తెర్తియు—పౌలు యొక్క నమ్మకమైన సెక్రటరీ
తెర్తియు ఒక సవాలును ఎదుర్కొన్నాడు. అపొస్తలుడైన పౌలు రోము నందలి తోటి క్రైస్తవులకు ఒక పెద్ద ఉత్తరాన్ని వ్రాసేటప్పుడు ఈయనను తన సెక్రటరీగా ఉపయోగించుకోవాలని ఇష్టపడ్డాడు. ఇది ఎంతో కష్టంతో కూడిన పని.
సా.శ. మొదటి శతాబ్దంలో సెక్రటరీగా ఉండటమంటే ఎందుకంత కష్టంతో కూడిన పనిగా ఉండేది? అలాంటి పని ఎలా జరిగేది? అప్పట్లో ఎలాంటి వ్రాత సామాగ్రి అందుబాటులో ఉండేది?
ప్రాచీన కాలాల్లో సెక్రటరీలు
ప్రాచీన గ్రీకు రోమా సమాజంలో, విభిన్న రకాలైన సెక్రటరీలు ఉండేవారు. కొంతమంది పురుషులు ప్రభుత్వ సెక్రటరీలుగా ఉండేవారు, వారు చాన్స్‌లర్ కార్యాలయంలో ప్రభుత్వ కార్యకర్తలుగా పని చేసే వారు. సంతలో పౌరులకు తమ సేవలను అందించే ప్రజా సెక్రటరీలు కూడా ఉండేవారు. ధనికులు ప్రైవేట్ సెక్రటరీలను (తరచూ బానిసలు) తమ అధీనంలో ఉంచుకునే వారు. మరి ఇతరుల కొరకు ఉత్తరాలు వ్రాసేందుకు సంతోషించే ఇష్టపూర్వకమైన స్నేహితులు కూడా ఉండేవారు. ఈ. రాండాల్ఫ్ రిచర్డ్ అనే పండితుని ప్రకారం, ఈ అనధికారిక సెక్రటరీల కౌశలాలు “భాషా నిపుణత మరియు/లేక వ్రాత ప్రక్రియల విషయంలో మామూలు సామర్థ్యం నుండి కచ్చితమైన, సరైన, చక్కని ఉత్తరాన్ని త్వరగా పూర్తిచేయగల అత్యున్నత ప్రావీణ్యత వరకూ ఉండేవి.”
సెక్రటరీలను ఎవరు ఉపయోగించుకుంటారు? మొదటిగా, చదవడమూ వ్రాయడమూ రాని వాళ్లు ఉపయోగించుకునే వాళ్లు. అనేక ప్రాచీన కాంట్రాక్టుల్లోనూ వ్యాపార ఉత్తరాల్లోనూ క్రింది భాగాన, తనకు ఆ పనిని అప్పగించిన వ్యక్తి వ్రాయలేడు గనుక తాను ఆ డాక్యుమెంటును వ్రాశానని సెక్రటరీ వ్రాసిన చిన్న నోటు ఉండేది. సెక్రటరీని వాడుకునేందుకుగల రెండవ కారణం, ఐగుప్తులోని థేబేస్ నందలి ఒక ప్రాచీన ఉత్తరం ద్వారా ఉదహరించబడుతుంది. ఎస్ల్కెపియాడిస్ అనే ఫలానా వ్యక్తి కొరకు వ్రాయబడిన ఆ ఉత్తరం, ముగింపులో ఇలా చెబుతుంది: “ఎర్మా కుమారుడైన ఎవ్‌మెలీస్, ఆయన కొరకు వ్రాశాడు . . . ఎందుకంటే ఆయన కాస్త మెల్లిగా వ్రాస్తాడు.”
అయినప్పటికీ, వ్రాయడమూ చదవడమూ రావడం ఒకరు సెక్రటరీని ఉపయోగించే విషయంలో నిర్ణాయక అంశం కాకపోయి ఉండవచ్చనిపిస్తుంది. బైబిలు వ్యాఖ్యాత అయిన జాన్ ఎల్. మెకెన్‌జీ ప్రకారం, “స్పష్టంగా చదివేందుకు వీలయ్యే విధంగా ఉండాలన్నది అసలు కారణం కాదు, బదులుగా అది అందంగా కనిపించాలన్న కోరిక లేక కనీసం చక్కగా ఉండాలన్న కోరిక” ప్రజలు సెక్రటరీని ఉపయోగించేందుకు వారిని పురికొల్పేది. విద్యావంతులకు కూడా, వ్రాయడమనేది చాలా విసుగు తెప్పించేదిగా ఉండేది, ప్రాముఖ్యంగా సుదీర్ఘమైన, సవివరమైన ప్రతులను వ్రాసేటప్పుడు వారలా భావించే వారు. సెక్రటరీని ఉపయోగించగలిగిన వారు “ఆ పనిని హాయిగా తప్పించుకుని దాన్ని బానిసలకు, వృత్తిరీత్యా శాస్త్రులైన వారికి అప్పగించేవారని” పండితుడైన జె. ఏ. ఇష్లిమాన్ చెబుతున్నాడు. అంతే కాకుండా, ఉపయోగించబడే సామాగ్రి మరియు పని జరిగే పరిస్థితులను పరిశీలిస్తే, ప్రజలు తమ స్వంత లేఖను వ్రాసుకునేందుకు ఎందుకు ఇష్టపడే వారు కాదో అర్థం చేసుకోవడం సులభమౌతుంది.
