మీరు దేవుని స్నేహితులా? మీ ప్రార్థనలు బయల్పర్చే విషయాలు
మీరు ఇద్దరు మనుష్యుల సంభాషణను ఎప్పుడైనా అనుకోకుండా వినడం జరిగిందా? వారి సంబంధం ఎలాంటిదనే విషయాన్ని అంటే వారు సన్నిహితులా లేక అపరిచితులా, కేవలం పరిచయమున్న వారా లేక ఆత్మీయులూ విశ్వసించే స్నేహితులూనా అనే విషయాన్ని గుర్తించడానికి నిస్సందేహంగా మీకు ఎక్కువ సమయం పట్టి ఉండక పోవచ్చు. అదే విధంగా, మన ప్రార్థనలు దేవునితో మనకుగల సంబంధాన్ని బయల్పర్చగలవు.
దేవుడు “మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు” అని బైబిలు మనకు నిశ్చయతనిస్తుంది. (అపొస్తలుల కార్యములు 17:26, 27) వాస్తవానికి, ఆయనను తెలుసుకోమని ఆయన మనలను ఆహ్వానిస్తున్నాడు. మనం ఆయన స్నేహితులం కూడా కాగలం. (కీర్తన 34:8; యాకోబు 2:23) మనం ఆయనతో నిజమైన సన్నిహితత్వాన్ని అనుభవించగలం! (కీర్తన 25:14) దేవునితో మన సంబంధం అనేది అసంపూర్ణ మానవులమైన మనం పొందగల అమూల్యమైన సంపద అన్నది స్పష్టమైన విషయం. యెహోవా మన స్నేహాన్ని విలువైన దానిగా ఎంచుతున్నాడు. ఆయనతో మనం కలిగి ఉండగల స్నేహం మన నిమిత్తం తన జీవాన్ని ఇచ్చిన ఆయన ఏకైక కుమారునియందు మనం విశ్వాసం ఉంచడంపై ఆధారపడి ఉంది గనుక ఈ విషయం స్పష్టమౌతుంది.—కొలొస్సయులు 1:19, 20.
కాబట్టి మన ప్రార్థనలు యెహోవా ఎడల మనకుగల గాఢమైన ప్రేమనూ మెప్పునూ ప్రతిబింబించాలి. మీ ప్రార్థనలు భక్తిపూర్వకంగా ఉన్నప్పటికీ హృదయపూర్వక భావాలు లేనివిగా ఉన్నాయని మీరు ఎన్నడైనా భావించారా? ఇది అసాధారణమైన విషయమేమీ కాదు. విషయాలను సరిచేసుకునేందుకు కీలకమేమిటి? యెహోవా దేవునితో మీ స్నేహాన్ని పెంపారజేసుకోవడమే.
ప్రార్థన కోసం సమయాన్ని కనుగొనడం
స్నేహాన్ని పెంపారజేసుకుని, వృద్ధి చేసుకునేందుకు సమయం పడుతుంది. మీరు అనేకమంది ప్రజలను అంటే పొరుగువారిని, తోటి ఉద్యోగులను, బస్సు డ్రైవర్లను మరియు దుకాణంలోని క్లర్కులను ప్రతిరోజూ కలుస్తుండవచ్చు లేక వారితో మాట్లాడుతుండవచ్చు కూడా. అయినప్పటికీ, అలాంటి వారితో మీకు స్నేహం ఉందని చెప్పలేము. మీరు ఎవరితోనైనా ఎక్కువసేపు మాట్లాడుతూ, మామూలు విషయాలతో ప్రారంభించి మీ ఆంతరంగిక భావాలను మరియు ఆలోచనలను వ్యక్తం చేస్తే మీ స్నేహం పెరుగుతుంది.
