పాఠకుల ప్రశ్నలు
యెహోవా సాక్షులు నిజాయితీపరులుగా ఉండడానికి కృషిచేస్తారు, ఒకరినొకరు విశ్వసిస్తారు కదా, మరి వాళ్లు తమమధ్య వ్యాపార వ్యవహారాలు జరుగుతున్నప్పుడు లిఖితపూర్వకమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ప్రాముఖ్యమని ఎందుకు తలస్తారు?
వాళ్లలా లిఖితపూర్వక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం లేఖనాధారమైన, ఆచరణయోగ్యమైన, ప్రేమపూర్వకమైన విషయమైవుంది. అదెలా? వ్యాపార సంబంధమైన ఒప్పందాల్లో చేరివున్న వివిధ అంశాలను మనం పరిశీలిద్దాం.
తన నిబంధన ప్రజలైన ఇశ్రాయేలీయులతో దేవుని వ్యవహారాల్ని గూర్చిన లిఖితపూర్వక రికార్డు బైబిల్లోవుంది. అందులో నిజ ఆరాధికులు ఇమిడివున్న వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాలు చేరివున్నాయి. మనం పరిశీలించదగిన ఒక విషయం ఆదికాండము 23వ అధ్యాయంలో ఉంది. తన ప్రియమైన శారా మరణించినప్పుడు, అబ్రాహాము ఓ శ్మశానభూమిని సంపాదించాలనుకున్నాడు. హెబ్రోను వద్ద నివసిస్తున్న కనానీయులతో తన వ్యవహారాల్ని కొనసాగించనారంభించాడు. తనకు కావలసిన స్థలం కొరకు ఆయన ఒక నిర్దిష్టమైన వెలను ప్రతిపాదించినట్లు 7-9 వచనాలు చూపిస్తాయి. ఈ ప్రతిపాదన బహిరంగంగా, నగర గవిని దగ్గరనున్న ఇతరులకు వినబడేలా చేయబడిందని 10వ వచనం నిరూపిస్తుంది. ఆ భూస్వామి అబ్రాహాముకు స్థలాన్ని ఇస్తానని అన్నాడు, కానీ ఆ భూమిని తనకు అమ్మితేనే తీసుకుంటానని అబ్రాహాము ప్రత్యుత్తరమిచ్చినట్లు 13వ వచనం చూపిస్తోంది. “ఊరి గవిని ప్రవేశించువారందరిలో హేతు కుమారుల ఎదుట” స్థిరపర్చబడినట్లుగా అబ్రాహాము ఆ భూమిని కొన్నాడని 17, 18, 20 వచనాలు వివరిస్తున్నాయి.
అయితే, అలాంటి వ్యాపార వ్యవహారాల్ని నిర్వహిస్తున్న ఇరువురూ సత్యారాధికులైతే, అది భిన్నంగా ఉంటుందా? యిర్మీయా 32వ అధ్యాయం జవాబునిస్తోంది. యిర్మీయా తన సహోదరుని దగ్గర నుండి స్థలాన్ని కొనాలని అనుకున్నాడనే విషయాన్ని మనం ఆరవ వచనం నుండీ చూస్తాం. న్యాయమైన వెలకు అంగీకారం కుదిరినట్లు 9వ వచనం చూపిస్తోంది. 10-12 వచనాలను ఇప్పుడు చదవండి: ‘నేను [యిర్మీయా] క్రయపత్రము వ్రాసి ముద్రవేసి సాక్షులను పిలిపించి త్రాసుతో ఆ వెండి తూచి క్రయపత్రమును, అనగా ముద్రగల విడుదల కైకోలును ఒడంబడికను ముద్రలేని విడుదల కైకోలును ఒడంబడికను తీసికొంటిని. అప్పుడు నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు ఎదుటను, ఆ క్రయపత్రములో చేవ్రాలుచేసిన సాక్షుల ఎదుటను, చెరసాల ప్రాకారములో కూర్చున్న యూదులందరి ఎదుటను నేను మహసేయా కుమారుడగు నేరీయా కుమారుడైన బారూకునకు ఆ క్రయపత్రమును అప్పగించితిని.’
అవును, తోటి ఆరాధికుడు, అందులోనూ బంధువు అయిన వ్యక్తితోనే యిర్మీయా వ్యవహరిస్తున్నప్పటికీ ఆయన కొన్ని సహేతుకమైన చట్టబద్ధమైన పద్ధతులను అవలంబించాడు. రెండు లిఖితపూర్వక రికార్డులు తయారు చేయబడ్డాయి—ఒకటి సుళువుగా సంప్రదించడానికి తయారుచేయబడింది, ముద్రవేయబడిన రెండవ లిఖితపూర్వక రికార్డు ముద్రవేయబడనిదాని కచ్చితత్వం విషయంలో ఏదైనా సందేహం తలెత్తితే ఆ సందేహాన్ని నివృత్తిచేసుకోడానికి తగిన సాక్ష్యాధారాన్నిచ్చేదిగా తయారు చేయబడింది. 12వ వచనం చెబుతున్నట్లుగా ఇదంతా “వారి కన్నుల ఎదుట” జరిగింది. కాబట్టి అది బహిరంగంగానూ, చట్టబద్ధమైన సాక్షులతోనూ జరిగిన వ్యాపార వ్యవహారం. కాబట్టి స్పష్టంగా, లేఖనాధార నిదర్శనంతోనే సత్యారాధికులు విషయాలను అలాంటి కచ్చితమైన రీతిలోనూ, లిఖితపూర్వక రీతిలోనూ చేపడతారు.