సా.శ. మొదటి శతాబ్దంలో పపైరస్‌పై (జమ్ము గడ్డి) వ్రాయడం జరిగేది. దాని కొమ్మలను నిలువునా కోసి దాని మధ్య భాగానున్న బెండును తీసుకుని దానితో పొడవైన పలుచని ముక్కలను చేసే వారు. ఆ పొడవైన పలుచని ముక్కలను కలిపి ఒక పొర వలె నిలువుగా వేసేవారు. పొడవైన పలుచని ముక్కల మరొక పొరను వాటిపై అడ్డంగా వేసేవారు. ఈ రెండు పొరలనూ కూడా గట్టిగా వత్తి పెట్టి ఉంచి అతుక్కునేలా చేయడం ద్వారా ఒక “కాగితం” షీటును తయారు చేసేవారు.
ఇలాంటి వాటిపై వ్రాయడం అంత సులభంగా ఉండేది కాదు. అది గరుకుగా, నారలుగా ఉండేది. ఆంజిలో పెన్నా అనే పండితుని ప్రకారం, “పపైరస్ యొక్క స్పాంజివంటి నారల మూలంగా సిరా వ్యాపించేది, ప్రాముఖ్యంగా చిన్న నార చుట్టల మధ్యగల అతి సన్నని సందుల్లో అది వ్యాపించేది.” సెక్రటరీ బహుశ నేలపై బాసిమటంవేసుకుని కూర్చుని పని చేసేవాడు, ఆ కాగితం షీటును ఒక చెక్కపై పెట్టుకుని ఒక చేతితో పట్టుకుంటాడు. అతడు అనుభవజ్ఞుడు కాకపోతే లేక అతడు ఉపయోగించే సామాగ్రి మంచి శ్రేణిది కాకపోతే, అతడు ఉపయోగించే ఈకతో చేయబడిన కలం లేక రెల్లు కలం పపైరస్‌లోనకు చొచ్చుకుపోతుంది, కాగితం చిరగవచ్చు లేక వ్రాత మరీ చదవలేనిదిగా ఉండవచ్చు.
పొగమసి మరియు జిగురు కలిసిన మిశ్రమంతో సిరాను తయారు చేసేవారు. వాటిని పొడవైన బిళ్లల రూపంలో అమ్మే వారు, వ్రాయడానికి ఉపయోగించుకునే ముందు దాన్ని సిరాబుడ్డిలో నీళ్లు పోసి నానబెట్టాలి. తెర్తియు వంటి సెక్రటరీలు తమ వెంట ఉంచుకునే ఇతర వస్తువులలో, తమ రెల్లు కలాన్ని చెక్కుకునేందుకు ఒక కత్తీ తాము వ్రాసిన తప్పులను తుడిపేందుకు చెమ్మగల ఒక స్పాంజీ కూడా ఉండి ఉండవచ్చు. ప్రతి అక్షరాన్నీ జాగ్రత్తగా వ్రాయవలసి ఉండేది. అందుకని వ్రాయడం చాలా మెల్లిగానూ కాస్త కష్టంతోనూ సాగేది.
‘తెర్తియు అను నేను, మీకు వందనములు చేయుచున్నాను’
రోమీయులకు పౌలు వ్రాసిన ఉత్తరం చివర్లో తెలియజేయబడిన వందనాలలో ఆయన సెక్రటరీవి కూడా ఉన్నాయి, “ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చేయుచున్నాను” అని ఆయన వ్రాశాడు. (రోమీయులు 16:22) పౌలు యొక్క వ్రాతల్లో తన సెక్రటరీల్లో ఒకరిని గురించి వివరంగా ప్రస్తావించబడింది ఈ ఒక్క సందర్భంలోనే.