అదే విధంగా, ప్రార్థన మనం యెహోవాకు సన్నిహితం అయ్యేందుకు మనకు సహాయం చేస్తుంది. అయితే దానికి తగినంత సమయాన్ని వెచ్చించాలి; అందుకు భోజన సమయాల్లో త్వరగా కృతజ్ఞతలు తెలియజేయడం కంటే ఎక్కువే అవసరం. మీరు యెహోవాతో ఎంత ఎక్కువ మాట్లాడితే, మీరు మీ స్వంత భావాలను, సంకల్పాలను మరియు చర్యలను అంత ఎక్కువగా అర్థం చేసుకోగల్గుతారు. దేవుని వాక్యంలోని సూత్రాలను ఆయన ఆత్మ మీకు జ్ఞాపకం చేస్తుండగా కష్టతరమైన సమస్యలకు పరిష్కారాలు వాటంతటవే కనిపిస్తాయి. (కీర్తన 143:10; యోహాను 14:26) అంతేకాకుండా, మీరు ప్రార్థిస్తుండగా, యెహోవా మీకు మరింత వాస్తవమైన వ్యక్తి అవుతాడు, మీ ఎడల ఆయనకున్న ప్రేమపూర్వక ఆసక్తి మరియు శ్రద్ధ మీకు మరింత ఎక్కువగా తెలుస్తాయి.
మీ ప్రార్థనలకు మీరు సమాధానాలను పొందినప్పుడు ఇది ప్రాముఖ్యంగా అలా ఉంటుంది. అంతెందుకు, యెహోవా “మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ”గలడు! (ఎఫెసీయులు 3:20) దీనర్థం దేవుడు మీ నిమిత్తం అద్భుతాలు చేస్తాడని కాదు. అయితే, ఆయన తన లిఖిత వాక్యం ద్వారా నమ్మకమైన దాసుని తరగతి యొక్క ప్రచురణల ద్వారా, లేక ప్రేమగల సహోదర సహోదరీల నోటి మాటల ద్వారా ఆయన మనకు అవసరమైన సలహాను లేక నడిపింపును అందించవచ్చు. లేక ఒక శోధనను సహించేందుకు లేక ఎదిరించేందుకు మీకు అవసరమైన శక్తిని ఆయన మీకు ఇవ్వవచ్చు. (మత్తయి 24:45; 2 తిమోతి 4:17) అలాంటి అనుభవాలు మన హృదయాలను మన పరలోక స్నేహితుని ఎడల మెప్పుతో నింపుతాయి!
అందుకని మనం ప్రార్థన కొరకు తప్పకుండా సమయాన్ని సంపాదించుకోవాలి. నిజమే, ఈ కష్టకాలాల్లో దేనికీ సమయం సరిపోవడం లేదు. కానీ మనం ఎవరి ఎడలనైనా నిజంగా శ్రద్ధ కలిగి ఉంటే, మనం వారితో గడిపేందుకు సమయాన్ని ఎలాగైనా సంపాదించుకుంటాము. కీర్తనల గ్రంథకర్త తనను తాను వ్యక్తం చేసుకున్న విధానాన్ని గమనించండి: “దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవునికొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవునికొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనేప్పుడు వచ్చెదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను?” (కీర్తన 42:1, 2) దేవునితో మాట్లాడేందుకు మీరు కూడా అలాగే తహతహలాడుతున్నారా? అలాగైతే ఆయనతో మాట్లాడేందుకు సమయాన్ని సంపాదించుకోండి!—ఎఫెసీయులు 5:16 పోల్చండి.
ఉదాహరణకు, మీరు వ్యక్తిగతంగా ప్రార్థించేందుకు కొంత సమయాన్ని వెచ్చించడానికి పెందలకడనే లేచేందుకు ప్రయత్నించవచ్చు. (కీర్తన 119:147) కొన్నిసార్లు మీకు రాత్రులు నిద్రపట్టడం లేదా? కీర్తనల గ్రంథకర్త వలె మీరు అలాంటి కష్టసమయాలను దేవునికి మీ చింతలను వ్యక్తం చేసుకునే అవకాశాలుగా దృష్టించవచ్చు. (కీర్తన 63:6) లేక దినంలో అనేకమార్లు క్లుప్తంగా ప్రార్థించవచ్చు. కీర్తనల గ్రంథకర్త దేవునితో ఇలా అన్నాడు: “దినమెల్ల నీకు మొఱ్ఱపెట్టుచున్నాను.”—కీర్తన 86:3.
