విపత్తుల కాలంలో రక్షించబడడం
కొరియా దేశంలో సీయోల్ నగరంలో ఉన్న వివిధ రకాల వస్తువులు విక్రయించే ఐదంతస్తుల భవనం ఆకస్మికంగా కూలిపోయింది! లోపల వందలాది మంది ప్రజలు చిక్కుకుపోయారు. వీలైనంతమంది ప్రాణాల్ని కాపాడేందుకు స్వచ్ఛంద సేవకులు రాత్రనక పగలనక కష్టపడ్డారు. రోజులు గడుస్తుండగా, పర్వతంలా పేరుకుపోయివున్న కాంక్రీటూ ఇనుము శిథిలాల క్రింద కప్పబడిపోయి ప్రాణాలతోవున్న వారిని కనుగొనే ఆశలు సన్నగిల్లనారంభించాయి.
ఆశలన్నీ అడుగంటిపోతుండగా, ఆశ్చర్యాన్ని కల్గించేదొకటి జరిగింది. ఆ కుప్ప అడుగునుండి సన్నగా ఏడుపు విన్పించింది. 16 రోజుల నుండీ సజీవంగా కప్పబడిపోయి ఉన్న 19 ఏళ్ల యువతిని బయటకు తీసేందుకు స్వచ్ఛంద సేవకులు ఉత్తిచేతులతో ఆత్రంగా త్రవ్వారు. కూలిపోయిన లిఫ్ట్ కమ్మె ఆమె చుట్టూ ఓ రక్షణ కవచంగా రూపొంది, టన్నులకొద్దీ బరువున్న కూలిపోయిన కాంక్రీటు నుండి ఆమెను కాపాడింది. దేహంలో నీటిని బాగా కోల్పోయి, తీవ్రంగా గాయపడినప్పటికీ, ఆమె మరణం నుండి తప్పించుకొంది!
ఈ రోజుల్లో, ఏదో ఒక విపత్తును గూర్చిన నివేదికలు లేకుండా దాదాపుగా ఏ ఒక్క నెలా గడవడం లేదు. అది భూకంపమైనా, పెను తుపానైనా, అగ్నిపర్వత విస్ఫోటమైనా, దుర్ఘటనయైనా, లేక క్షామమైనా కావచ్చు. అపాయాల నుండి కాపాడిన వారిని గూర్చిన, బ్రతికి బయటపడిన వారిని గూర్చిన విశేషమైన కథనాలు, వార్తల్ని తెల్సుకునే కోట్లాదిమందిని ఉత్కంఠభరితుల్ని చేస్తాయి, ఆకట్టుకుంటాయి. అయినప్పటికీ, మానవజాతి చరిత్రలో ఏ ఇతర విపత్తులకన్నా పెద్దదైన ఓ విపత్తు రాబోతుందనే హెచ్చరిక, మొత్తంమీద నిర్లక్ష్యం చేయబడింది. (మత్తయి 24:21) రాబోయే ఈ విపత్తును గూర్చి బైబిలు ఈ క్రింది మాటల్లో వర్ణిస్తోంది: “జనమునుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది, భూదిగంతములనుండి గొప్ప తుపాను బయలు వెళుచున్నది. ఆ దినమున యెహోవాచేత హతులైన వారు ఈ దేశముయొక్క యీ దిశనుండి ఆ దిశవరకు కనబడుదురు. ఎవరును వారినిగూర్చి అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతిపెట్టరు, పెంటవలె వారి శవములు నేలమీద పడియుండును.”—యిర్మీయా 25:32, 33.
భీతిగొల్పే మాటలు! కానీ ప్రకృతి వైపరీత్యాలవలె, ప్రమాదాలవలె గాక, ఈ విపత్తు విచక్షణారహితమైన హత్యాకాండ కాబోదు. నిజానికి, తప్పించుకోవడం—మీరు తప్పించుకోవడం—సాధ్యమే!