అది ఆచరణీయమైనది కూడా. “అదృష్టవశము చేతనే [“అనూహ్యంగానూ,” NW] కాలవశముచేతనే అందరికి కలుగుచున్నవి” అనేది ఎంత సత్యమైనదో మనకు తెలుసు. (ప్రసంగి 9:11) దానిలో భక్తిపరులైన నమ్మకమైన క్రైస్తవులూ ఇమిడివున్నారు. యాకోబు 4:13, 14 దాన్నిలా తెలియజేస్తోంది: “నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారముచేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు.” కాబట్టి, కొనుగోలు చేయడం, ఒప్పందం చేసుకున్న ఒక పనిని లేక సేవను చేయడం, లేక ఇతరుల కొరకు ఏదైనా ఒక వస్తువును ఉత్పత్తి చేయడం వంటి ఓ ప్రణాళికను మనం ప్రారంభించవచ్చు. కానీ రేపు—లేక తర్వాతి నెల లేక తర్వాతి సంవత్సరం—ఏమి జరుగుతుందో? మనం గానీ లేక అవతలి వ్యక్తిగానీ దుర్ఘటనకు గురైతే అప్పుడేమిటి? అది ఒప్పందాన్ని అసాధ్యమైందిగా చేయవచ్చు. మనం ఆ పనిని లేక ఆ సేవను చేయలేకపోతే, లేక అవతలి వ్యక్తి డబ్బును చెల్లించడం లేక తన ఒప్పందానికి కట్టుబడి ఉండడం అసాధ్యమన్నట్లు భావిస్తే అప్పుడేమి చెయ్యాలి? లిఖితపూర్వక ఒప్పందం గనుక లేకపోతే అసలు సమస్యలు ఉత్పన్నం కావచ్చు, సరళమైన లిఖితపూర్వక ఒప్పందం గనుక ఉంటే వాటిని నివారించడం లేక సరిచేయడం సాధ్యమైయుండేది.
అంతేకాకుండా, జీవితంలోని అనేక అంశాల యొక్క అనిశ్చిత స్వభావం, మన (లేక అవతల వ్యక్తి) వ్యాపార వ్యవహారాల విషయంలో ఎవరో ఒకరు బాధ్యత వహించేలా లేక పరిష్కరించేలా చేయవచ్చునని మనం ఎన్నడూ మరచిపోకూడదు. 14వ వచనంలో యాకోబు ఇంకా ఇలా తెలియజేశాడు: “మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరివంటివారే.” మనం అనుకోకుండా మరణించడం అనేది వాస్తవికమైన విషయమే. ఒప్పందం కుదుర్చుకున్న ఇరుపక్షాల్లో ఏ పక్షానికైనా అనుకోనిదేదైనా జరిగితే, లిఖితపూర్వకంగా అంగీకరించిన ఒప్పందం వాస్తవానికి ఇతరులు వ్యవహారాల్ని చక్కబెట్టేలా వీలు కలిగిస్తుంది.
ఒక విధంగా ఇది, లిఖితపూర్వక ఒప్పందాలు ప్రేమపూర్వకమైనవనే మూడవ అంశానికి కూడా నడిపిస్తుంది. కచ్చితంగా, ఒప్పందంలోని ఇరుపక్షాలకు చెందినవాళ్లలో ఎవరు మరణించినా లేక చట్టబద్ధంగా అసమర్థులను చేసే దుర్ఘటన సంభవించినా, క్రైస్తవునిగా తన బాధ్యతలు లేక ఆర్థికంగా అపేక్షించే వాటి లిఖితపూర్వక రికార్డును అందజేయడం ప్రేమపూర్వకమైనదై ఉండేది. అపనమ్మకాన్ని చూపించే బదులు, కచ్చితంగా తాను ఏమి చేయవలసిన బాధ్యత తనకు ఉంది లేక తాను ఏమి పొందవలసి ఉంది అనేది ఒక వ్యక్తికి స్పష్టంగా తెలియజేసే లిఖిత ఒప్పందాన్ని చేసుకుంటే, మనం ఎవరితోనైతే వ్యవహరిస్తున్నామో ఆ సహోదరుని ఎడల ప్రేమ చూపినట్లవుతుంది. అపరిపూర్ణ వర్గాలలో ఒకరు కొన్ని వివరాలను లేక బాధ్యతలను మరిచిపోతే ఎటువంటి నిష్ఠూరాలనైనా, ఆగ్రహాలనైనా ఈ ప్రేమపూర్వకమైన చర్య తగ్గిస్తుంది. మనలో అపరిపూర్ణులుకాని, మరిచిపోని లేక వివరాల్నిగానీ, ఉద్దేశాల్నిగానీ అపార్థం చేసుకోని వారెవరున్నారు?—మత్తయి 16:5.
లిఖితపూర్వక వ్యాపార ఒప్పందాలను చేసుకోవడంలో మన సహోదరుని ఎడల, మన కుటుంబం ఎడల, సంఘమంతటి ఎడల మనకున్న ప్రేమను ప్రతిఫలింపజేసే ఇతర మార్గాలు ఉన్నాయి. అయితే తగినన్ని వివరాలు గల అలాంటి లిఖిత రికార్డులు ప్రేమతో కూడినవే కాక ఆచరణయోగ్యమైనవి, లేఖనాధారమైనవి అయి ఉండాలనే విషయం స్పష్టంగా ఉండాలి.