మన ప్రార్థనల నాణ్యతను మెరుగుపర్చుకోవడం
కొన్నిసార్లు మీ ప్రార్థనల కాలపరిమితిని పెంచడం కూడా సహాయకరంగా ఉంటుందని మీరు కనుగొంటారు. క్లుప్తంగా ప్రార్థన చేస్తున్న సమయంలో, మీరు సాధారణమైన విషయాలను గురించి మాట్లాడేందుకు మొగ్గుచూపవచ్చు. అయితే మీరు సుదీర్ఘమైన, లోతైన ప్రార్థనలు చేస్తే, మీరు మీ ఆలోచనలను మరియు అంతరంగ భావాలను మరింత స్పష్టంగా వ్యక్తం చేస్తారు. యేసు కనీసం ఒకసారి రాత్రంతా ప్రార్థన చేస్తూ గడిపాడు. (లూకా 6:12) మీరు ప్రార్థన చేసి ముగించడానికి త్వరపడకుండా ఉంటే మీ ప్రార్థనలు మరింత సన్నిహితమైనవిగా మరియు అర్థవంతమైనవిగా ఉంటాయని మీరు కనుగొంటారనడంలో సందేహమే లేదు.
దీని అర్థం మీరు చెప్పేందుకు ఎక్కువ విషయాలు లేనప్పుడు అస్తవ్యస్తంగా మాట్లాడుతూ ఉండాలని దానర్థం కాదు; లేక అర్థరహిత పునరుక్తులు చేయాలని కూడా దీని అర్థం కాదు. యేసు ఇలా హెచ్చరించాడు: “మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు; విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు; మీరు వారివలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును.”—మత్తయి 6:7, 8.
మీరు ఏ అంశాలను చర్చించగోరుతున్నారనే విషయాన్ని గురించి ముందే ఆలోచిస్తే అప్పుడు ప్రార్థన మరింత అర్థవంతంగా ఉంటుంది. చర్చించగల విషయాల పట్టికకు అంతం లేదు—పరిచర్యలో మన ఆనందాలు, మన బలహీనతలు మరియు వైఫల్యాలు, మన నిరాశలు, మన ఆర్థిక చింతలు, ఉద్యోగ స్థలంలో లేక పాఠశాలలో ఉన్న ఒత్తిడులు, మన కుటుంబాల సంక్షేమం మరియు స్థానిక సంఘ ఆత్మీయ పరిస్థితి. ఇవి కొన్ని మాత్రమే.
మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, అప్పుడప్పుడు మీ ధ్యాస పక్కకు మళ్లుతుందా? అవధానాన్ని నిలిపేందుకు మరింత ఎక్కువగా ప్రయత్నించండి. ఎంతైనా, యెహోవా ‘మన ప్రార్థనలకు చెవియొగ్గేందుకు’ సుముఖంగా ఉన్నాడు. (కీర్తన 17:1) మన స్వంత ప్రార్థనల ఎడల శ్రద్ధ వహించేందుకు మనం తీవ్రంగా కృషి చేసేందుకు సుముఖంగా ఉండవద్దా? అవును, “ఆత్మవిషయములమీద మనస్సు” నిలపండి, అటూ ఇటూ వెళ్లేందుకు దాన్ని అనుమతించకండి.—రోమీయులు 8:5.
యెహోవాను మనం సంబోధించే పద్ధతి కూడా ప్రాముఖ్యమైన విషయమే. మనం ఆయనను మన స్నేహితునిగా దృష్టించాలని ఆయన కోరుకుంటున్నప్పటికీ, మనం విశ్వ సర్వాధిపతితో మాట్లాడుతున్నామనే విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ప్రకటన 4 మరియు 5 అధ్యాయాల్లో చిత్రీకరించబడిన భయాశ్చర్యాలను కలిగించే దృశ్యాన్ని చదివి, ధ్యానించండి. మనం ప్రార్థనలో సమీపించే వాని మహిమను యోహాను అక్కడ దర్శనంలో చూశాడు. “సింహాసనాసీనుడైన వాని” సమీపించి మాట్లాడేందుకు అనుమతి పొందగలగడం ఎంతటి గొప్ప ఆధిక్యత! మన భాష మరీ అగౌరవంగా లేక మర్యాదలేని విధంగా మారేందుకు మనం ఎన్నడూ అనుమతించకూడదు. బదులుగా, మన ‘నోటి మాటలు, హృదయ ధ్యానము యెహోవా దృష్టికి అంగీకారమైనవిగా’ అయ్యేందుకు మరింత ప్రయత్నించడానికి మనం ముందుగా ఆలోచించుకోవాలి.—కీర్తన 19:14.