మనకు తెర్తియు గురించి ఎక్కువ తెలియదు. ఆయన “ప్రభువునందు” వందనాలు చేయడాన్ని బట్టి ఆయన ఒక నమ్మకమైన క్రైస్తవుడై ఉంటాడని మనం చెప్పవచ్చు. ఆయన బహుశ కొరింథు సంఘంలోని ఒక సభ్యుడై ఉండి రోములోని అనేకమంది క్రైస్తవులను ఎరిగినవాడై ఉండవచ్చు. తెర్తియు బానిసో లేక విముక్తుడైన బానిసో అయ్యుంటాడని బైబిలు పండితుడైన గుసెప్పీ బార్బగ్లియో సూచిస్తున్నాడు. ఎందుకు? మొదటిగా, “శాస్త్రులు సాధారణంగా ఈ తరగతికి చెందిన వారై ఉండేవారు; తర్వాత ఆయన లాటిన్ నామం . . . బానిసలు మరియు విముక్తులైన బానిసలకు సర్వసాధారణంగా ఉండే పేరు గనుక.” “కాబట్టి, ఆయన ‘తటస్థమైన’ వృత్తి పర శాస్త్రి కాదు, ఆయన ఒక తోటి పని వాడు, ఈ విధంగా పౌలు సుదీర్ఘమైన, శ్రేష్ఠంగా వ్రాయబడిన తన వ్రాత ప్రతిని సమీకరించేందుకు ఆయనకు సహాయబడ్డాడు, ఈయన చేసినది ఎంతో ప్రశస్తమైన సేవ, అది పౌలు తన సమయాన్ని కాపాడుకునేందుకూ అలిసిపోకుండా ఉండేందుకూ వీలు కలిగించింది” అని బార్బగ్లియో చెబుతున్నాడు.
తెర్తియు చేసిన ఈ పని కచ్చితంగా ఎంతో ప్రశస్తమైనది. యిర్మీయా కొరకు బారూకు అలాంటి పనినే చేసి పెట్టాడు, పేతురు కొరకు సిల్వాను అలా చేశాడు. (యిర్మీయా 36:4; 1 పేతురు 5:12) అలాంటి తోటి పని వారికి ఎంతటి ఆధిక్యత లభించిందో కదా!
రోమీయులకు వ్రాయడం
పౌలు బహుశ కొరింథులో ఉండి, గాయు యొక్క అతిథిగా ఉన్నప్పుడు రోమీయులకు ఈ ఉత్తరం వ్రాయబడి ఉంటుంది. అది దాదాపు సా.శ. 56లో, అపొస్తలుని మూడవ మిషనరీ యాత్రా సమయంలో జరిగింది. (రోమీయులు 16:23) పౌలు ఈ ఉత్తరాన్ని వ్రాసేందుకు తెర్తియును తన సెక్రటరీగా ఉపయోగించుకున్నాడని మనకు తెలిసినప్పటికీ, కచ్చితంగా ఎలా ఉపయోగించుకున్నాడనే విషయం మనకు తెలియదు. ఎలాంటి పద్ధతి ఉపయోగించబడినప్పటికీ, ఆ పని అంత సులభంగా జరిగి ఉండదు. అయితే, బైబిలులోని మిగతా భాగం వలెనే, రోమీయులకు పౌలు వ్రాసిన ఈ ఉత్తరం కూడా “దైవావేశమువలన” కలిగిందని మాత్రం మనం కచ్చితంగా చెప్పగలము.—2 తిమోతి 3:16, 17.
ఈ ఉత్తరం ముగించబడే సరికి, తెర్తియు మరియు పౌలు పపైరస్ యొక్క అనేక షీట్లను ఉపయోగిస్తూ వేలకొలది పదాలను వ్రాసి ఉంటారు. వాటి మార్జిను వద్ద ఒకదానికొకటి అతికించబడిన తర్వాత, ఈ షీట్లు ఒక చుట్టగా చేయబడ్డాయి, అవి బహుశ మూడు నుండి నాల్గు మీటర్ల పొడవు ఉండవచ్చు. ఉత్తరాన్ని జాగ్రత్తగా చుట్టి సీలు వేశారు. తర్వాత పౌలు దాన్ని రోముకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న, కెంక్రేయలోని ఒక సహోదరియైన ఫీబేకు అప్పగించాడు.—రోమీయులు 16:1, 2.
మొదటి శతాబ్దం నుండి, వ్రాత ప్రతులను ఉత్పన్నం చేసేందుకు ఉపయోగించబడిన పద్ధతుల్లో ఎంతో గొప్ప మార్పు వచ్చింది. అయితే శతాబ్దాలన్నింటిలోనూ, రోము నందలి క్రైస్తవులకు వ్రాయబడిన ఈ ఉత్తరం దేవుని ద్వారా భద్రపర్చబడింది. పౌలు యొక్క నమ్మకమైన మరియు కష్టించి పని చేసే సెక్రటరీ అయిన తెర్తియు చేత వ్రాయబడిన, యెహోవా వాక్యంలోని ఈ భాగం విషయమై మనమెంత కృతజ్ఞులమై ఉండగలమో కదా!