కనెక్టికట్‌లోని సుప్రీమ్‌కోర్టు రోగుల హక్కులను సమర్థించింది
1996 ఏప్రిల్ 16న, అమెరికాలో కనెక్టికట్‌లోని సుప్రీమ్ కోర్టు, రక్తం ఎక్కించుకోవడానికి నిరాకరించేందుకు యెహోవాసాక్షులు కలిగివున్న హక్కును సమర్థించింది. ఈ నిర్ణయం మునుపు ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.
1994 ఆగస్టులో, ఒక యెహోవాసాక్షి అయిన నెల్లీ వేగా తన మొదటి పాపను ప్రసవించిన తర్వాత తీవ్ర రక్త స్రావానికి గురైంది. అలా స్రవిస్తున్న రక్తాన్ని ఆపేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. శ్రీమతి వేగా పరిస్థితి క్షీణిస్తుండగా, ఆసుపత్రి వారు రక్తాన్ని ఎక్కించడానికి కోర్టు అనుమతిని పొందేందుకు ప్రయత్నించారు. తను ఆసుపత్రిలో ఉన్నప్పుడు రక్తం గానీ లేక రక్తంనుండి తీయబడినవి గానీ తనకు ఇవ్వకూడదని సూచిస్తూ ఆ విధంగా తన నిర్ణయం మూలంగా కలిగే పర్యవసానాల బాధ్యతనుండి ఆసుపత్రి వారిని విముక్తులను చేస్తూ ఒక వైద్య పత్రంపై శ్రీమతి వేగా ఇది వరకే సంతకం చేసింది. అయినప్పటికీ, రక్తాన్ని బలవంతంగా ఎక్కించడం, తల్లి యొక్క అవసరతవున్న నవజాత శిశువుకు ఎంతో ప్రాముఖ్యమని ఆసుపత్రి వారు వాదించారు. శ్రీమతి వేగా తన రక్తాన్ని కోల్పోయింది గానీ ఆమె యౌవనురాలు, ఎంతో ఆరోగ్యవంతురాలైన తల్లి. అలా, శ్రీమతి వేగా భర్త, ఆమె లాయరు నిరాకరించినప్పటికీ, కోర్టు ఆర్డరు జారీ చేసింది, రక్తం ఎక్కించబడింది.
కొంత కాలానికి, ఆ కేసు కనెక్టికట్‌లోని సుప్రీమ్ కోర్టుకు తీసుకురాబడింది. అక్కడ, ఆసుపత్రి చర్య శ్రీమతి వేగా హక్కులను అతిక్రమించిందని ఏకగ్రీవ తీర్మానం చేయబడింది. తీర్పు ఇలా పేర్కొన్నది: “ట్రయల్ కోర్టు ఎదుట జరిగిన విచారణ మధ్య రాత్రి జరిగింది, అది ఇరు పక్షాల వారూ తమ వాదనను పూర్తిగా అందించేందుకు సరైన పరిస్థితి లేని సమయంలో ఎంతో తీవ్రమైన అత్యవసర పరిస్థితిలో జరిగింది.”
కనెక్టికట్‌లోని సుప్రీమ్ కోర్టు యొక్క ఈ తీర్పు యెహోవాసాక్షులు కాని వారికి ఎంతో విశేషమైనది. “అది తమ వైద్యుల తీర్మానంతో ఏకీభవించని రోగులందరికీ ఎంతో ప్రాముఖ్యమైన నిర్ణయం” అని శ్రీమతి వేగా యొక్క లాయర్ అయిన డోనాల్డ్ టి. రిడ్లే చెబుతున్నాడు. “రోగుల విలువలు మతపరమైనవైనా లేక సామాజికమైనవైనా వాటిపై వత్తిడి తెచ్చి వాటిని అలక్ష్యం చేయకుండా ఈ తీర్పు ఆసుపత్రులను నివారిస్తుంది.”