక్తి తనను తాను పోషించుకునే స్థితిలో లేకపోతే, అతడు మరో వ్యక్తినెలా పోషించగలడు?” అనేక దేశాల్లో, రాబోయే సంవత్సరాల్లో పరిస్థితి ఇంకా విషమించవచ్చు. ఐక్యరాజ్య సమితి వేసిన అంచనా ప్రకారం, ఆఫ్రికా నందలి సహారా యొక్క దక్షిణ భాగంలోని ప్రజలు త్వరలోనే కడు పేదరికంలో జీవించబోతున్నారు.
మీరు ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నట్లైతే, అవసరతలో ఉన్న ఒక విధవరాలిని గురించిన వాస్తవమైన వృత్తాంతం నుండి మీరు ఓదార్పును పొందవచ్చు. యేసు భూమిపైనున్నప్పుడు, ఒక విధవరాలు ఆలయంలోని కానుక పెట్టెలో చిన్న మొత్తం కానుక వేయడాన్ని ఆయన గమనించాడు. ఆమె కేవలం “రెండు కాసులు” మాత్రమే ఇచ్చింది. అయినప్పటికీ, యేసు ఆమె పరిస్థితి ఎరిగినవాడై, “ఈ బీద విధవరాలు అందరికంటె ఎక్కువ వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరు తమకు కలిగిన సమృద్ధిలోనుండి కానుకలు వేసిరిగాని యీమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెనని” అన్నాడు.—లూకా 21:1-4.
అలాగే, మనం మన తలిదండ్రుల లేక తాతామామ్మల వస్తుపరమైన అవసరతల గురించి శ్రద్ధ వహించడంలో మనకు సాధ్యమైనదంతా చేస్తే, అదెంత తక్కువైనప్పటికీ, యెహోవా దాన్ని గమనిస్తాడు, మెచ్చుకుంటాడు. మనం చేయగలిగినదాన్ని మించి చేయాలని ఆయన అపేక్షించడం లేదు. బహుశా మన తలిదండ్రులు లేక తాతామామ్మలు కూడా అలాగే భావిస్తుండవచ్చు.
భావోద్రేకపరంగా ఆదరించడం
మన తలిదండ్రులనూ, తాతామామ్మలనూ సంరక్షించడంలో వారి వస్తుపరమైన అవసరతలను తీర్చడంకంటే ఎక్కువే ఇమిడివుంది. మనందరికీ భావోద్రేకపరమైన అవసరతలు ఉంటాయి. ఇతరులు తమను ప్రేమించాలనీ, తమను ఇష్టపడాలనీ, తమను కావల్సినవారిగా ఎంచాలనీ, కుటుంబంలో విలువైన సభ్యులుగా తమను దృష్ఠించాలనీ వృద్ధులతోసహా ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.
కెన్యాలో నివసించే మారీ వృద్ధురాలైన తన అత్తయ్య విషయమై మూడు సంవత్సరాలపాటూ శ్రద్ధ తీసుకుంది. మారీ ఇలా చెబుతుంది: “ఆమె వస్తుపరమైన అవసరతలను తీర్చడమేగాక, మేము ఎప్పుడూ ఆమెతో మాట్లాడుతూ ఉంటాము. అత్తయ్య ఇంట్లో ఎక్కువ పనేమీ చేయలేదు, కాని మేము ఆమెతో మాట్లాడుతూ ఆమెకు సన్నిహిత స్నేహితులమయ్యాము. కొన్నిసార్లు మేము ఆమెతో దేవుని గురించీ, మరి కొన్నిసార్లు మేము మునుపు నివసించిన ప్రాంతంలోని ప్రజల గురించీ మాట్లాడేవాళ్లము. ఆమె వయస్సు 90 ఏళ్ల పైగానే ఉన్నప్పటికీ, ఆమెకు మంచి జ్ఞాపకశక్తి ఉంది. తాను బాలికగా ఉన్నప్పటి జీవితం, అంటే 1914 కంటే మునుపటి విషయాలు ఆమెకు జ్ఞాపకం ఉన్నాయి, వాటి గురించి ఆమె మాట్లాడుతుంది.”
