వృద్ధులకు కష్టకాలాలు
అరవై ఎనిమిదేళ్ల ఓనీయన్ మామ్మ పశ్చిమాఫ్రికాలోని ఒక పెద్ద నగరంలో నివసిస్తుంది. ఆమె యౌవనంలో ఉన్నప్పుడు, తన వార్ధక్య దశను ప్రశాంత వాతావరణంలో పిల్లలు, మనుమల మధ్య ఆనందంగా గడపాలని కలలు కన్నది. బదులుగా ఆమె తీక్షణమైన ఎండలో చన్నీటిని అమ్ముతూ తన కాలం వెళ్లబుచ్చుతోంది. ఆమె సంపాదించుకునే ఆ కొద్దిమొత్తం ఆమె మనుగడకు సరిపోతుంది. ఆమె ఇద్దరు కుమారులూ దూరాన మరో దేశంలో నివసిస్తున్నారు. వాళ్లామెకు డబ్బు పంపించి చాలా కాలమైంది.
గత కాలాల్లో, ఆఫ్రికాలో వృద్ధులు ఎంతో ఉన్నతమైనవారిగా ఎంచబడేవారు. వారు తమకున్న అనుభవాన్ని, జ్ఞానాన్ని బట్టీ, తరచూ వాటితోపాటూ వచ్చే బుద్ధి కుశలతను బట్టీ గౌరవించబడేవారు. మనుమలను పెంచడంలో వారు సహాయపడేవారు. చిన్నవారు వారి సలహాను, ఆమోదాన్ని కోరుకునేవారు. ప్రజలు బైబిలు సంబంధిత ఈ ఉపదేశానుసారంగా జీవించేవారు: ‘తల నెరసినవానియెదుట లేచి ముసలివాని [వృద్ధుని లేక వృద్ధురాలి] ముఖమును ఘనపరచవలెను.’—లేవీయకాండము 19:32.
కాలం మారింది. పేదరికం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నగరాలకు మూకుమ్మడి వలస అనేకమంది వృద్ధులు తమను తాము పోషించుకునేలా చేశాయి. హెల్పేజ్ కెన్యా డైరెక్టరైన కామిలస్ వెర్ ఇలా చెబుతున్నాడు: “వృద్ధులకు మద్దతునిచ్చి, వారి గురించి శ్రద్ధ తీసుకోవడమనే సాంప్రదాయం అంతకంతకూ నిర్లక్ష్యం చేయబడుతోంది.”
అయితే, కుటుంబ బంధాలు బలహీనమౌతున్నది కేవలం ఆఫ్రికా దేశాల్లో మాత్రమే కాదు. జపాను గురించి మాట్లాడుతూ గార్డియన్ వీక్లీ ఇలా నివేదిస్తుంది: “కన్‌ఫ్యూషియనిజం నుండి సంక్రమించిన జపానీయుల విధాన విలువల్లో తలిదండ్రుల ఎడల భక్తి కీలకాంశంగా ఉండేది, కానీ నగరీకరణ మూలంగా, కుటుంబ బంధాలు బలహీనమవ్వడం మూలంగా ఆ భక్తిభావం అదృశ్యమైపోయింది: నేడు జపానీయుల్లోని 85 శాతంమంది ఆసుపత్రుల్లో లేక వృద్ధుల శరణాలయాల్లో మరణిస్తున్నారు.”
పరిస్థితి ఏదైనప్పటికీ, దేవున్ని యథార్థంగా ప్రీతిపర్చాలని కోరుకునేవారు తమ తలిదండ్రులను సన్మానించడానికి కృషి చేస్తారు. వారు బైబిలిచ్చే ఈ ఉపదేశాన్ని లక్ష్యపెడతారు: “నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడవగుదువు.” (ఎఫెసీయులు 6:2) వృద్ధ తలిదండ్రులను సన్మానించి, వారిని గురించి శ్రద్ధ తీసుకోవడం అన్ని వేళలా సులభం కాకపోయినప్పటికీ, అది గొప్ప దీవెనలను తీసుకురాగలదు.