మనం భాషాపాటవాలతో యెహోవాను ప్రభావితుని చేయలేమని గుర్తించాలి. మనం గౌరవపూర్వకంగా, హృదయపూర్వకంగా మన భావాలను వ్యక్తం చేస్తే, అవి ఎంత మామూలు పద్ధతిలో వ్యక్తపర్చబడినా ఆయన వాటినిబట్టి ఆనందిస్తాడు.—కీర్తన 62:8.
కష్ట సమయాల్లో ఆదరణా అవగాహనలు
మనకు సహాయమూ ఆదరణ అవసరమైనప్పుడు, మనం మద్దతు మరియు సహానుభూతి కొరకు మన సన్నిహిత స్నేహితుల వైపుకు తిరుగుతాం. అయితే, యెహోవా కంటే ఏ స్నేహితులూ సులభంగా అందుబాటులో ఉండరు. “ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు.” (కీర్తన 46:1) ‘సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవునిగా’ మనం అనుభవిస్తున్న దాని గురించి మరెవరికంటే కూడా ఎక్కువగా ఆయన అర్థం చేసుకుంటాడు. (2 కొరింథీయులు 1:3, 4; కీర్తన 5:1; 31:7) బాధల్లో విపత్కర పరిస్థితుల్లో ఉన్న వారి ఎడల ఆయనకు నిజమైన దయా కనికరమూ ఉన్నాయి. (యెషయా 63:9; లూకా 1:76-79) యెహోవా అర్థం చేసుకునే స్నేహితుడనే విషయాన్ని మనం గుర్తించినప్పుడు, ఆయనతో ఎడతెగక మరియు హృదయపూర్వకంగా మాట్లాడేందుకు సంకోచించము. మనం మన లోతైన భయాలనూ చింతలనూ వ్యక్తం చేసేందుకు కదిలించబడతాము. అలా యెహోవా ‘గొప్ప ఆదరణ మన ప్రాణమునకు నెమ్మది’ ఎలా ‘కలుగ జేయుచున్నదో’ మనం ప్రత్యక్షంగా అనుభవిస్తాము.—కీర్తన 94:18, 19.
కొన్నిసార్లు మనం చేసిన తప్పుల మూలంగా మనం దేవున్ని సమీపించేందుకు అనర్హులమని భావించవచ్చు. అయితే మీ సన్నిహిత స్నేహితుడు మీ ఎడల తప్పు చేసి క్షమాపణ వేడుకుంటుంటే అప్పుడేమిటి? అతడిని ఊరడించి, అతనికి భరోసానివ్వాలని మీకు అనిపించదా? యెహోవా అంతకంటే తక్కువ చేస్తాడని మీరు ఎందుకు అనుకోవాలి? మానవ అపరిపూర్ణత మూలంగా తప్పు చేసే తన స్నేహితులను ఆయన ఉదారంగా క్షమిస్తాడు. (కీర్తన 86:5; 103:3, 8-11) ఆ విషయాన్ని తెలుసుకున్న మనం మన తప్పులను గురించి నిస్సంకోచంగా ఆయన ముందు దాచుకోము; ఆయన ప్రేమా కనికరాల విషయాల్లో మనం నమ్మకం కలిగి ఉండగలము. (కీర్తన 51:17) మనం మన తప్పిదాల మూలంగా కృంగిపోయి ఉంటే, 1 యోహాను 3:19, 20 నందు కనుగొనబడుతున్న, “ఇందు వలన మనము సత్యసంబంధులమని యెరుగుదుము. దేవుడు మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగి యున్నాడు గనుక మన హృదయము ఏ యే విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆ యా విషయములలో ఆయన యెదుట మన హృదయములను సమ్మతి పరచుకొందము” అనే మాటలనుండి మనం ఆదరణ పొందగలం.