మారీ ఇలా కొనసాగిస్తుంది: “వృద్ధుల గురించి శ్రద్ధ తీసుకోవడం అంత సులభమేమీ కాదు, కానీ ఆమె మాతో ఉండడం గొప్ప ప్రతిఫలాలను తీసుకువచ్చింది. మా కుటుంబంలో శాంతి సామరస్యాలు ఉన్నాయి. నేను ఆమెకు ఇవ్వడం, కుటుంబంలోని ఇతరులు ఇచ్చేస్వభావాన్ని అలవర్చుకునేలా చేసింది. నా భర్త నన్ను మరింతగా గౌరవిస్తున్నాడు. ఎవరైనా నాతో దురుసుగా మాట్లాడుతున్నట్లు అత్తయ్య వింటే చాలు, ఆమె వెంటనే నా పక్షాన మాట్లాడుతుంది. ఆమె చుట్టుప్రక్కల్లో ఉన్నప్పుడు ఎవ్వరూ నన్ను దురుసుగా ఒక్క మాట కూడా అనలేరు!”
ఆత్మీయంగా ఆదరించడం
వస్తుపరమైన, భావోద్రేకపరమైన మద్దతునివ్వడం ఇచ్చేవారికి ఎలా ప్రతిఫలాలను తెస్తాయో, ఆత్మీయ విషయాల్లో మద్దతునివ్వడం విషయంలో కూడా అంతే. రోములోని క్రైస్తవ సంఘానికి అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగియున్న విశ్వాసముచేత, అనగా మనము ఒకరి విశ్వాసముచేత ఒకరము ఆదరణ పొందవలెనని ఆత్మసంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను.”—రోమీయులు 1:11, 12.
అదే విధంగా, దేవుని సేవ చేసే వృద్ధులకు ఆత్మీయ మద్దతునివ్వడానికి సంబంధించి ఇచ్చే ప్రోత్సాహం సాధారణంగా పరస్పరం ఇచ్చిపుచ్చుకునేదై ఉంటుంది. నైజీరియాలో నివసించే ఓసండూ ఇలా తెలియజేస్తున్నాడు: “పూర్వకాలంలో జీవితం ఎలా ఉండేదో అర్దం చేసుకోవడానికి మా తాతామామ్మలు సహాయం చేసేవారు. ఇది నాకు ఎంతో ఆసక్తికరంగా ఉండేది. మా తాతగారు 50, 60 దశాబ్దాల్లో తాను పూర్తికాల పరిచారకునిగా సేవచేసిన ప్రాంతాన్ని మెరిసే కళ్లతో జ్ఞాపకం చేసుకుంటారు. ప్రస్తుత సంఘపరమైన ఏర్పాటును, తాను సాక్షి అయినప్పుడు ఎలా ఉండేదో దానితో పోలుస్తారు. ఈ అనుభవాలు పయినీరుగా నా సేవలో నాకు సహాయం చేశాయి.”
క్రైస్తవ సంఘంలోని ఇతరులు కూడా వృద్ధులను ఆదరించడంలో సహాయపడవచ్చు. మునుపు ప్రస్తావించిన టున్జీ తన సంఘంలో జరిగినదాన్ని ఇలా వివరించాడు: “పయినీరైన ఒక యౌవన సహోదరునికి, బహిరంగ ప్రసంగం ఇచ్చే పని అప్పగించబడింది, ఆయన మా మామయ్యతో కలిసి దాన్ని సిద్ధం చేసుకోవాలని ఆ కాగితాలు మామయ్య దగ్గరికి తీసుకునివచ్చాడు. కావలికోట పఠన నిర్వాహకుడు కూడా మామయ్య దగ్గరికి వచ్చి, ‘మీరు అనుభవం గలవారు. నేను మెరుగుపర్చుకోవడానికి నాకు మీరేమైనా చెప్పగలరా?’ అని అడిగాడు. మామయ్య ఆ పెద్దకు ఆచరణయోగ్యమైన సలహా ఇచ్చాడు. సహోదరులు మామయ్య పేరును సంఘ ప్రార్థనల్లో అనేకసార్లు ప్రస్తావించేవారు. ఇదంతా కూడా ఆయనంటే మాకు ఇష్టమని ఆయన భావించేలా చేశాయి.”