అత్యవసరమైన సమయం
ఈ వాస్తవాన్ని పూర్తిగా అర్థంచేసుకునేందుకు, ఈ భౌగోళిక విపత్తు ఎందుకు సంభవిస్తుందనే విషయాన్ని ఒకరు మొదట అర్థంచేసుకోవాలి. వాస్తవానికి, మానవజాతి సమస్యలకు ఏకైక నిజమైన పరిష్కారమిదే. చాలా కొద్దిమంది ప్రజలు నేడు సురక్షితంగానూ భద్రంగానూ ఉన్నట్టు భావిస్తారు. విజ్ఞానశాస్త్రం మంచి ప్రయత్నాల్ని చేసినప్పటికీ, అంటువ్యాధులు భూమి మీదనున్న ప్రజలను నాశనంచేస్తూనే ఉన్నాయి. మత, తెగ, రాజకీయ విభేదాల మూలంగా ఉత్పన్నమైన యుద్ధాలు, వేలాదిమంది ప్రాణాల్ని బలిగొంటున్నాయి. అమాయకులైన స్త్రీలూ, పురుషులూ, పిల్లలూ అనుభవించే బాధావేదనలకు క్షామం తోడవుతుంది. నైతిక క్షీణత సమాజ పునాదుల్ని కదిలించివేస్తుంది; చివరకు పిల్లలు కూడా భ్రష్టులైపోయారు.
1,900 సంవత్సరాల క్రిందట రాయబడిన ఓ బైబిలు ప్రవచనం మన స్థితిని గూర్చి గమనార్హమైన కచ్చితత్వంతో, వర్ణిస్తోంది. అది ఇలా చెబుతోంది: “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము.”—2 తిమోతి 3:1; మత్తయి 24:3-22 పోల్చండి.
ప్రేమగల దేవుడు మన దీనావస్థ విషయంలో ఉదాసీనంగా ఉంటాడంటే మీకు సమంజసంగా అనిపిస్తుందా? బైబిలు ఇలా చెబుతోంది: “ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిరపరచెను. నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు, నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను.” (యెషయా 45:18) అవును, ఈ సుందరమైన గ్రహం నాశనంకావడానికీ, దాని నివాసులందరూ అంతం కావడానికీ అనుమతించడానికి బదులు, దేవుడు జోక్యం చేసుకుంటాడు. ప్రశ్న ఏమిటంటే, ఆయన దీన్నెలా చేస్తాడు?
జీవాన్ని ఎంచుకోండి!
కీర్తన 92:7నందు బైబిలు ఇలా జవాబిస్తోంది: “నిత్యనాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డివలె చిగుర్చుదురు. చెడుపనులు చేయువారందరు పుష్పించుదురు.” దుష్టత్వాన్ని తీసివేయడమే, భూమిమీద ఉన్న సమస్యలకు దేవుని పరిష్కారం. సంతోషకరమైన విషయమేమిటంటే, ప్రజలందరూ తొలగించబడాలని దీని భావంకాదు. కీర్తన 37:34 ఇలా అభయమిస్తోంది: “యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము, ఆయన మార్గము ననుసరించుము, భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు.”
ఇంతకుముందెన్నడూ మానవజాతికి సంభవించని గొప్ప విపత్తునుండి రక్షించబడే అవకాశంవుందని ఈ మాటలు సూచిస్తున్నాయి. దేవుడు మనకు ఎంపికచేసుకునే అవకాశాన్నిచ్చాడు. ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించేందుకు సిద్ధపడుతుండగా మోషే వారికి ఉద్బోధించిన మాటలు, నేడు మనం కూడా అన్వయించుకోదగినవే: “జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి[యున్నాను], . . . నీవును నీ సంతానమును బ్రదుకు[నట్లు] . . . జీవమును కోరుకొనుడి [“ఎంచుకోండి,” NW].” (ద్వితీయోపదేశకాండము 30:19, 20) కానీ ఒకరు ఎలా ‘జీవాన్ని ఎంచుకొని,’ రక్షించబడవచ్చు? వాస్తవానికి రక్షణ అంటే నిజంగా దాని భావమేమిటి?
[2వ పేజీలోని చిత్రసౌజన్యం]
COVER: Explosion: Copyright © Gene Blevins/Los Angeles Daily News
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
Yunhap News Agency/Sipa Press