అయితే దేవుని ప్రేమపూర్వక శ్రద్ధను అనుభవించేందుకు మనం బాధల్లో ఉండాల్సిన అవసరం లేదు. మన ఆత్మీయ మరియు భావోద్రేక సంక్షేమాన్ని భంగపరిచే ఏ పరిస్థితుల్లోనైనా యెహోవాకు శ్రద్ధ ఉంది. అవును, మన భావాలు, ఆలోచనలు, చింతలు మనం ప్రార్థనలో పెట్టలేనంత అల్పమైనవని మనం ఎన్నడూ అనుకోనవసరం లేదు. (ఫిలిప్పీయులు 4:6) మీరు మీ సన్నిహిత స్నేహితులతో ఉన్నప్పుడు, మీరు మీ జీవితంలోని గొప్ప సంఘటనలను గురించి మాత్రమే చర్చిస్తారా? మీరు చిన్న చిన్న విషయాలను గురించి కూడా చర్చించరా? అదే విధంగా, “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు” అనే విషయాన్ని ఎరిగినవారై, మీరు మీ జీవితంలోని ఏ అంశాన్ని గురించైనా కూడా యెహోవాతో నిస్సంకోచంగా మాట్లాడవచ్చు.—1 పేతురు 5:7.
మీరు ఎప్పుడూ మీ గురించే మాట్లాడితే ఆ స్నేహం ఎక్కువకాలం కొనసాగదు. అదే విధంగా, మన ప్రార్థనలు ఎల్లప్పుడూ స్వయం కేంద్రితమై ఉండకూడదు. యెహోవా ఎడలా ఆయన ఆసక్తుల ఎడలా మనకుగల ప్రేమనూ శ్రద్ధనూ కూడా మనం వ్యక్తం చేయాలి. (మత్తయి 6:9, 10) ప్రార్థన అనేది మనం మన సహాయాన్ని కోరేందుకు ఒక అవకాశం మాత్రమే కాదు, అది మన కృతజ్ఞతా వచనాలనూ స్తుతులనూ తెలిపేందుకు కూడా ఒక అవకాశమై ఉంది. (కీర్తన 34:1; 95:2) క్రమమైన వ్యక్తిగత పఠనం ద్వారా “జ్ఞానాన్ని పొందడం” ఈ విషయంలో మనకు సహాయం చేస్తుంది. ఎందుకంటే మనం యెహోవాను గురించీ ఆయన మార్గాలను గురించీ ఎక్కువ తెలుసుకునేందుకు అది మనకు సహాయం చేస్తుంది. (యోహాను 17:3, NW) మీరు కీర్తనల గ్రంథాన్ని చదివి యెహోవా యొక్క ఇతర నమ్మకమైన సేవకులు తమను తాము ఎలా వ్యక్తం చేసుకున్నారో గమనించడం ప్రత్యేకంగా సహాయకరంగా ఉంటుందని మీరు కనుగొనవచ్చు.
యెహోవా స్నేహం వాస్తవంగా అమూల్యమైన బహుమానం. మనం దాన్ని మెచ్చుకుంటున్నామనే విషయాన్ని మన ప్రార్థనలను మరింత సన్నిహితమైనవిగా, హృదయపూర్వకమైనవిగా మరియు వ్యక్తిగతమైనవిగా చేయడం ద్వారా మనం చూపుదాము. “నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు” అని పలికిన కీర్తనల గ్రంథకర్త వ్యక్తం చేసిన ఆనందాన్ని అప్పుడు మనం అనుభవిస్తాం.—కీర్తన 65:4.
[28వ పేజీలోని చిత్రం]
దినమంతటిలో అవకాశాలు తలెత్తినప్పుడల్లా మనం దేవునికి ప్రార్థన చేయవచ్చు