మంచి ప్రవర్తన ప్రజలను దేవునివైపు ఆకర్షింపజేస్తుంది
కొన్నిసార్లు, మనం మన తలిదండ్రులను, తాతామామ్మలను సన్మానించి, వారిని ప్రేమించినప్పుడు, ప్రజలు దేవునివైపు ఆకర్షించబడేలా మనం చేస్తాము. అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి, వాటినిబట్టి . . . దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై” యుండుడి.—1 పేతురు 2:12.
పశ్చిమాఫ్రికాలోని ఒక క్రైస్తవ పెద్దయైన ఆండ్రూ, అనారోగ్యంతోనున్న విశ్వాసికాని తన తండ్రి గురించి శ్రద్ధ తీసుకోవడానికి వారానికి రెండుసార్లు 95 కిలోమీటర్లు ప్రయాణించేవాడు. ఆయనిలా చెబుతున్నాడు: “నేను యెహోవాసాక్షినైనప్పుడు, మా నాన్న తీవ్రంగా వ్యతిరేకించాడు. కాని తాను అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను తన గురించి ఎలా శ్రద్ధ తీసుకుంటున్నానన్నది ఆయన గమనించినప్పుడు, ఆయన నా తమ్ముళ్లు చెల్లెళ్లతో, ‘మీరు కూడా మీ అన్న మతంలో చేరాలి!’ అని చెబుతుండేవాడు. అది వారిని పురికొల్పింది, నా తొమ్మిదిమంది తోబుట్టువులూ ఇప్పుడు యెహోవాసాక్షులు.”
వృద్ధ తలిదండ్రుల గురించి శ్రద్ధ తీసుకోవడం, ప్రాముఖ్యంగా కష్టతరమైన ఆర్థిక పరిస్థితులున్నప్పుడు సవాలుతో కూడినదై ఉండగలదు. కానీ క్రైస్తవులు అలా చేయడానికి కృషి చేస్తుండగా, వాళ్లు ఎన్నో ప్రతిఫలాలను పొందుతారు. అన్నిటికంటే ముఖ్యంగా, “అందరికీ తండ్రియైన” యెహోవా దేవున్ని ప్రీతిపరుస్తున్నామని తెలుసుకోవడం ద్వారా కలిగే సంతృప్తితోపాటూ, వాళ్లు ఇవ్వడంలోని ఆనందాన్ని చవిచూస్తారు.—ఎఫెసీయులు 4:6.
[6వ పేజీలోని బాక్సు]
శ్రద్ధ తీసుకొనబడుతున్నవారి కొరకు, శ్రద్ధ తీసుకుంటున్నవారి కొరకు దైవిక ఉపదేశం
ప్రోత్సాహకరంగా ఉండండి: “తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను.”—రోమీయులు 15:2.
స్థిరంగా ఉండండి: “మనము మేలుచేయుట యందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంటకోతుము.”—గలతీయులు 6:9.
వినయస్థులై ఉండండి: ‘కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుకొనుడి.’—ఫిలిప్పీయులు 2:3.
మేలు చేసేవారై ఉండండి: “ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను.”—1 కొరింథీయులు 10:24.
మృదుత్వము కల్గివుండండి: “మీ సహనమును [“మృదుత్వమును,” అధఃస్సూచి] సకల జనులకు తెలియబడనియ్యుడి.”—ఫిలిప్పీయులు 4:5.
కనికరం గలవారై ఉండండి: “ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై . . . ఒకరినొకరు క్షమించుడి.”—ఎఫెసీయులు 4:32.
[7వ పేజీలోని చిత్రం]
యౌవనులైన సంఘ పెద్దలు వృద్ధుల అనుభవం నుండి ప్రయోజనం పొందవచ్చు